Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 23


    
    "ఆలస్యం అయిదండీ" అన్నాడు శంకరం.
    
    "సరే, రండి లోపలికి!" అన్నాడు మాస్టరు. ఇద్దరూ పోయి కూర్చున్నారు.
    
    "ఏరా చలం! జీతం కట్టలేదటగా ఈ నెల?" అనడిగాడు టీచర్.
    
    చలం లేచి నిల్చొని "లేదండీ!" అన్నాడు.
    
    "ఎందుకని?"
    
    చలం జవాబు చెప్పలేదు. టీచర్ శంకరంవంక తిరిగి "ఏరా మీ యిద్దరూ ప్రాణస్నేహితులుగా చలంగాడికి ఆ మాత్రం సాయం చెయ్యలేవా?" అన్నాడు. శంకరానికి గుండెలో ఏదో గుచ్చుకున్నట్లయింది. మాట్లాడలేదు.
    
    "మీ నాన్న లక్షాధికారి ఈ కాస్త సహాయానికే మీ ఆస్తంతా తరిగి పోతుందనుకున్నావేమిట్రా?" అన్నాడు టీచరు.
    
    "మా నాన్న లక్షాధికారి. ఈ కాస్త సహాయానికే మీ ఆస్తంతా తరిగి పోతుందనుకున్నావేమిట్రా?" అన్నాడు టీచరు.
    
    "మా నాన్న లక్షాధికారే కాని నేనుమాత్రం కాదండీ" అందామనుకున్నాడు శంకరం. అయినా తగ్గి వూరుకున్నాడు. కాని క్లాసందరిముందు తనని ఆ విధంగా అనటం చాలాకష్టం కలిగించింది. అతనికి క్లాసులో అందరూ తనవంక చూసి నవ్వుతున్నట్లే అనిపించింది. తలవంచుకుని కూచున్నాడు.
    
    మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత తల్లితో జరిగిందంతా చెప్పాడు. "అమ్మా! చలం చాలా మంచివాడే. క్లాసందరిలోను తెలివిగలవాడుకూడా! వాళ్ళ నాన్నకి మనదగ్గర ఏమైనా పని ఇప్పించమని చెప్పవే నాన్నతో" అన్నాడు.
    
    "అలాగేలేరా నాయనా!" అంది తల్లి.
    
    నారాయణరావు ఇంటికి వచ్చింతర్వాత కొడుకు చెప్పింది కాస్తా ఆయనతో చెప్పింది. ఆయన కొడుకుని పిలిచాడు. శంకరం వచ్చింతర్వాత "ఎవర్రా ఆ స్నేహితుడు?" అని అడిగాడు.

    "చలం నాన్నా."
    
    "అయితే, ఆ వేధవని నువ్వు ఉద్దరిస్తావా? ఉద్దరించటానికి నువ్వెవడివిరా? నువ్వు చెప్పేవాడివి నేను పనిలో పెట్టుకునేవాన్నీనా?" అన్నాడాయన.
    
    "అదికాదు నాన్నా..." అంటూ శంకరం యింకేదో అనబోయాడు. "నీ మొహం! ఇంకెప్పుడూ ఇలాంటి వేషాలు వెయ్యబోకు నీ మాటలు నమ్మి అడ్డమయినవాళ్ళనీ పెట్టుకుంటే నాకు హామీ ఏమిటి?" అన్నాడు తండ్రి కోపంగా శంకరం యింకేమీ మాట్లాడలేదు.
    
    మధ్యాహ్నం స్కూలుకు పోయిన తర్వాత చలాన్ని చూస్తే అదోలా అనిపించింది శంకరానికి మాస్టారన్న మాటలు బుర్రలో మెదిలాయి. తన నాన్న లక్షాధికారి ఐతే ఏం లాభం? తను ఎవరికీ ఏం సాయం చేయలేడు. చలం జీతం కట్టకపోతే అతనిపేరు కొట్టేస్తారు. అప్పుడతను ఏం కావాలి?
    
    "ఏమిట్రా ఆలోచిస్తున్నావు?"
    
    శంకరం వెనక్కి తిరిగి చూశాడు. శర్మాయి అడుగుతున్నాడు. "ఏంలేదు" అన్నాడు.
    
    "సాయంత్రం సినిమాకి వస్తావా?"
    
    "దేనికి?"
    
    "దేనికో ఓ దానికి."
    
    "రాలేనురా" అన్నాడు శంకరం.
    
