Previous Page Next Page 
అభయారణ్యం పేజి 21

  

  తేజా చనువు తీసుకోవడం లేదు. నిక్కచ్చిగా మాట్లాడుతున్నాడు అంతే. అయినా అందులో తప్పేముంది?

    రచయిత కూడా సంఘానికి ఏదో చెప్పాలనుకునే టీచర్ లాంటి వాడేగా, ఏ స్టూడెంటుకయినా టీచర్ దగ్గర దాపరికమెందుకు?

    "మీరు చాలా సెంటిమెంటల్ గా రాయగలరు తేజా" ఆర్తి గొంతుతో హఠాత్తుగా మార్పు వచ్చింది.  "ఇది నిజం.... అశలు మీరంత అద్బుతంగా ఎలా ఆలోచించగలరూ అన్నది మా వూహకందని విషయం"

    చదివిన వాక్యాల స్పూర్తితో అలా మాట్లాడాలనిపించిందో లేక తను ఓ ఆకతాయి అభిమానిగా అడిగి దృష్టిలో  ఇష్టంలేకనే అలా అందో కంఠస్థం చేసినట్లు అతడు రాసిన వాక్యాల్నీ రిపీట్ చేసింది.

    "అసలు ప్రియుడిలో తండ్రినీ, కొడుకునీ ఊహించుకోవడమన్న మీ థాట్ చాలా గొప్పగా వుంది మిస్టర్ తేజా. మామూలుగా వినటానికి ఇబ్బందికరంగా అనిపించే ఆ భావాన్ని చాలా పొయిటిక్ గా, కన్విన్సింగ్ గా రాశారు. 'రీడింగ్ ఈజ్ టుది మైండ్ వాట్ ఎక్సర్ సైజ్ ఈజ్ టు ది బాడీ' అన్న రిచర్ట్ స్టీల్ సూక్తిని నిజమే అని నిరూపించారు."

    ఎమోషనల్ గా ఆగింది.

    "థ్యాంక్స్ మిసెస్ ఆర్తీ!  మీ స్టేట్ మెంట్ నాకు గొప్ప ప్రేరణగా వుంది. అయితే ఒక రచన్ని ఇంత అందంగా విశ్లేషించగల మీరు ఇంకో విషయాన్ని గుర్తుంచుకోవాలి."

    "చెప్పండి."

    "లియోసిజలార్డ్ అన్నాడు 'అవసరం లేనప్పుడు అబద్దం చెప్పకూడదని.'

    "నేను అబద్దం చెప్పలేదు తేజాగారూ! మీ రచనని నిజాయితీగానే అభినందించాను."

    "నేను అంటున్నది ఇప్పుడు మీరు చెప్పినదాని గురించి కాదు."

    ఆర్తి అప్రతిభురాలై వింటూంది.

    "ప్రొద్దుట మీరు చెప్పిన మీ ఫోన్ నెంబరు గురించి. "

    క్షణం  విరామం తర్వాత అన్నాడు "అభిమానులు ఓ రచయితని పిచ్చిగా ఆరాధించడం తప్పుకాదు... పిచ్చిని నయం చేసుకునేటంత రేంజ్ లో  హాస్పిటల్ పాలవటం తప్పు."

    "మీరేం అంటున్నారో నాకర్దం కావటంలేదు."

    "మీరిచ్చిన నెంబరు మెంటల్ హాస్పిటల్ ది."
    ఫకాల్న నవ్వేసిందామె. అసంకల్పితంగా తను చెప్పిన నెంబరు మెంటల్  హాస్పిటల్ దని ఆమె కూడా వూహించలేదు.

    అయినా తేజాకి అదెలా తెలిసింది?

    తన కోసం ఫోన్ చేశాడా?

    అంటే....

    తనతో మాట్లాడాలని తనూ కోరుకున్నట్టేగా?

    ఈ ఆలోచన ఆమెకు చాలా సంతృప్తినిచ్చింది. అందుకే క్షమార్పణలు చెప్పటానికీ సంకోచించలేదు. "సారీ."

    "సో... "ఓ క్షణం ఆగి అన్నాడు తేజా "మీ వీల్ ఛైర్, మీ వయసు వగైరాల గురించి మీరు చెప్పింది ఎంత నిజమో నాకు చాలావరకూ తెలిసిపోయింది."

    "నిజానికి అవన్నీ...."

    "అబద్దాలై వుంటాయని నేనూ వూహించగలను. కానీ మీరొకటి గుర్తుంచుకోవాలి."

     "చెప్పండి."

    "ఒక రచయితతో నిష్కల్మషమైన స్నేహం ఆశించే అభిమాని యిలాంటి అబద్దాలు చెప్పడంలో అర్దంలేదు. ..." తేజా గొంతు గంభీరంగా వినిపించింది. "రచయిత ఆశించేది తన రచన గురించి విమర్శించగల అభిమానిని మాత్రమే తప్ప తనను ఆకట్టుకోవాలనే అభిమానిని కాదు... మెచ్యూరిటీ గల మీలాంటి అమ్మాయిలు అలా చేయడం అభిమానించదగ్గ విషయం కాదని మీరు అంగీకరించాలి."

    "ఎక్స్ ట్రీమ్లీ సారీ!"

    "అలా అంటే చాలా?"

    "సారీ చెప్పాను కాబట్టి మీరు నన్ను క్షమించాలి" అతడి పరిచయం చేజారిపోవడం యిష్టం లేనట్లు ఆందోళనగా అంది.

    "క్షమించలేను మిసెస్ ఆర్తీ! రైట్ ట్రేక్ లో మీరు నా పరిచయం కోసం ప్రయత్నించలేదు గాబట్టి రైటర్ రూట్ లో మీకు శిక్ష విధించాలనుకుంటున్నా. అదీ మీరు అనుమతిస్తే."

    అతి గొంతులోని సంస్కారం ఆమెనెంత ఆకట్టుకుందీ అంటే "ఓకె" అంది. "అయినా రైటర్ ట్రేక్ లో శిక్ష విధించడమూ అంటే?"

    "చేతిలో కలం అలాగే నిలిచిపోయింది.

    చివర లేని ఆలోచన సాగిపోయింది.

    ఏదో రహస్యం నన్నావరించుకుంది.

    అపుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది...."

    ఆగాడు తేజ.

    ఓ కవితలా కాక తన ఉనికిని అతడు భావుకంగా చెప్పినట్టు అనిపించిన ఆమె "ఇది తిలక్" గుండె కింద  నవ్వు' కవితలోనిది కదూ?"అంది.

    "గూడ్! మీకూ కవితలు చదివే అలవాటుందని  బోధపడింది కాబట్టి క్విజ్ లా మీకో ఎక్సర్ సైజ్ యిస్తాను."

    "నేను రెడీ."

    "నేను  సి నా రె రాసిన నాలుగు పంక్తుల్ని చెబుతాను. ఆ కవిత సి నా రె రాసిన ఏ కావ్యంలోదో చెప్పాలి."

    రైట్ ట్రేక్ లో కాక రైటర్ ట్రేక్ లో శిక్ష విధించడమంటే ఏమిటో బోధపడింది.

    "చెప్పండి."

    "అటు నవ్విందొక అందె
    ఇటు నవ్విందొక మలిసందె
    అటు పలికిందొక కుసుమ శలాక
    ఇటు పలికిందొక మదనపతాక"
 

 Previous Page Next Page