"జానీ! మనం కలిసినప్పుడల్లా మీ తెలుగులోనే మాట్లాడుతూ ఉండు. అప్పుడు నా తెలుగు కూడా ఇంకాస్త పాలిష్ అవుతుంది. అది నాకు ఎంతో అవసరం!"
ఇంగ్లీషు వాడయిన తను 'అబ్రహాం' అనే తనపేరుని 'అభిరాం' అని మార్చుకోగా, ఇండియన్ అయిన ఇతను 'జనార్ధన్' అనే పేరుని 'జొనాధన్' గా, దాన్ని జానీగా మార్చుకోవడం అతనికి తమాషాగానే అనిపిస్తోంది.
తెలుపుని నలుపుగా, నలుపుని తెలుపుగా చూపించే ప్రయత్నంలాగా లేదు ఇదీ!
ఏదో పాతకాలపు ఫొటో ఆల్బంలోనుంచి వూడిపడ్డట్టుగా ఉంది జానీ గెటప్పు. అతనిలో తెలుగు పోలికలు తక్కువ. ఏ స్పానిష్ వాడంటే తేలిగ్గా నమ్మేయవచ్చును. జానీ వేసుకున్న సూటు పాత స్టయిల్లో ఉంది. కోటు ముందువైపు నడుము దాకానే కత్తిరించి ఉంది. వెనకవైపేమో మోకాళ్ళదాకా వస్తోంది. అలా తోకలాగా కనబడుతూ ఉంటుంది కాబట్టే దానిని 'టెయిల్ కోట్' అంటారు. పాతకాలపు ఇంగ్లీషు వాళ్ళకి ప్రీతి పాత్రం! నెత్తిమీదేమో టాప్ హ్యాటు!
ఇండియన్ అయిన జానీ వేసుకున్న ఆ సూటు చూసి నవ్వుతూ ఒక సాంగ్ హమ్ చేశాడు అభిరాం.
"ఏ సూట్ మేరా దేఖో,
ఏ బూట్ మేరా దేఖో,
జైసా గోరా కోయీ లండన్ కా..."
"ఈ డ్రెస్సులో నువ్వు అచ్చంగా లండన్ నుంచి ఊడిపడ్డ ఒక దొరలాగే వున్నావులే!" అని, ఇంకా పెద్దగా నవ్వాడు అభిరాం మళ్ళీ.
"డ్రస్సు ఏదయినా అడ్రస్సు మాత్రం కేరాఫ్ ఇండియానే! నాకు దేశభక్తి మహా ఎక్కువ!" అన్నాడు జానీ, తమాషాగా వంగి అభివాదం చేస్తూ.
ఆ హోటల్ 'గోరా' లోనుంచి ఒక పాట స్పీకర్స్ లో నుంచి పెద్దగా వీధిలోకి వినబడుతోంది.
"అంబరాన సంబరాన విహరించే జెండా -
విస్తరించు మువ్వన్నెల విశ్వంభర నిండా!"
ఆకాశవాణిలో వినబడుతూ ఉండే గొప్ప భావపూరితమైన గీతం!
'మన హోటల్ గోరాలో ఇవాళ ఇండియాడే సెలబ్రేషన్స్ సర్!" అన్నాడు జానీ, అభిరాంని లోపలికి ఆహ్వానిస్తూ.
లోపలికి వెళ్ళీ వెళ్ళగానే అభిరాం దృష్టిని ఆకర్షించిన విషయం -
అక్కడి డెకరేషన్ అంతా భారత జాతీయ జెండాలతోనే!
అయితే -
ఆ జెండాలు అన్నీ కూడా, ఎక్కడెక్కడ ఉంచరాదో, అట్లాంటి స్థలాలలో ఉంచి వున్నాయి.
అతి అవమానకరంగా!
జాతీయజెండాని ఎక్కడ ఉంచాలీ, ఎలా వుంచాలీ, ఎక్కడ ఎలా ఎగరవేయాలి అన్న విషయంలో చాలా నియమాలు వున్నాయి.
కానీ -
ఆ నియమాల గురించి తెలిసినవాళ్ళే తక్కువ!" ఇవాళ ఇక్కడ ఇండియాడే సెలబ్రేషన్స్ - ఇవాళ్టి థీం- ఇండియన్ ఫ్లాగ్!" అన్నాడు జానీ, అపహాస్యంగా నవ్వుతూ.
