పిల్లదొంగ
--కొమ్మూరి వేణుగోపాలరావు
నా డ్రాయరులో అయిదురూపాయలు పెట్టాను. ఏమయిపోయాయే!" అంటూ అడిగాడు నారాయణరావుగారు వంటింట్లోకి వెళుతూ.
"ఏ అయిదురూపాయలండీ?" శాంతమ్మ తెల్లబోయి అడిగింది.
"అయిదురూపాయలనోటే, నిన్న సాయంత్రం పెట్టాను. ఇవాళ చూస్తేలేదు" అంటూ ఆలోచిస్తూ నిలబడిపోయారు నారాయణరావుగారు.
"మీరే తీసి ఖర్చు పెట్టుకున్నారేమో ఆలోచించండి."
"నీ మొహం నిన్న నేనే పెడితేనూ?" అనంటూ సావిట్లోకి వచ్చాడాయన.
నిన్న పెట్టింది ఇవ్వాళ మాయమయిపోతుంది? దానికేమైనా కాళ్ళూ చేతులొచ్చాయా! లేకపోతే ఎవరు తీసి వుంటారు? ఇలా ఈ ఒక్కటేగాదు పోవటం తను ఎక్కడున్నా ఒకటీ అర్ధా మరచిపోతుంటే అదీ అలాగే మాయమై పోతుండటం పరిపాటే అయింది ఈమధ్య.
ఒకవేళ రాముడుగాడేమైనా తీస్తున్నాడేమో అనుకున్నాడు ఒకసారి. రాముడు అంటే వాళ్ళ ఇంట్లో నెలజీతానికి పనిచేస్తున్న పాలేరు. రాముడు అటువంటి పనులు చేయడు. నిజమే కాని కళ్ళెదురుగా డబ్బు కనిపిస్తుంటే ఎవరు మాత్రం చూస్తూ వూరుకుంటారు? ఇది నారాయణరావుగారి అభిప్రాయం.
ఆయన తలఎత్తి చూచేసరికి రాముడు కూరలసంచితో లోపలికి ప్రవేశిస్తున్నాడు.
"ఇటు రారా" అని పిలిచాడాయన వాడ్ని.
"ఏంటయ్యగారూ!"
"ఒరేయ్ నిజంచెప్పు నిన్నేమీ అనను. అబద్దం ఆడితే మాత్రం డొక్క బద్దలుకొట్టేస్తాను సుమా, ఆ డ్రాయరులో పెట్టిన అయిదురూపాయలనోటు తీశావా? లేదా?" అన్నారు నారాయణగారు.
రాముడికి కాళ్ళు వణికాయి. తడబడుతూ "ఆ... అయిదురూపాయల నోటా! నాకేం తెలుసు బాబూ?" అన్నాడు.
నారాయణరావుగారికి కొంచెం కోపం వచ్చింది. "నిజం చెప్పకపోతే వళ్ళు వాయించేస్తాను సుమా ఎక్కడ పెట్టావది?" అన్నారు గట్టిగా అరుస్తూ "నిజం అయ్యగారూ! నాకేం తెలేదండి."
"నోర్ముయ్యి వెధవా"
"నిజమండీ!"
"వెధవా, నిజం చెప్పమంటుంటే?" అంటూ వాడి దవడమీద బలంగా ఒక్కటి వేశారు నారాయణరావుగారు దెబ్బతో బావురుమన్నాడు వాడు.
"తియ్యకపోతే ఏమవుతుందిరా? ఎక్కువకాలం పని చెయ్యాలని లేదేమిటి? సాయంత్రానికల్లా తెచ్చి యివ్వకపోతే ఏం చేస్తానో చూడు" అంటూ బయటికి వెళ్ళిపోయారు.
చాలాసేపటివరకూ రాముడు ఏడుస్తూనే వున్నాడు. శాంతమ్మగారు యిదేమీ చూడలేదు. అరగంట గడిచింతర్వాత ఇంట్లోకి ప్రవేశిస్తూ యీ విషయం చూసిన శంకరం "ఎందుకలా ఏడుస్తున్నావు?" అని అడిగాడు.
"అయ్యగారు కొట్టారండీ" అని చెప్పాడు రాముడు కళ్ళు తుడుచుకుంటూ.
"ఎందుకు?"
"నేనట, అయిదురూపాయలు దొంగిలించానట ఆ డ్రాయరులోవి" అన్నాడు రాముడు.
"నువ్వా!" అన్నాడు శంకరం ఆశ్చర్యంగా అతనిది కూడా రాముడి యీడే థర్డుఫారం చదువుతున్నాడు. నారాయణరావుగారి అబ్బాయి ఒక్కడే కొడుకు.
"నువ్వు తీశావని కొట్టారా నాన్నగారు?"
"అవునండి."
"సరేలే ఏడవకు. ఇంద, ఈ పావలా తీసుకో" అంటూ జేబులోంచి ఒక పావలా తీసియిచ్చి ఆలోచిస్తూ మెల్లిగా లోపలికి పోయాడు శంకరం.
2
"బడి టైమయింది రావోయ్" అంటూ చలం వచ్చాడు శంకరంకోసం.
"వస్తున్నా నుండు" అంటూ శంకరం పుస్తకాలు తీసుకొని చలం వెంబడి బడికి బయల్దేరాడు.
శంకరానికి చలం ప్రాణస్నేహితుడు. శంకరం తండ్రి వ్యాపారస్థుడు. బాగా డబ్బుంది. చలం తండ్రి గుమాస్తా.
చలం ముఖం ఆ రోజున ఎందుకో యిదిగా వున్నట్లు కనిపించింది శంకరానికి. "అలా వున్నావేం?" అని అడిగాడు.
చలం కొంచెం మనస్థయిర్యంగల కుర్రాడు. "బాగానే వున్నానుగా" అన్నాడు నవ్వు తెచ్చుకొంటూ.
"నాకు తెలుసులే చెప్పవోయ్" అన్నాడు శంకరం.
చలం కళ్ళలో నీళ్ళు చిమ్మాయి. "మా నాన్న ఉద్యోగంపోయి వారంరోజులయింది" అన్నాడు ఒక్క నిముషం ఆగి బొంగురుపోయిన గొంతుతో.
శంకరం ఆశ్చర్యపోయాడు. "ఎందుకు?" అని అడిగాడు.
"మా నాన్నని ఏదో తప్పులెక్కలు రాయమన్నారుట. రాయనన్నాడు. అందుకని ఉద్యోగంలోంచి తీసివేశారు" అని చెప్పాడు చలం.
శంకరానికి ఒక అనుమానం వచ్చింది. "అన్నం తిన్నావా?" అని అడిగాడు. చలం తిన్నానని చెప్పి తప్పించుకోబోయాడు. శంకరం కనుక్కొని పదమని చెప్పి కాఫీహోటలుకు తీసుకుపోయాడు.
వాళ్ళు స్కూలుకు పోయేసరికి కొంచెం ఆలస్యమైంది. అప్పుడే క్లాసులు ప్రారంభం చేశారు. వీళ్ళనుచూసి ఇంగ్లీషు మాస్టరు "ఏంరోయ్ ద్విమూర్తుల్లారా! ఇంత ఆలస్యం చేశారేమిటి?" అని అడిగాడు నవ్వుతూ.