"బాగుంది" ఇద్దరిమధ్యా పరిచయానికి సంబంధించిన ఓ కవితని అందంగా అతడే చెప్పినట్టుగా అనిపించడంతో నిట్టూర్పుగా అంది "ఈ కవిత ఎందులోదో చెప్పాలి.అంతేగా?"
"అవును."
"చెబుతాను."
"గూడ్!"
"కానీ ఇది నేను శిక్ష అనుకోకు" నవ్వేసిందామె. "ఒక మాస్టారు మంచి మనసుతో యిచ్చిన హోంవర్కుగా భావిస్తాను"
"థేంక్యూ అండ్ బై."
ఫోన్ క్రెడిల్ చేశాడు తేజ.
బడలికగా రివాల్వింగ్ చైర్లో వాలిపోయాడు.
ఏ రచయితకైనా అభిమానులుండటం అసహజం కాదు.
కానీ ఇలాంటి అభిమానులుండటం అరుదు! తనను అభిమానించే అభిమానుల్లో కొద్దిమందిని రచయిత అభిమానిస్తే అందులో ఆర్తిలాంటివాళ్లు బహుకొద్దిమంది.
"ఆర్యూ ఓకె?"
ఎవరో పలకరించినట్లయి ఆలోచనలనుంచి తేరుకున్నాడు తేజ.
ఎదురుగా అప్పటికే కూర్చుని వున్నాడు శ్రీమంత్. తేజాకి బాల్య స్నేహితుడు మాత్రమేకాక ప్రస్తుతం ఏడ్ ఏజన్సీని నడుపుతూ బాగా ఎదిగిన వ్యక్తి.
"నువ్వొచ్చి ఎంతసేపైందిరా?"
"అంటే అంత ఒళ్లు తెలీకుండా లేడీ ఫాన్స్ తో హస్కులో మునిగి పోయావన్నమాట?"
"ఎప్పుడూ వుండేదేగా అన్నయ్యా" అంటూ భాను కాఫీ కప్పుల్తో వచ్చింది.
బాల్యం మొదలుకుని యూనివర్శిటీదాకా కలిసే చదువుకున్న శ్రీమంత్ , తేజాలు ఎంత మంచి స్నేహితులో తెలిసిన తేజా భార్య భాను శ్రీమంత్ ని సొంత అన్నలానే ట్రీట్ చేస్తుంది.
"అలా నువ్వు సరిపెట్టుకుంటే చాలదమ్మా! వీడు సామాన్యుడు కాడు" శ్రీమంత్ జోక్ వేయడమేకాదు కాలేజీ రోజుల్లోనే తేజా కవితలకి అమ్మాయిలెలా రియాక్టయ్యేవారో గుర్తుచేసుకుంటూ అన్నాడు "ఎప్పుడూ కాపలాగా నేనుండలేనుగా. వాడ్ని నువ్వే కాపాడుకోవాలి."
"భయం లేదన్నయ్యా! ఈయన వట్టి పీటర్ టైగర్" నవ్వేసింది భాను.
"అంటే నిన్నంతగా నమ్మించగలిగాడన్నమాట."
"ఇక నోర్ముయ్యవోయ్! వచ్చిన పని చెప్పు."
ఎప్పుడూ బిజీగా వుండే శ్రీమంత్ వున్నట్టుండి ఇలా ఊడిపడటమూ, తేజాతో ఇలా అల్లరిగా ప్రవర్తించడమూ మామూలే.
"మరేం లేదురా! మా ఏడ్ ఏజన్సీ యానివర్సరీ వుంది ఈ నెల పదహారో తేదీన. నేను డీల్ చేసే కొందరు కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ తో బాటు నాకు తెలిసన స్నేహితుల్ని పిలుస్తున్నాను. పెద్ద హడావుడి చేయడం లేదు. చిన్న గెట్ టు గెదర్ లాంటిది ఏర్పాటు చేశాను కృష్ణ ఓబరాయ్ లో. నువ్వూ రావాలి."
"నేనెందుకురా?" తేజా పేరున్న రచయితయినా పబ్లిక్ ఫంక్షన్స్ కి దూరంగా వుంటుంటాడు. "నీకు తెలుసు ఇబ్బందికరంగా వుంటుందని."
"అలా అంటే లాభంలేదు. నువ్వొచ్చితీరాలి" మొండిగా అన్నాడు శ్రమంత్. సమీపంలో భాను లేకపోవడం చూసి రహస్యంలా అడిగాడు "ఇందాకటి అభిమాని ఎవరు?ఎలా వుంటుంది?"
"షటప్" నవ్వేశాడు తేజ "ఆమె ఎవరో, ఎలా వుంటుందో కూడా నాకు తెలీదు. పైగా అభిమానుల్ని నేను అలాంటి దృష్టితో చూడనని నీకు తెలుసు."
"నేను అలాంటి దృష్టితో చూసే అలవాటున్నవాడినని నీకు తెలుసు కదరా!చెప్పవోయ్" మరింత ఉత్సాహాన్ని ప్రదర్శించాడు శ్రీమంత్.
శ్రీమంత్ ఇప్పుడే కాదు - కాలేజీ రోజుల్నుంచీ యింతే! పెళ్లయీ ఓ ఆడపిల్ల తండ్రయినా యిప్పటికీ ఉమనైజరే.
ఆ విషంలో తేజా చాలాసార్లు హెచ్చరించాడు కాని ఫలితం లేకపోయింది.
ఒకటి రెండుసార్లు శ్రీమంత్ ని అతడి భార్య అనుమానించి రాద్దాంతము చేస్తే తనే వాళ్ల గొడవని సెటిల్ చేశాడు కూడా.
"మొత్తానికి నాకన్నా నువ్వు అదృష్టవంతుడివిరా..." అన్నాడు శ్రీమంత్.
"ఏ విషయంలో?"
"నువ్వేం చేసినా మా చెల్లాయి నమ్మదు."
"నమ్మకపోవటానికి కారణం నీలా నేనేమీ చేయను కాబట్టి."
"అయితే ఆ మాత్రం ఒకటీ ఆరా చేస్తే మాత్రం తప్పేమిటోయ్?"
"చూడు శ్రీమంత్!" మృదువుగా అన్నాడు తేజ "ఇప్పటికి యిదే విషయాన్నిమనం చాలాసార్లు చర్చించుకున్నాం. సో..... నన్ను ఎంకరేజ్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు."
"నీ మొహం... నేను ఎంకరేజ్ చేయడం లేదు."
"మరి?"
"నీలో కొంపదీసి ఏమన్నా మార్పుగాని వచ్చిందేమో అని చెక్ చేస్తున్నా."
"ఏడిశావ్" ఫకాల్న నవ్వుతూ అన్నాడు తేజ. "రైట్ ...నేను అర్జెంటుగా రాసుకోవాలి కాబట్టి యిక నువ్వు నోర్మూసుకుని బయలుదేరితే బెటరు."
ఇద్దరి మధ్యావున్న చనువుతో ఇంచుమించు బయటికి నెట్టినంత పనిచేశాడు తేజ.
"అమ్మా భానూ! పదహారో తేదీన వీడ్ని పంపించే పూచీ నీది అంటూ భానుకి చెప్పి వెళ్లిపోయాడు శ్రీమంత్.
"భోం చేయరూ?" అంది భాను ఇంకా టేబుల్ ముందే కూర్చుని ఏదో ఆలోచిస్తున్న భర్తని చూస్తూ.
"వీక్లీ సీరియల్ ఇన్ స్టాల్ మెంట్ రాయాలి."
రెప్పలార్పకుండా చూసింది రెండు నిమిషాలపాటు.