ఆమె మనసులో అలజడి ప్రారంభమైంది.
సరిగ్గా అదే క్షణంలో బయటకు వెళ్ళడానికి తయారయింది సాహితి.
"బయటకు వెళ్ళడానికి వీల్లేదు!" బిందుమాధవి ఆమె వెళుతున్నదారికి అడ్డుగా నిలిచింది.
"ఇప్పుడే వస్తాను ఆంటీ!"
సాహితీ ఆమెను తప్పించుకుని వెళ్ళాలనే ప్రయత్నంలో ఉంది.
"సాహితీ! ఆగు!" బిందుమాధవి గొంతు కంచు గంటలా మోగింది.
అనుకోనిది విన్నట్టు రెప్పపాటు కాలం సాహితి ఆశ్చర్యపోయింది. ఆమె ప్రవర్తన ఇవాళ చాలా కొత్తగా కనిపిస్తున్నది సాహితికి.
"ప్లీజ్ ఆంటీ! ఇవ్వాళ ఇంటికి తొందరగానే వచ్చేస్తాను, నన్ను బయటకి వెళ్ళనివ్వు..." అంటూ ప్రాధేయపడింది.
"వీల్లేదు. నోరు మూసుకుని ఇంట్లో పడివుండు!" దాదాపు అరిచినట్టు అంది బిందుమాధవి.
ఆమె ప్రవర్తనకు సాహితి కనుబొమలు ముడిపడ్డాయి.
"ఆంటీ! నువ్వు అనవసరంగా నా విషయాలలో అధికంగా జోక్యం కలిగించుకుంటున్నావు!" అంది పౌరుషంగా.
"ఏం కూశావే?" సాహితీ చెంప ఛెళ్ళు మంది.
ఆమె నునులేత చెంపలపై నీలి చారలు తేలాయి.
వణుకుతున్న చేతులతో సాహితి చెంప నిమురుకుంది. ఆమె కళ్ళలో నీరు చిమ్మింది.
"లేని బాధ్యతలు పులుముకుంటే చేదు అనుభవాలు ఎదురవుతాయి" అంటూనే కన్నీళ్లు తుడుచుకుని, కారు తాళాలు తీసుకుని విసవిసా బయటకు వెళ్ళిపోయింది సాహితి.
సాహితి పట్ల తన ప్రవర్తనకు తనమీద తనకే అసహ్యం వేసింది బిందుమాధవికి.
ఎంత తొందరపడింది తను! అనుకోని విధంగా జరిగిన సంఘటన ఇది.
సాహితిని కొట్టే హక్కు తనకెక్కడిది? గార్డియన్ గా ఉన్నంత మాత్రాన మరీ ఇంత తొందరపాటా? పొరపాటు జరిగింది అనుకుంది.
సాహితి ఆవేశంలో ఏ అఘాయిత్యం చేస్తుందో? ఆమెకు ఏదైనా కీడు జరిగితే? ఆమె మనసు విలవిల లాడింది.
సాహితి వెళ్ళిన అరగంటలోనే లాయరును వెంటపెట్టుకుని వచ్చింది.
బిందుమాధవి అవాక్కయింది. తను ఊహించనిది ఏదో జరగబోతున్నదనే భయం ఆమెను ఆవహించింది.
"నేటితో నీకూ నాకూ చెల్లు! ఈ ఇంటితో నీకు ఋణం తీరిపోయింది. నేను మేజర్ని అయ్యాను. నా ఆస్తి నాకు అప్పజెప్పి నీ దారిన నువ్వు వెళ్ళొచ్చు" అంది ఉక్రోషంగా సాహితి.
తను పెంచి పెద్ద చేసిన సాహితేనా ఈ మాటలంది? ఆమె నమ్మలేకపోతున్నది. ఇదంతా కల అయితే ఎంత బావుండును!
"ఎక్స్ క్యూజ్ మీ! అయామ్ లాయర్ రంగనాథ్."
