ఆకుపచ్చ జరీ చీర కట్టుకుని రాణి వచ్చింది. ముఖం తిప్పుకుంది అచ్యుతమ్మ.
"అమ్మా ఇళా! గులాబ్ జాం తింటావా?"
"తినమంటావా?"
"పోనీ దోసెలు పొయ్యనా?"
"నీకు పొయ్యాలని ఉందా?"
"ఇలా చిన్నప్పుడు నా దౌర్భాగ్యం కొద్దీ నీకు మూడు పూటలా కడుపు నిండా తిండి కూడా పెట్టలేక పోయేదానిని. ఇప్పుడు మనకన్నీ వున్నాయి. నీకేం తినాలని వుందో చెప్పు తల్లీ! నా చేతులతో చేసి పెడతాను."
"ధ్యానంలో కూచున్నప్పుడు తప్ప, మిగిలిన సమయాల్లో నాకు చాలా నీరసంగా వుంటుందమ్మా! దేనిమీదా వుండదు. తినాలని అస్సలుండదు. మీరంతా ఇప్పటికయినా మూడు పూటలా కడుపునిండా తింటున్నారు కదా! అది చాలు నాకు.
ఈడ్చి ముఖంమీద కొట్టినట్లయింది. కొన్ని క్షణాలు తల ఎత్తలేక పోయింది అచ్యుతమ్మ. మృత్యువుకి క్షణక్షణానికీ దగ్గరవుతోన్న కూతురికి, కొద్దిపాటి ఆనందమైనా సమకూర్చ గలిగినదేదీ లేదా ఈ లోకంలో. చటుక్కున గుర్తొచ్చింది.
"చిచ్చుకి సెలవులిచ్చారుట! వర్థనమ్మ చెప్పింది" అంది.
ఇళ కళ్ళు మెరిశాయి.
"సెలవుల్లో యిక్కడికి రమ్మని చిచ్చుకి రాయనా?"
కొద్దిసేపు ఆలోచించింది ఇళ.
"వొద్దు."
"అదేం? చిచ్చు యిక్కడికి రావటం నీకు ఇష్టం లేదా?"
"అది కాదు. చిచ్చు వస్తే జ్యోతి విషయం తేల్చుకోకుండా వదిలిపెట్టడు. ఆ విషయం తెలుసుకుందామని ప్రయత్నించిన ఇద్దరూ ఎలా మాయమయ్యారో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. చిచ్చు కూడా... వద్దు రాయకు!" నిర్ఘాంతపోయింది అచ్యుతమ్మ.
"అమ్మా దుర్గమ్మ తల్లీ! నీ పాదాల ముందు పువ్వులాంటి ఈ పసిడి తల్లిని కాపాడమ్మా!" కన్నీళ్ళతో చేతులు జోడించింది.
* * * *
"చి.సౌ.డాక్టరమ్మ విదుషికి.
అచ్యుతమ్మ శుభముగా దీవించి వ్రాయునది. నీవు క్షేమముగానున్నావని తలచెదను. చి.ఇళ ఆరోగ్యము విషయము నీవు చెప్పినది ఇక్కడి వారితో మాట్లాడితిని. ఇళని అచటికి పంపుట ఎట్టి పరిస్థితులలోనూ జరగదని కచ్చితముగా చెప్పినారు. నేను మనసులో కష్టపడితిని. దౌర్భాగ్యురాలిని. చేయగలిగిన దేమున్నది? కాని డాక్టర్ గారు యిచ్చటికి వచ్చి రహస్యముగా ఆపరేషన్ చెయ్యగలిగినచో అన్ని ఏర్పాట్లూ చేయుదుమని చెప్పినారు. డాక్టరుగారిని ఎట్లయిననూ ఇందుకు ఒప్పించవలయును. వారికి ఎంత ఫీజు అయినను యిచ్చుకొనగలము. ఎట్టి అసౌకర్యము కలగకుండా చూసుకొందుము. నాయందు దయ వుంచి డాక్టరుగారిని ఇందుకు అంగీకరింపచేయవలయును. ఇచ్చట వర్థనమ్మగారు, జ్ఞానదేవ్ మాస్టారు సుఖముగానున్నారు. పీడకలల పిన్నిగారు, చేతబడి అత్తగారు నిత్యమూ దైవ దర్శనమునకు వచ్చుచున్నారు. నామాలయ్య గారికి మరల కూతురు జన్మించినది. తల్లియు, బిడ్డయు క్షేమము. మీ బాబాయిగారు అనగా ఇళ నాన్నగారు క్షేమము. మా కొత్త ఇల్లు పూర్తయినది గాని గృహప్రవేశము చేసుకొనుటకు మనస్కరించుట లేదు.