    "డబ్బు లేదని చూస్తున్నావా? నేను పెట్టుకుంటాను లేవోయ్" అన్నాడు శర్మాయి. శంకరానికి వెన్నుమీద చర్రున చరిచినట్లయింది. డబ్బులేకనా తను సినిమాకి వెళ్ళకపోవడం, అసలు ఫస్టుషోకి ఎప్పుడైనా వెళ్ళాడా? తను ఎప్పుడు పోయినా ఇంట్లో చెప్పకుండా పోవటమే. ఏ స్నేహితుడింటికో పోతున్నానని చెప్పో, బడి ఎగ్గొట్టో మ్యాట్నీలకి పోవటం అలవాటు. దానికి కారణం కూడా వుందిగా!
    
    అప్పటికి మట్టుకు మాట్లాడకుండా ఊరుకున్నాడు శంకరం.
    
    అయిదింటికి యింటికిపోగానే తండ్రితో "మా స్నేహితులంతా సినిమాకి పోతున్నారు నాన్నా! నేను కూడా వెళతాను" అన్నాడు ధైర్యంగా.
    
    నారాయణరావు ఆశ్చర్యంగా చూశాడు. "సినిమాకా? ఎందుకూ!"
    
    శంకరానికి కోపం వచ్చింది. "చూడ్డానికి" అన్నాడు.
    
    "సినిమాలు చూసి బాగుపడదామనేనా? మేం వెళ్తున్నప్పుడు వస్తున్నావు చాలదూ? విడిగాకూడానా? బాగానే వుంది. చదువుకోవోయ్ నాపసానీ" అన్నాడాయన. శంకరం ముఖం మాడ్చుకొని యివతలికి వచ్చేశాడు.
    
    రాముడిని ఆ సాయంత్రం ఏమీ అనలేదు నారాయణరావుగారు. ఆయన ఏమనుకున్నారో చెప్పటం కష్టం. మొత్తానికి అయిదురూపాయలు పోవటం విషయాన్ని మళ్ళీ ఎత్తలేదు.
    
    శంకరం ఆ సాయంత్రం కోపంతోనూ, అవమానంతోనూ కుమిలి పోయాడు. అతనికి పౌరుషం ఎక్కువ. అనుకున్నదేదో ఖచ్చితంగా చేసి తీరే స్వభావం.
    
    శంకరం తల్లిదండ్రులు సినిమాకి ఏ మూడు నెలలకో ఒకసారి వెళతారు. తనుకూడా అప్పుడే వాళ్ళతో పోవాలన్న మాట.
    
    తనని తండ్రి ప్ర్తతివిషయంలో ఎందుకని నిర్భంధిస్తాడో అర్ధంకాదు శంకరానికి. సినిమాకి వెళితే తప్పు. నలుగురైదుగురు స్నేహితులతో తిరిగితే తప్పు. అందరూ తమకి డబ్బు వున్నదంటారు. అంటారేమిటి? నిజంగానే వుంది. ఉన్నంత మాత్రంచేత ఏం లాభం? తనేం అనుభవిస్తున్నాడో తనకి అర్ధంకాదు.
    
    అక్కయ్య యిక్కడ ఉన్నన్నాళ్ళూ దాన్నీ అలానే చేశారు. దానికి చదువుకూడా చెప్పించలేదు. అది ఆడది. అందుకని అన్నీ సహించింది. అయినా యిప్పుడు బావ దగ్గిర హాయిగా సుఖపడుతున్నది దానికేం?
    
    తనకే చిక్కు, తన ఖర్చుకి ఒక్కదమ్మిడి యివ్వడు నాన్న తను ఎలా బ్రతకాలనుకుంటాడో? తనకి స్నేహితులతో కులాసాగా గడపాలని వుండదా? హోటళ్ళకు పోవాలని వుండదా?
    
    డబ్బుయిస్తే పిల్లలు చేసిపోతారట. ఎందుకూ పనికిరారట. తను ఎప్పుడన్నా ఒక పావలా యిమ్మని అడిగితే "ఎందుకు?" అని అడుగుతాడు, ఇందుకు అని ఏ సంగతీ ఎలా చెప్పగలడు? ఏదో సరదాగా ఖర్చు చెయ్యటాని కయ్యె ఇంకా గట్టిగా "ఏమన్నా కొనుక్కోటానికి" అని తను చెప్పే "అదేదో నేనే కొనుక్కొస్తాను" అంటాడాయె. తనకెప్పుడన్నా అణా, బేడా అమ్మే యిస్తుంది. ఆవిడ దగ్గర అంతకంటే ఎక్కువే ముంటాయి? కాని అవి తనకేం చాల్తాయి? నిన్న తన పెన్ను పోయింది. పోయిందని చెబితే యింట్లో ఛడామడా తిడతారు. చెప్పకపోతే ఎలాగ? అందుకే ఇంకోపెన్ను కొనుక్కోదలిచాడు. అందుకే నిన్న...

 Previous Page Next Page