Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 22

  

       సాహితి ఉత్సాహంగా అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ సాయంత్రమే నౌఖర్లందరినీ ఏదో మిషమీద బయటకు పంపేశారు. పాతవాళ్ళెలాగూ ఎవరూలేరు. సింహాచలం వుంటే బావుండుననిపించింది సాహితికి. అతడికా ఇంట్లో చెప్పలేని అనుబంధం వుండేది. ముహూర్తం వేళకి తల్లిని స్వయంగా ముస్తాబు చేసింది. బొట్టు ఎంత అందానిస్తుందో అప్పుడే గ్రహించినట్టు మహా వింతగా చూస్తుండిపోయింది. నిర్మల మొహంలో చక్కటి కళ వుంది. కాస్త ముస్తాబు చేస్తే చాలు చాలా అందంగా కనిపిస్తుంది. సాహితికి అక్కలా అనిపిస్తుంది. పరమహంస ముఖంలో ఆనందం తాండవిస్తోంది. అనుకున్న ముహూర్తానికి బాజాబజంత్రీల క్యాసెట్ పెట్టారు. దండలు మార్చుకున్నారు. పరమహంస నిర్మల మెడలో తాళికట్టాడు. ఆ పెళ్ళికి ఏకైక సాక్షి సాహితి. ఫోటోలు తీసింది. పరమహంస అభ్యంతరం చెప్పలేదు.
   
    పడకగది కూడా స్వయంగా అలంకరించింది. ఆయన గదిలోకి వెళ్ళబోతుంటే ఆపింది సాహితి. "అంకుల్ మీరు చేసిన ఈ త్యాగానికి మేము ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. జన్మనిచ్చిన తండ్రి నాకు ఆప్యాయతని పంచలేకపోయాడు. ఆస్థిమాత్రం మిగిల్చిపోయాడు. మీనుంచి నేను కోరుకునేది ఆత్మీయథా, అభిమానం అవి నాకు అడక్కుండానే దొరుకుతాయనే నమ్మకం వుంది. అందుకే మీకు కానుక-ఊహు కాదు బాధ్యత అప్పగిస్తున్నాను."
   
    "ఏమిటి సాహితీ?" ఆశ్చర్యంగా అడిగాడు. నిర్మలకు కూడా సంగతేమిటో అర్ధం కావడంలేదు.
   
    "మా ఆస్థి అంతటికీ మీరే గార్డియన్ గా, మా వ్యాపారవిషయాలు చూసుకోవడానికి పూర్తి అధికారం మీకు ఇచ్చే దృవీకరణ పత్రాలు రెండు రోజులుగా మన లాయరుగారితో తిరిగి ఇది వ్రాయించుకొచ్చాను" అతడి చేతుల్లో పెట్టింది.
   
    "కానీ సాహితీ, ఇప్పటికే అన్ని వ్యవహారాలు నేనే చూసుకుంటున్నానుగా! ఇంకా యీ ఫార్మాలిటీస్ దేనికి? ఈ పెళ్ళి విషయం లాయరుకు చెప్పావా?" కంగారుగా అడిగాడు.
   
    "లేదంకుల్! ప్రపంచం దృష్టిలో మీరు నాకు ఏమీ కారు. కానీ నా దృష్టిలో తండ్రిగా నా బాధ్యతంతా తీసుకున్నారు. ఇది మీ చేతిలో వుండాలి. ఇది నా సంతోషం కోసం చేశాను కాదనకండి" పరమహంస కంట నీరు తిరిగింది. దగ్గరగా వచ్చి తెండు చేతులతో ఆమె మొహాన్ని పైకెత్తి కింది పెదవికి కాస్తక్రిందుగా గెడ్డం పైన ముద్దు పెట్టుకున్నాడు. కృతజ్ఞతలకి మాటలవసరం లేదు.
   
    ఆ రాత్రి సాహితి ఆనందానికి అవధుల్లేవు. ఒక మంచి కార్యం తన చేతులమీదుగా జరిపించిన సంతోషం నిద్రపట్టనివ్వడంలేదు. ఒక్కటే కొరత తన ఆనందాన్ని పంచుకోవడానికి పమేలా తప్ప పక్కన ఎవరూ లేకపోవడం!
   
    తన భావాలన్నీ డైరీలో రాసుకుని కాలేజి కెళ్ళింది.
   
    సాయంత్రం కాలేజీనుంచి తిరిగి వచ్చేసరికి పరమహంస లేడు. నిర్మల ఎప్పటిలా హాల్లో కూర్చుని భాగవతం చదువుకుంటోంది. సాహితి ఆవిడను చూడగానే అదిరిపడింది.
   
