కానీ విశ్వాసం, విశ్వాసం అంటూ కలవరిస్తూ కూచుంటే కలిసి వచ్చేదేమీ ఉండదని కూడా తెలుసు.
పైవాళ్ళకి నీమీద నమ్మకం కలిగేదాకా కుక్కకన్నా యెక్కువగా విశ్వాసం చూపించు.
వాళ్ళు నమ్మి నిన్ను నెత్తికెక్కించుకోగానే వాళ్ళని అధఃపాతాళానికి తొక్కెయ్:
ఈ ధర్మసూక్ష్మాన్నే తన యజమానుల పట్ల ప్రయోగించాడు బాబూజీ.
ఫలితంగా ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలూ అయ్యాయి. పోపట్ లాల్ అండ్ కంపెనీ కాస్తా బాబూజీ అండ్ పోపట్ లాల్ కంపెనీ అయింది.
ఆ తరువాత కంపెనీ పేరులో కనబడటమేతప్ప కంపెనీ ఒరిజినల్ యజమానులైన పోపట్ లాల్, అతని కుటుంబం ఏమయ్యారోగానీ వూరూ పేరూ లేకుండా పోయారు.
షవర్ బాత్ తీసుకుని, కేమెల్ ఊల్ తో నేసిన అతి ఖరీదైన సూటు వేసుకుని, బ్రేక్ ఫాస్ట్ కి కూర్చున్నాడు బాబూజీ.
బ్రేక్ ఫాస్ట్ కోసం తన ముందు టేబుల్ మీద పెట్టినదేమిటోఅతడికి అర్థంకాలేదు. అది ఎవరో రాక్షసుడి గుండెకాయలాగా చాలా పెద్ద సైజ్ లో వుంది.
బాబూజీ వస్తున్నాడని తెలిసి, కొన్ని రిపోర్టులను అందజేయడానికి పొద్దున్నే అక్కడికి చేరుకున్నాడు కంపెనీ సైంటిస్టు ప్రొఫెసర్ రామనాధం. భూతద్దాలలాంటి దళసరి కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్నాడు అతను. తెల్లటి జుట్టూ, గెడ్డం కుందేలుబొచ్చు అతికించినట్లున్నాయి... అతడికి వైజ్ఞానిక విషయాలు తప్ప మరేమీ పట్టవు. యజమాని మొహంలో కనబడుతున్న ప్రశ్నార్థకం చూసి గబగబ చెప్పటం మొదలెట్టాడు రామనాధం.
"ఇది కోకో డిమెర్: సముద్ర టెంకాయ. దీన్నే ఫర్ బిడెన్ ఫ్రూట్ అంటారు కూడా: ఇంత అద్భుతమైనది ప్రపంచంలో యింకొకటి ఉండదు. వృక్ష జాతులకు సంబంధించిన వాటిలో ఇంత రుచిగలది కూడా వేరేదీ లేదు.... వింతగొలిపే ఈ కాయని చూసి మధ్య యుగాలలో జనం యిది సముద్రగర్భంలో పండుతుందనుకునేవాళ్ళు. ఎందుకంటే దీని కాయలు సముద్రతీరాలలో దొరుకుతుండేవి.
కానీ 1768లో ఒక భగ్ననౌకలోనుంచి బయటపడి ప్రాణాలుదక్కించుకున్న నావికుడు ఒకడు ప్రాస్లిన్ ద్వీపాన్ని చేరి అక్కడ ఈ పండునీ, చెట్లనీ చూశాడు. దానితో ఈ పండుమీద అనాదిగాఉన్న కొన్ని భ్రమలు తొలగిపోయాయి.... కానీ వెంటనే కొత్త రకం వూహాగానాలు మొదలయ్యాయి."
"ఏమిటవి?" అన్నాడు బాబూజీ.
తమాషాగా నవ్వాడు ప్రొఫెసర్ రామనాధం.
