Previous Page Next Page 
తీరం చేరిన నావ పేజి 24


    ఆ మధ్యాహ్నం భోజనాల సమయంలో జరిగిన మరో సంఘటన అసలే అసంతృప్తితో, అవమానంతో బాధపడుతున్న వాణి మనసుమీద బాగా దెబ్బతీసింది.
    రాజారావు మూడ్ అసలే బాగులేదేమో-భోజనానికి కూర్చుంటూనే ప్లేట్లో పదార్ధాలు చూసి వంట అయ్యర్ మీద విరుచుకుపడ్తూ- "నీకీ చెత్తకూరలు, పచ్చళ్ళు చెయ్యద్దని ఎన్నిసార్లు చెప్పాను, యీ వెధవ వంకాయతప్ప మరోటి లేదా నేను తిననని తెలీదా-" ఎగిరాడు.
    అయ్యర్ టేబిల్ కి కాస్త దూరంలో నిలబడిన వాణి వంక ఒక వంకరచూపు విసిరి వాణిమీద కోపంతీర్చుకునే అవకాశం దొరికినందుకు సంతోషించి-"నాదేముంది, అమ్మ గారు ఏం వండమంటే అది వండాను-నేనే అయితే ఎందుకు చేస్తాను" అన్నాడు.
    వాణి గతుక్కుమంది-రాజారావు యీ కూర తినడన్న సంగతి వాణికి తెలియదు- వంట అతను చెప్పలేదు. అసలే వాణిమీద కోపంగా వున్న రాజారావు వాణిమీద దెబ్బతీసి కసితీర్చుకోవాలనిపించింది.
    "హు-జమీందారీ యింటి వ్యవహారాలు అమ్మగారికేం తెలుసు- ఆవిడింట్లో మాదిరి కూరుంటే- పప్పు అక్కర లేదు అనే రకం కాదు మా అలవాటు-యీ హోదా, సంపాదన అంతా కావల్సింది తినడానికే, లేనివాళ్ళలా ఒక్క కూరతో గడుపుకోవాల్సిన అవసరం మాకు లేదు-పంతులూ-వంటవిషయం ఎవరి పెత్తనం అక్కరలేదు - యిదివరకు మాదిరే చెయ్యి" హేళనగా వాణివంక చూసి, విసురుగా కూరప్లేటు తోసేసి పెరుగు వేసుకున్నాడు రాజారావు.
    వాణి మొహం అవమానంతో నల్లబడింది. అయ్యర్ ముందు అంత అవమానం దిగమింగడం ఆమె వశంలో లేక పోయింది. రోషంగా తలెత్తి సూటిగా రాజారావువంక చూస్తూ-"జమీందారీ వంశం అంటే యింతంత వండుకుని పారేసుకోవాలి అని తెలియక, దూబరా సహించలేక చెప్పిన మాట నిజమే- యింటి యజమానురాలు అవసరం లేకుండా వంటవాడే అన్నీ చక్కపెట్టుకుంటే నన్నెందుకు రమ్మన్నట్టు యీ పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు- కాబోయే భార్యని నౌకర్ల ఎదుట అవమానిస్తే ఆ అవమానం మీది కాని నాది కాదు అన్న నిజం గుర్తించండి" వాణి చటుక్కున అక్కడనించి వెళ్ళిపోయింది.
    ఎప్పటికప్పుడు తనమీద దెబ్బతీస్తున్న వాణి మాటలకి మరోసారి రాజారావు మొహం నల్లబడింది.
    వాణి గదిలో పక్కమీద వాలిపోయి ఎగిసిపడుతున్న గుండెలతో ఆవేశంగా అనుకుంది- పెళ్ళి కాకముందే ప్రతి క్షణం గండంలా తయారయితే...తరువాత...పెళ్ళికాకపోతే పాఠాలు చెప్పుకుంటూ కలో గంజో తాగి మనశ్శాంతితో బతకవచ్చు- ఈ ఐశ్వర్యం వద్దు- యీ అవమానాలు వద్దు- తల్లి తిట్టినాసరే వప్పుకోలేదు. తను ముందిక్కడనుంచి రేపు ఉదయమే బయటపడాలి-యిప్పుడే రాజారావుతో తను వెళ్ళి పోతున్నట్టు చెప్పేయాలి- వాణి ఆవేశంగా లేచి రాజారావు గదిలోకి వెళ్ళింది. రాజారావుకి భోంచేసి పడుకోడం అలవాటు వాణి వెళ్ళేసరికి తలుపులోపలవేసి నిద్రపోతున్నాడు. ఈలోగా అనసూయమ్మగారితో చెప్పడానికి ఆవిడ దగ్గరకి వెళ్ళింది- వాడిపోయివున్న వాణి మొహం చూసి, కింద జరిగిన సంగతి సీతమ్మ ద్వారా విన్న అనసూయమ్మ నిట్టూర్చింది.
    "రేపు నేను వెళ్ళి పోతానండీ యింక- యీ పూట ఆయనతో చెప్పివెళ్ళిపోతాను" అంది వాణి ముభావంగా యింత నెమ్మదస్తురాలైన అమ్మాయి మనసు నొప్పించిన కొడుకుని ఆవిడమనస్సు క్షమించలేక పోయింది- అయినా వాణి ముందు కొడుకును ఏమి అనలేక, "చూడు వాణీ యిందాక వాడు అన్నదానికి బాధపడుతున్నావా? వాడి తత్వమే....."
    "అది ఆయన తత్వం అయితే....ఎంత లేనింటిదాన్నయినా ఆ అవమానాలన్నీ సహించాలంటారా?" కళ్ళ నీళ్ళు నిండిపోగా విసురుగా అంది వాణి.
    అనసూయమ్మ నిట్టూర్చింది-వాణి మనసులో విరక్తి పసిగట్టింది- రాజారావు అహంకారంతో వాణిలాంటి పిల్లని దూరం చేసుకుంటే యింక జన్మలో కొడుక్కి పెళ్ళిగావటం ఉత్తమాట అని ఆవిడకి తెలుసు-అయినా పెళ్ళయినా కాక ముందే అంత దూకుడుగా ప్రవర్తించిన అతని తీరుని సమర్ధించ లేక, వాణికి నచ్చచెప్పలేక యిబ్బంది పడింది.
    "వాణీ- నీవు- రాజా కోసం కాకపోయినా నాకోసం, యీ యింటి పరువు ప్రతిష్ఠలు గుర్తుంచుకునయినా-యిదంతా మనసులో పెట్టుకోకుండా - మరో పదిహేను రోజుల్లో కోడలిగా యీ యింట్లో అడుగు పెట్టాలి-కోడలిగా అప్పుడు నీ హక్కులని ఎవరూ కాదనలేని స్థానం వస్తుంది- రాజాని దారిలో పెట్టుకోవడం నీ చేతిలో పని- అన్నీ సర్దుకుంటాయి-దిగులు పెట్టుకోవద్దు- పెద్దదాన్ని నా మాట మన్నించు" అంది ప్రాధేయపడుతున్నట్టు- అలాంటి ఆవిడతో ఏమీ చెప్పలేక మౌనంగా వాణి గదిలోంచి వెళ్ళిపోయింది.
    
