"ఒకసారి జరిగింది. నేను ఇప్పటికీ శుక్రవారం పాతగుడికి వెళ్ళి వస్తుంటాను. అలా వస్తున్నప్పుడు ఇదివరకటి మా ఇంటి దగ్గర్లో ఉన్న చెట్టుకింద నుంచి చిచ్చు ఈల వినిపించింది.
"నిజంగా చిచ్చు వేసిన ఈల. నా చెవులారా విన్నాను. పరిగెత్తి చెట్టుకింద కెళ్ళాను. ఎవ్వరూ లేరు. చాలా బాధ తోచింది. ఎందుకలా జరిగింది అక్కా?"
"మనసుకున్న శక్తి అలాంటిది. తీవ్ర భావనకి తప్పకుండా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అది మంచి భావన కావచ్చు, చెడ్డది కావచ్చు. లౌకికం కావచ్చు. దైవ సంబంధమైనది కావచ్చు. మనసు ఏ భావాన్ని తనలో అతి గాఢంగా నిలుపుకుంటుందో, దానినీ భావనలో రూపుకట్టించే శక్తి మనసుకి వుంది. అందుకే చిచ్చు ఈల నీకు నిజంగా వినిపించింది. మామూలు స్నేహంలోనే నువ్వు చిచ్చు ఈల వినగలిగినప్పుడు ఇంతటి ఏకాగ్రధ్యానంలో నీ మనసుకి దేవి తేజోరూపం సాక్షాత్కరించడంలో ఆశ్చర్యమేముందీ?"
"అంటే? దేవి నిన్ను అనుగ్రహించలేదంటావా?"
"అనుగ్రహించడం అంటే....?"
"అంటే... ఈ సౌఖ్యాలూ, సంపదా, అమ్మా నాన్నా సుఖంగా ఉండడం... తమ్ముళ్ళు హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకోవడం."
"నువ్వు నీకు సాక్షాత్కరించిన దేవిని ఎప్పుడైనా కావాలని అడిగావా"
"లేదు...అసలప్పుడు నాకు దేవి తప్ప మరో ఆలోచన ఉండదు."
"ఎంత అదృష్టవంతురాలివీ. పోనీ మరో సమయంలో అయినా నువ్వు నీ దేవిని వీళ్ళ రోగం పోవాలి. వీళ్ళ కోరిక నెరవేరాలి! అని అడిగావా!"
"లేదు లేదు. నేనసలు వాళ్ళనీ, వాళ్ళ కానుకల్నీ పట్టించుకోను. ఊరికే నవ్వుతూ కూచుంటాను అంతే!"
"అలాంటప్పుడు అంతా దేవి అనుగ్రహమెలా అవుతుందీ? దీనిని నువ్వు అనుగ్రహమనే అనుకుంటే ఈ అనుగ్రహం కాదు. నామాలయ్య అనుగ్రహం. నామాలయ్య ఇంత పెద్ద గుడి కట్టించి ఈ అట్టహాసాలన్నీ చేసి "జ్యోతి" లాంటి ప్రచారాలు చేయకపోతే, ఇందరు భక్తులూ, ఇన్ని కానుకలూ వచ్చేవి కావు. ఆ కానుకలేగా నువ్వు అనుగ్రహం అంటున్నది?"
ఇళ మాట్లాడలేదు. తల దించుకుంది. ఆ అమ్మాయి అమాయకురాలే కాని తెలివైనది. విదుషి మాటలు అర్థమయ్యాయి. మనసు మథన పడుతోంది. ఈ మార్గంలో ఇళ ఆలోచించడమే కావాలి విదుషికి.
మళ్ళీ అంది.
"చాలా రోజుల క్రితం ఓ సినిమా చూశాను. ఆ సినిమాలో ఒక అమ్మాయి వుంటుంది. చాలా బీద కుటుంబం. ఆ అమ్మాయి తన కుటుంబాన్ని ఆడుకోవడం కోసం వ్యభిచరిస్తుంది. ఆ డబ్బుతో తన వాళ్ళందరినీ పైకి తీసుకొస్తుంది. చివరికి నిజం తెలిశాక కుటుంబ సభ్యులే ఆ అమ్మాయిని అసహ్యించుకుంటారు. ఇందులో ఎవరిది తప్పు?"
"ఆ అమ్మాయిదే తప్పు. కుటుంబాన్ని ఆడుకోవడానికయితే మాత్రం వ్యభిచరించడమేమిటి? ఛీ!" సంప్రదాయాలు జీర్ణించుకుపోయిన ఇళ తక్షణం అంది.
నేనొక మాట అంటాను. ఏమీ అనుకోవుగా?"
భయంగా చూసింది ఇళ.
