Home » Kommuri venugopala rao » వ్యక్తిత్వం లేని మనిషి


    "తప్పు. నా జీవిత నిఘంటువునుండి యీ పదాన్ని పరపర చింపివేస్తాను. స్మశానవాటికలో కాలేకష్టం ప్రక్కన నిలబడి నృత్యం సలిపే పిశాచకాండ నాది. ఈ ప్రకృతిలో నేనో మహావికృతిని."
    "నాకు అలాగే జరగాలి."
    పుస్తకం పట్టుకున్న అతనిచేతులు వణుకుతూ పట్టుతప్పుతున్నాయి. శరీరం చెమటలతో తడిసిపోతోంది.
    మరునాడు ఆమె రాసుకున్న పంక్తులలో ఎక్కువ విశేషం లేదు. "గీతలోని పదిహేనవ అధ్యాయాన్ని కంఠస్థం చేస్తున్నాను" అనివుంది.
    మరోపేజీ!
    "ఇవాళ గీతాపఠనం పోటీ జరిగింది. పురుషులు, స్త్రీలు, వృద్ధులు, బాలలు మొత్తం పదిహేనుమంది వరకూ పాల్గొన్నారు. నాకు ఈ తతంగమంతా నవ్వులాటగా, హాస్యాస్పదంగా వుంది. అయినా పాల్గొన్నాను. ఉపన్యాసానికి ప్రతిరోజూ దయచేసే పండితోత్తములు ముగ్గురు న్యాయనిర్ణేతలుగా స్వామివారి చేత నియమింపబడి వేదికముందు ఆసీనులై వున్నారు. శ్లోకాలు పఠించేముందు ఒక్కొక్కరే వచ్చి స్వామివారి పాదాలను కళ్ళకు అద్దుకుని, తర్వాత నిలబడి చదివేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది మధ్యలో మరిచిపోయి, సిగ్గుపడి పారిపోతున్నారు. కొంతమంది బాగానే చదివారు. నావంతు వచ్చింది.
    "నెమ్మదిగాలేచి, వేదికవద్దకు వెళ్ళి నిలబడ్డాను. ఆయనవంక చూశాను. ఆయన నావంక చూశారు. ఆయన పాదాలను కళ్ళకద్దుకోలేదు సరికదా, చేతులు జోడించి నమస్కారమైనా చేయలేదు. ఒకసారి గొంతు సవరించుకున్నాను.
    "ఊర్థ్వమూల మధశ్యాఖమ్
    అశ్వత్థం పాహురవ్యయమ్
    ఛన్దాంసి యశ్వపర్ణాని
    యస్తం వేద సవేదవిత్"
    నా కంఠం, ఉచ్ఛారణ నాకే మధురాతి మధురంగా ధ్వనించాయి. ఎక్కడో గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. ఇంతమంది మనుషులు నన్ను వీక్షిస్తున్నారని గాని, నేను ఓ సభామందిరంలో వున్నట్లుగాని నాకు స్ఫురించలేదు. సర్వత్రా చీకటి. ఒకే ఒకచోట- ఓ బిందువులా అందులో ఓ కాంతి పుంజం. కంటికి ఆ కాంతిపుంజంతప్ప మరో వస్తువు కనిపించటం మానేసింది. మొదట అలుముకున్న ఆ నల్లటి చీకటికూడా కనబడటం మానేసింది. ఒకే ఒక వెలుగు. క్రమంగా భారీగా, నలువైపులా దూసుకుపోతోంది. మొదట నల్లని తెరమీద తెల్లటి జలతారు వ్యాపించినట్లుగా వుండి, తర్వాత తర్వాత అంతా తెలుపుమాయమై వూరుకుంది. అబ్బ! ఎంత ఏకాకిని! ఇలాంటి అనుభూతిని జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు.
