"చిప్స్, గ్రీన్ పీస్, ఫింగర్ చిప్స్, చికె పకోడా...." అతని మాటని మధ్యలో కట్ చేస్తూ అడిగాడు.
"మీరూ....నాన్ వెజ్ తీసుకుంటారా? అంకితా?"
"అన్నీ తీసుకుంటాను."
"రైట్....అయితే చికెన్ పకోడా తీసుకురా."
"రైట్....డిన్నర్ ఆర్డర్ సర్?"
"ఇస్తా....ముందివి తెచ్చెయ్యండి." స్టూవర్డ్ వెళ్ళిపోయాడు.
కుర్చీ వెనక్కి వాలాడు సిద్ధార్థ. అతన్ని మొదటిసారిగా పరిశీలించి చూసింది అంకిత. సుమారు అయిదడుగుల ఎనిమిదంగుళాలుంటాడు అతను.
హుందాగా, అందంగా వున్నాడు. అతని మేనర్స్ కూడా ఆకర్షించాయామెను.
"మీ గురించేమన్నా చెప్పండి" అన్నాడు.
"ఏముంది!"
"మీ జాబ్ గురించీ....మీ ఫ్యామిలీ గురించీ...." అని క్షణం ఆగి "ఆర్యూ మేరీడ్ అంకితా?" అడిగాడు.
"ఐ వజ్ మేరీడ్" చాలా మామూలుగా చెప్పింది.
ఉలిక్కిపడి చూశాడతను ఆమె వైపు.
"అంటే!"
"సరిపడలేదు....విడిపోయాం."
"ఓ అయిసీ!"
కాసేపు ఎవరూ మాట్లాడుకోలేదు.
"చాలా దురదృష్టవంతుడు_మీలాంటి అందమయిన భార్యను_"
"అతను వదులుకోలేదు. మీరు పొరబడుతున్నారు. విడిపోయాం అన్నాన్నేను."
"సారీ...."
"దేరీజ్ నథింగ్ టు ఫీల్ సారీ ఎబౌట్. ఇష్టంలేని కాపురాలు వెలగబెడుతూ ప్రతి క్షణం కుక్కల్లా పోట్లాడుకునే కంటే స్నేహంగా దూరంగా వుండటం మేలు కదూ?"
ఏమీ మాట్లాడలేకపోయాడు సిద్ధార్థ. ఆమె అంత ఓపెన్ గా, స్పష్టముగా మాట్లాడుతుంటే.
డ్రింక్ వచ్చింది.
లిమ్కా ఆమె గ్లాసులోకి వంచుతూ అడిగాడు. "హైదరాబాదులో మీరు వుండేది ఎక్కడ?"
"సంతోష్ నగర్ కాలనీలో."
"అంటే....మొహదీ పట్టణం దగ్గర."
"కాదు. సైదాబాద్ దగ్గర."
తన విస్కీ గ్లాసులో తనే సోడా కలుపుకున్నాడు తనకి కావలసినంత.
బేరర్ ని ఆపి.
"ఎవరెవరుంటున్నారు?"
"ఒక్క దాన్నే.... ఫ్రెండ్ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా వుంటున్నాను."
"మరి మీ వాళ్ళు?"
"నాకీ ప్రపంచంలో ఒకరిద్దరు మంచి స్నేహితులు తప్ప మరెవరూ లేరు."
"వారిదీ హైదరాబాదేనా?"
"హుఁ....ఒకరు నా ఫ్రెండ్_తన ఇంట్లోనే నేనుండేది. మరొకరు నా ఎక్స్ హస్బెండ్...." గలగలా నవ్వింది అంకిత.
"అంతేనా?"
"మరొకరు కూడా వున్నారు. సాగర్ అని, 'అక్షయ్'లో పనిచేస్తున్నాడు. ఆరునెలల పాటు మా ప్రక్క పోర్షన్ లో వుండేవాడు. ఇప్పుడు సంజీవరెడ్డి నగర్ లో ఉంటున్నాడు."
సాగర్ గురించి చెప్తుంటే ఆమె కళ్ళల్లో అదోలాంటి మెరుపు కనిపించడం గుర్తించాడతను. గ్లాసులోని సగం విస్కీని ఒకే గుటకలో తాగి, సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. అతని కళ్ళల్లో క్షణం కదలాడిన తొట్రుపాటు ఆమె గుర్తించలేదు.
ఇంతలో స్టూవర్ట్ మళ్ళీ వచ్చాడు.
అంకిత సహాయంతో మంచి డిన్నర్ ఆర్డర్ చేసి, లైటర్ తీశాడు.
"కావాలంటే మీరింకా డ్రింక్ తీసుకోండి....ఫరవాలేదు" అంది అంకిత.
"నా మొహం దొంగ మొహం లానే కాక పచ్చి త్రాగుబోతు మొహంలా కూడా వుందా?"
"ఛ....అలాగని కాదు."
"నిజం చెప్పమంటారా?"
"ఊఁ...."
"మీ అందం, మీ స్నేహం కలిగిస్తున్న మత్తులో డ్రింక్ పైన మోజు పోయింది."
అంకిత గులాబి బుగ్గలు మరికాస్త ఎర్రబడ్డాయి.
కోపంతోనో, రోషంతోనో, సిగ్గువల్లో అర్థంకాలేదతనికి.
"ఇంతకీ మీ గురించి చెప్పనే లేదు." అంది టాపిక్ మార్చాలని.
"ఏముంది? అమ్మ తప్ప ఎవరూ లేరు నాకు.
ఇంకా బ్రహ్మచారిని. బహుశా ఇలాగే వుండిపోతానేమో కూడా!" అంటూ లైటర్ తో సిగరెట్ అంటించాడతను.
లైటర్ మండి సన్నటి సంగీతం వినిపిస్తూ లైటార్పగానే ఆగిపోయింది.
10
హోటల్ మనోరమకి తిరిగి ప్రయాణమయ్యేసరికి పది దాటింది టైమ్.
"ఇఫ్ యూ డోంట్ మైండ్.... ఐ నీడ్ సబ్ హెల్ప్" అడిగింది.
"ఫ్లెషర్.... ఏం కావాలి?"
".........."
"పోనీ.... ఆ హెల్పేదో నేను గెస్ చేయనా?" అడిగాడు.
"ఏం లేదు.... నా పర్సు...."
"పోయింది కాబట్టి మీ దగ్గర డబ్బులేదు. చాలామంది చేసే పొరపాటే మీరు చేశారు. మొత్తం డబ్బు అందులోనే వుంది. మథ్యాహ్నం నుండి ఎవర్నయినా అడుగుదామనుకుంటూనే మొహమాటంతో కాలం గడిపేశారు. ఇప్పుడిక తప్పదు గాబట్టి నన్నడగబోతున్నారు...."
"మళ్ళీ...."
"మళ్ళీ తిరిగి వెళ్ళగానే తీర్చేస్తారు" డోర్ లాక్ చేసి, ఆమెతో పాటు లాబీకేసి నడుస్తూ పర్సులోంచి అయిదు వందలు తీసి ఆమె చేతిలో వుంచాడు."
"ఇంత అవసరంలేదు."