Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 21


    చాలామంది పార్లమెంటు మెంబర్లకి ఎలెక్ట్రిసిటీ బిల్లులు కట్టే అలవాటు లేదు. ఎలెక్ట్రిసిటీ బకాయిలు కోట్ల రూపాయల్లో వున్నాయి.

    ఇవి చాలదన్నట్లు ప్రతి మెంబరుకి ముప్పయి వేల ఫోన్ కాల్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని ఎయిర్ కండిషనర్లు ఫ్రీగా పెట్టించుకోవచ్చు. వాళ్ళు ఎవరికైనా నలభై ఎనిమిది గ్యాస్ కనెక్షన్లు ఇప్పించవచ్చు. మామూలుగా అయితే వీటిని వాళ్ళు బ్లాకులో అమ్ముకుంటారు. వాళ్లు లెక్కలేనన్నిసార్లు రైల్లో ఫాస్ట్ క్లాసుల్లో ప్రయాణం చేయవచ్చు.

    చాలామంది పార్లమెంటు మెంబర్లు నెలకి యాభై వేల దాకా వీటిమీదే సంపాదించుకుంటూ వుంటారు.

    మొన్నటికి మొన్న లోక్ సభ రద్దయిపోతున్నప్పుడు వాళ్ళు అన్ని విషయాలూ పక్కకినెట్టేసి తమకి రావలసిన పెన్షన్ రూల్స్, తమకి అనుకూలంగా అప్పటికప్పుడు మార్చేసుకున్నారు.

    ఈ రాజకీయ భోగాల్లో పార్లమెంటు మెంబర్లు కేవలం ఒక భాగం మాత్రమే మంత్రులనీ, సెక్రెటరీలనీ, వాళ్ళనీ వీళ్ళనీ కలిపి చూస్తే గుండె బేజారైపోతుంది.

    ఈ దేశంలో ముప్పాతిక మందికి రోజుకి ఓ పూట కడుపుకి తిండి దొరికే అవకాశం లేదు. అలాంటి ఈ నిరుపేద దేశపు ప్రజల సొత్తు ఈ దేశపు రాష్ట్రపతి కోసం ఎంత ఖర్చవుతుందో తెలుసా?

    రోజుకి డెబ్బయి అయిదువేల రూపాయలు!

    పూటకి తిండిలేని ప్రజల తాలూకు రాష్ట్రపతి కోసం రోజూ ఖర్చు డెబ్బయి అయిదువేల రూపాయలు!

    అంటే సంవత్సరానికి రెండుకోట్ల డెబ్బయి లక్షల రూపాయలు!

    "ప్రభుత్వం ఒక్క మనిషి మీద ఇంత ఖర్చు చెయ్యడం దౌర్జన్యం కాదా? ఇది అధికారికమైన గూండాయిజమ్ కాదా? చాతనైతే వీటిమీద ఎందుకు తిరగబడవు?" అన్నాడు అఖిల్ ఆగ్రహంతో ఊగిపోతూ.

    వింటున్న సుధ కూడా కోపంతో వణికిపోయింది.

    అతను పార్లమెంటు మెంబర్ల ప్రస్తావనే ఎందుకు తెచ్చాడో ఆ అమ్మాయికి తెలుసు.

    తన తండ్రి దుర్గేష్ మొన్ననే రాజ్యసభకి నామినేట్ అయ్యాడు.

    నిజమే! ఏమాత్రం సంస్కారం ఉన్న మనిషైనా విని సిగ్గుతో తల వంచుకోవలసిన విషయమే ఇది.

    ఒక రౌడీ ఎలెక్షన్ కు నిలబడి గూండాయిజమ్ తో భీభత్సం సృష్టించి బూత్ కాప్చరింగ్ చేసి, రిగ్గింగ్ చేసి గెల్చాడన్నా అదోరకం.

    ఇది అలా కాదు.

    మహామహులు, మేధావులూ, సాహితీవేత్తలు, సంఘసేవకులు, సంస్కర్తలకోసం ఉద్దేశించబడిన రాజ్యసభకి_

    ఒక రౌడీని, ఒక హంతకుడిని, ఒక గ్యాంగ్ స్టర్ ని, ఒక దేశ ద్రోహిని, తలలు పండిన పెద్దలందరూ కలసి ఎన్నుకున్నారు.

