ఇంతవరకు ఆ ఇంటి స్త్రీలను పరాయి పురుషులెవరూ చూసి ఎరుగరు ఎక్కడికి వెళ్ళాలన్నా పల్లకీలుండేవి., పల్లకీలుపోయి కార్లొచ్చినా కారు కిటికీలకీ పరదాలుండేవి!
సౌదామినికి పరదా అంటే తెలియదు. నైటీ వేసుకొని కూడా ఫ్రీగా తిరుగుతుంది. తనకంటూ ప్రత్యేకంగా ఓ కారున్నా ఒక్కోసారి నడిచి ఊరవతలికి షికారువెళ్ళేది. కూనిరాగాలు తీస్తూ నడిచేది.
ఆమెను పెళ్ళి చేసుకోవడానికి మోహనవంశీకి ఎటువంటి అభ్యంతరం లేకపోయినా ఆ పెళ్ళి ప్రపోజల్ కు తీవ్రంగా అభ్యంతరం తెలిపింది సౌదామిని.
"ఏదో లైసెన్స్ బిళ్ళలా ఆ తాళికట్టుకోడాలు, మంత్రాలు నాన్సెన్స్. ఒకరి మీద ఒకరికి ప్రేమున్నంత వరకు కలిసి ఉండాలి. తరువాత ఎవరి దారి వారిది" అనేస్తుంది.
సాంఘిక నిబంధనలూ, నీతి నియమాలూ - వీటిపట్ల ఏమాత్రం లక్ష్యం లేదు. అవన్నీ మనిషి కల్పించుకొన్న కృత్రిమ బంధనాలు. మనిషి తనకై తాను పంజరం నిర్మించుకొని అందులో బందీ ఎందుకు కావాలి? మనిషికి స్వేచ్చవుంటే ఏం లేకపోయినా అన్నీ వున్నట్లే.
అదీ, జీవితం పట్ల సౌదామినికున్న అభిప్రాయం.
నిజమే! ఈ ప్రపంచంలో మనిషికి స్వేచ్ఛాజీవి కావడం కంటే మించిన అదృష్టం లేదు. కాని, మనిషి అడవిలో లేడు. ఆకులలములు కట్టుకునే అటవిక దశలో అసలు లేడు. మనిషి సామూహికమైన జీవితం కోరుకొన్నప్పుడు చట్టాలు, నిబంధనలూ అవసరమౌతాయి. తనకై తాను చుట్టూ చువ్వల్ని నిర్మించుకొనే అవసరం తప్పకుండా వస్తుంది.
సౌదామిని దీనికి అతీతం కాలేకపోయింది.
ఆమెకు నెల తప్పింది!
మోహనవంశీ ఖచ్చితంగా చెప్పాడు. "నువ్వు అవివాహితగా నా సంతానానికి తల్లివైతే అది అక్రమ సంతానంగా ఈ సమాజం పరిగణిస్తుంది. ఆ పరిస్థితిని నేను ఎంతమాత్రం సహించను. నీకు నా వల్ల పుట్టే సంతానానికి చట్ట సమ్మతంగా నాకు తండ్రి హోదా కల్పించలేనంటావా, అబార్షన్ చేయించుకో!"
సహజంగా సౌదామినిది మృదుహృదయం. కుక్కల్ని, పిల్లుల్ని సైతం అపారంగా ప్రేమిస్తుంది. అలాంటిది తన కడుపులో జీవం పోసుకుంటున్న ప్రాణిని ప్రేమించలేదా? తనకి పిల్లలే వద్దనుకొంటుందా?
వివాహానికి అంగీకరించక తప్పలేదు సౌదామినికి.
అయితే ఆర్భాటం, హంగామా ఏం లేకుండా ఏ గుళ్ళోనో పెళ్ళయిందనిపించుకొందా మనుకొంది.
దానికి అంగీకరించాడు మోహనవంశీ.
ఒక దేవాలయంలో వారి వివాహం ముక్తసరిగా జరిగింది.
పెళ్ళయ్యాక గ్రాండ్ గా రిసెప్షన్ ఇద్దామన్నాడు మోహనవంశీ.
"బాగుంది! ఇంతకాలం కలిసి వున్నాం. ఇప్పుడు కడుపుతో ఉన్నాక పెళ్ళి చేసుకొన్నామహో అని దండోరా వేయడానికన్నట్టు పెళ్లి రిసెప్షన్ ఇస్తే నవ్వుతారు. నాకీ కృత్రిమ మర్యాదలే నచ్చవు. ఆర్బాటం అసలు నచ్చదు" అంది సౌదామిని.
