Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 21

 

        "ఏమిటి నా గురించేనా మాట్లాడుకుంటున్నది....?" పరమహంస తలుపు దగ్గర నుంచి అడిగాడు.
   
    సాహితికి ఈ విషయం ఎప్పుడూ ఆశ్చర్యంగానే వుంటుంది. పరమహంస ఎప్పుడూ రావలసిన సమయంలోనే ప్రత్యక్షమవుతాడు. నిర్మల ఉత్తరం సంగతి చెప్పింది. పరమహంస ముఖం గంభీరంగా మారింది.

    "అలా కూర్చో సాహితీ! సింహాచలం! ఆ ఉత్తరం ఇచ్చి నువ్వు వెళ్ళు." సింహాచలం వెళ్ళిపోయే వరకు అతడేం మాట్లాడలేదు. నిర్మల లేచి లోపలి వెళ్ళిపోయింది. పరమహంస ముఖం ప్రసన్నంగా మారిపోయింది.
   
    "చూశావా సాహితీ! మీ మమ్మీకి నా మీద ఎంత నమ్మకమో! నే నెటువంటి నిర్ణయం తీసుకున్నా కాదనదు. కానీ నువ్వు కూడా ఊహ తెలిసిన దానివి, నీ అభిప్రాయం కూడా తెలుసుకోవలసిన అవసరం నాకుంది. నేను చెప్పేది విని ఆలోచించి నీ నిర్ణయం చెప్పాలి- సరేనా?"
   
    "చెప్పండి అంకుల్...." అంది సాహితి. తప్పుచేశానన్న అభిప్రాయం కలిగిందామెలో.
   
    "నీ మనోభావాలనూ, ముఖ్యంగా సంతోషకరమైన వార్తలనూ నీ స్నేహితులతో, బంధువులతో పంచుకోవడంలో తప్పేమీలేదు. ఆ విషయంలో నిన్ను అదుపులో పెట్టాలనుకోవడం నా స్వార్ధమే అవుతుంది. కానీ నేను మొదటే నీకు చెప్పాను. మనం తీసుకున్న నిర్ణయాన్ని అమల్లో పెట్టడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకూ యీ విషయాన్ని ఎవరికీ తెలియచేయకపోవడమే మంచిదని నా ఉద్దేశ్యం.....కారణాలు రెండు- ఒకటి నేను తీసుకోబోయే విడాకులకీ, ఈ పెళ్ళికీ సంబంధం వున్నట్లు ఎవరికీ అనుమానం రాకూడదు. రెండో ముఖ్యమైందీ, మీ మావయ్య వాళ్ళు పల్లెటూరి వాళ్ళు. మన మనసులు ఎదిగినంతగా వాళ్ళలో నాగరికత పెరగలేదు. వాళ్ళు యీ విషయంలో అడ్డుపడినా పడవచ్చు. కాబట్టి యీ విషయాన్ని ప్రస్తుతానికి రహస్యంగానే వుంచి, పెళ్ళి అయ్యాకే అందరికీ తెలపటం మంచిదని నా వుద్దేశ్యం. ఆ తర్వాత వాళ్ళేం అన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. నీవుకూడా ఆలోచించు."
   
    ప్రతీ విషయాన్నీ తన ఫ్రేమ్ లో బిగించి, తార్కికంగా చెప్పగలగటం పరమహంసకి దేవుడిచ్చిన వరం! సాహితికి ఆయన వాదనలో సత్యం వుందని అర్ధమైంది. మారు మాట్లాడకుండా ఉత్తరం అందుకొని ముక్కలు ముక్కలుగా చేసింది.
   
    "సారీ అంకుల్! నేను చేసింది పొరపాటే. అనాలోచితంగా వ్రాసేశాను. మీరన్నదంతా నిజం. నాకీ ఆలోచన తట్టనేలేదు...." అంది క్షమాపణగా.
   
    "వెరీగుడ్! నీలో ఈ ఆలోచనే నాకు కావలసింది. వెళ్ళి చదువుకోమ్మా! పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. బాగా చదవాలి."
   
    "అలాగే అంకుల్" లేచి లోపలకు వెళ్ళిపోయింది సాహితి. పరమహంస నిర్మల గదిలోకి వెళ్ళాడు. తలుపులు మూసుకున్నాయి. ఆ విషయం గమనించినా సాహితి బాధపడలేదు.
   
    సాహితికి తెలీని విషయం ఒక్కటే-క్రితం రాత్రి తను ఉత్తరం వ్రాయడం గమనించిణ తల్లి, వెంటనే ఆ విషయం పరమహంసకి ఫోన్ లో తెలియచేసిందనీ, అందుకే వెంటనే అతడు బైయల్దేరి వచ్చాడనీ, అతని ఆకస్మిక ప్రవేశం అద్బుతంకాదనీ.....
   