                                           *    *    *
    
    రాజారావు కోపం కాస్త తగ్గాక- వాణిపట్ల తన ప్రవర్తన సమంజసంగా లేదేమోనన్న భావం తలెత్తింది-యింకా పెళ్ళయినా కాకముందే తామిద్దరి మధ్య యిలాంటి సంఘటనలు తలెత్తాయేమిటి అనిపించింది ఛా- రాగానే ఆ కిషోర్ వాళ్ళు రావడం, వాణి ఆ పద్మావతి చీరలో కంటపడడం తరవాత వాణితమ్ముడు రావడం, వాణి తనకోరికని నిరాకరించడం, ఆ తరవాత వంటవాడిదగ్గిర-అన్నీ తలచుకుంటే తనుదురుసుగా ప్రవర్తించి వాణి మనసు నొప్పించ లేదుగదా అన్న అనుమానం చోటు చేసుకుంది అతని మనసులో - పెళ్ళి అయ్యాక అయితే చచ్చినట్లు గతిలేక వూరుకునేదేమోగాని, పెళ్ళయినా కాకుండా తన ప్రవర్తన చూసి వాణి ఏమనుకుంటుందో-ఆమె మనసు మార్చుకోదు గదా-అన్న జంకు కల్గింది ఆలోచిస్తుంటే. వాణి మనసు మార్చుకుని ఈ పెళ్ళి నిరాకరిస్తే అంతకంటే అప్రతిష్ఠ తనకి మరోటివుండదు అతనిలో వివేకం మేల్కొని మందలించింది కనీసం పెళ్ళయేవరకయినా వాణీని ప్రసన్నురాలిగా చేసుకోవాలి.

 Previous Page Next Page