    వళ్ళు తెలిసేటప్పటికి, క్రిక్కిరిసివున్న సభలో పద్మాసనం వేసుకుని స్వామి కూర్చున్న వేదికదగ్గర ఎప్పటిలా నిలబడి వున్నాను. నే ధరించిన నేతబట్టలు, కాటుకపెట్టుకున్న కళ్ళు, విరబోసుకున్న శిరోజాలు, యీ రూపంతో నిల్చుని వున్నాను.
    "పన్నెండో శ్లోకం ఏది?" స్వామివారి కంఠం వెనకనుండి అడిగింది.
    "యదాత్య గతం తేబో..." అని చెప్పాను తడుముకోకుండా.
    "మమైవాంశో జీవలోకే... ఎన్నో శ్లోకం?" అని ప్రశ్నించారు.
    "ఏడోది" అని జవాబు చెప్పాను వెంటనే.
    "వెళ్ళి కూర్చో" అన్నారు.
    నా స్థానంలోకి పోయి కూర్చున్నాను. నా చుట్టూ కూర్చున్న ఆడవాళ్ళంతా నావంక విడ్డూరంగా చూడసాగారు.
    "నువ్వు ఎవరి అమ్మాయివి?" అనడిగింది ఓ ముత్తైదువ.
    "నేనెవరి అమ్మాయినో చెబితే మీకు తెలీదు. నన్ను జగతి అంటారు" అన్నాను.
    "పెళ్ళి అయినట్లు లేదే" అంది యింకో పునిస్త్రీ.
    "అయినట్లు వుండదులెండి" అన్నాను.
    "ఎంతవరకూ చదువుకున్నావు?" అనడిగింది ఓ పూర్వసువాసిని.
    "అక్షరం ముక్క ఒస్తే ఒట్టు" అన్నాను.
    వాళ్ళంతా నాగురించి గుసగుసలు చెప్పుకుంటున్నారు. నాలో నేను నవ్వుకుని ముఖం యింకోవైపుకు త్రిప్పుకున్నాను.
    "స్వామి నావైపు రెండుమూడుసార్లు చూడటం గమనించాను. అయినా ఏమీ తెలియనట్లు ఊరుకున్నాను.  
    "పోటీ ముగిసేసరికి చాలా పొద్దుపోయింది. ఫలితాలు మరునాడు వెల్లడి చేస్తామన్నారు. సభ ముగిసింది. అంతా లేచి సెలవు తీసుకుని వెళ్ళిపోతున్నారు. నేను మామూలుగా లేచి నాదార్న నేను వచ్చేశాను.
    "మొత్తంమీద స్వామి చాలా ఉత్సాహవంతులు. మిగతా వేళల్లోకూడా ఒక్కక్షణం వృధా చెయ్యకుండా ఏదో ఒకపని చేస్తుంటారుట. అపరాహ్ణంవేళ శిష్యులతో కలసి భిక్షకు వెళతారు. రాత్రిళ్ళు పళ్ళు తీసుకుంటారు.
