Previous Page Next Page 
నిషా పేజి 20

    వారిద్దరి మధ్య బేరసారాలు తమాషాగా సాగుతుండగా తుంగభద్ర వచ్చింది. "అమ్మగారు పిలుస్తున్నారు. రండి! చినబాబూ"

    "కథ విని వస్తానాగు!"

    "రమ్మంటుంటే, అమ్మగారు కోప్పడతారు"

    "ఉండనీ కాస్సేపాగి వస్తాడు!" అంది సౌదామిని

    "అమ్మగారు తీసుకురమ్మన్నారమ్మా!" బాబును బలవంతంగా ఎత్తుకుపోయింది తుంగభద్ర. సౌదామిని ముఖం అవమానంతో పాలిపోయినా లక్ష్యపెట్టలేదు.

    సౌదామిని నుండి ఫిర్యాదు అంది, చాలా రోజుల తరువాత రాజ్యలక్ష్మి గదిలోకి అడుగుపెట్టాడు మోహనవంశీ,  "ఇంత సంస్కారం లేకుండా ప్రవర్చించడం ఎప్పుడు నేర్చుకొన్నావు? బాబుతో సౌదామిని ఆడుకొంటుంటే ఎందుకు పిలిపించుకున్నావు! సౌదామినిని అవమానించే అధికారం నీకెవరిచ్చారు?" పిడుగులు రాలుస్తున్నట్టుగా అడిగాడు. బాబుతో ఆడుకోవడం కాదు! ముట్టుకొనే అర్హత కూడా ఆమెకు లేదు బజారు మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టిందికాక, ఆమె తరపున వచ్చి నాతో పోట్లాడడానికి మీకు సిగ్గేయడం లేదా?

    "సౌదామిని బజారు మనిషా?"  అతడికి ఆపుకోలేని ఆగ్రహం వచ్చింది రాజ్యలక్ష్మి చెంప ఛెళ్ళుమంది. "ఆమె ఎవరనుకొన్నావు? కోటీశ్వరుడి కూతురు! స్టేట్స్ లో ఇంజనీరింగ్ చేసింది!"

    "కోటీశ్వరుడి కూతురైతేనేం? ఇంజనీరింగ్ చేస్తేనేం? ఒక వివాహితుని తగులుకొని వచ్చిందంటే ఆమె సంస్కారం ఏమిటో తెలుస్తూనే వుంది కదా?" అతడి చేతి దెబ్బను లక్ష్యపెట్టకుండా తన ఆగ్రహాన్ని వెల్లడించింది.  "బజారు మనుషులను ఇంటికే తీసుకొచ్చి వంశ పరువుమర్యాదలనే మంటగలిపారు!" 

    "ఇంటి పరువు మర్యాదల గురించి ఆలోచించడానికి ఇంకా నేను బ్రతికేవున్నాను!"

    "ఒక స్త్రీకి భర్తగా మీరెప్పుడో చచ్చిపోయారు. ఒక ఇంటికి గృహస్థుగా మీరు చచ్చిపోయారు. మిగిలింది లంపటుడు! వేశ్యాలోలుడు!" కసి వెళ్ళబోసింది రాజ్యలక్ష్మి.

    "ఇంకొక్కమాట మాట్లాడితే నేను సహించేది లేదు! సౌదామిని నాకు కాబోయే భార్య. త్వరలో ఆమెను వివాహమాడబోతున్నాను. ఇకపై హద్దులు తెలిసి మాట్లాడు!" విసురుగా వెళ్ళిపోయాడు మెహనవంశీ.

    అంతే! ఇక ఒక్కక్షణం ఆగలేదు రాజ్యలక్ష్మి. తన మెడలో మాంగల్యాలు తీసి ఏడువారాల నగలున్న పెట్టెలో పడేసి, కట్టుగుడ్డలతో కొడుకునెత్తుకొని వెళ్ళి కారులో కూర్చుంది.

    డ్రైవర్ని పిలిచి కారుని తన పుట్టింటికి పోనివ్వమంది!

    "దొరవారికి చెప్పివస్తానమ్మా!" డ్రైవరు వెళ్ళి మెహనవంశీకి చెప్పాడు. అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోతున్నారని.

    సౌదామిని అక్కడేవుంది! ఈ విషయం విని కలతపడింది "ఆవిడ వెళ్ళిపోతున్నారా? ఏం జరిగింది? ఏమన్నావు, మోహన్ ఆమెను?"

    మోహనవంశీ సమాధానం చెప్పకుండా సరసరా క్రిందికి వచ్చాడు. కోపంగా కారుని సమీపించి కఠినంగా అన్నాడు  "హనీని ఇక్కడే విడిచి వెళ్ళు!"

