9
అచ్యుతమ్మ చెప్పిందంతా విన్నాడు నామాలయ్య.
"ఇళమ్మ దేవత. ఆయమ్మకి జబ్బేంటమ్మా! ఏదన్నా జబ్బున్నా, ఆ దేవతే నయం చేస్తది" అన్నాడు తాపీగా, చుట్టపొగ వదులుతూ...
అచ్యుతమ్మ నెత్తి కొట్టుకుని "నా కూతుర్ని ఖూనీ చెయ్యకండి" అని బావురుమంది.
యోగనాథశాస్త్రి సహితం బొంగురు గొంతుకతో_
"నామాలయ్యగారూ! ఆపరేషన్ చెయ్యకపోతే నా కూతురు బతకదని డాక్టరమ్మ కచ్చితంగా చెప్పింది. చూస్తూ చూస్తూ దాని ప్రాణాలు పొట్టన పెట్టుకోమంటారా?" అన్నాడు.
"ఏంటయ్యా! నీదంతా ఓ గోల! ఇళమ్మ దేవత అన్నాం! ఆయమ్మ ఆశీర్వదిస్తే రోగాలు పోతాయనీ, కోరిన కోరికలు నెరవేరతాయనీ, ఇంతమంది భక్తులొస్తున్నారు. ఇంతింత డబ్బు సంపాదించుకున్నాం! ఇప్పుడు ఇళమ్మకి గుండె జబ్బు, ఆపరేషన్ కెళ్ళిందీ అంటే జనం ఊరుకుంటారా! ఇళమ్మనీ, నిన్నూ, నన్నూ కూడా చంపుతారు."
"పాపం! ఏదో ఒక మార్గం చూడండీ!"
నామాలయ్య భార్య అంది. ఆవిడ ఉత్తమురాలు. ఇళమీద అభిమానం.
"కొంతమంది స్వాములూ, బాబాలూ కూడా డాక్టర్లతో ఆపరేషన్లు చేయించుకుంటారు, ఫర్వాలేదు. జనం ఏమీ అనుకోరు" అంది మళ్ళీ.
"అవును. సాక్షాత్తు అవతారమూర్తులయిన రాముడు, కృష్ణుడూ మొదలయిన వాళ్ళకే వైద్యాలు తప్పలేదు, అంచేత..."
"నోర్మూసుకోండి..." విదిలించాడు నామాలయ్య. ఇప్పుడతను యోగనాథశాస్త్రిని కూడా "నోర్మూసుకో!" అనగలుగుతున్నాడు. డబ్బుకి లోబడి యోగనాథశాస్త్రి నామాలయ్య చేతిలో కీలుబొమ్మగా ఎప్పుడు మారిపోయాడో, అప్పుడే శాస్త్రి బ్రాహ్మణత్వం మీద గౌరవం నశించిపోయింది నామాలయ్యలో!
"మనం ఇళమమ 'రోగాలు నయం చేయగలదు' అని చెప్పి డబ్బు సంపాదిస్తున్నాం! ఇప్పుడు ఇళమ్మకే రోగం అనటానికి కుదరదు. ఆ డాక్టరెవరినో, అక్కడికే వచ్చి రహస్యంగా ఆపరేషన్ చేసెయ్యమనండి. అన్ని ఏర్పాట్లు చేస్తాం! అంతే!"
"ఇంక మాటలు చాలు" అన్నట్లు లేచాడు నామాలయ్య. అంతటితో నామాలయ్య ఇంట్లో రహస్య సమావేశం ముగిసిపోయినట్లే. బరువెక్కిన గుండెతో లేచిన అచ్యుతమ్మని "జాగ్రత్త! ఈ విషయాలు బయట ఎక్కడా నోరు జారకండి. జనం ఇళతోపాటు మనందర్నీ చంపుతారు" అని హెచ్చరించాడు. గుండె గుభేల్లుమంది అచ్యుతమ్మకి.
* * * *
ఇళ ధ్యానంలో నిశ్చలంగా ఉంది. అమాయకంగా నిర్మలంగా ఉన్న ఆ ముఖం చూస్తోంటే, అచ్యుతమ్మ మనసు లుమ్మలు చుట్టుకుపోసాగింది. పసితనం నుంచీ ఈ పిల్ల అమ్మకి ఏదో చేద్దామనే తాపత్రయపడుతోంది. చిన్నపిల్ల ముద్దుగా ఉందని ఎవరైనా పండు యిస్తే "అమ్మా ఇదిగో" అని తనకే తెచ్చి ఇచ్చేది. పూజలో కూచోబెట్టి ఎవరైనా దక్షిణగా ఐదో, పదో చేతిలో పెడితే, అవి తెచ్చి తనకే ఇచ్చేది. ఏనాడూ "ఇది కావాలి, అది కావాలి!" అని పేచీ పెట్టటం ఈ పిల్లకి తెలీనే తెలీదు. తమ్ముడూ, చెల్లెలూ "పెరుగు వెయ్యవే!" "నెయ్యి కావాలే!" అని చీర కుచ్చేళ్ళు లాగుతూ పేచీలు పెడుతుంటే ఆలి చిప్పలంత అందమైన కళ్ళతో జాలిగా చూసి వయసుకి మించిన పెద్దరికం తెచ్చుకుని, వాళ్ళని ఎత్తుకునే శక్తిలేక నడిపించి తీసుకువెళ్ళి కబుర్లతో, కథలతో మరిపించేది. శక్తిలేని చిన్నారి చేతులతో అంట్లు కడిగిపెట్టేది. "అమ్మా! పచ్చడి నేనూరుతారులే! కాసేపు నువ్వు కూచో!" అని ఆరిందలా తనను సుఖపెట్టాలని తాపత్రయ పడేది. అలాంటి పిల్ల... ఆపరేషన్ చెయ్యకపోతే బతకదని తెలిసి కూడా...
