"అయ్యో ! ఇది ప్రేమ కాదండీ ! జాలి ! పవిత్ర భారతదేశ స్త్రీకి పరాయి మగాడి మీద జాలి కలగడంలో తప్పులేదని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయండీ !"
"నాక్కావలసింది కూడా అదే రాధా ! ప్రేమకు మొదటి మెట్టే జాలి ! అంటే ఇవాళ జాలి, రేపు ప్రేమ ! వస్తానండీ ! థాంక్యూ." అనేసి పరుగెత్తాడు మురళి.
రాధ నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిపోయింది.
* * *
రాధ తన ఫ్రెండ్స్ తో బ్లూ మూన్ హోటలు కొచ్చింది. ఆమె స్నేహితురాలు రంజిత బర్త్ డే పార్టీ జరుగబోతోందక్కడ. అయితే తనను మురళీ వెంటాడుతున్నాడన్న విషయం రాధకు తెలీదు.
మురళి తన గాంగ్ వాళ్ళందరితో కలసి మేనేజర్ దగ్గిరకెళ్ళాడు.
"ఇవాళ నేను సితార వాయించేందుకు పర్మిషన్ ఇవ్వాలి." అడిగాడతనిని ! పెద్ద పెద్ద హోటళ్ళలో ఇలా తినేవాళ్ళు తింటూ వుండగా, వాయించే వాళ్ళు ఒక పక్క వాయిస్తూ వుంటారు. ఒకప్పుడు గిటారు వాయించేవారు, ఇప్పుడు సితారు ఫాషనయింది.
"ఏం బాబూ ? మా హోటల్ ఇలా అభివృద్ధి చెందడం మీ కిష్టం లేదా ?" అడిగాడు మేనేజరు రెండు చేతులూ జోడించి.
"నా ప్రేమ అభివృద్ధి చెందడం మీ కిష్టం లేదా ?"
మేనేజరుకి అర్ధం అయింది. "ఐసీ ! ఫ్లాష్ బాక్ ఉందన్న మాట !"
"చిన్నది ! మీ హోటల్ కేమీ ట్రబులుండదని హామీ ఇస్తున్నాను."
"అయితే ఒకే !"
రాధ అయిస్ క్రీమ్ తినబోతూండగా మైక్ ముందు ఎనౌన్స్ మెంట్ వచ్చింది.
"ఇప్పుడు భారతదేశ ప్రఖ్యాత సితారిస్ట్ శ్రీ మురళీగారు తన మ్యూజిక్ తో మీ హృదయాలను దోచుకుంటారు."
రాధ చేతిలోని ఐస్ క్రీమ్ ఠంగ్ మని కిందపడి ముక్కలైంది. (సారీ ... కరిగిపోయింది). మురళి మైక్ ముందుకొచ్చి ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు.
"డియర్ ఫ్రెండ్స్ ! నా ప్రియురాలి ప్రేమను పొందడానికి ఇది ఆఖరి రోజు ! ఇదే ఆఖరి అవకాశం !! ఈ రోజే నా ప్రేమ మీ అందరి ఎదురుగ్గా పుష్పించాలి. మీ అందరి ఎదురుగ్గా నా ప్రియురాలు తన అంగీకారాన్ని తెలియజేయకపోతే నా జీవితం ఇక్కడే ముగిసిపోతుంది. ఆమె తన ప్రేమను వెల్లడించేవరకూ ఈ సితార్ సంగీతం ఆగదు-"
హోటల్ లో కూర్చున్న వాళ్ళందరికీ ఆసక్తి కలిగి కరతాళ ధ్వనులు చేశారు. మరుక్షణం మురళీ వాద్య సంగీతం ప్రారంభమయింది.
"ఆ అమ్మాయి ఎవరయి ఉంటారు?" ఆశ్చర్యంగా అడిగింది రంజిత.
"ప్రస్తుతం హోటల్లో పక్కన బాయ్ ఫ్రెండ్స్ లేకుండా ఉన్నవాళ్ళం మనం అయిదుగురిమే ! కనుక మనలోనే ఎవరో ఒకరై ఉండాలి!" అంది ఉమ.
మురళి మొహంలో బాధ కనబడుతోంది. అతని చేతివేళ్ళు తెగిపోతాయేమో అన్నంత వేగంగా కదులుతున్నాయ్. రాధకు చెమటలు పట్టేస్తున్నాయి.
హఠాత్తుగా ఓ ముసలమ్మ లేచి పూనకం వచ్చిన దాన్లా స్టేజి ఎక్కేసింది. వెనుకే ఆమె భర్త పరుగెత్తాడు.
"నిన్నెలా ప్రేమిస్తాడే నీ మొహం ! ఆరుగురు పిల్లలు నీకు -"
"మీకు తెలీదండీ! ఆ కుర్రాణ్ణి చూస్తూంటే నాకే ఓదార్చాలనిపిస్తూంది."
"చాల్చాల్లే ఊరుకో ! ఎవరయినా నవ్వుతారు."
"ఎందుకు నవ్వటం ? ఆ పిల్ల ఎవత్తో నిజంగా రాక్షసి అయి వుంటుంది. అది హృదయం కాదు, రాయి."
రాధకు మురళిమీద జాలి, కోపం, చిరాకూ, ప్రేమా అన్నీ కలిసిపోయి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఇప్పుడేమిటి చేయటం ? లేచివెళ్ళి అతనిని నివారించాలా ? వప్పుకోవాలా ?
మురళి ఆమె మొఖ కవళికలు గమనిస్తూనే ఉన్నాడు. ఇంకొంచెం ! ఇంకొక్క డోస్! అంతే! ఆమె లేచి వచ్చేస్తుంది.
సితార వాయిస్తూనే తన గాంగ్ కూర్చున్న టేబుల్ కేసి చూశాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న అమితాబ్ టేబుల్ మీదున్న టమోటో కెచప్ తీసుకుని మురళి దగ్గిర కొచ్చి, అతడి చెమట తుడుస్తున్నవాడిలా నటిస్తూ దాన్ని పక్కన పెట్టాడు.
అమితాబ్ ని అడ్డు పెట్టుకుని, మురళి ఆ టమోటా జ్యూస్ లో వేళ్ళు పెట్టాడు.
అంతే !
అతని చేతి వేళ్ళ నుంచీ రక్తం కారుతున్నట్లు ఒక్కో చుక్కే పైజామా మీదకు జారసాగింది. హాలంతా కలవరం బయలుదేరింది.
"అరె బాప్రే రక్తం" అంది రంజిత కళ్ళు మూసుకుంటూ.
"మైగాడ్ ! హి ఈజ్ క్రేజీ !" అంది భానుమతి. "ఈ ముసలమ్మగారన్నట్లు అదెవత్తో నిజంగా రాక్షసే."
రాధ ఇంక సహించలేకపోయింది. పరుగుతో స్టేజీమీదకు వెళ్ళి అతని చేతుల్ని పట్టేసుకుంది.
కంటి నిండా కారుతున్న నీటితో "మురళీ - ఐ లవ్యూ ..." అన్నది.