అక్కడ భారత జాతీయ జెండా డోర్ కర్టెన్లుగా వేళ్ళాడదీసి వుంది.
టేబుల్స్ మీద టేబుల్ మ్యాట్ ల లాగా చిన్న చిన్న పతాకాలు పరచి వున్నాయి!
కార్డ్స్ ఆడే టేబుల్ క్లాత్ లాగా కూడా ఇండియన్ ఫ్లాగే!
అంతలో - నల్లగా, చింతమొద్దులా ఉన్న ఒకడు వెకిలిగా నవ్వుతూ వచ్చి, మోటు హాస్యం ప్రదర్శించడం మొదలెట్టాడు.
ఛాతీమీద ఆచ్ఛాదన లేదు. లుంగీలాగా ఒక పెద్ద జెండాని చుట్టుకుని ఉన్నాడు.
భారత జాతీయ జెండా!
కోపాన్ని దిగమింగుతూ, ఇదంతా చూస్తున్నాడు విక్రమ్ సింగ్.
అతను ఆ హోటల్ కి మేనేజరు.
అతనికి ఒక విషయం గుర్తు వచ్చింది. ఇండియన్ సినీస్టార్స్ గ్రూపు ఒకటి గల్ఫ్ కంట్రీస్ లో ప్రోగ్రాములు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, అక్కడ మన హాస్యనటుడు ఒకడు జాతీయ జెండాని అపహాస్యం చేస్తూ ఆడి పాడి, అక్కడి ఆహ్వానితులని ఆనంద డోలికలలో ఓలలాడించాడు.
ఎందుకూ?
ఇండియా పేరు చెబితేనే మండిపడే కొంతమంది అండర్ వరల్డ్ డాన్ లకి భయపడి!
ఆ సంఘటన గురించి అప్పట్లో సెన్సేషనల్ గా వార్తలు వచ్చాయి. అంతే అంతటితో సరి!
కొన్నాళ్ళలోనే ఆ న్యూసు పాతబడిపోయింది. ఇంకేదో కొత్త సెన్సేషన్ దొరికింది. అది పత్రికలలో స్పేస్ ని ఆక్రమించడం మొదలెట్టింది.
కొత్త ఒక వింతా- పాత ఒక రోతా అని కదా అంటారూ! దానికితోడు పబ్లిక్ మెమొరీ ఈజ్ షార్ట్ - వెరీ వెరీ షార్ట్! ప్రజలు అంత సులభంగా మర్చిపోగలుగుతూ ఉండడం వల్లనే కదా ప్రభువులు ఎన్ని తప్పిదాలు చేసినా కూడా ఎప్పటికప్పుడు తప్పించుకు తిరగగలుగుతున్నారు!
ఒక గల్ఫ్ కంట్రీలో ఒక హాస్యనటుడు మన జాతీయపతాకాన్ని అపహాస్యం చేస్తూ ఆడిపాడిన వార్త పాతబడ్డాక మళ్ళీ అంతా షరా మామూలే! పట్టించుకునే నాథుడే లేడు!
అంతకుమించిన అవమానం ఇక్కడే కొందరు ఇండియన్సు నడిపే ఈ హోటల్ 'గోరా'లో జరిగిపోతోంది.
'గోరా' అంటేనే తెలుపు. తెల్లదొరల కోసం నల్ల దొంగలు నడుపుతున్న హోటల్ ఇది.
అంతటితో అయిందా? లేదే!
జానీ చెప్పడం మొదలెట్టాడు.
"ఇప్పుడు అసలు సిసలైన రసవత్తర ఘట్టం మొదలవుతుంది" అని ఒక్కక్షణం ఆగి, "అభిరాం సర్ ఇక్కడికి వస్తూ గూడెం, కాలనీల మధ్య జరిగిన గలాటా చూశారు.
రెండు కుక్కల రొమాన్స్ గురించి రెండు వర్గాల మధ్యన కుక్క తగవులు!
ఈ దేశం బాగుపడదు. లేడీస్ అండ్ జెంటిల్మన్! ఎప్పటికీ బాగుపడదు! చూస్తూ వుండండి! కుక్కలు చింపిన విస్తరిలాగా అయిపోతుంది." అన్నాడు జానీ ఆనందంగా.
ఆ తర్వాత, "కమాన్ భరత్!" అని చిటికెలు వేశాడు.
తక్షణం ఒక ఊరకుక్క తోక ఊపుకుంటూ వచ్చింది.
'ఇండియన్ డాగ్' అని రాసిన అట్టముక్క కట్టి ఉంది దాని మెడలో.
"బెగ్" అని కమాండ్ ఇచ్చాడు జానీ.
అడుక్కుంటున్నట్లుగా ముందు కాళ్ళు రెండూ పైకి ఎత్తింది కుక్క. అట్లాంటి ట్రైనింగు దానికి జానీనే ఇచ్చాడు.
"డౌన్ బాయ్!"
వెనక్కు తగ్గింది కుక్క.
"ప్లే డెడ్!"
చచ్చిపోయిన దానిలాగా వెల్లకిలా పడుకుంది.
అక్కడ ఉన్న అందరూ ఆ కుక్క చేష్టలు చూసి వినోదిస్తున్నారు.
ఒక్క విక్రమ్ సింగ్ తప్ప! అతని రక్తం సలసల మరుగుతోంది.
అదే సమయంలో వింతగా జానీ వైపు చూస్తున్నాడు అభిరాం.
తను తెలుసుకున్నంత వరకూ స్వాతంత్ర్య సమరంలో ఈ తెలుగువాళ్ళు ఎప్పుడూ ముందు వరుసలోనే వున్నారు.
ఇంగ్లీషువాళ్ళ తుపాకులకి ఎదుర్రొమ్ము చూపి ఎదిరించిన సాహసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు.
జాతీయ జెండాని రూపశిల్పి పింగళి వెంకయ్య.
కానీ - ఈ తెలుగువాడు జానీ అనబడే ఈ జనార్ధన్ కి ఇండియా అంటే ఇంత ద్వేషం ఎందుకో?
బెంగాలీబాబు అయిన నీదర్ చౌదరి కూడా అంతే గదా! అతనికి ఇంగ్లాండు తప్ప ఇండియా అంటే పడదు.
ఈ జానీగాడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఇంకా పూర్తిగా తవ్వి తియ్యాలి. అది తన తక్షణ కర్తవ్యం! అనుకున్నాడు అభిరాం.
ఇంతలోనే చాలా పెద్ద సైజు కేకు ఒకటి వచ్చింది.
నెరిసిపోయిన జుట్టులాంటి తెల్లటి రంగులో మెట్లు మెట్లగా ఉన్న జులపాల జుట్టులాంటి విగ్గు పెట్టుకుని, ఒక ఫాన్సీ కారెక్టరు ముందుకు వచ్చాడు. మోకాళ్ళ దాకా వచ్చి 'బ్రీచెస్' అనబడే ప్యాంటు వేసుకుని వున్నాడు. బ్రిటిష్ పాలన రోజుల నాటి జూబు పట్టిన బొమ్మలా!
అతని చేతిలో ఒక ఖడ్గం!
ఇండియా మ్యాపు షేపులో ఉన్న కేకుని అక్కడే బల్లమీద ఉంచారు.
"ఈ ఇండియా కేకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తలొక ముక్కా వచ్చేలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి" అన్నాడు హోటల్ మేనేజరూ, ఆ సీన్ లో మాస్టర్ ఆప సెరెమొనీస్ గా వ్యవహరిస్తున్న విక్రమ్ సింగ్ - పాఠం ఒప్పగిస్తున్నట్లు అయిష్టంగా
నిజమే!
ఈ ఇండియా ఒక అఖండ ఉపఖండంగా వుండడం అనేకనేక దేశాలకు ఇష్టం లేదు. ఇబ్బందికరంగా వుంది.
భారతదేశం ముక్కలు చెక్కలుగా కావాలని ఎందరికో కోరిక!
"స్వాతంత్ర్యానికి ముందు ఇండియా ఎన్నేసి సంస్థానాలుగా విడిపోయి ఉండేదో ఇప్పుడు మా 'ప్రిన్స్' విక్రమ్ సింగ్ చెబుతాడు" అన్నాడు జానీ.