Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 22


                         9
    రోజులు గడుస్తున్నాయి. జగతి రాను రాను మరీ గంభీరంగా తయారౌతోంది. ఎప్పుడూ లేని విషాదఛాయలు ఆమె ముఖంమీద అలుముకొనసాగాయి.
    ఈమధ్య ఆమె ఒక తెల్లకాయితాల పుస్తకం సంపాదించి అందులో ప్రతిరోజూ ఏదో శ్రద్ధగా రాసుకుంటోంది. ఒక్కొక్కసారి అర్థరాత్రిపూట లేచి కూర్చుని ఆ పుస్తకంలో గంభీరంగా రాసుకునేది. దీపకాంతి మీదపడి మృత్యుంజయరావుకు మెలకువ వచ్చి ఆమెవంక ఆశ్చర్యంగా చూస్తుండేవాడు. ఏమిటంత శ్రద్ధాసక్తులతో రాస్తున్నావని ఆమెనెప్పుడూ ప్రశ్నించలేదు. కాని అది ఏమిటో తెలుసుకుందామని అతనిలో కుతూహలం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. నిరంతరం ఆమెలో కనిపిస్తోన్న దిగులు అతనిలో బాధను రగిలిస్తోంది.
    ఒకరోజు సాయంత్రం ఆమె మఠానికి వెళ్ళింది. కొన్నిరోజులబట్టీ చేద్దామనుకుంటూన్న పని అతను ఆనాడు చేశాడు. తలుపులు, కిటికీలు గడియపెట్టి ఆమెబట్టల మధ్య పదిలంగా దాచుకున్న పుస్తకం బయటకు తీశాడు. అందంగా బౌండ్ చేసి వుంది. మొదటిపేజీలో 'జగతి' అని ముత్యాలవంటి అక్షరాలతో పేరు రాసుకుంది. ఒకసారి గబగబ పుటలు త్రిప్పాడు. అందమైన దస్తూరితో ఎన్నో విషయాలు రాసుకుంది జగతి. అది డైరీ అన్నమాట! అతని గుండె గబగబ కొట్టుకుంది. చదువుదామా వద్దా అని రెండుమూడు క్షణాలు తటపటాయించాడు. ఏమైనాసరే చదవమని అతని ఆత్మ ప్రేరేపించింది. ఒకసారి తలుపు గడియ సరిగ్గా వేసుందో లేదో చూసి అతను చదవసాగాడు.
    స్వామివార్ని చూసిన మొదటిరోజున జగతి యిలా రాసుకుంది. 'చిలకమ్మగారు యివాళ ఊళ్ళోకి ఎవరో స్వాములవారు వచ్చారు. భాష్యం బాగా చెబుతున్నారట. పద చూసివద్దాం' అని బలవంతం చేసింది. నాకసలు స్వాములార్లు అంటే నమ్మకంలేదు. వాళ్ళు వంచకులని, అమాయకులయిన ప్రజలను మూర్ఖుల్నిచేసి ఆడిస్తూ వుంటారని నమ్మకం. కొంతమంది స్వాములు విపరీతంగా చదివి, విజ్ఞానాన్ని సాధించిన మాట నిజమే. కాని మంచివాళ్ళను చెడ్డవారినుండి వేరుచేయటం కష్టం! మంచివారిని వెతుక్కుంటూ పోతే ఎక్కువగా దుష్టులనే ఎదుర్కోవలసి వుంటుంది.
    "ఆవిడ మాట కాదనలేక, కాసేపు వినోదంగాకూడా వుంటుందని తలపోసి చిలకమ్మగారితో మఠానికి వెళ్ళాను."