ఆమె దృష్టి లాయరు వైపు మళ్ళింది.
ఆమె గురించి తెలుసుకున్న లాయరు ముఖాన చిరునవ్వు చోటుచేసుకుంది.
సాహితి కేవలం ఆవేశంలో తనను వెంటబెట్టుకుని వచ్చిందని, కుటుంబ కలహంలో తనను అనవసరంగా ఇరికించడానికి ప్రయత్నిస్తున్నదనీ అర్థం చేసుకున్నాడు.
పరిస్థితిని గమనించిన సాహితి, లాయరు మెత్తబడి జారుకుంటున్నట్టు గ్రహించింది.
వెంటనే విసురుగా బయటకు వెళ్ళింది.
"మిస్ సాహితీ! ఆగండి_ నేను చెప్పేది వినండి."
లాయర్ సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఆమె వినిపించుకోలేదు. కారు నడుపుకుంటూ వెళ్ళిపోయింది.
బిందుమాధవి కళ్ళు చెమర్చాయి.
ఇక అక్కడ తన అవసరం ఎంతమాత్రం లేదని గ్రహించిన లాయరు వెళ్ళడానికి సంసిద్దుడయ్యాడు.
"ఒక్కక్షణం ఆగండి లాయరు గారూ!" అంటూ బిందుమాధవి లోపలకు వెళ్ళింది.
లాకరులో ఉన్న దస్తావేజులు, బ్యాంకు పాస్ పుస్తకాలు, లాకర్ తాళంచెవీ తీసుకువచ్చి, లాయరు ముందు పెట్టింది.
"నన్ను సాహితి ఓ స్వార్థపరురాలనుకుంటుంది. ఇవి చూడండి లాయరుగారూ! మీరైనా నన్ను అర్థం చేసుకోండి!" ఆవేదనతో కూడి వుంది ఆమె స్వరం.
లాయరుకు ఇదో కొత్త అనుభవం. అతను ఏం మాట్లాడాలో అర్థంకాక మొహమాట పడిపోతూ అలానే కూర్చుండిపోయాడు.
సాహితి ఈసారి పోలీసు కానిస్టేబుల్ ను వెంటబెట్టుకు వచ్చింది.
బిందుమాధవి ముఖాన నెత్తురు చుక్కలేదు.
"బిందుమాధవి మీరేనా?"
కానిస్టేబుల్ ప్రశ్నకు అవునన్నట్టు తలూపిందామె.
"మీరు ఉన్నపళాన నాతో స్టేషన్ కు రావాలి. మీ మీద పిటిషన్ ఉంది."
లాయరుకు విషయం అర్థమయింది. ఆవేశంగా వెళ్ళిన సాహితి సరాసరి పోలీసు స్టేషన్ లో రిపోర్టు ఇచ్చి కానిస్టేబుల్ ను వెంటబెట్టుకుని మరీ వచ్చినట్టు గ్రహించాడు.
"పోలీసు స్టేషన్ వరకు ఎందుకులెండి? నా క్లయింట్ కు నేను సర్దిచెప్పుకుంటాను..." సౌమ్యంగా అన్నాడు లాయర్ రంగనాథ్ కానిస్టేబుల్ తో.
"చివరికి సాహితి నన్ను బజారుకు ఎక్కించడమే కాక, పోలీసు స్టేషనుకు కూడా తీసుకువెళుతున్నది. జీవితంలో ఇంతకంటే ఏం జరగాలి లాయరుగారూ? ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది!"బిందుమాధవి గొంతు జీరపోయింది.
బ్యాంక్ పాస్ పుస్తకాలు, లాకర్ తాళంచెవి దాస్తావేజులు హాండ్ బ్యాగ్ లో వేసుకుని బిందుమాధవి కానిస్టేబుల్ వెంట స్టేషనుకు బయలుదేరింది.
ఆమె వెనుకే లాయరు, సాహితి కదిలారు.
* * * *