"గుడ్ బాయ్ ! అది సరే గానీ, నీ ప్రేమ ఫలించడానికి ఓ సహాయం చేసిపెట్టనా ?"
"ఏం చేయగలవ్ నువ్వు ?"
"అదిగో ! ఎవర్నీ అలా అండర్ ఎస్టిమేట్ చేయకు ! నీకూ, ఈ ఎలక్ట్రిక్ పోల్ కీ మధ్య సాలెగూడు అల్లేస్తాను. రేపొద్దున్న రాధ బయటికొస్తూ ఈ గూడు చూసిందంటే నీ మీద ఎంత ప్రేమ కలుగుతుందో ఒక్కసారి ఆలోచించు !"
మురళి ఒక్కసారి ఆలోచించాడు.
"అబ్బ ! రియల్లీ ఒండర్ ఫుల్ ! నాకింత సహాయం చేస్తున్నందుకు నీ ఋణం ఎలా తీర్చుకోను ?"
"ఆ రాధను పెళ్ళి చేసుకుని నీ వెంబడి తీసుకుపోతే చాలు !"
"అదేమిటి ?"
"అదో పెద్ద కథ ! నేను రాధ గదిలో ఉన్న ఓ ఆడ సాలెపురుగుని ప్రేమించాను. ఇద్దరం కలిసి కాపురం చేద్దామని ఆ గదిలో ఎన్నిసార్లు గూడు కట్టుకున్నా ఆ రాధ చీపురుతో మా గూడు లూడ్చి ఇదిగో - చెత్త కుండీలో పడేస్తోంది ! ఎంత కఠిన హృదయమో చూడు."
"స్టోన్ ఏజ్ గాళ్" అన్నాడు మురళి.
మరుక్షణం గూడు అల్లటం ప్రారంభించింది సాలెపురుగు.
అంతలో "నేను కూడా నీకు సాయం చేయనా !" అన్న మాటలు పక్క నుంచి వినబడి తల తిప్పి చూశాడు మురళి.
ఒక కుక్క నిలబడి వుంది.
"నువ్వా ? నువ్వు నాకు ఏం సాయం చేస్తావ్ ?"
"ఈ సారి రాధ కిటికీ తలుపు తెరిచి చూసేసరికి నేను కాలు ఎత్తుతాను."
మురళి కెవ్వున కేక పెట్టినట్టు "ఎందుకూ ?" అని అరిచాడు.
"ఒక జంతువుకే 'స్థంభమ' ని భ్రమ కలిగేలా అలా స్థాణువులా నిలబడ్డ నిన్ను చూసి ఆమెకి ప్రేమ కలగవచ్చు."
"నోర్ముయ్ ! కాలెత్తక్కరలేదు, తోకెత్తక్కరలేదు. ఇక్కడి నుంచి పోతావా పోవా" అని అరిచాడు మురళి.
"కదలకు" అంటూ కోప్పడింది సాలెపురుగు పని మధ్యలో డిస్టర్బెన్స్ చూసి.
* * *
ఎందుకో రాధకు చటుక్కున మెలకువ వచ్చింది. దూరంగా ఎక్కడో ఆకాశంలో నుంచి పాట వినబడుతోంది.
"శంకరా ..." అంటూ ఎలుగెత్తి అరుస్తోందా గొంతు.
దాని వెనుకే ఆకాశం విరిగి మీద పడుతోందేమో అన్నంతగా ఉరుముల శబ్దాలు, మెరుపులు, ప్రళయం ముంచుకు రాబోతున్నట్లుంది.
ఒక్క ఉదుటున లేచి కిటికీ ఉన్నాడు. ఆమె గుండెలు బరువెక్కి పోయినయ్. ఆమె చూస్తూండగానే ఓ నల్లని మేఘం మురళీ తలకు తగిలేంత కిందకు వచ్చేసింది.
"చూశావా గురూ ! రాధను నిద్ర లేపి కిటికీ దగ్గరకు లాక్కొచ్చాను ! ఓ మాంచి వర్షం కూడా కురిచేశానంటే - ఆ మే ప్రేమ కూడా దెబ్బకు వర్షిస్తుంది."
"మరి నేను తడిచిపోతాను కదా ?"
"నువ్వు తడవకుండా నేను చూసుకుంటానుగా !" అంది మేఘం.
మరుక్షణం పేద్ద గాలీ వాన మొదలయిపోయాయ్. రాధకు మురళీ మీద ఎక్కడ లేని జాలీ కలిగింది. తన మీద ఎంత ప్రేమ లేకపోతే ఇన్ని అవస్తలు పడుతున్నాడు పాపం !
అంతలో పాటతోపాటు గాలీ వాన కూడా ఆగిపోయింది.
రాధ కన్నీరు తుడుచుకుంది. తెల్లారడానికి ఇంకో గంట టైముంది. సరిగ్గా అప్పుడే ఆబోతు రంకె వేయడం వినిపించింది. ఆమెలో సన్నగా వణుకు ప్రారంభమైంది. అది మురళీని చూసిందంటే పొడిచేయటం ఖాయం !
"భగవంతుడా ! అతనిని ఆబోతు బారినుండి రక్షించు" కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్ధించుకోసాగిందామె.
"అవునూ ! 'అచ్చోసిన ఆంబోతులా తిరుగుతావేం ! చదువుకో !' అని నిన్ను మీ టీచర్ అనడం నేను విన్లేదనుకున్నావా? అది సరే గానీ నీకు సహాయం చేద్దావనొచ్చాను - రాధ కిటికీలోంచి చూస్తోంది, నేనిప్పుడు నిన్ను పొడుస్తున్నట్లు నటిస్తాను. దాంతో ఆమె పరుగెత్తుకొస్తుంది ! ఎలా వుంది ?"
"నిన్ను అపార్ధం చేసుకున్నందుకు క్షమించు ఆబోతూ -"
"డోంట్ బోదర్ ! బ్రదర్స్ అన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా?" అని పెద్దగా రంకె వేసి దూరం నుంచీ మురళీ వేపు పరుగెత్త సాగింది. రాధ వణికిపోసాగింది.
"అయ్యో - అయ్యో" అంటూ తన నుదుటిని చేత్తో కొట్టుకుంటూ తలుపు తెరచుకుని బయటకు పరుగెత్తింది.
"మురళీగారూ ! దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళి పొండి! ప్లీజ్ -" అంది బాధతో విలవిల లాడుతూ.
"అయితే మరి నా ప్రేమ వప్పుకున్నట్లేనా ?"
"అయ్యో ! ఎలా చెప్పేదండీ మీకు ! నేను పవిత్ర భారతదేశంలో పుట్టిన స్త్రీనండీ ! ఒకసారి ఆమె మెడలో ఎవరయినా తాళి కడితే ఆవు మెడలో పలుపు కట్టినట్లేనండీ ! ఆ వ్యక్తి చచ్చిపోయినా, హిమాలయాలకు వెళ్ళిపోయినా ఆమె మనసు మారదండీ ! పరాయి మగాడిని కన్నెత్తి కూడా చూడదు -"
"నేనిప్పుడు పరాయి మొగాడినేగా - ఇక్కడి కెందుకొచ్చారు మరి ?"