Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 22


    అప్పుడు....

    గబగబా నడుస్తూ దుర్గేష్ దగ్గరికి వచ్చాడు పాన్ షాపు ఓనరు.

    "ఏందిరా" అన్నాడు అతన్ని చూసి.

    "అన్నా నువ్వు సాల్మన్ టీచర్ చెయ్యి విరక్కొట్టినావంట గద! స్కూలు పోరగాళ్ళు టీచర్లు కలసి జులుస్ తీస్తుండ్రు. ఆడ్ని ఆస్పత్రిలో చేర్చి అక్కడినుండి జులుస్ తోనే పోలీస్ స్టేషన్ కి ఎల్తారంట!"

    దుర్గేష్ మొహం భీకరంగా మారింది.

    "పోలీసుల దగ్గరికెళతారా? చూద్దాం" అన్నాడు.

    "అన్నా ఇంకోటి వున్నదే" అన్నాడు పాన్ షాపతను.

    "ఏందిర?"

    "ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ పెట్టినారంట"

    "ఏమాయె?"

    "గఫార్ లేడూ ఆడ్ని మరిడేశ్వరరావు గన్ మాన్ చంపి మసీదు దగ్గర పడేసిండంట. ఓల్డ్ సిటీ అంతా కత్తిపోట్లు"

    సిగరెట్ దమ్ము పీల్చి ఆలోచించాడు దుర్గేష్.

    "స్కూలు పిల్లగాళ్ళు, టీచర్లు తీసే జులుస్ ఎట్నుంచి వెళుతుందట" అన్నాడు.

    సాభిప్రాయంగా చూసి అన్నాడు పాన్ షాపతను.

    "మన షాపు మీదనుంచే" అన్నాడు.

    టీచర్లు, పిల్లలు కలసి సాల్మన్ మీద జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా చెయ్యబోయే ఊరేగింపు పాన్ షాపు దగ్గరికి రాగానే ఏం చెయ్యాలో చెప్పడం మొదలుపెట్టాడు దుర్గేష్.


                       *    *    *    *


    ఢిల్లీలో నిన్న పొద్దున ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టుకి వచ్చేటప్పుడు తనతోబాటు బ్యాగ్ లో చాలా ఖరీదైన మందులు తెచ్చింది డాక్టర్ సుధారాణి. అనుకున్నది గనక అంతా అనుకున్నట్లు జరిగివుంటే, తను ఈవెనింగ్ ఫ్లైట్ కి టిక్కెట్ కొనుక్కుని, అటునుంచి అటే హాస్పిటల్ కి వెళ్ళిపోయి, క్రిటికల్ కండిషన్ లో వున్న ఒక పేషెంట్ ని అటెండ్ అయి, మళ్ళీ సాయంత్రం ఎయిర్ పోర్టుకి వచ్చేసి వుండాలి.

    కానీ అంతా అప్ సెట్ అయిపోయింది.

    పంజాబ్ టెర్రరిస్టులు బాంబు పేల్చి, విధ్వంసం జరపడంవల్ల, తను ఎయిర్ పోర్టు దగ్గరే, అక్కడ గాయపడిన వాళ్ళకు ట్రీట్ మెంటు యిస్తూ వుండిపోవలసి వచ్చింది. అయినా కూడా అత్యవసరమైన ఆ మందుల సంగతి మర్చిపోలేదు తను. వాటిని ఒక మనిషికి యిచ్చి హాస్పిటల్ కి పంపేసింది. తన సేవింగ్స్ లో నుంచి ఖర్చు చేసి కొన్న ఖరీదైన మందులివి.

    సమయానికి పేషెంటుకి అందకపోతే అంతా వేస్టే! ఆ మందులు ఆ పేషెంటుకి ఇచ్చి వుంటారా అసలు? ఇచ్చే వుంటారు.

    అయినా గట్టిగా చెప్పలేం.

    మధ్యలో ఎవరైనా వాటిని మాయం చేసేసి ఉండొచ్చు. వాటిని బ్లాక్ లో అమ్మేసుకుని వుండొచ్చుకూడా.

    ఈ రోజుల్లో మనుషులకి డబ్బు ముఖ్యం. అది ఎలా వచ్చినా సరే! సాటి మనిషి ప్రాణాలకు విలువే లేదు.

    హాస్పిటల్ కి ఫోన్ చేసి ఆ పేషెంట్ ఎలా వున్నాడో కనుక్కోవాలని రెండు మూడుసార్లు ట్రై చేసింది తమ హోటల్లో నుంచే. హాస్పిటల్లో బోర్డు దగ్గర ఫోన్ మోగుతూనే వుంది. ఎవరూ ఎత్తరు! నో రెస్పాన్స్.

