Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 21


    రిపోర్టును మళ్లీ మళ్లీ చదివాడు ఇన్ స్పెక్టర్ వీరేష్.
    అతనికి దానిలో నేరం ఏమీ కనిపించలేదు. సాహితి ఆవేశం మాత్రం అక్షర రూపంలో కనిపిస్తున్నది!
    "చూడమ్మా సాహితీ! నేను మీ ఆంటీతో అన్ని విషయాలూ మాట్లాడి నీ సమస్యను పరిష్కరిస్తాను. ఈలోగా నువ్వు తొందరపడి తగవు పెట్టుకోవద్దు." తనకు ఎదురుగా కూర్చున్న సాహితిని ఉద్దేశించి సర్దుబాటు ధోరణిలో అన్నాడు వీరేష్.
    "నా ఆస్థిని నాకు అప్పజెప్పమనండి అంకుల్! ఆమెతో నాకు గొడవలెందుకు?" నిష్కర్షగా అంది సాహితి.
    నేటి యువత ఇలా తయారైంది! ఎవరేం చేయగలరు? ఏమని చెప్పగలరు? బాంధవ్యం, బాధ్యతలు అన్నీ వాళ్ళ దృష్టిలో వ్యాపార సరళిలనే ఉంటాయనిపించింది. నిట్టూర్చాడు వీరేష్.
    బిందుమాధవి తన హాండ్ బాగ్ తెరచి దస్తావేజులు, బాంక్ పాస్ పుస్తకాలు తీసి సాహితి చేతిలో పెట్టింది.
    సాహితి తండ్రి రావుగారు చనిపోయే ముందు రాసిన వీలునామా చదివిన సాహితికి ముచ్చెమటలు పోశాయి.
    ఆమెలో ఇదివరకటి ఆవేశం చల్లారిపోయింది. ఆ చోటును ఆందోళన ఆక్రమించుకుంది.
    "బ్యాంక్ లాకరులో నీ పెళ్ళికి చేయించిన నగలు దాచాను. వెళ్ళి చూసుకో!" అంటూ బిందుమాధవి లాకరు తాళంచెవిని ఆమె చేతిలో పెట్టింది.
    సాహితి తన చేతిలోని దస్తావేజులు, బాంక్ పాస్ పుస్తకాలు, లాకర్ తాళంచెవిని విసరికొట్టి ఆవేశంగా వెళ్ళిపోయింది.
    రావూస్ ట్రస్ట్ కు తన ఆస్తులన్నీ చెందేట్టూ, వాటి మీద వచ్చే రాబడితో ట్రస్టు ద్వారా పేద స్త్రీలకు జీవనోపాధిని కల్పించేట్టూ, ట్రస్టుకు వైస్ ప్రెసిడెంట్ గా, సాహితికి గార్డియన్ గా బిందుమాధవిని నియమించినట్టూ రావుగారు రాసిన వీలునామా చదివిన వీరేష్ ఆశ్చర్యపోయాడు.
    బ్యాంక్ పాస్ బుక్ లో లక్ష రూపాయాలు సాహితి పేరుమీద వున్నాయి.
    అవి బిందుమాధవి రచనలకు ఎడిటర్లు, పబ్లిషర్లు పంపిన పారితోషికాలని తెలుసుకోవడానికి ఇన్ స్పెక్టర్ కు ఎంతోసేపు పట్టలేదు.
    బిందుమాధవి మొదటినుంచి సాహితిని శ్రీమంతుల బిడ్డగానే పెంచింది.
    అసలు మొదటే సాహితి రావుగారి ఆస్తులకు వారసురాలు కాదని తెలియచేసి వుంటే ఈరోజున సాహితి ప్రవర్తన ఇంత అసహ్యకరంగా ఉండేది కాదేమో! వీరేష్ బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా ఆలోచించాడు.
    "సారీ మేడమ్! అనవసరంగా మిమ్మల్ని ఇబ్బందిపెట్టాం" నొచ్చుకున్నాడు.
    "సాహితి ఆవేశంలో చేసినదానికి మీరుమాత్రం ఏం చేస్తారు ఇన్ స్పెక్టర్!" అంది బిందుమాధవి.
    కాఫీ రావడంతో ఒక కప్పు ఆమెకు అందించి తనొక కప్పు తీసుకున్నాడు.
    "ప్రజా సంబంధాలను మీరు బాగా నిర్వహిస్తారనుకుంటాను!" కాఫీ అందుకుంటూ అన్నది బిందుమాధవి.