రాజసాబ్ ఉంచుకున్న మనిషిగా ముద్రపడ్డ సౌదామిని ఆ ముద్ర పోగొట్టే ప్రయత్నం ఏం చేయలేదు. వారి వివాహం గురించి ధర్మలింగం వంటి కొందరు ముఖ్యులకే తెలుసు.
ఊళ్ళో జనం ఇప్పటికీ రెండు రకాలుగా అనుకొంటారు. రాజసాహెబ్ ఆమెను గుళ్ళో వివాహం చేసుకొన్నాడని కొందరు, ఆ... అలాంటిదేం లేదు అని కొందరూ! ఎందుకంటే పుస్తె మట్టె ఆమె మీద ఎవరూ చూడలేదు.
సౌదామినికి కొడుకు పుట్టాడు.
లండన్ లో వ్యాపారరీత్యా స్థిరపడ్డ ఆమె అన్నగారి దగ్గర పురుడు పోసుకొని బాబుకు అయిదోనెల వచ్చాక తిరిగి వచ్చింది. బాబుకు వికాస్ చంద్ర అని పేరు పెట్టారు. ముద్దుపేరు వికీ. ఆరేళ్ళ వరకే వాడు ఇక్కడ వున్నాడు. తరువాత పెద్ద మేనమామ వచ్చి తనతో లండన్ తీసుకుపోయాడు. అతడి విద్యాభ్యాసం అక్కడే సాగుతుంది. మొదట మొదట ఏడాదికోసారి వచ్చేవాడు కాని రాను రాను అతడి రాకపోకలు తగ్గాయి. సౌదామినే బోర్ కొట్టినప్పుడల్లా కొడుకుని చూసే నెపంతో లండన్ వెళ్లి రెండు మూడు నెలలు ఉండివచ్చేది! మోహనవంశీ ఆయన చేస్తున్న వ్యాపారరీత్యా వెళ్ళినప్పుడు కొడుకుని చూసి వచ్చేవాడు.
మోహనవంశీ కూడా ఇప్పుడు ఎక్కువగా ఇంటి పట్టునుండటం లేదు. బిజినెస్ లో పడ్డాడు. తరుచూ ఆ పనిమీదే బయట తిరుగుతుండేవాడు.
ఇక సౌదామిని ప్యాలెస్ లో వున్నా, లేకున్నా హడావిడేమీ ఉండదు.
ఆ ఇంటి వైభవం రాజ్యలక్ష్మితోనే అంతరించిపోయిందనుకొంటారు జనం.
ఆమె వున్న రోజుల్లో నవరాత్రులని, శ్రావణమాసమని, కార్తీకపూజలని నోములు వ్రతాలని, సంతర్పణలని సంవత్సరం పొడువునా ఏదో ఒక హడావిడి జరుగుతుండేది. ప్రతి విజయదశమికీ బంగళా మొత్తం వెల్లవేయబడేది. చక్కగా రంగులతో తీర్చిదిద్దబడేది. రాత్రిపూట దీపతోరణాలు వ్రేళాడగట్టబడేవి. శమీపూజకు మోహనవంశీ వెళ్ళడం సంప్రదాయంగా ఉండేది! ఆడ, మగ, చిన్న పెద్ద భేదం లేకుండా ఊరి జనం ఆయనవెంట నడిచేది.
'గంధర్వ' లో ఏ సందడి జరిగినా ఊరంతా ప్రాకిపోయేది.
ఇప్పుడవన్నీ బంద్!
సౌదామిని నాస్తికురాలు కాకపోయినా పూజలు పునస్కారాలు పట్ల నమ్మకం లేని మనిషి, సంప్రదాయాలకీ, సెంటిమెంట్లకీ ఆమడ దూరంలో వుంటుంది.
ఎప్పుడైనా సిటీ నుండి ఆమె ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, లేదా రాజాసాబ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు 'గంధర్వ' లో సందడి కనిపించేది. మిగతారోజుల్లో చడీచప్పుడుండేది కాదు. అప్పుడున్న పనివాళ్ళు సైతం ఇప్పుడు చాలావరకు తగ్గించబడ్డారు.