"కథలో అమ్మాయి కంటే హీనంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఆ అమ్మాయి తన వాళ్ళకోసం తన ఒళ్ళు మాత్రమే అమ్ముకుంది. ఎవరినీ మోసం చెయ్యలేదు. మరి నువ్వో! ఎందరో ప్రజల్ని దేవి పేర మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నావు."
"నేనా? నేను మోసం చేస్తున్నానా?"
"కాకపోతే? నీ దేవి కిరాణా కొట్టు మీది వ్యాపారిలా నీ పక్కన కూచుని భక్తుల కానుకలు వసూలు చేసి, వాళ్ళిచ్చిన కానుక విలువను బట్టి, వాళ్ళ రోగాలు కుదర్చటమూ, వాళ్ళకి కావలసిన పనులు చేసిపెడుతూ ఉండడమూ, ఇవన్నీ చేస్తుందా? నువ్వలా అనుకుంటున్నావా నిజంగా?"
"కానీ, వాళ్ళ రోగాలు నయమవుతున్నాయి గదా!"
"కొన్ని నయమవుతున్నాయి. కొన్ని కావడంలేదు. నయమయితే అది దేవి అనుగ్రహం. నయం కాకపోతే అందుకు కారణం భక్తుల్లో విశ్వాసం లేకపోవడం! అంతేకదూ!"
ఇళ ముఖం పాలిపోయింది. బేలగా అంది.
"నన్ను ధ్యానం మానెయ్యమంటావా?"
ఉలిక్కిపడింది విదుషి. చటుక్కున ఇళ రెండు చేతులూ పట్టుకుని "వద్దు వద్దు. ధ్యానం ఎంతమాత్రం మానకు. ఈ విషయాలు మరోసారి ఆలోచించుకుందాం! వెళ్ళి విశ్రాంతి తీసుకో. రాత్రి జ్యోతిని చూద్దాం!" అంది.
"ఇళలో మానసిక సంఘర్షణ తలెత్తింది. అది ఆమె ఆరోగ్యానికి మంచిది కాదు. కాని, ఇళ బతకాలంటే, ఆపరేషన్ జరగాలంటే ఇళ ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. అందుకు మొదట ఇళని సైకలాజికల్ గా తయారుచెయ్యాలి."
* * * *
చీకటి దట్టంగా వుంది. అది వెన్నెల రాత్రి కాదు. ఒకవేళ వెన్నెల రాత్రి యినా, ఆ అడవి మధ్య వెలుతురు కనపడదు, అంత దట్టంగా ఉన్నాయి చెట్లూ, పొదలూ. చెట్ల మధ్య జ్యోతి కదులుతోంది నెమ్మదిగా నెమ్మదిగా! ఏ ఆకారమూ కనపడటం లేదు. ఇళ పక్కన కూచుని పరీక్షగా చూస్తోంది జ్యోతిని విదుషి. ఎంతగా కళ్ళు చించుకుని చూసినా ఏమీ తెలియడం లేదు. అంతా బయలు ప్రదేశం కావడం వల్ల ఎంత దూరంలో వుందో కూడా అంచనా వెయ్యలేకపోయింది. జ్యోతి కదులుతూనే వుంది. భక్తి విశ్వాసాలతో చేతులు జోడించి చూస్తోంది ఇళ.
చటుక్కున విదుషికి ఒక ఆలోచన తోచింది.
"రాణి ఎక్కడుందీ?" అడిగింది ఇళని.
"తన గదిలోనే పడుకుంటుంది."
"చూద్దాం రా!"
"దేనికి?"
"నడు!"
ఇద్దరూ రాణి గదిలో చూశారు. అక్కడ లేదు. విదుషి ఇంట్లో అన్ని గదులూ వెతికింది. ఎక్కడా లేదు. వంటశాలలో చూసింది, అక్కడా లేదు.
"నా అనుమానం... రాణి..."
"రాణి అంటున్నారు_ఏమిటి?"
లోపలికి అడుగుపెట్టింది రాణి. విదుషి నోట్లో మాటలు నోట్లోనే ఆగిపోయాయి. పరిశీలనగా రాణీని చూసింది. అమాయకంగా ఏమిటలా చూస్తున్నారూ!" అంది.
"ఏం లేదు. నువ్వెక్కడున్నావ్ ఇప్పటివరకూ?"
"ముందు వాకిట్లో తులసికోట దగ్గర నిలబడి జ్యోతిని దర్శించుకుంటున్నాను. అలా చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని..."
బుద్ధిగా లెంపలేసుకుంది రాణీ.
జ్యోతి ఇంకా కదులుతూనే వుంది. ఇళ, విదుషి, రాణి ముగ్గురూ కలిసి చూశారు జ్యోతిని.