    "అదేమిటమ్మా ముఖాన బొట్టు లేదేం?" అనడిగింది.
   
    నిర్మల చిన్నగా నవ్వింది.
   
    "నౌఖర్లందరూ అనుమానపడరూ? బావుండదు, పెట్టుకోవద్దన్నారు అంకుల్. నిజమే కదా అందుకే తీసేశాను."
   
    సాహితి గొంతులో ఏదో అడ్డుపడినట్లు మాటరాలేదు. ఆ వాదనలో నిజం వుంది నిజమే కాని, ఏ సౌభాగ్యాన్ని కోసం తనింత త్యాగం చేశాననుకుంటుందో దానికి ఏ మాత్రం విలువ లేదా? గుర్తింపు లేదా? కొద్ది నిమిషాలలోనే ఆమె తేరుకుంది. కొన్ని సత్యాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది.
   
    రాత్రి తొమ్మిదింటికి వచ్చాడు పరమహంస. ముగ్గురూ కలసి భోజనం చేశారు. పరమహంస, నిర్మల ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎందుకో మనస్ఫూర్తిగా ఆ ఆనందాన్ని పంచుకోలేకపోయింది సాహితి.
   
    నౌఖర్లంతా పడుకోవడానికి వెళ్ళిపోగానే నిర్మల నుదుట బొట్టు దిద్దుకుంది. తలనిండా పూలు తురుముకుంది. పాలగ్లాసు పట్టుకొని గదిలోకెళ్ళి తలుపు వేసుకోవడం గమనిస్తూనే వుంది సాహితి. ఎందుకో క్రితం రోజులా సంతోషం కలిగించ లేదా దృశ్యం.
   
                                6
   
    రెండు సంవత్సరాలు గడిచాయి. పరమహంస ఎప్పటిలా వచ్చిపోతూనే వున్నాడు. గుట్టుగా కాపురం చేస్తూనే వున్నాడు. సాహితిని మునుపటికంటే ఆప్యాయంగా పలుకరిస్తున్నాడు. ఒకటి రెండుసార్లు అంతా కలసి బయట భోంచేశారు. సినిమాలకెళ్ళారు. సాహితికేం కావాలన్నా దగ్గరుండి తీసుకెళ్ళి కొనిపెడుతున్నాడు. ఒకసారి పుస్తకాల షాపులో అతని స్నేహితుడు కనిపించాడు.
   
    "మా అమ్మాయి సాహితి" అని పరిచయం చేశాడు పరమహంస. ఆమె సంతోషంతో పొంగిపోయింది. ఆ విషయం చెప్పినప్పుడు నిర్మల ముఖంలో ఆనందం తృప్తి చూసి, తన త్యాగానికి ఫలితం లభించిందని మురిసిపోయింది.
   
    ఆ మరుసటి రోజునుంచి పరీక్షలు. దార్లో ఏదో పనిమీద కారాపి షాపులోకెళ్ళింది. కావాల్సింది కొనుక్కుని బయటకు వస్తున్న ఆమెకి దూరంగా పరిచయమున్న రూపం కనిపించింది. అప్పుడే షాపులోకి అడుగు పెడుతున్నాడు సింహాచలం.
   
    "సింహాచలం!" ఆమె పిలుపుకి అతడు తల తిప్పి చూశాడు. క్షణంపాటు అతడి ముఖంలో సంతోషం మెరిసి మాయమైపోయింది. ఆమెను గుర్తించనట్లుగా తల పక్కకు తిప్పేశాడు. ఆమె అప్పటికే అతడి దగ్గరిగా వచ్చింది.
   
    "అదేమిటి సింహాచలం, అలా మొహం తిప్పేసుకున్నావేం? నా మీద కోపం వచ్చిందా?"
   
    "మీమీద కోపం చూపించేంత గొప్పవాడిని కాదు చిన్నమ్మా"
   
    "నిన్ను పని నుంచే తీసివేసినట్లు నాకు తెలియదు సింహాచలం. నిజంగా నీ మీద ఒట్టు, తర్వాతెప్పుడో మమ్మీ చెప్పింది."
   
    "సరే పోనీలే చిన్నమ్మా! నీవు బావున్నావా?" ఆప్యాయత ధ్వనించిందా స్వరంలో "పమేలా బావుందా?"
   
    "బావుంది సింహాచలం. నీ సంగతేమిటి? ఎక్కడ పని చేస్తున్నావు?'
   
    "ఒక సేటుగారింట్లో! అక్కడ బాగానే వుందిలే చిన్నమ్మా పరమహంస బాబుగారు వస్తున్నారా?"
   