    "కాఫీ ఇచ్చినందుకు ప్రశంసా?" నవ్వుతూ అన్నాడు.
    "అబ్బే! అలా అని కాదు. సాహితి విషయంలో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని, నాకు ఫోన్ చేసి సమ్రాట్ విషయంలో సాహితిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారుగా! అందుకని అంటున్నాను."
    "అఫ్ కోర్స్! అది నా ధర్మం కాకపోయినా, సాటి మనిషిగా బాధ్యతతో మీకు తెలియజేశాను, అంతే!" అతని గొంతులో నిజాయితీ ధ్వనించింది.
    "అంత విపులంగా సాహితిని గురించి ఎప్పుడు తెలుసుకున్నారు?"
    "గౌతమి ఆత్మహత్య వెనుక సమ్రాట్ ప్రమేయం ఉందని నా అనుమానం. సాక్ష్యాధారాల కోసం ఇంకా దర్యాప్తు చేయాలి. అతని వలన మరొక ఆడపిల్ల జీవితం బూడిదపాలు అవుతుందేమోనన్న భయం, మీకు ఫోన్ చేయవలసి వచ్చింది."
    సాహితి విషయంలో అతనెంత శ్రద్ధ తీసుకున్నాడో బిందుమాధవికి ఇప్పుడర్థమయింది.
    "అయితే_ సమ్రాట్ ను మీ పోలీస్ శాఖ ఏమీ చేయలేదా? ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నదా?"
    "ఏం చెప్పమంటారు? సాక్ష్యం చెప్పడానికి ఎవ్వరూ ముందుకు రావడంలేదు. పైపెచ్చు అదృష్ట రేఖ అతని చేతిలో ఉంది! అధికారులను నమ్మిస్తున్నాడు. వాళ్ళ నీడ వజ్ర కవచంగా ఉంది. చిన్న ఉద్యోగిని. నేనేం చేయగలను చెప్పండి? పై అధికారులను ఎంతవరకు నమ్మించగలను? అయినా సమ్రాట్ ఏ ఆధారమూ దొరకనీయకుండా ముందు జాగ్రత్త పడినట్టనిపిస్తున్నది. న్యాయస్థానానికి సాక్ష్యాధారాలు ముఖ్యం కదా!" అతని స్వరంలో నిరాశా నిస్పృహలు ధ్వనించాయి.
    ఫోన్ మోగింది.
    "ఒక్క నిమిషం" వీరేష్ రిసీవరు ఎత్తాడు.
    ఫోనులో మాటలు వింటూ "ఎస్. సార్" అంటున్న అతని ముఖంలో వస్తున్న మార్పును గమనించింది బిందుమాధవి.
    ఇన్ స్పెక్టర్ విసురుగా ఫోన్ పెట్టేశాడు.
    "క్షణం కిందట అన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. ఎందుకొచ్చిన ఉద్యోగాలు? మనస్సాక్షిని చంపుకొని పనిచేయవలసివస్తున్నది" ఆవేదన వ్యక్తమయింది అతని స్వరంలో.
    సమ్రాట్ కు సాయంత్రం ఆడిటోరియంలో సన్మానం జరుగుతున్నది. దానికి డి.ఎస్.పి. మార్తాండ్, ఆయనగారి కూతురు కళ్యాణి వస్తున్నారు. పూలదండలు వగైరాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఇన్ స్పెక్టరుకు అప్పజెప్పాడాయన!
    విషయం తెలుసుకున్న బిందుమాధవి తెల్లబోయింది.
    "అంత పెద్ద ఆఫీసరు కుటుంబ సమేతంగా వస్తున్నారంటే, సమ్రాట్ కూ, వాళ్ళకూ ఏమైనా బంధుత్వం వుందా?" అనుమానంగా అడిగింది.
    "బంధువులూ కాదు, బీరకాయ పీచూ కాదు. అభిమానం పేరుతో వ్యక్తిత్వాన్ని చంపుకోవడం!" కసిగా అన్నాడు వీరేష్.
    అతను బయటకు వెళ్ళడానికి తొందరపడుతున్నట్టు గ్రహించింది బిందుమాధవి. లేచింది.
    "అన్నట్టు, మీరు నాకో సహాయం చేయగలరా మేడమ్?" సంశయంగా అడిగాడు.
    "నేను మీకు చేయగల సహాయం ఏముంటుంది చెప్పండి? చేతనైతే తప్పక చేస్తాను!"

 Previous Page Next Page