    శిష్యులను చూస్తే నాకు విచిత్రంగా వుంది. అక్కడ ఆశ్రమంలో ఎంతమంది శిష్యగణం వున్నారో తెలియదుగాని, యిక్కడకు మాత్రం వెంట యిద్దరు వచ్చారు. కరటక దమనకుల్లా వుంటారు. ఇద్దరూ చాలా చిన్నవాళ్ళు. పద్దెనిమిది, యిరవై ఏళ్లలోపు. గునగునలాడుతూ, ఆరోగ్యంగా వున్న పశువుల్లా వుంటారు. స్వామి చెప్పేది ఎంతవరకూ తలకెక్కించుకుంటారో తెలీదుగాని, అందులో ఒకడు- వాడిపేరు కరటకుడని పెట్టాను. పరమ తిండిబోతూ. ఎప్పుడు అరటిపళ్ళు భక్షిస్తూ వుంటాడు. రెండవవాడు దమనకుడు. వాడి చూపులెప్పుడూ ఆడవాళ్లమీదే. ఏదో వంకమీద ఆడపిల్లల్ని పలకరించటానికి ప్రయత్నం చేస్తుంటాడు. నవ్వించటానికి తంటాలు పడతాడు. తీర్థప్రసాదాలు అందచేసే సందర్భాలలో మెల్లిగా చేయి తగలనిస్తూ వుంటాడు. నాకు చాలాసార్లు తీర్థ ప్రసాదాలు పెట్టబోయాడు. అఖ్ఖర్లేదన్నాను. 'మీరు నాస్తికులా?' అన్నాడు. 'ప్రసాదం సేవిస్తే ఆస్తికురాల్ని అవుతానని అనుకోవటం లే'దన్నాను. ఒకరోజు 'ఫర్వాలేదు. నాకోసం తీసుకోండి' అని చనువు ఎక్కువచేసుకుంటూ బలవంతంగా యింత ప్రసాదాన్ని చేతిలో కుక్కాడు. అంతటితో వూరుకున్నాడా? చెయ్యి నొక్కుతున్నాడు. వీడిపని యిలాకాదని గోరుతో గట్టిగా గిచ్చేశాను. కందిరీగ కుట్టినట్లయింది కాబోలు. 'అబ్బ' అని చటుక్కున చెయ్యి వెనక్కి లాగేసుకున్నాడు. కళ్ళల్లో నీళ్ళు తిరిగిన పర్యంతం అయింది. గబగబ అక్కడ్నుంచి జారుకున్నాడు."
    మృత్యుంజయరావు ఊపిరి బరువుగా ఒదిలాడు. మరోపేజీ త్రిప్పాడు.
    "ఇవాళ గీతాపఠనం ఫలితాలు ప్రకటించారు. మొదటి బహుమతి 'జగతి'కి. నాకు తెలుసు- వాళ్లకి యివ్వక తప్పదని. నాపేరు చదివి వేదికవద్దకి పిలిచారు. అయిదారు పుస్తకాలు కలిపికట్టిన ఓ ప్యాకెట్ స్వామి నాకు అందజేశారు. తీసుకుంటూంటే నాచేయి ఆయనచేతికి తగిలింది. కావాలని తగిలించానేమో తెలియదు. కాని మరుక్షణంలో సుడిగాలికి ఆకులా వణికిపోయాను. నా శరీరమంతా ఒకరకమైన మంట ప్రారంభించింది. ఆకస్మికంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్రయత్నంగా ప్యాకెట్ ప్రక్కనపెట్టి చేతులు జోడించి ఆయనకు నమస్కరించాను. కాని ఆయన కళ్ళలోకి చూసేసరికి అదిరిపోయాను. ఎప్పుడూ కనిపించే ప్రశాంతత వాటిల్లో యిప్పుడు లేదు. ఏదో భరించరాని బాధకు గురయినట్లు, అందులోనుండి కోలుకునేందుకు కలవర పడుతున్నట్లు కనిపించారు. పంటితో క్రిందిపెదవి గట్టిగా కొరుక్కుంటున్నాడు. ఎప్పుడూ లేనిది నాకు భయంవేసింది. నేనేమన్నా చేశానేమో అనిపించింది. అలాగే కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాను. క్రమక్రమంగా ఆయనముఖంలో జీవకళ తిరిగి ప్రవేశించింది. కళ్ళలో కాంతి, పెదవులపై చిరునగవు ఎప్పటిలా అవతరించాయి.
    "నువ్వెవరివి?" ఆయన పెదవులు అతినెమ్మదిగా ఉచ్ఛరించాయి.
    "నేను పాపిని" అని గొణిగాను.
    ఏదో అలౌకికశక్తి నాలో ప్రవేశించినట్లయింది. ఆయన స్పర్శ నాలో కొత్త రక్తాన్నీ, కొత్త గుండెనూ నిర్మించినట్లయింది. ఆయన పాదాలమీద తలపెట్టి ఏడవాలనిపించింది. మా మాటలు ఎవరికీ వినిపించి వుండవు.