    "మఠానికి ఏర్పాటుచేసిన మందిరం చాలా విశాలంగా వుంది. ఉదాత్తం గానూ వుంది. ఒకవైపు స్త్రీలు, ఒకవైపు పురుషులు కూర్చుని వున్నారు. స్వామివారు వేదికమీద ఆసీనులై వున్నారు. దూరంగా వుంటే సరిగ్గా కనిపించదనీ, వినిపించదనీ ముందు వరుసలోకి వెళ్ళి కూర్చున్నాను. అంతమంది మధ్యనుండి నడచిపోతుంటే జనులు నావంక స్తబ్దులయి అనిమిషంగా చూస్తూ వుండిపోయారు. వారి విభ్రాంతికి కారణం నాకు తెలుసు. నా రూపం! నాలో నేను నవ్వుకుని ఎవరి ఉనికీ పట్టించుకోకుండా చిలకమ్మగారితో వేదికముందు కూర్చున్నాను.
    "స్వామి పద్మాసనం వేసుకుని కృష్ణాజినం మీద కూర్చునివున్నారు. నూతనాగంతకులమైన మామీద ఒకసారి దృష్టిని బరపారు. చిలకమ్మగారు కంగారుపడుతూ నమస్కారం చేసింది. నన్నుకూడా దణ్నంపెట్టమని మోచేత్తో పొడిచింది. నేను లెక్కచేయలేదు. గమనించనట్లు వూరుకున్నాను.
    "స్వామిని బాగా పరిశీలించి చూశాను. పూర్తిపేరు విద్యాధరస్వామి, వయసులో చాలా చిన్నవారిలా కనిపించారు. ముప్పయిఅయిదు, ముప్పయి ఆరు సంవత్సరాలకంటే వయసు వుండదు. కూర్చుని వున్నా ఆజానుబాహులా గోచరించారు. పచ్చనిపసిమి, ఆకర్ణాంతం వ్యాపించినట్లున్న విశాలనేత్రాలు, దీర్ఘమై, వాడిగా వున్న నాసిక, ఎబ్బెట్టులేకుండా, అందంగా, గంభీరంగా పెరిగిన గెడ్డం, మీసాలు, ఆయన ముఖంలో వెల్లివిరుస్తూన్న వర్చస్సు... అంతటి స్పురద్రూపిని నేనెప్పుడూ చూడలేదు. అలాగే నిర్ఘాంతపోయి కళ్ళప్పగించి చూడసాగాను.
    "మా రాకవల్ల అంతరాయం కలిగి ఆగిన ప్రసంగం మళ్ళీ కొనసాగింది. ఆయన కంఠం ఖంగుమని మ్రోగింది. మలయానిలం వీస్తున్నట్లుగా, సెలయేరు తాపీగా ప్రవహిస్తున్నట్లుగా, వెన్నెల ప్రసరిస్తున్నట్లుగా, హుందాగా సాగి పోతోంది ఉపన్యాసం. ఆయన ఉచ్ఛారణ, పెదవుల కదలిక, నేత్రాలచలనం అన్నీ ఆసక్తిగా తిలకిస్తూ కూర్చున్నాను. ఆయన చెప్పేది నా చెవుల బడడంలేదు. అయినా చాలా బాగా చెబుతున్నాడనిపిస్తోంది. విసుగనిపించటంలేదు.
    "ఇంత చిన్నవయసులోనే యీయనకు సన్యాసాశ్రమం ఎందుకు పుచ్చుకోవలసి వచ్చిందో అర్ధంకాలేదు. ఆయన ముఖంలో బ్రహ్మతేజస్సు ఉట్టిపడుతోంది. బాగా విజ్ఞానిలా కనిపించాడు.
    "మళ్ళీ నావంక దృష్టి మరల్చుతాడేమోనని చూశాను. ఉహు! తర్వాత ఒకసారికూడా ఆయన తీక్షణ వీక్షణాలు నావైపు ప్రసరించబడలేదు.
    "సభ ముగిసిపోయింది. అందరూ వరుసవారి ఆయనదగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతున్నారు. చిలకమ్మగారు వెళ్ళి ఆయన పాదాలముందు మోకరిల్లుతోంది. నన్నుకూడా పిలుస్తుందేమోనన్న భయంతో యివతలికి మెల్లగా నడుచుకుంటూ యింటికి చేరాం.