"ఈ కోకో డీమెర్ చెట్లలో మొగచెట్లకీ, ఆడచెట్లకీ తేడా చాలా స్పష్టంగా తెలిసిపోతూ వుంటుంది. మొగచెట్లు బాగా పొడుగ్గా ఉంటాయి. అంత ఎత్తులేని ఆడచెట్లు వాటిపక్కనే వినయంగా నిలబడినట్లు ఉంటాయి. ఇక్కడ చిత్రద్వీప్ లో వున్న జనం చాలామందికి ఒక నమ్మకం వుంది. తుఫాను గాలులు వీస్తున్న రాత్రులలో మొగచెట్లు ఆడచెట్లు దగ్గరికి నడిచి వెళ్ళి శృంగారం జరుపుతాయని..."
పెద్దగా నవ్వాడు బాబూజీ.
"అంతేకాదు: వాటి కలయికని ఏ మానవుడయినా చూస్తే తక్షణం మరణిస్తారని..."
"ఐసీ:"
"ఈ అరేబియన్ సముద్రంలో వున్న కొన్ని ద్వీపాలకి వినోద యాత్రికులవల్లే ఆదాయం ఎక్కువగా వస్తూ వుంటుంది. వినోద యాత్రికులు చాలామంది ఈ కోకోనట్ డీమెర్ గురించిన మిస్టీరియస్ కథలూ - గాథలూ విని ఆ కుతూహలంతో దీనిని చూడాలనీ తినాలనీ వస్తుంటారు. ఈ కాయల ఎగుమతిని సెషెల్స్ లాంటి చాలా ద్వీపాలు నిషేధించాయి... హోలీరోమన్ ఎంపైర్ వంశానికి చెందిన రాజు రూడోల్ఫ్ II, ఆ కాలంలోనే ఒక డచ్ అడ్మిరల్ దగ్గర ఉన్న ఒక కోకోనట్ డిమెర్ కోసం నాలుగువేల బంగారు నాణాలు ఇస్తానన్నాడట: మాల్ దీవులలో ఒకప్పుడు ఒక రాజశాసనం ఉండేది దానిప్రకారం సముద్రతీరాలలో ఎవరికి ఈ కాయలు దొరికినా అవి వాళ్ళు రాజుకు సమర్పించుకోవాలి అలాకాకుండా ఎవరయినా వాటిని తినేసినా, మరోవిధంగా ఉపయోగించినా వాళ్ళ చేతులు నరకబడేవి. అంత విలువైన కాయ యిది."
హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్లయింది బాబూజీకి.
"అరె: దీని చిప్ప చూస్తే ఇండియాలో ముస్లిమ్ ఫకీర్లు చేతిలోపట్టుకొని తిరుగుతూ వుంటారే, తాబేలు డిప్పలా వుంటుంది - అది గుర్తురావడం లేదూ?" అన్నాడు. జీడిపప్పు ఆకారంలో వున్న రెండు చిప్పలు కలిసి ఒక కాయగా వుంది కోకో డిమెర్.
"అవును" అన్నాడు ప్రొఫెసర్ రామనాధం. "ఇక్కడ స్థిరపడ్డ ఒక గుజరాతీ వర్తకుడు వందసంవత్సరాల క్రితం ఈ సముద్ర టెంకాయలను ఇండియాకి పంపి, కుంభమేళాలాంటి సమయాల్లో హరిద్వారలోనూ, ప్రయాగలోనూ, సన్యాసులకూ, సాధువులకు పంచిపెట్టే ఏర్పాట్లు చేసేవాడు.
ఈ కాయలో వుండే కొబ్బరిలాంటిది తింటే పోయిన యవ్వనం తిరిగి వస్తుందంటారు. గట్టిగా వుండే దీని చిప్పతో చాలారకాల మందులు చేస్తారు. ఈ చిప్పతోనే చైనీయులు కంకణాలు చేయించి చేతులకి తొడుక్కుంటారు... అలా చేస్తే దెయ్యాలూ, గియ్యాలూ, దగ్గరకి రావని వాళ్ళ నమ్మకం:"