                              *    *    *
   
    సాహితి ఇంటర్ పరీక్షలు బాగా వ్రాసింది. ఫస్ట్ క్లాస్ తప్పక వస్తుంది. మెడిసిన్ లో చేరాలంటే ఎంట్రన్స్ పరీక్ష వుంటుంది. దానికోసం సెలవుల్లో కోచింగ్ తీసుకోవాలనుకుంది. నిర్మలను అడిగిందా విషయం. "అంకుల్ ని రానివ్వమ్మా! అడిగి చేరుదురుగాని" అంది నిర్మల.
   
    "ఎంట్రన్స్ పరీక్షకి ఇంకా నెలరోజులే టైముందమ్మా! వెంటనే చేరాలి, అంకుల్ ఇంకో వారంరోజుల దాకా రానన్నారు. వెళ్ళి చేరతాను మమ్మీ."
   
    "వద్దు సాహితీ! అడగకుండా చేరడం మంచిదికాదు. బాగుండదు. మన వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్నప్పుడు ఒక్కమాటైనా చెప్పకుండా స్వయంగా నిర్ణయం తీసుకుంటే బాధపడతారు. ఆయన రానీ...అంతగా అయితే ఇంట్లోనే ట్యూటర్ని పెడతాను."
   
    "అదికాదు మమ్మీ...." ఏదో చెప్పబోయింది సాహితి.
   
    "వద్దు! బలవంతం చేసి నా మనసు కష్టపెట్టకు. ఆ తర్వాత ఆయన బాధపడితే నేను భరించలేను."
   
    "అదికాదు మమ్మీ! ఆయన కాదంటే అప్పుడే మానేస్తాను. అయినా అంకుల్ కాదనరు."
   
    "ఏమయినా ఆయనకు చెప్పకుండా చేయడం నాకు యిష్టం లేదు- అంతే."
   
    ఆమె మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఎక్కడో ఏదో అపశృతి.....నాన్నగారున్నప్పుడు మమ్మీ ఎప్పుడూ యిలా మాట్లాడలేదు. ఆయనేదైనా కాదంటే వాదులాడేది. ఇప్పుడు అంకుల్ ఏది చెబితే అదే వేదం! మొన్న సింహాచలం విషయంలోనూ అదే జరిగింది. పరీక్షల హడావుడిలో తను గమనించనే లేదు. ఊరెళ్ళి వస్తానని వెళ్ళినవాడు రానేలేదు. మమ్మీని ఆ విషయం అడిగితే పనిలోంచి తీసేశామని చెప్పింది. వారం రోజుల్లో వస్తానన్నవాడు ఇరవై రోజులకిగానీ రాలేదట.
   
    "అదేంటమ్మా ఏదైనా అర్జంటు పనుండి ఆగిపోయాడేమో!"
   
    "ఆ.... ఏదో వంక చెప్పాడులే ఒంట్లో బాగోలేదని అయినా అంకుల్ కి బాగా కోపం వచ్చింది. దేవుడి గదిలో చుట్ట కాల్చాడట."
   
    సింహాచలానికి చుట్ట కాల్చే అలవాటుంది. కానీ దేవుడి గదిలో కాల్చే దుర్మార్గుడు కాదు. పదిహేనేళ్ళుగా ఆ ఇంటికి సేవచేస్తున్నాడు. ఓ చిన్న కారణానికి అతణ్ణి పన్లోంచి తీసేయడం బాధ కలిగించింది.
   
    "ఛ! తనెందుకిలా ఆలోచిస్తుంది? అంకుల్ ని అనుమానించడమా? ఆయన ఏ విషయమైనా ఆలోచించి, విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారు. సింహాచలం వలన ఏం పొరపాటు జరిగిందో తెలీదు కానీ ఇది క్షమించరాని నేరమే అయుంటుంది" అని సరిపెట్టుకుందామె.
   
    పదిరోజుల తర్వాత వచ్చాడు పరమహంస. నిర్మల విషయం అంతా చెప్పినట్లుంది. సాహితి గదిలోకి వచ్చాడు.
   