    "ఎవరిగురించీ తీవ్రంగా, శ్రద్ధగా, ఆలోచించని మనసు ఈనాడు ఈ యువకస్వామిని గురించిన తలపుల్లో వుంది. ఆయన యింత చిన్నవయసులో సన్యాసం స్వీకరించటానికి కారణమేమిటి? ఆయన జీవితంలో ఏమయినా పెనుతుఫానులున్నవా? అలజడులున్నవా? ఏమయినా ఆయన నన్ను ఆకర్షించాడు. ఇహ రోజూ ఆయన సమక్షానికి పోవాలని నిశ్చయించుకున్నాను."
    మృత్యుంజయరావుకు ఆమె మొదటిసారి మఠానికి వెళ్ళివచ్చినరోజు జ్ఞాపకం వచ్చింది. అయితే యీ ఆలోచనలన్నీ యెప్పుడు రాసుకుంది? తాను నిద్రపోయాక ఎప్పుడో రాసుకుని వుంటుంది.
    మరో పేజీ త్రిప్పాడు.
    "ఈరోజు స్వామి ఉపన్యాసాన్ని శ్రద్ధగా ఆలకించాను. 'హిందూమతము- దాని ప్రాశస్త్యము' అనే అంశాన్ని గురించి చాలా విషయాలు బోధించారు. మనమంతా ద్రావిడులన్న సంగతి అనృతమన్నారు. ఆర్యులనేవారు ఎక్కడి నుంచో వలసరావటం అంతకంటే అబద్ధమన్నారు. ఆర్యులు భరతఖండంలోనే హిమాలయపర్వత ప్రాంతంలో దేవకానదీ తీరాన జననమందారట. ఆ ఆర్యులే హిందువులట.
    "ఇలా ఎన్నో విషయాలు చెప్పారు. ఈరోజుకూడా వెళ్ళగానే ఒకసారి నావంక చూశారు. తర్వాత యాదృచ్చికంగా ఉపన్యాసమిస్తూ ఒకటి రెండుసార్లు చూశారుగాని, ప్రత్యేకదృష్టి ఏమీలేదు."
    మరోపేజీ త్రిప్పాడు.
    "ఇవ్వాళ స్వామివారు ఒక ప్రకటనచేశారు. ఎల్లుండి శ్రోతలలో చిన్నపోటీ పెడుతున్నారట. భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయం పోటీలో పాల్గొనేవారు వేదికవద్దకు వచ్చి కంఠస్థం చేసినట్లు పఠించాలట. ఎవరు బాగా చదువుతారో వాళ్ళకి చిన్నచిన్న బహుమతులిస్తారట.
    "పుట్టి బుద్ధెరిగాక భగవద్గీత మొహం ఎప్పుడూ చూడలేదు. అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఉత్కంఠా యెప్పుడూ కలగలేదు. కాని అయన దృష్టిని ఆకర్షించాలన్న కోరికను అణుచుకోలేకుండా వున్నాను. అందుకని యింటికిరాగానే చిలకమ్మాగారింటికి వెళ్ళి గీతపుస్తకం ఒకటి పట్టుకువచ్చాను. పదిహేనవ అధ్యాయం తెరిచి చూశాను. అబ్బా! చాలా శ్లోకాలున్నాయి. ఎల్లుండికల్లా వల్లెవేయటం నావల్ల అవుతుందా? ప్రయత్నిద్దాం.
    "స్వామివార్ని గురించి కొన్ని విషయాలుకూడా తెలుసుకున్నాను. శృంగేరి పీఠాధిపతి శ్రీ శంకరాచార్యులుగారికి యీయన ప్రియశిష్యులట. ఈయనకు ఉపదేశం చేసి సన్యాసాశ్రమాన్ని స్వీకరింపజేసిందికూడా శృంగేరి పీఠాధిపతులే. ఈయన సంసారాశ్రమం విస్మరించి వచ్చినవాడు కాదు. బ్రహ్మచారి. రేపల్లె దగ్గర మాధవాపురం అనే చిన్నగ్రామంలో స్వామివారికి చిన్న ఆశ్రమం వుంది. కొద్దిమంది శిష్యగణం కూడా వుంది. యీయనింకా పీఠాధిపతి కాలేదు. మనిషి నిరాడంబరుడు. అసలు ఎక్కడికీ పోవడం, మతప్రచారం చేయటం గిట్టదు. కాని ఆయన ప్రతిభ విన్న యీవూరి పురప్రముఖులు కొందరు బలవంతంచేసి యిక్కడ శంకరమఠంలో కొద్దిరోజులపాటు ఉపన్యాసాలు యివ్వడానికి తీసుకువచ్చారు.