ఇంతే ఇచటి సంగతులు. డాక్టర్ గారితో రావలయును. నీకు మంచి కంచి పట్టుచీర పెట్టెదను.
ఆశీర్వచనములతో,
ఇట్లు
అచ్యుతమ్మ వ్రాలు..."
విదుషి ఆ ఉత్తరాన్ని చదువుకుని చిచ్చు హాస్టల్ కి వెళ్ళి అతడికి ఆ ఉత్తరం అందించింది.
చిచ్చు చదివి నవ్వి "ఇంకేం? కంచి పట్టుచీర పోగొట్టుకోకు అక్కా!" అన్నాడు.
"జోక్స్ చాల్లే. వీళ్ళ మూఢత్వం చూడు! డాక్టర్ని అక్కడికి తీసుకురావాలట. 'రహస్యంగా' ఆపరేషన్...అందులోనూ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాలట!"
నిట్టూర్చాడు చిచ్చు.
"ఏం చేద్దాం అక్కా!"
"ఒక్కటే ఉపాయం. ఇప్పటి వరకూ ఇళకి తన ఆరోగ్య విషయం చెప్పలేదు మనం. ఇప్పుడు చెప్పెయ్యాలి! తను ఎలాంటి ప్రమాద పరిస్థితుల్లో చిక్కుకుందో నచ్చచెప్పాలి. రహస్యంగా డాక్టర్ని అక్కడికి తీసికెళ్ళటం అసంభవం గనుక, రహస్యంగా ఇళనే ఇక్కడికి తీసుకొచ్చెయ్యాలి."
"యెక్స్ లెంట్. వెంటనే వెళ్ళు"
* * * *
విదుషి చెప్పినదంతా చాలా ప్రశాంతంగా వింది ఇళ.
"మనం ఇక్కడి నుంచి రహస్యంగా హైద్రాబాద్ వెళ్ళిపోదాం. ప్రయాణానికి ఏర్పాట్లూ, అక్కడ ఆపరేషన్ ఏర్పాట్లూ అన్నీ నేను చూసుకుంటాను."
"నివ్వెరపోయింది విదుషి.
"రావూ?"
"ఏమిటక్కా? ఇన్ని రోజులుగా దుర్గామాత తన భక్తుల రోగాలు నయం చేస్తుందని నమ్మించి కానుకలు వసూలు చేశాను. ఇప్పుడు నన్ను డాక్టర్ దగ్గరకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని సుఖపడమంటావా? నా ద్వారా దుర్గ భక్తుల రోగాలు నయం చేస్తున్నది నిజమే అయితే నా రోగం కూడా దుర్గ తనే నయం చేస్తుంది. నిజం కాకపోతే నన్ను నమ్మి వచ్చిన భక్తులలాగే నేనూ ఫలితం అనుభవిస్తాను" స్థిమితంగా అంది ఇళ.
గుండె గుభేలుమంది విదుషికి! కానీ, ఇళ నైతిక స్థయిర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అమాయకంగా బలహీనంగా కనిపించే ఈ పిల్లలో ఎంత మనోబలం? మృత్యువుకి కూడా చెదరని మనో నిబ్బరం.
గుమ్మంలో "ఇహిహి" అంటూ వికృతమైన నవ్వు వినిపించటమూ, ఇళ గడగడ వణికిపోతూ, విదుషిని కౌగిలించుకుని భుజం వెనుక ముఖం దాచుకోవటమూ ఒకేసారి జరిగాయి. గుమ్మంలో పిచ్చిది నిలబడి ఉంది. నిలువునా వణుకుతోంది ఇళ. విదుషి ఇళ వెన్ను నిమురుతూ_
"భయపడకు అది పిచ్చిది, ఏమీ చెయ్యదు" అంది.
"అక్కా! దానిని చూడగానే నాకు ఏ జన్మలోనో, ఏనాటివో భయంకర స్మృతులు మనసును కలచినట్లవుతుంది. ఆవిడ ముఖం చూడలేను, వెళ్ళమను."
మరొకసారి నవ్వింది పిచ్చిది.
"ఇహ్హిహ్హిహ్హిహ్హిహ్హిహ్హి..."
10
నామాలయ్య కబురందుకుని కోయలందరూ నామాలయ్య ఇంటి ఆవరణలోకి వచ్చారు. వీధి అరుగుమీద నామాలయ్య వాలుకుర్చీలో కూచుంటే, వాళ్ళు వాకిట్లో గొంతుక్కూచున్నారు. అలా గంటలు గంటలు కూచోవటం వాళ్ళకి అలవాటే! జ్ఞానదేవ్ దగ్గర చదువుకుంటున్న యువకులు మాత్రం నిలబడే ఉన్నారు.