    తలుచుకోవడానికే ఇబ్బందిగా వున్నా కూడా హాస్పిటల్లో జరుగుతోంది ఏమిటో గ్రహించగలిగింది డాక్టర్ సుధ.

    ఆ బోర్డు దగ్గర వున్న అమ్మాయి చాలా చలాకీ. మొగ డాక్టర్లందరూ క్షణం తీరిక దొరికితే చాలు, ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేసి ఆమెని "ఎంగేజ్" చేస్తూ వుంటారు.

    బహుశా ఇప్పుడు కూడా అలాగే బిజీగా వుండి వుండొచ్చు ఆ పిల్ల. డాక్టర్ సుధారాణి భ్రుకుటి ముడిపడింది. తను ఫోన్ చేసినా కూడా వాళ్ళు కరెక్ట్ ఇన్ ఫర్మేషన్ చెబుతారని ఏమిటి?

    అప్పటికప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పేసి తప్పించుకుందామని చూస్తూంటారు ఎవరికి వాళ్ళు.

    ఇలా లాభంలేదు. తనే వెళ్ళి ఒకసారి పేషెంటుని చూసి రావాలి.

    మనిషి ప్రాణాల విషయాల్లో ఇంకెవరినీ నమ్మదు తను.

    ఒక నిశ్చయానికికొచ్చి హోటల్ లాబీలోకి వచ్చింది డాక్టర్ సుధ. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి "శ్రమ అనుకోకపోతే టాక్సీ ఒకటి పిలిపించగలరా? మా హాస్పిటల్ కి వెళ్ళిరావాలి" అని తమ హాస్పిటల్ అడ్రసు చెప్పింది.

    "మా కారు అరేంజ్ చేస్తాను డాక్టర్! వెళ్లి రండి" అంది రిసెప్షనిస్టు మర్యాదగా.

    "వద్దు! అక్కడ నాకు ఆలస్యం కావచ్చు. ఆలస్యం అయితే మీకు ఇబ్బంది" అంది డాక్టర్ సుధారాణి స్థిరంగా.

    "ఫర్వాలేదు!" అని కారు తెప్పించింది రిసెప్షనిస్టు.

    హాస్పిటల్ దగ్గర దిగగానే కారు వెనక్కి పంపించేసింది సుధ. చకచకా తన పేషెంట్ వున్న రూంకి వెళ్లింది.

    మంచం మీద పడుకుని వున్నాడు పేషెంటు. రెప్ప వెయ్యకుండా చూస్తూ వుంటాడు అతను. అతని కనురెప్పలు కాలిపోయి, కదలిక లేకుండా అయిపోయాయి. అతని కనుబొమ్మలు కూడా కాలిపోయాయి. తలమీది జుట్టు కాలిపోయి వుంది. అతనికి ఇదివరకు గడ్డం వుండి వుండాలి. ఆ గెడ్డం కాలిపోయి వుంది. తలమీదా, మొహం మీదా వున్న ప్రతి వెంట్రుక కూడా కాలిపోయి వుంది.

    కాదు....

    ఎవరో జాగ్రత్తగా కాల్చేశారు. హాస్పిటల్ కి తీసుకొచ్చినప్పటినుంచి అతను షాక్ లోనే వున్నాడు. ఎవరితో ఒక్కమాట కూడా మాట్లాడడు. కళ్ళు ముయ్యలేడు. తల తిప్పడు. ఊరికే కళ్ళు మాత్రం తిప్పి మనిషి కనబడినంత దూరం చూస్తూ వుంటాడు.

    అతని పేరేమిటో, ఊరేమిటో హాస్పిటల్ వాళ్ళకి తెలియదు. "పర్టిక్యులర్స్ నాట్ నోన్" అని రాశారు అతని పేరు వుండాల్సినచోట.

    అతని పేరు పాండు అనీ, కిల్లర్ అనే పేరుతో అతను చాలా పాపులర్ అనీ, అతను మరిడేశ్వరరావు గ్యాంగు మెంబరని సుధకి అప్పటికి యింకా తెలియదు.

    తెలుస్తుంది కొద్దిసేపటి తర్వాత.

    హాస్పిటల్ అంతా డిన్ ఇన్ ఫెక్టంట్ వాసన ఆవరించి వుంది.

    క్లీన్ గా వుండే ఆ వాసన అంటే సుధకి ఇష్టం! ఖరీదైన పెర్ ఫ్యూమ్ సువాసనని కూడా ఆమె అంతగా ఇష్టపడదు.

    ఆ డిస్ ఇన్ ఫెక్టంట్ వాసన తనకి తన డ్యూటీని గుర్తుచేస్తుంది.

    తన డ్యూటీని తను ఎప్పటికప్పుడు నిర్వర్తించ గలుగుతున్నానన్న తృప్తిని కలుగజేస్తుంది కూడా.