    రాజ్యలక్ష్మి ముఖం పాలిపోయింది. ఏది జరుగుతుందని భయపడిందో అదే జరుగుతుంది! రాజ్యలక్ష్మి గుండె రాయి చేసుకొంది! హనీని ఒళ్లో నుండి క్రిందికి దింపబోయింది!

    ఎప్పుడు వచ్చిందో సౌదామిని, మోహనవంశీని ప్రక్కకు త్రోసి రాజ్యలక్ష్మి చేతులు పట్టుకొంది! "మీరు దిగండి రాజ్యలక్ష్మి గారూ, నా కారణంగా మీరు వెళ్ళిపోతే నాకు బాగుండదు. నేనే వెళ్ళిపోతాను. ఇప్పుడే ఈ క్షణం."

    "నువ్వు వున్నా పోయినా ఆ ఇంట తీసిన కాలు మళ్ళీ పెట్టను! ఈ జన్మకు ఈ ఇంటితో రుణం తీరిపోయింది" తిరస్కరించింది రాజ్యలక్ష్మి.  "హని నాదగ్గరే పెరగాలనుకొంటే ఇచ్చేయండి. తీసికెళ్ళిపోతాను! లేదంటే ఒక్కదాన్నే వెళ్ళిపోతాను"
 
    కొడుకును అందుకోబోయాడు మోహనవంశీ.

    "నువ్వేమిటి ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు., మోహన్! తల్లీ కొడుకుల్ని ఎడబాపడానికి మనస్సెలా ఒప్పుతూంది?" అన్న సౌదామిని మాటతో ఆగిపోయాడు.

    "పోనీయ్ డ్రైవర్!" రాజ్యలక్ష్మి అంది.

    నౌకర్లు కళ్ళప్పగించి చూస్తుండగా కారు కదిలి వెళ్ళిపోయింది. అమ్మగారు లేని ఈ రాజభవనం దేవుడు లేని కోవెల అని, ఆమె లేని చోట తాము పనిచేయలేమని వాళ్ళలో వాళ్ళు గొణుక్కుని కన్నీళ్ళు పెట్టుకోసాగారు.

    సౌదామిని కూడా కన్నీళ్ళ పర్యంతమైంది. "నీతో నాకు ఏర్పడిన అనుబంధం మీ భార్యాభర్తలను ఎడబాపేదవుతుందనుకోంటే నేనిక్కడికి వచ్చేదాన్ని కాదు మోహన్! నావల్ల రాజ్యలక్ష్మి గారికి చాలా ద్రోహం జరిగింది."

    "నువ్వు రాకపోతే నీ బదులుగా ఇంకొకతె వచ్చేది! మా మధ్యకు ఎవరో ఒకరు తప్పకుండా రావలసిందే! నా మనసులో చోటు సంపాదించి అది నువ్వయ్యావు! అనవసరంగా బాధపడకు. శీలం పాతివ్రత్యం అని వాపోయేవాళ్ళు తాము సుఖపడరు. ఒకరిని సుఖపడనివ్వరు. వెళ్ళనీ! ఆమె స్వయంకృతం ఆమె అనుభవిస్తుంది. దానికి నువ్వు కారణమయ్యావని బాధపడడం ఫూలిష్ నెస్!" ఓదార్పుగా ఆమె భుజం తట్టి., నడుంమీద చెయ్యేసి పైకి నడిపించుకుపోయాడు మోహనవంశీ.

    ఆ క్షణంలో పనివాళ్ళ కళ్ళలో మెదిలిన ఏవగింపు చూసివుంటే సౌదామిని తప్పకుండా పారిపోయేది.

    ఇక్కడ సౌదామిని గురించి కొంచెం చెప్పాలి.

    సౌదామినిది ఒక విచిత్రమైన మనస్తత్వం! అవివాహితగా వుండి ఒక వివాహితుడితో సంబంధం పెట్టుకు వచ్చేసిందని మొత్తం మనిషే చెడ్డదనలేం! ఆమె మనసు వెన్నకన్నా మెత్తనిది! అవడానికి ఒక కోటీశ్వరుడి కూతురైనా, ఆమె చదువు సంధ్యలు విదేశంలో సాగినా మనిషి చాలా సాదాసీదాగా వుంటుంది. బంగారం మీద మోజుకాని, మంచి మంచి దుస్తులు ధరించాలని కానీ అనుకోదు పని వాళ్ళు చూస్తుండగా నేలమీద చతికిలబడుతుంది. అందరితో చనువుగా మాట్లాడుతుంది. దర్పంగా ప్రవర్తించాలని ఎప్పుడూ అనుకోదు.

 Previous Page Next Page