Previous Page Next Page 
దావాగ్ని పేజి 23


    కోకో డిమెర్ ని కొద్దిగా నోట్లో వేసుకుని రుచి చూశాడు బాబూజీ - "సూపర్బ్" అన్నాడు.

 

    వెంటనే అతనికో ఆలోచన వచ్చింది.

 

    ఎలాగయినా సరే, ఈ కాయలు ఇండియాలో పండేటట్లు చేయగలిగితే?

 

    మరుక్షణంలో అతని బుర్ర ఎన్ని రకాలుగా దాన్ని పండించవచ్చో, ఎంత లాభానికి అమ్ముకోవచ్చో, లెక్కవేయడం మొదలెట్టింది... ఎగ్జయిట్ మెంట్ కలిగింది అతనికి.

 

    బ్రేక్ ఫాస్ట్ తర్వాత ప్రొఫెసర్ రామనాధంతో కలిసి పారడైజ్ సిటీ నుండి హాపీటవున్ దాకా తమ కంపెనీ వేస్తున్న హైవేని పర్యవేక్షించటానికి బయలుదేరాడు బాబూజీ. అతడి కంపెనీ స్థాయికి ఇది చాలా చిన్నవర్కు.

 

    కానీ యిది ఊరికే ట్రయల్.

 

    ఇది కనుక విజయవంతంగా పూర్తి అయితే, చిత్రద్వీప్ లో వెయ్యబోయే రోడ్ల వర్కు అంతా తనకి యిచ్చేస్తానని చెప్పాడు జనరల్ భోజా అనుచరుడు తోకాస్.

 

    అది కూడా -

 

    ఎవరికి ముట్టవలసిన ముడుపులు వారికి ముట్టిన తర్వాతే:

 

    అందులోనూ ముఖ్యంగా ముడుపులకి మూలవిరాట్టయిన జనరల్ భోజాకి భారీగా ముట్టిన తర్వాత:

 

    ఇన్నాళ్ళ నుంచి తమ కంపెనీ చిత్రద్వీప్ లో వర్కు చేస్తున్నా, జనరల్ భోజాని కలుసుకోవటం ఎప్పుడూ తటస్థించలేదు.   

 

    ఇవాళ అతనితో తనకు అపాయింట్ మెంట్ వుంది.

 

    వర్క్ సైట్ ని సమీపించి ఆగింది కారు.

 

    దిగి, ఇంజనీరు చేసిన అభివాదం అందుకుని ముందుకు నడిచాడు బాబూజీ.

 

    మట్టి మనుషుల్లా వున్న కూలీలు, జ్వర తీవ్రతలా వున్న ఎండలో మరిగిన తారూ, కంకరా కలిపి రోడ్డుమీద పోస్తున్నారు.

 

    మోకాళ్ళదాకా వచ్చే రబ్బరు బూట్లు వేసుకుని వున్నాడు బాబూజీ. జాగ్రత్తగా చూసి చూసి అడుగులు వేస్తున్నాడు. జరుగుతున్న పనిని శ్రద్ధగా పరిశీలిస్తున్నాడు. ఏ చిన్న విషయమూ అతని దృష్టిని తప్పించుకొని పోలేదు. అందుకే అతను అంత గొప్ప ఇండస్ట్రియలిస్టు కాగలిగాడు.   

 

    అలా ఒక పావుగంట గడిచింది.

 

    అక్కడ తల్లిదండ్రులు చెమటలు కారుస్తూ పనులు చేస్తూ వుంటే, వంటిమీద బట్టయినా లేని చిన్నపిల్లలు కొందరు కంకర రాళ్ళనే అటూ ఇటూ విసురుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు.

 

    అది చూసిన బాబూజీకి వళ్ళు మండింది.

 

    "ఎవరా వెధవలు: కంకరనంతా చెల్లాచెదురుచేస్తున్నారు. నాలుగు అంటించండి:" అని అరిచాడు.

 

    అంతలోనే -

 

    ఒక పిల్లాడు చూసుకోకుండా విసిరిన రాయి వచ్చి బాబూజీ బాన పొట్టకి తగిలింది.

 

    "అబ్బా:" అన్నాడు బాబూజీ. తక్షణం అతని కళ్ళలో ఎర్రజీర కనబడింది.

 

    ఇద్దరు నౌఖర్లు ఆ కుర్రాడ్ని పట్టుకోవడానికి పరిగెత్తారు.... ఆ కుర్రాడు భయభ్రాంతుడై పెద్దగా ఏడవడం మొదలెట్టాడు. ఒక వర్కరు వచ్చి, బాబూజీకి ఉపచారాలు చేయడం మొదలెట్టాడు.   

 

    కానీ -

 

    ప్రొఫెసర్ రామనాధం మాత్రం తన చుట్టూ ఇంత గొడవ జరుగుతున్నా అదేమీ పట్టించుకోవడం లేదు. అతని దృష్టి అంతా బాబూజీ పొట్టకి తగిలి కిందపడిన రాయిమీద వుంది. ఒంగి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు అతను. తదేకంగా దానివైపు చూశాడు. ఆ రాతిమీద చిన్న చిన్న చుక్కలు వున్నాయి. అతని మొహంలో ఆశ్చర్యం కనబడింది.    

 

    అప్పటికి బాధలోనుంచి కొద్దిగా తేరుకున్నాడు బాబూజీ... ప్రొఫెసర్ రామనాధం మొహంలో కనబడుతున్న భావాల్ని గమనించాడు. తక్షణం అతనికేదో అనుమానం తట్టింది.

 

    అదే సమయంలో రామనాధం ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు.

 

    చప్పున అతన్ని వారించాడు బాబూజీ.

 

    "రామనాథం: ఇప్పుడు నేను జనరల్ భోజా దగ్గరికి వెళుతున్నాను. ఒక కొత్త క్రాంట్రాక్టు గురించి డిస్కస్ చెయ్యడానికి. మీరు కూడా నాతోబాటు వస్తే, టెక్నికల్ విషయాలు చెప్పడానికి బాగుంటుంది..." అన్నాడు.   

 

    బాబూజీ వచ్చిన సంగతీ, అతనికి రాయి తగిలిన సంగతీ తెలిసిన మేనేజరు వర్క్ స్పాట్ ఆ చివర నుంచి గబగబా వచ్చాడు.

 

    అతనితో చెప్పాడు బాబూజీ.

 

    "నేనూ రామనాథం కలిసి జనరల్ భోజా దగ్గరకి వెళుతున్నాం"

 

    "నేను కూడా రావాలా సార్?" అన్నాడు మేనేజరు వినయంగా.

 

    "అవసరం లేదు" అన్నాడు బాబూజీ ముక్తసరిగా. అతనికి రామనాధాన్ని సాధ్యమైనంత త్వరలో ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి సంగతేమిటని అడగాలని వుంది. రామనాధానికి సబ్జెక్టులో తెలివి వుందిగానీ, లౌక్యం లేదు అతను ఏదో గొప్ప సంగతి కనిపెట్టాడని బాబూజీ సిక్స్ త్ సెన్సుకి తోచింది.... అది అతను అందరి ముందూ కక్కేస్తే కష్టం:

 Previous Page Next Page