    తలుపు చప్పుడు కాగానే హాస్పిటల్ బెడ్ మీద వున్న పాండు కళ్ళు తిప్పి చూశాడు.

    మామూలప్పుడు సీరియస్ గా వుండే సుధ మొహం పేషెంట్ల దగ్గర మాత్రం అతి ప్రశాంతంగా మారిపోతుంది. చూపులు చల్లగా అయిపోతాయి. పెదిమలు చిరునవ్వుతో అరవిచ్చుకుంటాయి.

    సుధని చూడగానే పాండు కళ్ళలోకి వెలుగు వచ్చింది.

    అది గమనించింది సుధ. అతను తనని గుర్తుపట్టాడు. అతనిలో ఫస్ట్ రియాక్షన్ అది.

    అతని మంచం దగ్గరికి నడిచింది. కేస్ షీట్ తీసి చూసింది. తను పంపిన మందులు అన్నీ వాడారు ఒకటి తప్ప.

    ఆ మందు అవసరమే! కానీ అత్యవసరం కాదు. ప్రక్కనే వున్న రాక్ తో చూసింది. ఆ ఇంజెక్షన్ లేదు అక్కడ. ఏమైంది? కొట్టేశారా....? ఒక్కక్షణం నుదురు చిట్లించి, అంతలోనే మళ్ళీ ప్రశాంతంగా అయిపోయి పాండు నాడిని పట్టుకు చూసింది సుధ. రొటీన్ గా చెకప్ చేసింది.

    ఎవ్విరిథింగ్ ఈజ్ నార్మల్. నోటితో అస్పష్టంగా శబ్దాలు చేస్తున్నాడు పాండు. ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు అతను.

    పెదిమల మీద చిరునవ్వుతో తల వంచింది డాక్టర్ సుధ. అతను చెప్పేది వినాలని, అర్ధంచేసుకోవాలనీ ప్రయత్నించింది.

    "ఏమిటీ?" అంది ఆర్ద్రంగా.

    కష్టం మీద కుడిచేతిని కాస్త ఎత్తాడు పాండు. అతని ముంజేతికి కాస్త పైగా, ఒక పచ్చబొట్టు వుంది.

    పెద్దపులి తల....

    ఆ పచ్చబొట్టు వేపు ఒకసారి చూసింది డాక్టర్ సుధ. తర్వాత పాండు మొహంలోకి ప్రశ్నార్ధకంగా చూసింది. మాటలు మర్చిపోయిన వాడిలాగా కాసేపు సతమతమయ్యాడు పాండు.

    "ప్ప....ప్ప....ప్ప...." అన్నాడు తడుముకుంటున్నట్లు.

    ఓపిగ్గా ఎదురు చూసింది సుధ.

    హఠాత్తుగా తన నాలుక మీద తనకు స్వాధీనం వచ్చినవాడిలాగా గబగబా మాట్లాడటం మొదలెట్టాడు పాండు.

    "ఈ పచ్చబొట్టు ఉన్న చేతిని కాల్చేసినా బాగుండేది వాళ్ళు."

    "ఎవరు వాళ్లు?" అంది సుధ జాగ్రత్తగా.

    "రాజ్ కుమార్ అండ్ కంపెనీ...."

    నుదురు చిట్లించి ప్రశ్నార్ధకంగా చూసింది సుధ.

    "పేరు చెప్పకూడని వ్యక్తి....అతను పెద్దాడైపోయాడు. అతని వారసుడు రాజ్ కుమార్!"

    అర్ధంకానట్లు చూసింది సుధ. కానీ ఆమెకు అర్ధంకావటం మొదలుపెట్టింది. ఆమె గ్యాంగ్ స్టర్ దుర్గేష్ కూతురు.

    తను మాట్లాడుతున్నది ఎవరో గ్యాంగ్ స్టర్స్ తో కాదని, ఒక మర్యాదస్తురాలయిన డాక్టర్ తో అని గ్రహించాడు పాండు. అందుకని వివరంగా చెప్పడం మొదలెట్టారు.

    "ఈ ఢిల్లీకి ఒకప్పుడు పేరు చెప్పకూడని వ్యక్తి గాడ్ ఫాదర్ గా వుండేవాడు. అవును....అతన్ని అందరూ అలాగే పిలిచేవాళ్ళు.... అతని అసలు పేరు ఏమిటో ఎవరికీ తెలీదు. ఇప్పుడా 'పేరు చెప్పకూడని వ్యక్తి' పెద్దవాడయిపోయాడు. మర్యాదస్తుడిలాగా చెలామణి అవ్వాలని తెగ తాపత్రయపడిపోతున్నాడు. కానీ తొడ సంబంధం తొంభైయ్యేళ్ళంటారు. తేలికగా పోదు...."

 Previous Page Next Page