"వుంచండి. ఎప్పుడేం అవసరం వస్తుందో తెలీదు.... మరో విషయం మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో నా పేరు కూడా చేర్చండి.... ఇంకెప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే అడగండి నన్ను.... కర్టెసీ కోసం కూడా మొహమాట పడొద్దు సుమా.... ఎందుకంటే...." ఆర్దోక్తిలో ఆగిపోయాడతను.
అతనున్న ఫ్లోర్ లో ఆగింది లిఫ్ట్.
"ఎందుకంటే?" అడిగింది.
లిఫ్ట్ డోర్ తెరుచుకుంది.
"ఎందుకంటే__ అంకిత నాకొక్కసారి మాత్రమే నచ్చదు. అదీ, నా దగ్గిర మొహమాట పడినప్పుడు.... గుడ్ నైట్."
బయటికి నడిచాడతను.
రూమ్ చేరాక చాలాసేపు నిద్రపోలేదామె....
ఆమె మనసు మారుమూలల్లో దాగిన అదోలాంటి స్పందనని తిరిగి సున్నితంగా మీటాడు సిద్ధార్థ.
కేవలం తనకే తెలిసేటట్టుగా ఆమె సాగర్ గురించి దాచుకున్న తీయని అనుభూతి గుప్త తెరలు దాటి బయటికి పొరలు కొని రాసాగింది.
ఆ పొరల నడుమ మెరుస్తున్న సాగర్ రూపం మెదడులో తిరుగుతూండగా, మరో మంచి స్నేహితుడయ్యే అవకాశమున్న వ్యక్తిని కలిసిన తృప్తిలో అమాయకత్వపు జోలలో ఆదమరచిన నిద్రలోకి జారుకుందామె.... ప్రశాంతంగా.... హాయిగా.... గాఢంగా.... ఇక భవిష్యత్ లో అలాంటి నిద్రే వుండనట్టుగా.... భీకర ప్రళయ ప్రారంభానికి నాందిలా.
* * * *
"హల్లో"
"నేను.... సిద్ధార్థను."
"ఓ.... హాయ్...."
"మీరు ఎప్పుడు వెళుతున్నారు?"
"ఎక్కడికి?"
"అదే.... తిరుగు ప్రయాణం ఎప్పుడని?"
"ఓ.... ఈ రాత్రి నర్సాపూర్ కిగాని డీలక్స్ కి గాని వెళ్ళిపోదామని...."
"నేను సాయంత్రం బయలుదేరుతున్నాను నాతో వచ్చేయకూడదూ?"
".........."
"అభ్యంతరమా?"
"అలా అని కాదు...."
"మీ కిష్టం లేకపోతే వద్దు. కాని అంతదూరం ఒక్కణ్నే బోరు కొట్టుకుంటూ వెళ్ళేకన్నా మీ కంపెనీ వుంటే చాలా బావుంటుందనిపించింది అంతే...."
డిస్కనెక్ట్ చేశాడు సిద్ధార్థ. మరో రెండు ఫోన్ కాల్స్ చేసి, బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కున్నాడు.
సరిగ్గా అదే సమయానికి హైదరాబాదులో శ్రీధరం, హాస్పిటల్ నుండి ఇంటి వచ్చాక మొదటిసారిగా ఆఫీసుకి వచ్చాడు.
అప్పటికింకా లీవ్ లోనే వున్నాడతను.
క్రొత్తగా చేరిన ఇంజనీర్ సుఖజీవన్ గురించి భరద్వాజతో మాట్లాడదామని అతని ఉద్దేశం.
మధ్యాహ్నం కావడంతో ఆఫీసు హడావుడిగా వుంది.
నేరుగా భరద్వాజ ఛాంబర్స్ చేరుకున్నాడు.
బయటికి వెళ్ళాడనీ తిరిగి కొద్దిసేపట్లో వచ్చేస్తాడనే చెప్పింది. పర్సనల్ సెక్రటరీ.
లోపలి గదిలోకి అడుగుపెట్టి విజిటర్స్ చెయిర్ లో కూర్చున్నాడు శ్రీధరం.
ఏమని చెప్పాలి భరద్వాజకు? అసలు సుఖజీవన్ పైన తనకి కలిగిన అనుమానాన్ని ఏ రకంగా నిరూపించగలడు తను!
