"ఇదీ ఒక విధంగా పబ్లిక్ రిలేషన్స్ కు సంబంధించిందే! సహాయం చేస్తానని మాట ఇవ్వగలరా?" క్షణం ఆగాడు.
"భలేవారే! నా చేతనైనంత వరకు చేస్తానన్నానుగా! అయితే నామీద మీకు యింకా నమ్మకం కుదరలేదన్నమాట!" అంది నిష్టూరంగా.
"సారీ! మీ మనసును బాధపెట్టినట్టున్నాను. అవతలవైపు నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంవల్ల అలా అడిగాను. శ్రీపతి అని లక్షాధికారి ఉన్నాడు. ఆయనగారి కూతురు అనూష పెద్ద సాహసం చేసి యింట్లోంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం సమ్రాట్ దగ్గర పనిచేస్తూ తన కాళ్ళమీద తను నిలబడినట్టేనని అనుకుంటుంది. మీరు ఎలాగైనా ఆమెకు నచ్చజెప్పి తండ్రి దగ్గరకు పంపాలి. నేను నా సీటులో కూర్చోవడమే పాపంగా ఉంది. శ్రీపతి గంటకొకసారైనా సమ్రాట్ ను అరెస్టు చేసి అతనిమీద కిడ్నాప్ కేసు పెట్టమంటాడు. అనూష తన యిష్టంమీద ఇల్లు విడిచి వెళ్ళింది. పైగా ఆమె మేజరు కూడా. ఇక కేసు ఎలా పెట్టమంటారు. మీరు నాకీ సహాయం చేస్తే ఇక నాకు శ్రీపతి గోల తప్పుతుంది, ఏమంటారు?"
"భలే కేసు అప్పజెప్పారు! అనూష మా సాహితి కంటే నాలుగాకులు ఎక్కువే చదివింది. అసలు మొదట అనూష నాదగ్గరకే వచ్చింది. నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. అంత తేలికగా వినే ఘటం కాదు. అయినా మీరింతగా అడిగారు కనుక మరొకసారి అనూషను మా యింటికి పిలిపించి నచ్చజెప్పడానికి పయత్నిస్తాను. ఆమె వినకపోతే అది నా పరాజయం అని మాత్రం అనవద్దు!" అంది నవ్వుతూ బిందుమాధవి.
"విష్ యూ బెస్టాఫ్ లక్ మేడమ్!" కుర్చీలోంచి లేస్తూ అన్నాడు వీరేష్.
* * * *
సాహితి సూట్ కేసుతో రిక్షా దిగింది.
సమ్రాట్ ఆఫీసులోకి వచ్చింది. అతను అక్కడ లేకపోవడంతో నీరసపడిపోయింది.
అనూష పరీక్షగా ఆమెనే చూస్తూ ఉండిపోయింది. సాహితి తనను సమ్రాట్ అభిమానిగా పరిచయం చేసుకుంది.
"మీరు సమ్రాట్ గారిని కలవడానికే వస్తే_సారీ! ఇవాళ ఆయన చాలా బిజీగా ఉంటారు. సాయంత్రం ఆడిటోరియంలో ఆయనకు సన్మానం జరుగుతున్నది. సరాసరి అక్కడికే వస్తారు."
"అయితే, నేను వెళతాను...." సాహితి నిరుత్సాహంగా అంది.
"భలేవారే! ఇంతవరకు వచ్చి సమ్రాట్ ను కలవకుండా వెళతారా? ముందుగా గదికి వెళ్ళి బట్టలు మార్చుకుని సభకు వెళ్ళవచ్చు. మీరు అక్కడే సమ్రాట్ ని కలవచ్చు. ఏమంటారు?"
సాహితి ఆలోచనలో పడింది.
"ఒకవేళ మీకు ఆహ్వానం పంపలేదని అనుమానపడుతున్నారా? సమ్రాట్ స్వదస్తూరీతో తన అభిమానులందరికీ పంపారు. మీకు అందలేదేమో! అయినా నేను వ్యక్తిగతంగా వారి తరఫున ఆహ్వానిస్తున్నాగా!" అనునయంగా చెప్పింది.
ఆ వెంటనే ఆఫీసుకు తాళంవేసి సాహితితో బయటకు వచ్చింది అనూష.
రిక్షాను పిలిచింది.
