Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 20


    రాధకు తెలిసిపోయింది- అతను నిజమే ! ఊహ కాదు.

    "అంటే మన ప్రేమకు మీరు వప్పుకున్నట్లే కదండీ ?" ఆనందంగా అడిగాడు.

    హటాత్తుగా స్పృహలోకొచ్చిందామె.

    "ఇంకోసారిలాంటి మాటలు మాట్లాడవద్దని మీకిదివరకే చెప్పాను" అంది కోపంగా.

    "ఈ మాటలు వదిలేస్తే మనకి వేరేమాట లేముంటాయండీ ?"

    ఆమె అతనివంక చిరాగ్గా చూసి వడివడిగా నడవసాగింది. ఆమె వెంబడి పడ్డాడు.

    "ఏమండీ ! అయ్ లవ్ యూ అని ఒక్కసారి చెప్పండి ! చాలు."

    "చెప్పను !"

    "ఎందుకనండీ ?"

    "నాకిలాంటివి నచ్చవు గనుక !"

    "పోనీ ఎలాంటివి నచ్చుతాయో చెప్పండి. అదే చేస్తాను."

    "చేస్తారా ! అయితే, తిన్నగా ఇక్కడి నుండి వెళ్ళిపోయి, మళ్ళీ ఎప్పుడూ నాకు కనిపించకండి."

    "అలాంటివి మరి నాకు నచ్చవు కదండీ ?"

    ఆమె మళ్ళీ నడక ప్రారంభించింది.

    "ఏమండీ ! నా ప్రేమమీద నమ్మకం లేకపోతే పరీక్ష పెట్టండి. సైకిల్ మీద ఇండియా అంతా చుట్టమంటారా ! బే ఆఫ్ బెంగాల్లో ఈత కొట్టమంటారా ?"

    "మర్యాదగా వెళ్తారా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వమన్నారా ?"

    "చూడండి ! మీ మంచికోసం చెప్తున్నాను. మీరు ఎవర్నయినా నమ్ముకోండిగానీ ఆ పోలీసుల్ని మాత్రం నమ్ముకోకండి ! కేవలం మీ మంచికోసం చెప్తున్నాను. అయినా ప్రేమించాను  అన్నవాడి మీద పోలీస్ కంప్లెయింట్ అంటారేమిటండీ ! సరే పోనీండి ! ప్రియురాలన్నాక ఇలాంటి విషయాలలో చూసీ చూడనట్లు పోవాలని మేఘసందేశంలో రాశారు."

    "మేఘసందేశంలోనా ?"

    "ఒరిజినల్ కాదులెండి ! మా ఫ్రెండ్ కూడా మా పేరుతో నవల రాశాడు. ఇంక మరి మీరు వప్పుకున్నట్లే కదండీ__"

    "లేదు-లేదు-లేదు."

    "సరే! మీ రాతి హృదయం ఎలా కరిగించాలో నాకు తెలుసండీ ! రాతిలో నుంచి నీరు వెలికి తీయగలదు నా ప్రేమ. నేను కొంతకాలం రాయలసీమలో ఉన్నానులెండి-"

    "... ..."

    "మాట్లాడరు  కదూ ? ఒకే ! మీ అంతట మీరే వచ్చి 'అయ్ లవ్ యూ' అనేవరకూ మీ ఇంటి ముందున్న ఎలక్ట్రిక్ పోల్ పక్కన నిలబడతాను. ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రుళ్ళు అయినా సరే, అక్కడి నుంచీ కదలను ! ఇదే నా ప్రతిజ్ఞ !" అని అతనంటూ వుండగా ఆమె కాలేజి గేటు దాటేసి లోపలికెళ్ళిపోయింది.


                         *    *    *


    రాధ కాలేజి నుంచీ ఇంటికొస్తూనే ఇంటి ముందున్న ఎలక్ట్రిక్ పోల్ వేపు చూసింది, మురళి చిరునవ్వుతో కనిపించాడక్కడ. చటుక్కున చూపులు మరల్చుకుని ఇంట్లో కెళ్ళిపోయింది. స్నానం, పూజలు, గీతా పఠనాలు అన్నీ యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి గానీ మనసు మాత్రం వేటిమీదా లగ్నం కావడంలేదు.

    బాగా చీకటిపడ్డాక ఉండబట్టలేక ఓసారి డాబామీద కెళ్ళి చూసింది.

    దీపం కాంతిలో అతనక్కడే నిలబడి ఉండటం కనిపించింది. త్వరగా మెట్లుదిగి తన గదిలోకొచ్చేసింది మళ్ళీ.

    అలా ఎంతసేపు నిలబడతాడు ? మహా అయితే ఇంకో రెండు మూడు గంటలు.

    ఆ తరువాత ఆకలేయకుండా వుంటుందా, నిద్రపట్టకుండా ఉంటుందా ? అనుకుని సరిపెట్టుకుంది.

    రాత్రి పదకొండయిపోయింది. లోలోపల ఆత్రుత పెరిగిపోతోంది. అతనింకా నిలబడే ఉన్నాడా? గది కిటికీ తలుపులు తెరచి చూసింది, మురళీ చిరునవ్వు నవ్వుతూ చేయి ఊపాడు. కిటికీ తలుపు మూసేసి మంచంమీద పడుకుందామె.

    మురళీకి కాళ్ళు పీకేస్తున్నాయి. రెండు మూడు గంటలు నిలబడితే చాలు రాధ పరుగుతో వచ్చి 'ఐ లవ్ యూ' అంటుందేమోనని ఊహించాడు తను. కానీ ఆమె గుండె కరగలేదు సరికదా - తనను సర్కస్ లో జంతువుని చూసినట్లు ఉండుండి చూస్తూంది.

    "హుఁ" అనుకున్నాడు మురళి.

    "ఎప్పుడూ 'హూ' అనకపోతే ఇంకేదయినా అక్షరం వాడకూడదూ ?" అన్నమాటలకి ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూశాడు. ఎలక్ట్రిక్ పోల్ మీద ఓ సాలీడు తప్పితే ఇంకెవ్వరూ కనిపించలేదు. మరింత తలతిప్పి చూశాడు.

    "ఆ మాటన్నది నేనేనయ్యా - ఊరికే దిక్కులు చూస్తున్నావ్ కానీ" అంది సాలీడు చిరాగ్గా.

    "మాట్లాడుతో ... తోతోతోంది ను ...నునునువ్వా ?" అడిగాడు తడబడుతూ.

    "అవును నేనే! ఎందుకలా ఖంగారు పడుతున్నావ్ ?"

    "సాలె పురుగు ఎక్కడయినా మాట్లాడుతుందా ?"

    "బుద్ధి లేకపోత్ సరి ! సినిమాల్లో ఎద్దులు పాటలు పాడటం, కుక్కలు నవ్వటం, పొట్టేళ్ళు విజిల్స్ వేయటం, ఇవన్నీ చూసినప్పుడు రాణి అనుమానం ఇప్పుడు ఎందుకొచ్చింది ?" కోపంగా అంది సాలెపురుగు.

    "సారీ !" అన్నాడు మురళి.

 Previous Page Next Page