    వెళ్ళు అన్నట్లు సౌంజ్ఞ చేశారు. మెల్లిగా తలవంచుకుని నా స్థానంలోకి వచ్చి కూర్చున్నాను.
    "తర్వాత మిగతావాళ్లకి కూడా బహుమతులివ్వటం జరిగింది. కాని నేను మహా అలజడితో, నూతన ప్రపంచంలో వున్నాను. నా కళ్ళకేం కనబడటం లేదు.
    "సభ ఎప్పుడు ముగిసిందో నాకు తెలియదు. వళ్ళు తెలిసేటప్పటికి అధోముఖినై అదేస్థానంలో కూర్చునివున్నాను. చుట్టుప్రక్కల ఎవరూ లేరు ఏమిటి? అంతా వెళ్ళిపోయారా? ఇంతలో నాకెదురుగా పాముకోళ్ళుమీద నిలిచినా రెండు బంగారుపాదాలు కనిపించాయి. నెమ్మదిగా తల ఎత్తాను. కాషాయంబరాలు, ఆజానుబాహురూపం, మందహాసం చేసే పెదవులు ప్రశాంత సెలయేర్లు వంటి నేత్రాలు.
    కంగారుగా లేచి నిల్చున్నాను, ఆ క్షణంలో చాలా లజ్జితురాల్ని అయిపోయాను.
    "ఏం కావాలి? ఇంకా కూర్చున్నావేం?" ఆయన ప్రశాంతకంఠం ఆదర పూర్వకంగా ప్రశ్నించింది.
    నాకేం చెప్పాలో తెలియలేదు. నాకేం కావాలి? ఏది కోరి నేనక్కడ కూర్చున్నాను?
    ఆలోచిస్తున్నాను.
    "ఏమీ అఖ్కర్లేదా?"
    "ఒక సందేహం" అన్నాను తడబడుతూ.
    చెప్పమన్నట్లు చూశారు.
    "పాపం అంటే ఏమిటి?" అని అడిగాను.
    "చాలా పెద్దప్రశ్న అడిగావు" అన్నారు చిరునవ్వుతో.
    మందిరంలో ఎవరూ లేరు. శిష్యులు లోపలెక్కడో పనిలో వున్నట్లున్నారు. వచ్చిన జనం ఒక్కరుకూడా మిగలకుండా అంతా వెళ్లిపోయారు.
    "కాదు- చెప్పండి. తెలుసుకోవాలని వుంది" అన్నాను ఆందోళనతో.
    ఒకక్షణం నా ముఖంవంక చూసి ఆయన చెప్పసాగారు. "మంచికి ఒకరూపం లేనట్లే పాపానికి ఒక రూపంలేదు. పాపం మానవ మనుగడలో అంతర్లీనమై వున్న అస్తిపంజరం. మనస్సుకు వెయ్యి పొరలు వున్నాయనుకుంటే అన్నిటికన్నా అట్టడుగునవున్న వెయ్యోపొర పాపం. మిగతా పొరలు చిరిగి నట్లుగా అది చిరగదు. పాపంలో పుణ్యం ఒక అంతర్భాగంకాదుగాని, పుణ్యంలో పాపం ఒక అంతర్భాగం. పుణ్యం అనుకుని, ప్రయత్నించి చేస్తాం. పాపం అనుకోకుండా, ఆకర్షణలో అప్రయత్నంగా చేస్తాం. చేస్తున్నప్పుడు బాధ కలిగించేది, దాని స్మృతికూడా పీల్చి పిప్పిచేసేసి పాపం. సాంఘిక ధర్మాలకు వ్యతిరేకంగా, తాత్కాలిక తృప్తికోసం, ఇంద్రియనిగ్రహంలేకుండా ప్రవర్తించటం పాపంలో ఒక భాగం."
    "ఇంద్రియ నిగ్రహం అని అందరూ తరచూ ఉపయోగిస్తూ వుంటారే, అది అంత ఘనమైనదా? ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఉదాత్తుడు కాలేడా?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra