తను చేసిన పనికి శిక్ష రాముడు అనుభవించాడు. అయినా తను ఏం చేయగలడు?
శంకరానికి యిప్పుడో గట్టిచిక్కు పట్టుకుంది. చలానికి సహాయం చెయ్యాలి. అతని స్కూలు జీతం కట్టబడేటట్లు చూడాలి ఎట్లా? నిన్నటి నిశ్చయానికే ఇవాళా వచ్చాడు శంకరం.
ఆ రాత్రి నారాయణరావుగారి కోటుజేబులోని పర్సులోంచి పదిరూపాయల నోటు మాయమయింది.
3
పది రూపాయలనోటు పోయిన సంగతి నారాయణరావుగారికి మరునాడు పొద్దున్నే తెలిసింది. ఈసారి రాముణ్ణి అనుమానించటానికి వీలులేదు. వాడు యింటినుంచి వెళ్ళిపోయినా తర్వాతనే ఆయన కోటు విప్పాడు. తిరిగి ప్రొద్దుట చూసుకునే సరికి వాడింకా పనికిరాలేదు.
ఆయన శాంతమ్మని పిలిచాడు. "మళ్ళీ ఒక పదిరూపాయలనోటు పోయిందే. రాత్రి కోటు ఈ స్టాండుకు తగిలించానా, ఇప్పుడు చూస్తే లేదు" అన్నాడాయన.
"ఏమవుతుంది లేకపోతే?"
"అదే నేనూ అడుగుతున్నాను."
"బాగానే వుంది. ఇంట్లో ఇంకెవరూ లేందే ఎలా పోతుంది? మీరే లెక్క పొరబాటుగా పెట్టుకుని వుంటారు. అంతేగాని కాళ్ళూచేతులూ వచ్చి వెళ్ళిపోతుందా అది?" అన్నాది శాంతమ్మగారు. ఈసారి నారాయణరావుగారు నమ్మి ఊరుకోక తప్పలేదు.
ఆ రోజు శంకరం బడికిపోయిన తరువాత ముందుగా చలాన్ని పిలిచి ఒక అయిదురూపాయలు యిచ్చాడు జీతం కట్టమని. "ఎక్కడిది?" అనడిగాడు చలం. శంకరం ఇంట్లో పరిస్థితి అతనికి కూడా తెలుసు.
"ఎక్కడిదో నీకెందుకు?" అన్నాడు శంకరం.
"అదికాదు మీ నాన్నగారు ఇచ్చారా?"
"లేదులే మా అమ్మనడిగి తీసుకువచ్చాను" అని చెప్పాడు శంకరం. చలం ఇంకేమీ మాట్లాడలేదు. నిన్న సినిమాకి పోలేదే అన్న బాధ శంకరాన్ని ఇవాళ ఇంకా పీకుతుంది. "మధ్యాహ్నం మ్యాట్నీ షోకి వెళదామా?" అన్నాడు శంకరం. "బడో" అన్నాడతను. "వెధవ బడి పోనిద్దూ ఈ ఒక్కపూటేగా" అన్నాడు శంకరం నిర్లక్ష్యంగా మొదట చలం ఒప్పుకోలేదు. "హాఫియర్లీ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. బాగా చదవకపోతే లాభంలేదు" అన్నాడు. అయినా శంకరం ఒప్పుకోలేదు. ససేమిరా సినిమాకి పోవాలని పట్టుబట్టి కూర్చున్నాడు. చలం ఏమనగలడు? ఒప్పుకున్నాడు.
మధ్యాహ్నం యిద్దరూ బడి ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళారు. చలం లోపల బాధపడుతూనే వున్నాడు. అయినా శంకరానికి కోపం వస్తుందేమోనని భయపడి బయటికేమీ అనలేదు.
సినిమా చూసి యిద్దరూ ఇంటికి వస్తుంటే దార్లో ఇంగ్లీషు టీచరు కనిపించారు. వీళ్ళిద్దరూ సినిమా చూసి వస్తున్న మొహాలని చూడగానే గ్రహించాడాయన.
"ఎలా వుందిరా పిక్చర్?" అనడిగాడాయన చటుక్కున. ఆయన్ని చూసి ఇందాకనే భయంతో గతుక్కుమన్న ఇద్దరూ ఈ ప్రశ్నకి బిగుసుకుపోయారు. ఇద్దరిలో ఎవరికీ నోటివెంట మాటరాకుండా నిలబడిపోయారు. ఆయన చలంవంక చూస్తూ "వాడంటే లక్షాధికారి బిడ్డ. జీతం కట్టడానికి కూడా గతిలేని నీకుకూడా యీ తిరుగుళ్ళేమిటిరా?" అన్నాడు. చలం తలవంచుకొన్నాడు.
"ఏరా శంకరం, మీ నాన్నగారితో చెప్పాలేమిటి నిన్నుగురించి?" అన్నాడాయన తిరిగి శంకరం నోరు మెదపలేదు. ఇద్దర్నీ సరిగ్గా బడికి వస్తుండమనీ, యిది ఫస్టు వార్నింగనీ చెప్పి ఆయన వెళ్ళిపోయాడు.
ఆయన వెళ్ళిపోయిన తర్వాతకూడా చలానికి భయం వదల్లేదు. తను బడికి ఎందుకు వస్తున్నాడు? చదువుకోటంకోసం. మరి ఆ చదువును వదిలిపెట్టి ఇలా బలాదూరు తిరగటాన్ని ఏమంటారు? మాష్టారన్నట్లు శంకరం అంటే లక్షాధికారి బిడ్డడు. ప్రస్తుతం వాడిస్థితి ఎలా అయినా వుండనీ వాడు చదువుకోకపోయినా ఫర్వాలేదు రేపు డబ్బంతా వాడిదే అవుతుంది. తింటానికి తిండి లేకపోయినా నాన్న తననెలాగో బడికి పంపిస్తున్నాడు. తను చదవకపోతే ఎలాగ? తనకి జీతం కట్టటానికి డబ్బులేకపోతే శంకరం తనకు సహాయం చేసినమాట నిజమే. అయినంతమాత్రంచేత ఇందుకు ప్రతిఫలంగా తను క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకి తిరగటమా? ఈ విషయం నాన్నకు తెలిస్తే బ్రతకనిస్తాడా?
ఈ ఆలోచనలు చలాన్ని దహించివేశాయి చూస్తూ చూస్తుండగానే అతని కళ్ళనుండి నీళ్ళు కారిపోసాగాయి. శంకరం యిది చూశాడు. "ఏడుస్తున్నావా" అని అడిగాడు.
"నేనంటే డబ్బులేనివాణ్ణి మాస్టర్ల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి వుండాలి. వాళ్ళకోపానికి గురయితే?" అన్నాడు కళ్ళు తుడుచుకొంటూ చలం. కాని ఏ విధంగా చూసినా సినిమా చూడటం తప్పు అని అనుకోలేకపోయాడు శంకరం. తను ఈవిధంగా యిదొక్కసారే కాదుగా చెయ్యటం? వాళ్ళ సరదాలు తీరేది ఎట్లా? చలం వాళ్ళకి డబ్బులేదు. అందుకని సినిమాలు ఎప్పటికోగాని చూడరు. చలంకూడా తనలాంటి కుర్రవాడే. వాడికి సరదాలుంటాయి. ఎంత బీదవాడు అయితేమాత్రం మాస్టర్లకు అంత అణిగిమణిగి వుండాలా? సినిమాలు చూడకుండా కళ్ళు కట్టేసుకోవాలా?
అందుకని చలం చెప్పినదానికి శంకరం ఒప్పుకోలేదు. "ఫర్వాలేదురా- మేష్టర్లంటే దేవతలా? వాళ్ళంటే భయంతో చచ్చిపోవాలా?? ఏం అక్కర్లేదు. ఒకరోజు సినిమాకు పోయినంతమాత్రంచేత చదువేం పాడయిపోదులే" అని చెప్పాడు. శంకరం చెప్పింది చలానికి అంతగా నచ్చకపోయినా వాదించటం యిష్టంలేక ఊరుకున్నాడు. ఇద్దరూ తిరిగి ఇళ్ళకు బయల్దేరారు. కొంతదూరం పోయిన తర్వాత ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. చలం ఇంటికి ఎడంవైపు మలుపు తిరిగిపోవాలి శంకరం ఇంటికి సరాసరి వెళ్ళిపోవచ్చు. "వెళుతున్నాన్రా చలం, రేపు బడికి వస్తావుగా" అన్నాడు శంకరం.