    అందరూ తలలు వంచుకోవలసిన విషయమే.

    అయితే అది తన తప్పా!

    డాక్టర్ సుధ పెదిమలు బిగుసుకుపోయాయి.

    అసలు ఇలాంటి వ్యవహారాలన్నీ తనకి పడకనే కదా ఉన్న ఊరు వదిలి ఈ ఢిల్లీ వచ్చేసి ఉద్యోగం చేసుకుంటూ బతుకుతోంది తను.

    ఇతని కసలు మెదడు వుందా అని!

    ఇతనే ఒక గూండా అయి వుండి తనని....

    మరి ఇతని తండ్రి సంగతేమిటి?

    ఈ అఖిల్ తండ్రి మరిడేశ్వరరావుకి ఈ మధ్యే ఒక యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇవ్వలేదూ?

    మరిడేశ్వరరావు సెనేట్ సభ్యులని డబ్బుపడేసి కొనేశాడు. అందుకే వచ్చింది డాక్టరేట్.

    అప్పట్నుంచి అతను డాక్టర్ మరిడేశ్వరరావు.

    బుల్ షిట్ !

    మరిడేశ్వరరావును కనుక డాక్టర్ అని పిలిస్తే ఆ పదానికి అమర్యాద కాదూ?

    ఇతనిలాంటివాళ్ళు కూడా డాక్టర్ అనిపించుకుంటుంటే సంవత్సరాల తరబడి తపస్సులాగా చదివి తెచ్చుకున్న తనలాంటి వాళ్ళ డిగ్రీలకి అవమానం కాదూ?

    డాక్టర్ మరిడేశ్వరరావు!

    డాక్టర్ మరిడేశ్వరరావు!!

    తలచుకుంటూ ఉంటేనే చాలా వెగటుగా వుంది ఆ పేరు.

    గౌరవ డాక్టరేట్ పట్టాకోసం సెనేట్ సభ్యులతో బేరసారాలు సాగించింది ఈ అఖిలే అని విన్నది తను.

    "మర్యాదగా డబ్బులు తీసుకుని పని చేసిపెట్టారా సరేసరి. లేకపోతే మీ పని పడతా" అని సెనేట్ సభ్యులని బెదిరించాడుట ఈ అఖిల్.

    బ్లడీ ఛీప్ ఫెల్లోస్!

    బ్లడీ ఛీప్ టాక్టిక్ట్స్!

    ఛీ ఛీ ఛీ ఛీ!

    ఇతనా తనని హేళన చేసేది?

    "పార్లమెంటు మెంబర్లు...." అని ఇంకేదో అనబోయాడు అఖిల్.

    ఆగ్రహంగా, అసహనంగా అంది డాక్టర్ సుధ.

    "స్టాపిట్! నీకేం రోగమో తెలుసునా! వెర్బల్ డయోరియో! ఫినాయిల్ తో నోరు కడుక్కుని రెస్టు తీసుకో!" అని గిరుక్కున వెనక్కి తిరిగి చకచకా తన రూంవైపు వెళ్ళిపోయింది డాక్టర్ సుధ.

    కమ్చీతో కొట్టినట్టయ్యింది అఖిల్ కి.

    ఏమంది?

    వెర్బల్ డయోరియా!

    నోటితో మాటల విరోచనాలు!

    ఎవరికి?

    తనకా? 

    అతని ముక్కుపుటాలు పెద్దవయ్యాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి పళ్ళు గిట్టికరచి పట్టుకున్నాడు.

    ఇంతలో పైలెట్ ఏదో అనబోయాడు.

    సుధ మీద కోపాన్నంతా పైలెట్ మీద చూపిస్తూ ఈడ్చి చెంప మీద కొట్టాడు అఖిల్. ఆ దెబ్బకి ఎయిర్ హోస్టెస్ ఒక్క గంతేసి గజం అవతల నిలబడింది.

    అక్కడున్న ప్రయాణీకులందరూ సంతోషంగా హర్షధ్వానాలు చేశారు.