    "ఏమిటమ్మా మెడిసిన్ లో చేరాలనుకుంటున్నావట? కోచింగ్ లేకపోయినా నీకు సీటు వస్తుంది. అదీ కాకపోయినా లక్షలైనా ఖర్చుపెట్టి నీకు సీటు తెప్పించగలను. కానీ ఒక్క విషయం ఆలోచించమ్మా! నీది చాలా సున్నితమైన మనస్తత్వం. రక్తాన్ని చూడలేవు. ఎవరైనా బాధతో విలవిల్లాడుతుంటే చూసి వణికిపోతావు. ఆ మధ్య ఎవరో సైకిల్ మీదనుంచి పడి దెబ్బలు తగిలించుకుంటే ఏడ్చేశావు. రేపు పెద్ద యాక్సిడెంట్లో ఎవరైనా ఒళ్లంతా గాయాలతో వస్తే, ధైర్యంగా స్థయిర్యంగా నిలబడి వైద్యం చేయించగలవా? ఆలోచించు. ఆ వృత్తికి నువ్వు న్యాయం చేకూర్చగలవనే నమ్మకం నీకు వుంటే నాకేం అభ్యంతరం లేదు. చదువు కూయా సామాన్యమైంది కాదు. పోస్టు గ్రాడ్యుయేషన్ చెయ్యందే విలువ లేదు. గ్రామాల్లో అయిదేళ్ళ సర్వీస్ తప్పనిసరిగా చేయాలి. అక్కడ రాజకీయాలకు తట్టుకోగలగాలి. అవన్నీ అవసరం లేదనుకో. ఓ అయిదారు లక్షలతో నర్సింగ్ హోమ్ కట్టించి యివ్వగలను. కానీ నీకు అందులో తృప్తి కలుగుతుందా? ఇవన్నీ ఆలోచించుకో సాహితీ! ఇదంత సులభంగా తీసుకునే నిర్ణయం కాదు. జీవితంలో ఇదొక స్టెప్పింగ్ స్టోన్! చాలా ముఖ్యమైన విషయం."
   
    అదేమిటోగాని పరమహంస వాదనలో ఎప్పుడూ నిజాయితీ కనిపిస్తుంది. అవతలి వాళ్ళను ఆలోచింప చేస్తుంది. అన్నింటినీ మించి అతని వాదనే రైటనిపిస్తుంది. సాహితి వెంటనే నిర్ణయం చెప్పేసింది. బి.యస్సీలో చేరతానని.
   
    ఆమె కాలేజీలో చేరి సంవత్సరం కావస్తోంది. పరమహంస ఎప్పటిలా వచ్చి పోతూనే వున్నాడు. వ్యవహారాలన్నీ చక్కపెడుతున్నాడు.....ఇంట్లో ఏ విషయం అయినా అతడు చెప్పినట్లు జరుగుతోంది. కానీ పెళ్ళి విషయం మాత్రం ఎవరూ ఎత్తలేదు. ఒకరోజు పరమహంస తిన్న కంచంలోనే, దాన్ని కడగకుండా తల్లి తినడం సాహితి చూసింది. అంత ప్రేమ ఆమె తన గుండెల్లో దాచుకుని వుందని తెలీదు. తండ్రి తన తల్లి తాలూకు అంత ప్రేమని గుర్తించకపోవటం దురదృష్టకరం. 'పెళ్ళికి ఎందుకు ఆలస్యం?' అనుకొంది. ఆ రోజునే పరమహంసే ఆ ప్రస్తావన తెచ్చాడు. నిర్మల, సాహితి ఇద్దరూ వున్నారప్పుడు.
   
    "నా కుటుంబం విషయం ఏమీ తేలేటట్లు లేదు. కోర్టులో విషయాలు యింతగా నానుస్తారని అనుకోలేదు. గొప్పగా ఆదర్శాలు వల్లించి ఇప్పుడు వెనక్కు తగ్గుతున్నాననుకుంటున్నారేమోనని నాకు కూడా గిల్టీగా అనిపిస్తోంది. ఈ క్షణమైనా నేను పెళ్ళికి సిద్దం కాకపోతే సింపుల్ గా పెళ్ళి చేసుకుంటాను."
   
    "నాకేం అభ్యంతరం లేదు" అంది నిర్మల మెల్లిగా.
   
    "నువ్వేమంటావు సాహితీ! అక్కడి పరిస్థితులు చక్కబడ్డాక పదిమందికీ తెలియచేద్దాం. కనీసం యిలా చేస్తే మన మనస్సులకైనా శాంతి లభిస్తుంది కదా."
   
    "అలాగే అంకుల్ మీ ఇష్టం! చెప్పండి మంచి ముహూర్తం ఎప్పుడుందో ఏర్పాట్లన్నీ చేస్తాను" అంది ఉత్సాహంగా.
   
    పరమహంస పంచాంగం తీసి ఏవో లెక్కలు కట్టాడు. శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నరకి మంచి ముహూర్తం అన్నాడు.

 Previous Page Next Page