క్షణం ఆగాడు ఇంద్రుడు.
'సుధర్మంలో ధర్మాసనాశీనులమై ధర్మాధర్మ విచక్షణతో ధర్మాధికారంతో ధర్మాన్ని నిలిపే మహేంద్రులం. మోహానికి, మోసానికీ, అధర్మానికీ, అన్యాయానికీ ఆమడ దూరంలో ఉంటాం!'
నవ్వింది 'జగజంత్రి' ఆ మాటలకు.
'నవ్వులాట కాదే నవలామణీ, నిజం!'
'నిజం ప్రభూ! ప్రభువులు చెప్పిందంతా నిజం'
'మా పాలనపై విశేష గౌరవం ఉండే త్రిమూర్తులు మమ్మల్ని అమరాధిపతుల్ని చేశారు'
'ప్రభువులు పడతి మాట మరిచి ప్రస్థుతిలో పడిపోయారు'
'హు! ఏ క్షణాన అహల్యా సృష్టి జరిగిందో- ఆ క్షణంలోనే ఆమె మా మనసులో నిలిచింది. ఇక మరుపు లేదు. మైమరుపే తప్ప!'
'తమరికి అహల్యని చూడాలని లేదా?' చప్పున అడిగింది.
'చూడాలని లేదా! కథంతా విని కధానాయకుడికి కథానాయిక ఏం కావాలని వరస అడిగినట్లుంది నీ ప్రశ్న. తపస్సు చేస్తున్నాను.'
'తపిస్తున్నారా?'
'నువ్వు వ్యంగ్య వైభవం వెల్లి విరిసేలా అలా అడిగినా అది నిజమే! నేను ఆమె కోసం తపిస్తున్నాను. నిజం!'
'తమ తపస్సు ఫలించినా గమనించడం లేదా తమరు?'
'ఫలితమా!' చప్పున అటు తిరిగి ఆమెని సూటిగా చూశాడు.
అహల్య! అహల్య! అహల్య! ఇంతసేపూ తమతో సంభాషించింది అహల్యా!
'తను వలచి, వలపు ఫలించేలా వలపించుకోవాలని కోరిన అహల్య తనను వెదుక్కుంటూ తన లోకానికి వచ్చి తన వనానికి వచ్చి తన సన్నిధిలోనే నిలిచి తనతో సంభాషిస్తూ ఉన్నా తను గమనించలేకపోయాడా!
'అహల్యా!' సంభ్రమంలో పిలిచాడు. పిలుపువెంట ఆమె చెంతకు చేరాడు.
ఆ యువతి తలెత్తి కనులారా మహేంద్రుడిని చూసి నవ్వింది.
ఆ నవ్వులతో వెన్నెల విరిసినట్లయింది. తన జన్మ, తన తపన ఫలించింది అనుకున్నాడు ఇంద్రుడు. చప్పున ఆమె భుజాలపై చేతులు వేసి లాలనగా చూశాడు.
* * * *
అహల్య గౌతముల కౌగిలిలో ఒదిగిపోయింది. అపరంజి బొమ్మ అహల్య తన కౌగిలిలో ఒదిగిపోగానే మహర్షి గౌతములు ఆమె ముఖాన్ని పైకెత్తి చుబుకం పట్టి ఆమె కళ్లలోకి చూస్తూ చిరునవ్వు నవ్వాడు.
'దేవీ!' ప్రేమగా పిలిచాడు ఆయన.
'స్వామీ!'
'ముల్లోకాల ఏలికకు పట్టని అదృష్టం ఈ మునిపుంగవునికి దక్కింది.'
'ఒక స్త్రీని పెండ్లాడటం అదృష్టమా స్వామీ!'
'ఒక స్త్రీ కాదు. నువ్వు స్త్రీ మాత్రురాలివి కాదు అహల్యా! పరమేష్టి వర పుత్రువి! నీ పుట్టుకకు ముందు ఎంతో గాధ ఉంది. సకల సృష్టిలోనూ లేని ఏ లోతూ లేని స్త్రీ సృష్టించవలసిన పరిస్థితి వచ్చింది. అన్ని లోకాలలోనూ నిన్ను పోలిన అందగత్తె లేకుండా నిన్ను సృష్టించారు మా మామగారు!'
చిరునవ్వు నవ్వింది అహల్య.
'తమరు వేదవేదాంగ వేత్తలు. మహర్షులలో మన్నన పొందినవారు. తమ ధర్మ సూత్రాలతో న్యాయ సూత్రాలతో సక లోక ప్రసిద్ధి పొందినవారు. తమ పాద సేవా భాగ్యం లభించడం నా అదృష్టం స్వామీ!'
'చతురాననుడి పుత్రివి. అంతకంటే ఇంకేం అనగలవులే! అహల్యా మన ఈ తొలిరాత్రి నీ పుట్టుకను గురించి నేను ప్రస్తావించడానికొక కారణం ఉంది'
'చెప్పండి స్వామీ!'
'నువ్వు వేదాధ్యయనం చేయాలి! సృష్టికర్త అందాలన్నీ రాశి పోసి నిన్ను పోతపోశాడే కాని సమస్త విద్యలనూ ధారపోయలేదు. స్త్రీలు చదువు నేర్వాలి. అహల్యా! వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు చక్కగా అభ్యసించాలి. మగవారిలాగే మగువలూ అన్ని విద్యలూ నేర్వాలి. మాతృమూర్తి విద్యావతి అయితే సంతానమూ విద్యావంతులవుతారు అహల్యా! నిన్ను నేను చదివిస్తాను.'
'ధన్యోస్మి స్వామీ!'
అహల్య భర్త పాదాలకు నమస్కరించింది.
గౌతములు ఆమెని లేవదీసి గుండెల్లో పొదుపుకున్నారు. రుద్రాక్ష మాలికలు అహల్యకు గుచ్చుకున్నాయి.
13
'అహల్యా! అహల్యా!' ఆర్తిగా గుండెల్లో పొదుపుకున్నాడు ఇంద్రుడు.
'ప్రభూ!'
'ప్రభువును కాదు అహల్యా! పాద దాసుడ్ని. సురలోకం వద్దు. సురాధిపత్యం వద్దు. నాకు నువ్వే కావాలి అహల్యా!'