దుఃఖం ఆపుకోలేక పోతోంది అచ్యుతమ్మ. యోగనాథశాస్త్రిని చూసి "ఏమండీ! మనం కటిక కసాయి వాళ్ళకంటే అన్యాయమయిపోతున్నాం. కన్న కూతుర్ని చేతులారా బాలి యిచ్చి ఆ నెత్తుటి కూడు తింటున్నాం! ఇక ఈ తిండి నేను తినలేను. ఆ పసిదాన్ని ఎలాగయినా బతికించండీ!" అంటూ అతడి రొమ్ముల మీద గుద్దింది.
"ఊరుకో! ఊరుకో! మన ఇళకేమీ కాదు. అది కారణజన్మురాలు. అంతా దుర్గాదేవి దయ."
అక్కడ నిలవలేకపోయాడు యోగనాథశాస్త్రి. అతడి కొత్త ఇల్లు పూర్తయింది. చాలా ఘనంగా గృహప్రవేశం జరుపుకోవాలన్నాడు. కానీ ఇప్పుడా మాట తపట్టలేకపోతున్నాడు.
ధ్యానంలో వున్న ఇళకి కొంచెం దూరంలో కూచుంది అచ్యుతమ్మ. పసుపు బట్టలతో పెళ్ళికూతురిగా కూతుర్ని ఊహించుకుంది. లక్షణంగా పెళ్ళి చేసుకుని భర్తతో సుఖంగా సంసారం చేసుకోవలసిన పిల్ల... అచ్యుతమ్మ మనసులో చిచ్చు మెదిలాడు. మంచంలోంచి లేవలేని స్థితిలో చిచ్చు చెయ్యి పట్టుకోగానే ఇళ పెదవుల మీద మెరిసిన చిరునవ్వు గుర్తొచ్చింది. నిట్టూర్పు వదిలింది. ఆనాడు తనే చిచ్చు ఇళ దరిదాపులోకి రాకుండా జాగ్రత్తపడింది. తనలో వున్న పచ్చి స్వార్థం కదూ, దీనికంతకూ కారణం! పాపం, జ్ఞానదేవ్ మాస్టారు ఎన్ని విధాల చెప్పారు ఇళని చదివించమని. ఇకముందు ఇళని సాధ్యమైనంత సుఖపెట్టాలి, సంతోషంగా ఉంచాలి అనుకుంది.
* * * *
అచ్యుతమ్మ పెద్ద జరీ అంచున్న చిలకపచ్చ పట్టుచీర తీసింది.
"ఇళా! ఈ చీర కట్టుకో!"
"అలాగే!"
"పోనీ జరీ గళ్ళ వెంకటగిరి చీర కట్టుకుంటావా?"
"అలాగే!"
"నీకేది ఇష్టమో చెప్పు!"
"నాకు అయిష్టం, ఇష్టం ఏమీ లేవు అమ్మా! నీ యిష్టం! నువ్వేం చెపితే అది చేస్తాను. నీకంటే నా మంచి కోరే వాళ్ళెవరూ?"
చివ్వున కళ్ళలో నీళ్ళు తిరిగాయి అచ్యుతమ్మకి. తనను ఎత్తి పొడుస్తుందా అనిపించి ఇళ ముఖంలోకి చూసింది. అమాయకంగా ప్రేమ కురిపిస్తున్నాయి ఆ కళ్ళు. కల్మష మనేది ఏ కోశానా లేని ఆమె మనసు ఆ కళ్ళలో అత్యంత ఆకర్షణీయంగా మెరుస్తోంది.
చీరలన్నీ బల్లమీద పడేసి "నీ యిష్టం వచ్చింది కట్టుకో" అనేసి వెళ్ళిపోయింది.
పక్కగదిలోనే వున్న రాణి వచ్చింది. జరీలేని అంచులేని కాషాయ రంగు చీర తీసి "నువ్విది కట్టుకో! దేవి అంశ వున్నదానివి కదూ! అంచేత ఈ రంగే నీకు బాగుంటుంది" అంది. ఇళ అదే తీసుకుంది. పెద్ద బోర్డరున్న చిలకపట్టు జరీ చీర తను తీసుకుని "ఇది నేను కట్టుకోనా?" అంది. 'కట్టుకో' వెంటనే చెప్పింది.
కాషాయరంగు చీరలో తన దగ్గిరకి వచ్చిన ఇళని చూసి నిర్ఘాంతపోయింది అచ్యుతమ్మ.
"ఎక్కడో అడుగున పడేశాను ఇది కట్టుకున్నావేమిటీ?"
"రాణి నాకు యిది బాగుంటుందని చెప్పింది. బాగుండలేదా? మార్చెయ్యనా?" అమాయకంగా అడిగింది. అచ్యుతమ్మ మాట్లాడలేదు. నిజానికి ఆ పిల్లకి పట్టుచీరలెందుకూ? నూలు చీర కట్టుకున్నా దివ్యంగానే ఉంటుంది.