Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 20


    అంత అయోమయంలోనూ అతను ఆమెను గురించే ఆలోచించాడు.

    "నీవల్లే ఇదంతా జరిగింది" అని తనమీద విరుచుకుపడతాడేమోననుకున్న శ్రీప్రియకు అతని మాటలు ఊరటను కలిగించాయి.

    "నేను క్షేమమేకాని....నావల్లనే ఇదంతా జరిగింది....నామీద మీకు కోపంగా వుందికదూ...."

    "ఎందుకు?"

    "నేను మిమ్మల్ని కౌగిలించుకుని వుండకపోతే ఈ దెబ్బ తగిలిఉండేదికాదుగా...."

    "అందులో తప్పేంవుంది....నువ్వు నన్ను కావాలని పట్టుకోలేదుగా....నీ భయంతో నువ్వున్నావు. ఏదయితేనేం నీకేం కాలేదుగా....అవును ప్రియ ఎవరు వాళ్ళు...."

    "ఏమో నాకు తెలియదు చక్రీ....మీరు హటాత్తుగా పడిపోవడంతో పెద్దగా అరిచి కేకలు పెట్టేసరికి పారిపోయారు....ఒంటరిగా వున్న నన్ను ఏదో చేయాలని ఊహించి నాపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. కానీ మీరు అడ్డుకునే సరికి తోకముడిచారు వెధవలు...." అంటూనే అతనికి హార్లిక్స్ కలిపి ఇచ్చింది శ్రీప్రియ.

    ఆప్యాయంగా ఆమె గ్లాసు అందిస్తుంటే అతనికి అదోలా అనిపించింది.

    తొలిసారిగా వైవాహిక జీవితం మీద ఆశ కలిగిందతనికి.

    శ్రీప్రియ తన ప్రక్కనే బెడ్ మీద కూర్చోవడంతో అతనికి దాదాపు మతి భ్రమించింది.

    శ్రీప్రియను తను పెళ్లాడితే....

    ఛ....! ఏమిటీ ఆలోచన....!

    తను వున్నది ముళ్ళబాటలో....

    ఊబిలాంటి రాణా కొలువునుంచి బయటపడాలంటే....అంత అసాధ్యమయిన ఆలోచన ఇంకొకటి లేదు.

    అతని మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది. 
 
    "చక్రీ....ఏమిటి ఆలోచిస్తున్నారు."

    అతని చేతిని తనచేతిలోకి తీసుకుంటూ మృదువుగా అడిగిందామె.

    ఆ పిలుపు అతనిని ఏవో లోకాలకు తీసుకువెళ్ళిన భావన....

    "ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేక మనసులోనే దాచుకుంటున్నారు కదూ!"

    "అవును....నీతో ఏదో చెప్పాలని వున్నా చెప్పలేకపోతున్నాను."

    "యేమిటో చెప్పవచ్చుగా...."

    "నేనున్నదారి వదిలి నీ మార్గంలోకి రావడం యెలా?"

    "అంటే....నన్ను ప్రేమిస్తున్నట్టేగా"

    "అవును"

    "ఒక బలహీనమయిన క్షణం మనిషిని ఎంతగా మారుస్తుందో....మీరు తలుచుకుంటే ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొని రాగలరు. ఆ నమ్మకం నాకున్నది...."

    "ముళ్ళబాటలో అడుగులు వేసే నాకు ఏదో అవుతుందనే భయం లేదు. కానీ పువ్వులా పెరిగిన నువ్వే ఏమైపోతావోనని నా బాధ"

    "చక్రీ....మీరుండగా నాకేమీ జరగదు."

    "ప్రయత్నిస్తాను డియర్__నా గతం వదిలి నీకోసం__నన్ను కోరుకునే నీకోసం. నిన్ను చేరుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను"

    శ్రీప్రియ కళ్ళలో చెప్పలేనంత ఆనందం....

    "ఆ ఒక్కమాటచాలు చక్రీ__కాలం ఎన్ని అడ్డుగోడలు కట్టినా చేదించుకుని రాగల సత్తా మీకు వున్నది. ఆ నమ్మకంతోనే బ్రతుకుతాను."     

    శ్రీప్రియ అతని చేతిని మృదువుగా నొక్కిపట్టింది   

    చక్రవర్తికి నవనాడులు కంపించాయి....

    మున్నెన్నడూ స్త్రీ స్పర్శ తెలియని ఆ తొలి అనుభవం?

    ఆమె సన్నిధిలో కొన్ని యుగాలపాటు....తనను తను మరచి....ఈ లోకాన్ని మరచి....!

    అదే క్షణంలో అతనికి రాణా గుర్తొచ్చాడు.

    ఆమె చేతి వ్రేళ్ళ మధ్య చిక్కుపడిన తన చేతిని సుతారంగా వదిలించుకుంటూ....

    "వెళ్తాను శ్రీప్రియా...." అన్నాడతను హఠాత్తుగా.

    అలా అనకండి....మళ్ళీ వస్తానని అనండి"

    "తప్పకుండా....నీకోసం....నీ ప్రేమకోసం....వస్తాను సరేనా"

    శ్రీప్రియ నవ్వింది....

    పాలపొంగులాంటి ఆ నవ్వును చూస్తూ అక్కడే వుండిపోవాలనిపించిందతనికి.

    బలవంతంగా మనసును సమాధానపరచుకుంటూ బయటకు నడిచాడతను.

    అతను వెళుతుంటే శ్రీప్రియ అర్దవిమీలిత నేత్రాలతో కవ్వింపుగా చూసింది.

    ఆమెకు తెలుసు....

    అతను మళ్ళీ తనకోసం వస్తాడని! తనను చూడనిదే వుండలేడనీ!

    అదే శ్రీప్రియ కోరుకున్నది!


                            *    *    *


    చక్రవర్తి హాలులో అడుగుపెడుతూనే హఠాత్తుగా ఆగిపోయాడు.

    ఎదురుగా రాణా....

    సింగపూర్ వెళ్ళాడనుకున్న బాస్ ను ఆ సమయంలో అలా చూస్తాడనుకోవడం చక్రవర్తి ఊహకందనిది.

    "ఎక్కడ నుంచి వస్తున్నావ్ చక్రవర్తీ...." రాణా గంభీరమయిన  ప్రశ్న....

    అతని కళ్ళలోని సీరియస్ ను గమనించిన చక్రవర్తికి తన కోసమే అతను ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నట్టు అర్దమయింది.

    నిజం చెబితే ఒక ప్రమాదం....నిజం చెప్పకపోతే మరొక ప్రమాదం...  
 

 Previous Page Next Page