    "వస్తున్నారు సింహాచలం వ్యాపారం అంతా ఆయనే చూసుకుంటున్నారు. చాలా మంచివారు కదూ."
   
    సింహాచలం ఆమె కళ్ళల్లోకి చూశాడు- "అవునమ్మా! చాలా మంచివారు. అందుకే నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు."
   
    "ఆయన తీసెయ్యడమేమిటి? నువ్వే దేవుడిగదిలో చుట్ట కాల్చి పొరబాటు చేశావు. ఆయన అలాంటివి సహించరని తెలియదూ?"
   
    "అలా అని చెప్పారమ్మా! సంగతి అదికాదు"
   
    "అయితే ఏమిటి? నిజం చెప్పు అప్పుడే అనుకున్నాను. మరేదో కారణం వుందని" ఆతృతగా అడిగిందామె.
   
    "అదికాదు చిన్నమ్మా! నాకు తెలియకూడని విషయాలు తెలిశాయని ఆయనకు కోపం వచ్చింది."
   
    అప్పుడర్ధమయింది ఆమెకు. పరమహంస, నిర్మల చనువుగా అతడి కళ్ళపడి వుంటారు. ఎమ్దుకయినా మంచిదని అతడిని పనిలోంచి తీసేశారు.
   
    "ఆ రహస్యం ఏమిటో నాకు తెలుసు సింహాచలం. అది తప్పని నేననుకోవడంలేదు. ఆయన మమ్మీని పెళ్ళిచేసుకుంటానన్నారు" గొప్పగా చెప్పింది.
   
    "ఎంతమందిని చేసుకుంటారమ్మా? ఆయనకు పెళ్ళయిన విషయం మీకు తెలీదా?"
   
    "తెలుసు. ఇద్దరు పిల్లలనీ తెలుసు. కానీ భార్య ఆయన దగ్గరుండదు. చాలా రోజుల క్రితమే విడిపోయారు."
   
    "అంటే అంతకుముందు జరిగిన పెళ్ళి ఒక్కటే నీకు తెలుసన్నమాట. గత సంవత్సరం ఆయన చేసుకున్న రెండో పెళ్ళి సంగతి నీకు తెలీదనుకుంటాను."
   
    "ఏమిటి సింహాచలం నువ్వంటున్నది? అభాండాలు వేయకు" కోపంగా అంది సాహితి.
   
    "లేదు చిన్నమ్మా! ఇప్పటికయినా మేలుకోండి. నాన్నగారి ఆస్తి వ్యవహారాలన్నీ కూడా ఆయనే చూస్తున్నాడని తెలిసింది. పోయినేడాది నేను సెలవుపెట్టి నా కూతుర్ని చూడటానికి వెళ్ళినప్పుడు, ఆయన మరొక ఆవిడను పెళ్ళి చేసుకోవడం నేను కళ్ళారా చూశాను. ఆ విషయం నాకు తెలిసిందనే నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు."
   
    భూమికీ ఆకాశానికీ మధ్య వాలిన తమాల శాఖ, దిగంతాలకి వ్యాపించి......పగిలిన సూర్యగోళంలో విచ్చేదనమై.....కాంతికిరణమై కర్ణభేరి పగిలే రాక్షస గీతమై.....దృతవేగయై, హేలయై సాహితి తలమీద పిడుగు పడ్డట్లనిపించింది. 'గత సంవత్సరం' అంటే అమ్మని పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చిన తర్వాతే......మొదటి పెళ్ళి విషయంలో డైవర్స్ కి ప్రయత్నం చేస్తున్నానని చెప్పిన సమయంలో-
   
    "ఇది నిజమేనా?" తనలో తనే గొణుక్కున్నట్లుగా అంది.
   
    "దైవ ప్రమాణంగా నిజం చిన్నమ్మా! కావాలంటే నువ్వే అడుగు. ఆవిడ పేరు రాజ్యలక్ష్మి మంచి కలిగిన కుటుంబంలో మనిషే."
   
    సాహితి నిద్రలో నడుస్తున్నదానిలా వచ్చి కార్లో కూర్చుంది.
   
    కారు పరీక్ష హాలు ముందాగింది. అప్పటికి అందరూ వ్రాయటం మొదలు పెట్టేశారు. తన పేపరు తీసుకుని నీరసంగా వచ్చి కూర్చుంది.
   
    రెండున్నర గంటల కాలం పూర్తయినట్లు బెల్ మోగింది.
   
    ఆమె ముందు తెల్లకాగితం అలానే వుంది.

 Previous Page Next Page