ఇక నా విషయం వేరే చెప్పనవసరంలేదు. ఆ సమాజం నిర్వహణకుడు చెప్పినట్టు చిట్టిబాబు "మెరిక" లాటి కుర్రాడు. అతను అమ్మిరెడ్డి పాత్రని మనోహరంగా పోషించేడు. ఇక్కడ, ఈ నగరంలో - నే నూహించి రాసిన అమ్మి రెడ్డిని ఖచ్చితంగా చూడగలిగేను- ఆసీను పూర్తవుతుందనగా అమ్మిరెడ్డి కి రాసిన నాలుగు మాటలూ చిట్టిబాబు చాలా బాగా అనగలిగాడు. ఓ దివ్యాను భూతిని పొందినట్లయింది నాకు.
" అయ్యా ! సార్! దేవుడితో పాటు వీరంతా కూడా నా కన్యాయం చేసేస్తున్నారు! నే నిప్పుడు తండ్రిలేని వెధవని, కుర్ర కుంకని నా మిద జాలి చూపిండండి సార్! నన్నో దార్పండి!"
నా పక్కనే కూచున్న చిట్టిబాబు తండ్రి కళ్ళొత్తుకోవడం స్పష్టంగా చూడగలిగేను!
తిరిగి మా వూరొచ్చిన నెలరోజుల క్కాబోలు స్క్రూటినీలో 'బ్రతకనేర్చిన మనిషి' ఎనన్నకైన శుభవార్త తెలిసింది. ఆ నాటకం ఎన్నికవడానికి ముఖ్యమైన కారణం అమ్మిరెడ్డి పాత్రనీ నాకు తెలుసు.
నా వూర్లో నా స్నేహితుల్తో నే నక్కడ చూచిన అమ్మిరెడ్డి గురించి ఘనంగా చెప్పేను. చిట్టిబాబు ఉజ్వలమైన భవిష్యత్తుకి వారసుడవుతాడనీ జోస్యం చెప్పేను. ఇది విని చాలామంది నవ్వేసి వూరుకున్నారు. అది గమనించి ఈ ప్రచారాన్ని మరి తగ్గించక తప్పలేదు.
ఆఫీసుపని ఒత్తిడిలో తల నిండుగా మునిగిపోయిన నాకు " బ్రతక నేర్చిన మనిషి" ప్రదర్శన తేదీ వారంరోజులు ముందుగానే తెలిసింది. భాగ్యనగరంలో ఆ రవీంద్ర భారతి లోనే రసజ్ఞలముందు ప్రత్యేకాహ్వానితులైన సినీనటులు, దర్శకుల సమక్షంలో యే ర్పాటు చేసిన పోటిల్లో నాకు నచ్చిన అమ్మిరెడ్డి పరిచయం కాబోతున్నాడని వినగానే నీ ఉత్సాహం పరవళ్ళు తొక్కింది,ఆ పోటిల్లో తుది ప్రదర్శన " బతక నేర్చిన మనిషి" అదే రోజు బహుమతి ప్రదానోత్సవం గూడాను.
కానీ, నా ఆఫీసుపని నా ఉత్సాహాన్ని మరుక్షణంలో చంపింది. అయినా ఆవేళకి తప్పనిసరిగా వెళ్ళి అమ్మిరెడ్డి అభినందించాలనే తపన రోజురోజుకి ఎక్కువవుతూవొచ్చింది. ఆర్రోజులు పగటి కలల్తోనే గడిపేను. ఏడోరోజు- సరిగ్గా నా నాటకం ప్పదర్శన రోజుకి భగవదనుహ్రంవల్ల ఎలాగైతేనేం శేలవు సంపాదించ గలిగేను. ఆఫీసునుంచే బస్టాండుకి వెళ్ళేను.
బస్సు హైద్రాబాద్ చేరేవేళకి చాలా వేళయింది. టాక్సీ ఎక్కి రవీంద్ర భారతి దగ్గిర దిగేను. నేను ఆడిటోరియంలో అడుగుపెడుతూన్న వేళకి రెండోసీను జరుగుతోంది. పోటిల్లో ఈ రోజు చివరిది గనక చాలా ముఖ్యమైన రోజు .ప్రేక్షకులు కిటకిట లాడిపోతున్నారు.
గుండె చేతుల్లో పెట్టుకుని గోడనానుకుని ప్రదర్సన చూస్తున్నాను. మంచి రక్తిగా నడుస్తోంది రంగం. అమ్మిరెడ్డి పట్ల ప్రేక్షకుల సానుభూతిని ప్రత్యక్షంగా విన్నాను. ఆ సీను పూర్తవుతూండగా ఆడిటోరియంలో ఎవరో రసజ్ఞుడు "లవ్ లీ" అని అరిచేడు, అ కేక వెంబడి గబగబా చప్పట్లు వినిపించేయి ఆనందాశ్రవుల విలువెంతో అప్పుడు నాకు తెలిసొచ్చింది.
