"హలో....అంకితా హియర్"
"రిలాక్సయ్యారా? సిద్ధార్థని....మీరు విజిటింగ్ కార్డు చూసి వుంటే.
"ఓ....హలో"
ఏం మాట్లాడాలో అర్థంకాలేదామెకు.
"ముభావంగా వున్నారేఁ? కోపమా?"
"ఛఛ....అదేంలేదు"
"మరింకేఁవిటి?"
"సారీ...."
"దేనికి?"
"ఐయామ్ ఫీలింగ్ గిల్టీ"
"ఎందుకు? చెప్పానుగా....నా మొహమే అంతని"
"మీరెవరో తెలుసుకోకుండా చాలా దారుణంగా ప్రవర్తించాను"
"ఇప్పుడు తెలుసుకున్నారుగా? పరిహారం చేసుకోండి"
"ఏం చెయ్యను?"
"ఈరాత్రి డిన్నర్ కి రావాలి"
"........"
"మాట్లాడరేం?"
"ఎందుకండీ?"
"ఎందుకండీ ఏవిటి? నథింగ్ డూయింగ్.... ఈ రాత్రి యూ ఆర్ హావింగ్ డిన్నర్ విత్ మీ...."
"ఎనిమిదింటికి క్రింద రిసెప్షన్ లో వెయిట్ చేస్తాను...."
ఫోన్ పెట్టేసి దిండు కానుకున్నాడు సిద్ధార్థ. చేతిలోని డైరీలో నిమిషం క్రితం తనకొచ్చిన ఇన్స్ పిరేషన్ కి తను కల్పించిన భాషని మరోసారి చదువుకున్నాడు.
"దాదాపు పాతికేళ్ళ క్రితం....
అందానికి నిర్వచనం
రచించాడు బ్రహ్మ....
పొడుగాటి, ఒత్తైన జడ + విశాలమైన నుదురు + పొడుగాటి కొనదేరిన ముక్కు + విశాలమైన కళ్ళు + నున్నటి బుగ్గలు + చిన్న నోరు + శంఖాకారపు కంఠం + నత్తాకారపు చెవులు + ఎత్తైన మదన శిఖరాల్లాంటి వక్షం + సన్నటి నడుము + పొడవాటి కాళ్ళు + కనిపించని పొత్తి కడుపు + బంగారు శరీర ఛాయ + హంస గమనం x ఆడతనం.
ఈ నిర్వచనాన్ని లోకానికి అంకితం చేస్తూ ప్రపంచ కాగితంపై రాశాడామె పేరును.
"అంకిత...."
డైరీ పక్కన పడేసి అంకిత ఇచ్చిన కార్డ్ అందుకున్నాడు.
"అంకిత బెనర్జీ...."
[ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్]
స్పెషల్ కరెస్పాండెంట్,
ది న్యూస్...."
చిన్న నవ్వు అతని పెదాలపై కదిలింది.
అంకిత రాత్రి డిన్నర్ కి వస్తుందా???
* * * *
సరిగ్గా ఏడు గంటల నలభై నిమిషాలకి రిసెప్షన్ దగ్గరికి చేరుకున్నాడు సిద్ధార్థ.
గడియారంలో ఒక్కో నిమిషం గడుస్తున్నకొద్దీ సిద్ధార్థలో అదోరకం టెన్షన్ ప్రారంభమయ్యింది.
అంకిత వస్తుందా....రాదా....వస్తుందా_రాదా....
రెండుసార్లు టాస్ వేశాడు. ఒకసారి వస్తుందనీ మరోసారి రాదనీ పడింది టాస్. మూడోసారి ఫైనల్ గా టాస్ వేద్దామనుకుని విరమించుకున్నాడు. భయంవేసి ఎందుకో అంకిత అందం అతన్ని విపరీతంగా ఆకర్షించింది. జీవితంలో అంతవరకు చలించనంతగా చలించాడతను ఆమె అందానికి. ఆమెతో ఎలాగైనా స్నేహం పెంచుకోవాలనే తపన అతనిలో క్షణ క్షణానికి అధికం కాసాగింది.
వస్తుందా....రాదా....
ఏడూ యాభయ్ అయ్యింది.
వస్తుందా....రాదా....
ఏడూ యాభయ్ అయిదు.
వస్తుందా రాదా....
ఎనిమిది అయ్యింది.
ఎదురుగా లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి.
బయటికి రాలేదు అంకిత.
మళ్ళీ లిఫ్ట్ మూసుకుని పైకి వెళ్ళిపోయింది.
సరిగ్గా సిద్ధార్థ గడియారం ఎనిమిదీ అయిదు చూపిస్తుండగా లిఫ్ట్ తెరుచుకుంది.
అంకిత బయటికి వచ్చింది.
అటూ ఇటూ చూసి గబగబా సిద్ధార్థ దగ్గరకొచ్చింది.
గుండె వేగం పెంచి కొట్టుకుంటూండగా ఆమెను మరోసారి పరీక్షగా చూశాడు సిద్ధార్థ.
లైట్ బ్లూ జీన్స్ పాంట్ లోకి రోజ్ కలర్ సిల్కు చొక్కా టక్ చేసి పోనీటెయిల్ జడవేసింది అంకిత.
ఆ గెటప్ లో ఆమె వయసు మరింత తగ్గినట్టు కనిపించింది.
"మేరు అయిదు నిమిషాలు లేట్" నిష్టూరంగా అన్నాడు.
"మీరే అయిదు నిమిషాలు ఎర్లీ...." తన వాచ్ చూపించింది.
"మీ వాచి కృష్ణానదిలో పడేసి మరో క్రొత్తది కొనుక్కోండి."
"ఎక్కడి కెళదాం?"
"ఏమో....యూ ఆర్దిహోస్ట్."
"అయితే కాంధారీ కెళదామా?"
కారు అయిదు నిమిషాల్లో కాంధారి చేరింది.
స్టూవర్ట్ రాగానే అంకితకేసి చూశాడు.
"డ్రింక్స్!"
"నో....థాంక్స్"
"ఎప్పుడూ తీసుకోరా...."
"వెరీ అకేష్నల్....ఇప్పుడొద్దు."
"మే ఐ?"
"కేరీ ఆన్."
"ఓ లార్జ్ మేన్షన్ హౌస్. సోడా, ఓ కూల్ డ్రింక్...." అంటూ ఆగి అంకిత వంక చూశాడు.
"లిమ్కా"
"....ఓ లిమ్కా తే....మంచింగ్ కి ఏమున్నాయి?"