    మరుక్షణంలో పైలెట్, ఎయిర్ హోస్టెస్ మంత్రం వేసినట్లు మాయమైపోయారు అక్కడి నుంచి.

    అఖిల్ పైలెట్ ని కొట్టడం సుధ చూడలేదు.

    అప్పటికే ఆమె తన రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె మనసు మండిపోతోంది.

    తను పైలెట్ ని నిలదీస్తుంటే అఖిల్ తన ప్రత్యర్ధిగా తననే ఎదిరించడం ఆమెకి అపరిమితమైన బాధని కలిగించింది.

    కానీ ఇక్కడ చిత్రం ఏమిటంటే-

    చెడుమీద జరుగుతున్న ధర్మయుద్ధంలో వాళ్ళిద్దరూ పోరాటరేఖకి ఒకేవైపున వున్నా అది వాళ్ళు అర్ధం చేసుకోలేక ఒకళ్ళని ఒకళ్ళు ప్రత్యర్ధులులాగా, బద్ధ శత్రువులులాగా చూసుకుంటున్నారు.

    ఈ లోకంలో సగం అనర్దాలకి, అపార్ధాలకీ కారణం కమ్యూనికేషన్ గ్యాప్!

    సమాచారం సరిగా అందకపోవడం!

    లేదా__

    అందిన సమాచారాన్ని సరిగా అర్ధం చేసుకోలేకపోవడం!

    అంతే!


                       *    *    *    *

    అంతకు కొంత సమయం ముందు_

    హైదరాబాద్ లో-

    తన శానిటరీ నేప్ కిన్స్ లో ఉంచిన డ్రగ్స్ తీసుకుని భయం భయంగా ముందుకు వెళుతున్న గాయత్రిని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ "ప్లీజ్ స్టాప్" అని గంభీరమైన స్వరంతో ఆపగానే మంత్రముగ్ధలా ఆగిపోయింది.

    అక్కడికి కొద్దిదూరంలో నిలబడి వున్న దుర్గేష్ ఇదంతా కళ్ళార్పకుండా చూస్తున్నాడు.

    హతాశురాలయిపోయింది గాయత్రి.

    తను మొదటి తప్పు చేసీ చెయ్యకముందే దొరికిపోయింది.

    ఇప్పుడు తనకి ఏం శిక్ష వేస్తారు?

    యావజ్జీవ ఖైదు వేస్తారా?

    లేదా ఏకంగా తనని కొరత వేస్తారా?

    ఏం చేస్తారు?

    నెమ్మదిగా దగ్గరికి వచ్చాడు ఏ.సి.పి.

    "ఏంలేదు మీకు ఇంకోసారి అపాలజీ చెప్పాలనే మిమ్మల్ని ఆపాను" అన్నాడు.

    అంతేనా?

    తేలిగ్గా ఊపిరి తీసుకుంది గాయత్రి.

    చిన్నగా నవ్వుతూ అన్నాడు ఏ.సి.పి.

    "నన్ను నేను పరిచయం చేసుకునే అవకాశం యివ్వండి"

    "నా పేరు ప్రణయ్! ప్రణయ్ కుమార్! పోలీసోడికి బొత్తిగా సూటవని పేరు, అవునా?"

    బలవంతాన పెదిమల మీదికి నవ్వు తెచ్చుకుంది గాయత్రి.

    "మీ పేరు అడగొచ్చా?" అన్నాడు ప్రణయ్ ఏ.సి.పి.

    "గాయత్రి" అంది అస్పష్టంగా.

    "ఇంక నేను వెళతాను"

    తల ఊపాడు ప్రణయ్. ఆమె ముందుకు నడిచింది.

    ఆమె వెళ్లినవైపే కొంతసేపు చూసి తర్వాత జీపు ఎక్కాడు ఏ.సి.పి. ప్రణయ్.

    ప్రణయ్ జీపు కదిలి అక్కడినుంచి వెళ్ళిపోయాకగానీ కుదుటబడ లేదు దుర్గేష్ మనసు. జేబులోనుంచి రెండో పాన్ తీసి నోట్లో పెట్టుకుని తాపీగా ఇండియా కింగ్స్ సిగరెట్ అంటించాడు.

 Previous Page Next Page