బహుమతి ప్రదాన్సోతవం జరుగుతూన్నప్పుడు మరింత నిటారుగా నించున్నాను. ఆ ఏడాది ఉత్తమ నటుడుగా నా అమ్మిరెడ్డి పాత్రధారి చిట్టిబాబే ఎన్నికయ్యాడు. ప్రేక్షకుల హర్షామెదంతో ఉక్కిరి బిక్కిరి రయ్యేను. ఉత్తమ ప్రదర్శన బహుమతీ నా నాటకానికే లభించింది!
ఎగిరి గంతు వేయాలనిపించింది. గబగబా గ్రీన్ రూమువేపు నడిచేను. ముఖ్యంగా చిట్టిబాబుని అభినందిచాలని. కాని- అక్కడ చేరిన మనుష్యుల్ని చూడగానే వాళ్ళ క్కాస్త దూరంగా ఆగిపోయేను. ప్రఖ్యాత సినీ దర్శకులొకరు చిట్టిబాబుతో యేమి టేమిటో మాటాడుతున్నారు. వాళ్ళిద్దరి చుట్టూ తతిమ్మానటులందరూ గుమిగూడేరు! వాళ్ళలో ఒక్కరూ నన్ను గమనించే స్థితిలో లేరు. వాళ్ళలో ఒక్కరూ నన్ను గమనించే స్థితిలో లేరు. వాళ్ళ ఉత్సాహానికీ చిట్టిబాబు అదృష్టానికీ, నేను ముచ్చటపడిన మాట వాస్తవం!
నా భుజం మిద ఎవరిదో చేయి పడ్డది. ఉలిక్కిపడి ఆవేపు చూసేను. అతను సుదర్శనరావు! నా మిత్రుడు నా మిత్రుడు, అతనన్నాడు-
" వొచ్చేయ్? ఇప్పుడు మి వాళ్ళకి నీతో అవసరమేమి లేదు ! గనక వాళ్ళ నిబ్బంది పెట్టక! నీ మర్యాదా కాపూడుకో: వొచ్చేయ్"
నిజంగూడా అదేను. సుదర్శతో పాటు అతనింటికి వెళ్ళిపోయేను. ఆరాత్రి నిద్రస్సలు పట్టనే లేదు.
ఉదయం పదిగంటలక్కాని స్నానం గట్రా ముగించలేదు. సుదర్శనం కాఫీ తాగి వాళ్ళా ఫీసుకి వెళ్ళిపోయేడు. నేను చిక్కిడపల్లి వేపు నడిచేను.
మునుపు స్ర్కూటినీ జరిగినప్పుడు చిట్టిబాబు వాళ్ళింటికి వెళ్ళేను.ఇప్పుడు వాళ్ళ యిల్లు పోల్చుకోడం కష్టమనిపించినా, చివరికి వాళ్ళింటి ముందు నించో గలిగేను. అయితే ఇప్పుడా ఇంటికి తాళం వేసి వుంది.
రాత్రికి ఆ తండ్రీ కొడుకు లిద్దరూ మదరాసు బండెక్కి పోయారేమోనని ఆతాళం చూడగానేఅనిపిచింది. కానీ, అక్కడికి దాపులోవున్న కుళాయి దగ్గిర నీళ్ళు పట్టుకుటూన్న చిట్టిబాబుని చూడగానే నా అనుమానం పటాపంచలయ్యింది. గబగబా అతని వేపు నడిచేను.
నన్నతను చూచినక్షణంలో అతని మొహంలో 'వెల్తురు' కనిపించింది. కానీ అది క్షణికం. వెంటనే దీనత్వం గోచరించింది. అతను రెండు చేతులూ వినయంగా జోడించేడు. ముచ్చట వేసింది నాకు.
అతనన్నాడు.
"మీకు తెలీదా సార్! మా నాన్న పోయేరు!"
నా నెత్తిమిద పిడుగుపడినట్లయింది. మళ్ళీ అతనే అన్నాడు.
"అయ్యా! సార్! దేవుడు నాకు అన్యాయం చేసేడు సార్! నేనిప్పుడు తండ్రిలేని వెధవని కుర్రకుంకని. నా మీద జాలి చూపించండి. నన్నోదార్చండి సార్."
నా కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగేయి. నిలువెల్లా కంపించిపోయేను. అతన్తో ఏం చెప్పకుండానే వెనుతిరిగేను. అతనింకా ఏడుస్తూనే వున్నాడు.
మా వూరు బస్సెక్కింతర్వాత అనుకున్నాను:
అమ్మిరెడ్డి నాటకంలోనేకాదు, జీవితంలోనూ అన్యాయం జరిగిపోయింది. చిట్టిబాబూ! నువ్వీ నాటకం వెయ్యొద్దింకా! కేవలం నాటకాలు రాసేవాడినేగాని జీవితాలుమార్చేచాతుర్యం నా కెక్కడుంది నాయన! నేనెవర్నీ ఉద్దరించలేను. నిన్ను ఓదార్చలేను. నిజం!