అంతలోనే అతనికి మరో విషయం స్పురణకు వచ్చింది.
తలకు దెబ్బ తగిలినపుడు తన తల చుట్టూ కట్టబడిన గుడ్డ పీలిక శ్రీప్రియ చీర తాలూకు గుడ్డ అని....
అందుకే అతనికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు.
"కధలల్లడం చేత కావడం లేదా?"
చక్రవర్తి తడబడ్డాడు.
"ఆ అమ్మాయి ఎవరు?"
రాణా సూటిగా ప్రశ్నించాడు.
అయిపోయింది....
జరగవలసిన ప్రమాదం జరిగిపోయింది...
ఏదయితే తెలియకూడదని భావించాడో అది పూర్తిగా తెలిసిపోయింది.
ఇక దాచి లాభం లేదనుకున్నాడో ఏమో....ఏ వెధవ తనను అనుసరించి, పూసగుచ్చినట్టు బాస్ కు చెప్పాడో ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదనుకున్నాడో ఏమో....జరిగిందంతా చెప్పేశాడు చక్రవర్తి.
కాకపోతే ఆ అమ్మాయి తనను ప్రేమిస్తున్నదనే సంగతి మాత్రం దాచాడు.
"అయితే చాలాదూరం వెళ్ళిందన్నమాట వ్యవహారం"
అతను చెప్పిందంతా నింపాదిగా విన్న తరువాత అన్నాడు రాణా.
రాణా ఎదుట చక్రవర్తి అలా నేరస్థునిలా నిలబడడం అదే మొదటిసారి.
రాణా చెప్పిన ఏ పని ఫెయిల్ అవ్వకుండా చేసేవాడు చక్రవర్తి ఒక్కడే....అందుకే తన అనుచరులందరికన్నా చక్రవర్తి ప్రతి విషయంలోనూ ప్రహ్త్యేకత ఇస్తాడు.
అటువంటిది....
ఒక అమ్మాయి విషయంలో ఈరోజు, ఒక నేరస్థునిలా బాస్ ముందు నిలుచుంటాడని కలలో కూడా ఊహించలేదు చక్రవర్తి.
"చక్రవర్తీ....ఆ అమ్మాయిమీద నీ అభిప్రాయం ఏమిటి?"
రాణా అడిగిన ఆ మాట చెంపపై ఫెడేలున కొట్టినట్టయిందతనికి.
బాస్ తన గురించి చాలాదూరం ఆలోచిస్తున్నాడు....
శ్రీప్రియ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టేలా లేడని అర్ధమయిందతనికి.
"ఆమెపై నాకెలాంటి అభిప్రాయమూ లేదు బాస్"
అబద్దం చెప్పకు చక్రవర్తీ....ఆ అమ్మాయి, నువ్వు ఒకరినొకరు ప్రేమించు కుంటున్నారు కదూ" రాణా గొంతులో క్రౌర్యం స్పష్టంగా తొంగి చూస్తున్నది.
చక్రవర్తి తడబడ్డాడు.
"లేదు బాస్....మా మధ్య అలాంటిదేమీ లేదు"
"చక్రవర్తీ"
ఆ హాలు దద్దరిల్లేలా గంభీరంగా అరిచాడు రాణా.
చక్రవర్తి గుండె జలదరించింది.
"చిన్నతనం నుంచీ నా దగ్గర పెరిగిన వాడివి. ఈ రాణాను అర్ధం చేసుకోలేక పోయావు. నీ స్థానంలో మరొకరు ఉన్నట్టయితే మినిస్టర్ రోడ్, భరణి కాంప్లెక్స్ లో అతని శవం తేలివుండేది"
చక్రవర్తి అయోమయంలో పడలేదు.
ఎందుకంటే రాణా ఏ విషయమయినా పూర్తిగా తెలుసుకోనిదే బయట పడడన్న నిజం తనకు తెలుసు. ఆ విషయం గ్రహించలేక పోవడం తనదే పొరబాటు.
తన గురించి అంతా తెలిసిపోయిన తరువాత బుకాయించి ప్రయోజనం లేదు....
ఇప్పుడు తప్పించు కోవడానికి ఏ అవకాశమూ లేదు.
రాణా ఏ శిక్ష విధించినా తను దానిని అనుభవించక తప్పదు.
"ఆల్ రైట్ చక్రవర్తి....నీకు నేను వార్నింగ్ ఇవ్వవలసి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు సరే....జరిగిందేదో జరిగిపోయింది. ఇంకొకసారి ఇలాంటి సందర్భం రాకూడదనే నేను కోరుకుంటున్నాను. ఏ అమ్మాయినయినా ఒక రాత్రి సుఖం కోసమే కలుసుకుంటే ఫరవాలేదు. కానీ జీవితాంతం తోడుగా వుంచుకోవాలనుకుంటే నేను క్షమించనని తెలిసి కూడా పెద్ద తప్పు చేశావు. ఇది మొదటి తప్పు కింద భావించి వదిలివేస్తున్నాను. కానీ నువ్వు ఈ క్షణం నుంచి ఆ అమ్మాయిని కలుసుకోడానికి ప్రయత్నించవద్దు. అలా చేశావంటే మాటలు చెప్పను నేను....ముందు ఆ ఆమ్మాయి శవం....తరువాత నీ శవం....నా మనుషుల్లో ఎవరైనా సరే నాకు ఎదురు తిరిగితే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. నా మాట విని ఆ అమ్మాయిని మరిచిపోయి ఇకనుంచయినా బుద్దిగా వుండు" అని చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు రాణా.
ఇప్పుడక్కడ చక్రవర్తి మాత్రమే మిగిలాడు.
రాణా మాటలే అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
చక్రవర్తి దీర్ఘాలోచనలో పడ్డాడు.
* * *
బాస్ తనను రమ్మంటున్నాడని ప్యూన్ చెప్పడంతో తుళ్ళిపడ్డాడు ఆనందవర్మ.
ఒకసారి తన టేబుల్ మీదనున్న ఫైల్స్ అన్నీ చూశాడు అవన్నీ సక్రమంగా వున్నాయో లేదోనని.
సాధారణంగా ఏదయినా తప్పు జరిగితే తప్ప స్టాఫ్ నేవరినీ ప్రత్యేకంగా పిలిపించాడు. అదీ కంపెనీ గెస్ట్ హౌస్ కు తీసుకురమ్మన్నాడు అంటే అతడికేదో మూడినట్టే లెక్క.
అందుకే ఆనందవర్మ ఖంగారు పడిపోతున్నాడు.
తను తెలిసికానీ తెలియక కానీ ఏం తప్పుచేశాడో?
గజగజా వణుకుతూ ఆఫీసులో నుంచి బయటకు నడిచాడు.
ఫ్యాక్టరీ ఆవరణలోనే దూరంగా వున్న గెస్ట్ హౌస్ లోపలకు అడుగుపెట్టాక అతని వణుకు మరీ ఎక్కువయింది.
"కూర్చో" అన్నాడు జగపతి.
"ఫర్వాలేదు సార్" చేతులు కట్టుకుంటూ వినయం ప్రదర్శించాడు వర్మ.