భరద్వాజకి తన మాటపైన అమితమైన గురివున్నా అసలే పునాదీ లేకుండా ఏవిఁటి చెప్పడం!!!
ఆలోచనలని తల విసురుతో చెదరగొడుతూ భరద్వాజ టేబులు పైన ఫైళ్ళూ పుస్తకాలూ చూడ సాగాడు. వాటితో పాటు కనిపించిన ఓ డైరీ_ భరద్వాజది_ శ్రీధరంలో కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఓ.ఎమ్.డి. డెస్కు పైన డైరీ ఆశ్చర్యపడే విషయం కాకపోవచ్చు. కాని అది ఎప్పటిదో పాతది. అప్రయత్నంగా దాన్ని చేతిలోకి తీసుకున్నాడు శ్రీధరం.
ఇంతతో ఫోన్ మ్రోగడంతో రిలాక్సై రిసీవర్ అందుకొని 'హలో' అన్నాడు.
సరిగ్గా అదే క్షణంలో విజయవాడలో సిద్ధార్థ గదిలో ఫోన్ మ్రోగింది. మంచంమీద వాలి ఏదో ఫైలు చూస్తున్న సిద్ధార్థ అందుకున్నాడు.
"హలో"
"హలో....నేను....అంకిత"
అనుకోకుండా తడబడుతూ లేచి కూర్చున్నాడు సిద్ధార్థ.
"హ....హలో....ఆఁ....సిద్ధార్థనే...."
"మీరెన్ని గంటలకి బయల్దేరుతున్నారు?"
"ఆరు. ఏం?"
"సరే.... ఫైవ్ ఫిఫ్టీకి క్రింది లాబీలో కలుసుకొందాం"
అంకిత ఫోన్ క్రెడిల్ చేసేసింది.
సరిగ్గా ఆరుగంటల ముప్పై నిమిషాలకి విజయవాడ లిమిట్స్ దాటింది. సిద్ధార్థ కారు, సిద్ధార్థ అంకితలతో.
ఆదర్శ నగర్ లోని ఒక ఇంటిలోని గడియారంకూడా ఆరున్నరనే సూచిస్తోంది.
"లాభంలేదు శృతీ....నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మనం సాగర్ కి ఒక రివాల్వర్ తెప్పించి ఇద్దాం! డేటూ, టైమూ ఫిక్స్ చేసి మనకి పటిష్టమైన ఎలిబీలు తయారుచేసే పూచీ నాది."
కుర్చీ వెనక్కి వాలి ప్రశాంతంగా అన్నాడు మదన్.
"తప్పదంటావా?" ఎంతో ధైర్యంగా ఉండాలని ప్రయత్నించినా శృతి గొంతులో సన్నటి వణుకు దాగలేదు. ఆమెకేసి చాలా తీవ్రంగా అయిదు నిమిషాలపాటు చూశాడు మదన్.
సరిగ్గా మార్కండేయుడి పైకి పాశాన్ని విసరబోతున్న యముడి కళ్ళల్లోని దృఢత్వాన్ని సూచించే ఎర్రటి చారికలాంటి చారిక మదన్ కళ్ళలో కన్పించింది శృతికి. ఆమె ఆలోచన ఒక్కక్షణం స్థంభించింది.
ఓ క్రొత్త మదన్ ని చూస్తున్న అనుభూతి కలిగిందామెకు.
చాలాసేపు మాట్లాడుకోలేదు వాళ్ళు.
లేచి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు.
వెస్టర్న్ సంగీతం వస్తోంది.
"షల్ వుయ్ డాన్స్?"
హఠాత్తుగా అడిగాడు మదన్.
శృతి లేచింది.
మదన్ ఆమె కుడి చేతిని తన ఎడమచేత్తో అందుకొని తన కుడి చేయిని ఆమె నడుంచుట్టూ పోనిచ్చాడు. ఆమె తన ఎడమచేయి అతడి కుడి భుజంపైన వేసింది. టేప్ రికార్డర్ లోంచి విన్పిస్తున్న సంగీతానికనుగుణంగా వారి కాళ్ళు లయబద్ధంగా కదలసాగాయి.