ముందు నిశ్చేష్టులయినా అందరూ సంతోషంగా తప్పట్లు కొట్టేశారు.
తన చేతులకున్నది టమోటో జ్యూస్ అన్న సంగతి తెలీకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకున్నాడు మురళి.
8
అదేరోజు రాత్రి పదింటికి ఒక ఆకారం నెమ్మదిగా ఒక కాంపౌండ్ వాల్ ని ఎక్కింది. గూర్ఖా ముందువైపు వున్నాడు. మొత్తం పెరడంతా నిశ్శబ్దంగా వుంది. కుడివైపు వున్న వాటర్ పైపు పట్టుకుని పైకెక్కి పడగ్గది దగ్గిరకు చేరుకుని, కిటికీ రెక్కమీద చిన్నగా చప్పుడు చేసింది.
పుస్తకం చదువుకుంటున్న రాధ చప్పుడుకి తలెత్తి చూసి కళ్ళని నమ్మలేనట్టు - "... మురళీ" అంది.
"అవును నేనే రాధా !"
రాధ చప్పున గుమ్మం వైపు చూసింది. ఆమె కళ్ళలో భయం స్పష్టంగా కనిపించింది. పరుగెత్తుకుంటూ వెళ్ళు తలుపు వేసేసి కిటికీ దగ్గిరకి వచ్చింది. "మురళీ - ఏమిటిది - వెళ్ళిపో ! ప్లీజ్ ! ఎవరన్నా చూస్తే బావోదు." అని కంగారుగా అంది.
"నేను నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను రాధా ... ఈ రాత్రి నిన్ను ఒకసారైనా చూడకపోతే బ్రతకలేననిపించింది."
"ప్లీజ్ ! వెళ్ళిపో మురళీ - నాన్న చూస్తే చంపేస్తాడు."
ఇంకా ఏదో చెప్పపోతున్న అతడిని వారించి, ' "ఆగు మురళీ... అట్నుంచి బాల్కనీలోకి రా !" అంటూ పరుగెత్తుకువెళ్ళి తలుపు తీసి తను కూడా బాల్కనీలోకి వెళ్ళింది.
ఇద్దరూ కలుసుకోగానే కృష్ణ చేతులు సాచాడు.
ఆమె వాటిమధ్య ఒదిగిపోయింది.
"ఈ విషయం ... ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు ?" ఉద్వేగంతో ఆమె రోదిస్తూంది.
"నిన్ను నిన్నుగా గెల్చుకోవాలని ... రాధా - చిన్నప్పుడు తాళి కట్టిన భర్తగా వచ్చి, నిన్ను ప్రేమించమనటం నాకిష్టం లేకపోయింది. అందుకే ఇంత కష్టపడి నీ ప్రేమని పొందగలిగాను. చివర్లో తెలిసింది. చిన్నప్పుడే నేను తాళికట్టిన రాధవి నువ్వేనని-"
"నేనూ చాలా మధన పడ్డాను మురళీ! ఒకసారి వివాహమైనదాన్ని మళ్ళీ ప్రేమించటం ద్రోహమనీ, అన్యాయమనీ - అందుకే నీ ప్రేమని అంగీకరించటానికి అంత తటపటాయించాను - నన్ను అర్ధం చేసుకో -"
"ఏది ఏమైనా భగవంతుడు కరుణామయుడు. మనల్ని చివరికి ఇలా కలిపాడు. ఆమె భుజంమీద నుంచి పక్కకు చూస్తూ అన్నాడు కృష్ణ. క్రింద ఇంకా ఏ అలజడి వినిపించకపోవటం అతడికి తొందరగా వుంది.
"నన్ను - ఇన్ని సంవత్సరాల తరువాత ఎలా గుర్తుపట్టావ్ మురళీ?"
"మీ మామయ్య చెప్పాడు రాధా ! నీకు తెలుసుగా బోయ్స్ హాస్టల్ వార్డెను రామలింగం, మీ మామయ్య- నాకు బాబాయి అవుతాడు...దూరపు వరస ..."
"అవును. మనిద్దరం తనకి థాంక్స్ చెప్పుకోవాలి." అంటూ రాధ నవ్వింది. ఆమె టెన్షన్ తగ్గిపోయింది. ప్రపంచాన్ని గెల్చినంత ఆనందంగా వుంది ఇప్పుడు. ప్రేమించినవాడే భర్త కావటం -
అలా ఒకరి కౌగిలిలో ఒకరు ఎంతసేపున్నారో తెలీదు. హఠాత్తుగా లైటు వెలిగింది. మెట్ల మీద నరసింహం నిలబడివున్నాడు.
రాధని వదిలిపెట్టి అతడు నరసింహంవైపు ఓ క్షణం చూశాడు. ఆ క్షణంలో ఎన్నో భావాలు.
ఇతడే... ఇతడే... తన కుటుంబం సర్వనాశనం అవటానికి కారకుడు. తన తల్లి ఇన్నేళ్ళు జైల్లో మగ్గటానికి కారణభూతుడు. అతడిని చూడగానే కృష్ణ రాధని వదిలి బాల్కనీ మీదనుంచి క్రిందికి జారాడు. ఈ హఠాత్ సంఘటనకి రాధ బిత్తరపోయింది. ఈ లోపులో నరసింహం పైకి వచ్చి "ఎవరదీ" అంటూ బాల్కనీ అంచువరకూ పరుగెత్తాడు. కృష్ణ ప్రహరీ దాటి పారిపోవటం, నరసింహం "పట్టుకోండి-పట్టుకోండి" అని అరవటం ఒకేసారి జరిగాయి. గూర్ఖా పరుగెత్తుకువచ్చాడు గానీ లాభం లేకపోయింది. అప్పటికే కృష్ణ చీకట్లో కలిసిపోయాడు.
* * *
"అదీ కంప్లెయింటు. మీరు వెంటనే వాడిని అరెస్టు చేయండి" కుర్చీ వెనక్కి వాలి కాగితం అందిస్తూ అన్నాడు నరసింహం. తన ఇంటిలో మురళి అనే కుర్రవాడు అర్దరాత్రి దొంగతనంగా ప్రవేశించి అల్లరి పెట్టాడని కంప్లెయింటు అది.
"వెంటనే మా వాళ్ళని పంపిస్తాను" అంటూ ఇనస్పెక్టర్ ఆ కాగితం అందుకుని చదివి, "బోయ్స్ హాస్టల్ - మురళినా-" అన్నాడు ఆశ్చర్యంగా.