* * * *
ఆహ్వానితులతో కళకళలాడుతున్నది ఆడిటోరియం.
సమ్రాట్ అప్పుడే కారు దిగాడు. అభిమానులు అతన్ని చుట్టుముట్టారు.
కొందరు కరచాలనం చేశారు. మరికొందరు ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.
డి.ఎస్.పి. మార్తాండ్, అతని కూతురు కళ్యాణి రాగానే ఇన్ స్పెక్టర్ వీరేష్ వాళ్ళను లోనికి తీసుకువెళ్ళాడు.
కార్యక్రమం మొదలవుతుండగా వీరేష్ ఆడిటోరియం వెలుపలకు వచ్చాడు.
బిందుమాధవి ఆడిటోరియం ముందు అటూ ఇటూ తిరుగుతున్నది. ఆమెను చూడగానే వీరేష్ కు రిలీఫ్ గా అనిపించింది.
"అరె! మీరు లోపలకు వెళ్ళరా? బయటే ఉండిపోయారు?" అన్నాడు తన ఉనికిని తెలియజేస్తూ వీరేష్.
"సారీ! నేను కార్యక్రమం చూడడానికి రాలేదు. పనిమీద వచ్చాను..." అంది బిందుమాధవి.
ఆమె ముఖంలో ఆందోళన ఛాయలు కనిపిస్తున్నాయి.
"నా సహాయం ఏమైనా కావాలనిపిస్తే చెప్పండి మేడమ్ అన్నాడు నవ్వుతూ.
సాహితి గురించి తను అన్నిచోట్లా వెదికింది. ఆమె జాడ తెలియలేదు.
సమ్రాట్ సన్మానానికి వస్తుందేమోననే ఆశతో కళ్ళలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్నది. ఆమె రాలేదు. ఇప్పుడు తను పోలీసుల సహాయం అర్థించడం కంటే చేయగలిగిందేమీలేదు. అందునా తెలిసిన ఇన్ స్పెక్టర్. చెప్పుకుంటే తప్పులేదు. ఇతనైనా తన బాధను అర్థంచేసుకుని సాహితిని వెదకడంలో తనకు సహకరించవచ్చు.
"చెప్పడానికి మీరేదో సంశయిస్తున్నారు. ఏదో సుదీర్ఘమైన ఆలోచనలో యిక్కడ నా ఉనికినే మరచిపోయారు!" అన్నాడు ఆమె పరధ్యానంగా ఉండడం గమనించి వీరేష్.
బిందుమాధవి ఉలిక్కిపడింది. వెంటనే తేరుకుని అతనికి అర్థమయ్యేట్టు సాహితి యింట్లోంచి వెళ్ళిపోయిన వైనం చెప్పింది.
సమ్రాట్ సన్మాన సభకు ఆమె తప్పక రావలసిందే! కాని రాలేదు. బిందుమాధవి అంచనా ఎక్కడ తప్పిందో అతనికి అర్థం కాలేదు.
"ఇంకాసేపు చూద్దాం. రాకపోతే రేపు పత్రికా ప్రకటన ఇద్దాం. తెలివిగల పిల్లే. కాకపోతే కొంచెం ఆవేశం పాలు ఎక్కువ. సూట్ కేసుతో వెళ్ళిందంటున్నారు. తెలిసిన వాళ్ళ దగ్గరకే వెళ్ళి వుంటుంది. అఘాయిత్యం చేసుకోవడానికి తనేమీ చిన్నపిల్ల కాదు. మీరు అనవసరంగా కంగారు పడవలసిన పనిలేదు. నిశ్చింతగా వుండండి. ఆమె ఎక్కడ వున్నా క్షేమంగానే ఉంటుంది."
అతని మాటలు కొంత ఊరట కలిగించాయి బిందుమాధవికి.
సరిగ్గా అదే క్షణంలో ఆడిటోరియం ముందు ఆటో ఆగింది.
బిందుమాధవి ముఖం విప్పారింది.
ఆటోలోంచి అనూష, సాహితి దిగారు.
బిందుమాధవి ఆత్రుతగా వాళ్ళ దగ్గరకు వెళ్ళింది.
"ఆంటీ, బాగున్నారా?" ముందుగా అనూషే ఆమెను గుర్తుపట్టినట్టు అంది.