    "ఈయన్ని చూస్తుంటే నాకు చాలా విచిత్రమైన భావాలు కలుగుతున్నాయి. ఎందుకీ బ్రహ్మచారి జీవితాన్ని యిలా వృధా చేసుకుంటున్నాడు? అనిపిస్తుంది. మళ్ళీ వృధా చేసుకోవటమంటే ఏమిటన్నప్రశ్న?  నాలా విచ్చలవిడిగా బరితెగించి తిరగలేదనా? నాలా అనుభవాలనే గుండుసూదులను శరీరమంతా గుచ్చుకోలేదనా?
    "అయినా అంతరాత్మ ఒప్పుకోవటంలేదు. ఆత్మవిమర్శ చేసుకోబుద్ధి కావటంలేదు. అహం ఒకటి వుండనేవుంది.   
    "వీటన్నిటినీ మించి నా దుర్భుద్దులు. మనసులోని నిశ్చింతనూ, నిజాయితీని నాలా శంకించే ప్రాణివుండదు. మనిషిలోని మనోదౌర్భల్యమే సృష్టిలోకాల్లో శక్తివంతమైనదని ఓ నమ్మిక. జూదరులుమ్ త్రాగుబాతులు, వ్యభిచారులు ఎన్నిసార్లు పశ్చాత్తాప హృదయులవుతూ వుంటారు? ఎన్నిసార్లు'ఈపాడుపని చెయ్యను' అని ప్రమాణాలు చేసుకుంటూ వుంటారు? కాని ఒకటి రెండు రోజులైనా గడవకముందే తిన్నదెబ్బనుంచి పూర్తిగా కోలుకోకముందే తిరిగి ఆ మనోదౌర్భల్యానికే దాసోహమనటంలేదా?
    "ఇతడు ఎంతో సాధనచేసిన మహనీయుడు అయివుండవచ్చు. ఎన్నో ప్రతిఘాతాలనూ, లౌకికచింతలనూ జయించి వుండవచ్చు. కాని ప్రకృతి శక్తులను, వాటి విజృంభణను మానసిక క్షేత్రంనుండి పూర్తిగా తుడిచివేయ కలిగిన వజ్రహృదయుడా? కఠోరనిష్ఠాపరుడా?"
    "పెంకిదాన్ని అవుతున్నాను."
    "ఆయన్నిగురించి అంతా ఘనంగా చెప్పుకుంటున్నారు. యవ్వనంతోవున్న సంసారస్త్రీలు సైతం ఆయనను నిస్సంకోచంగా స్పృశిస్తున్నారు. దైవసమానంగా పూజిస్తున్నారు. ఆయనంటే అసూయగా వుంది."
    "అందుకే కాబోలు... ఆయన్ని సాధించుదామని వుంది."
    "ఆయన్ని జయిద్దామని వుంది."
    "ఈ స్వామి, యీ యింద్రియాలను జయించిన కఠోర దీక్షాతత్పరుడు, విజ్ఞాన దురంధరుడు నాచేత పరాజితుడు కావాలి."
    "అప్పుడు నేను పిశాచిలా వికటాట్టహాసం చేయాలి."
    "ఇలా రాస్తోంటే ఎందుకు నాకు ఏడుపొస్తోంది? ఎందుకు ఏదో స్పందన కలుగుతోంది అణువణువునా?"
    తప్పని హెచ్చరిస్తోంది మనసు.

 Previous Page Next Page