Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 20


    నాలుగడుగులు వేసేసరికి ఇద్దరూ చిరంజీవిని బ్రతిమాలటం ప్రారంభించారు.
    "తప్పయిపోయిందన్నా! సారీ! మమ్మల్ని వదిలెయ్."
    "మరి ఎవళ్ళనో నా మీదకు తోల్తా వన్నారు గదా?"
    "సారీ అన్నా! ఇంకోసారట్లా మాట్లాడం."
    చిరంజీవి ఇద్దరి చొక్కాలూ వదిలేశాడు.
    దారినబోయే జనం పోగయి పోయారప్పటికే!
    "సినిమా చూస్తారా ఇంటికెళ్తారా?"
    "సినిమా చూస్తామన్నారు."
    "మళ్ళా నకరాలు చేశారంటే ఇక్కడే ఖతమ్ చేస్తా ఇద్దరినీ సమజయిందా?"
    "అయిందన్నా"
    "అయితేవెళ్ళండి హాల్లోకి!"
    ఇద్దరూ తలలు వంచుకుని హాలు వేపు నడిచారు.
    చిరంజీవి లాన్స్ లోకి చేరుకునేసరికి ఓ కుర్చీలో గౌడ్ కూర్చుని కనిపించాడు.
    "వెరీ గుడ్! చాలా మంచిగా డీల్ చేశావ్! నిజం చెప్తున్నా! నిన్ను చూసి ఇందాక అండర్ ఎస్టిమేట్ చేశాను. నీకు చాలా హిమ్మత్ ఉన్నది అన్నాడతను ఆనందంగా.
    చిరంజీవి నవ్వాడు.
    "మనం 'మంచి'ని సైడ్ చేస్తే హిమ్మత్ ఆటోమేటిగ్గా వస్తుంది."
    "ఆ మాట నిజమే."
    "అన్నట్లు ఇంకో విషయం మీకు చెప్పటం మర్చిపోయానిందాక"
    "ఏమిటది?"
    "ఆరువేలు జీతం నా చేతికి ఇవ్వాలి. గాంధీకి కాదు."
    "ఓకే. నాకేం ప్రాబ్లమ్ కాదు."
    చిరంజీవి మరికాసేపు అక్కడ కూర్చుని ఇంటికి బయల్దేరాడు. పిల్లలంతా నిద్రపోకుండా అతనికోసమే చూస్తున్నారు.
    "ఏమిట్రా పన్నెండయినా ఇంకా పడుకోలేదా?"
    "లేదు మావయ్యా! నీకోసమే చూస్తున్నాం" అన్నాడు రాజు.
    "ఎందుకు?"
    "నీ ఉద్యోగం పోయిందని కృష్ణయ్య అంకుల్ చెప్పారు నిజమేనా మామయ్యా?"
    "అవున్రా"
    "అయితే మరి మనకి డబ్బెలా వస్తుంది మరి?"
    "ఇంకో ఉద్యోగం దొరికిందిరా! మనకేం ఫర్లేదింక. మీరంతా రేపు స్కూలుకి వెళుతున్నారు తెలిసిందా? మీ అందరికీ ఫీజు పుస్తకాలకు డబ్బు తీసుకొచ్చాను. ఇంక మీకేం ఫర్వాలేదు. మీ అమ్మా, నాన్నా ఉన్నప్పుడు రాజకుమారుల్లా ఎలా ఉండేవారో ఇకనుంచీ అచ్చం అలానే ఉంటారు. సరేనా? అందరి మొఖాల్లో ఆనందం కనిపించింది.
    "అందరికీ బట్టలు కూడా కొనిపెడతావా మావయ్యా?" అడిగాడు శీను.
    "బట్టలు, బూట్లు, సాక్స్, స్కూలు బ్యాగ్ లు, యూనిఫారం అన్నీ కొనిస్తాను."
    కొద్దిసేపు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.
    "నిజంగానా మావయ్యా?" అనుమానంగా అడిగాడు భాను కొద్దిక్షనాల తర్వాత."
    "నిజంగానేరా! ఇదిగో డబ్బు." అంటూ జేబులోనుంచి వెయ్యి రూపాయలు తీసి చూపించాడతను.
    "అయితే కలలు నిజమవుతాయ్ మావయ్యా. మధ్యాహ్నం నిద్రపోయినప్పుడు నాకు కల వచ్చింది. మనం చాలా గొప్పోళ్ళయిపోయినట్లు."
    చిరంజీవికి తన కల గుర్తుకొచ్చింది. తను ఆ కోటీశ్వరుడి కూతురిని ఇన్సల్ట్ చేసినట్లు వచ్చిన కల నిజమవుతుందా?


                                        *    *    *    *


    "యూ ఆర్ బ్లడీ ఫూల్! గుడ్ ఫర్ నథింగ్ ఫెలో! యూజ్ లెస్, ఇడియట్" ఆవేశంగా అరుస్తోంది దీప.
    శ్రీరామ్ నిర్ఘాంతబోయి కర్చీఫ్ తో మొఖం తుడుచుకున్నాడు అవమాన భారం భరించలేక.
    "నీకు వారం రోజులు ముందు ప్రోగ్రాం ఇచ్చాను. ఇప్పుడొచ్చి అయిదుగురికి ఫ్లైట్ కన్ ఫర్మేషన్ అయింది, ఒకరికి కాలేదంటున్నావ్! ఎనీ సెన్స్ ఇన్ దట్? మేమందరం కలసి వేసుకున్న టూర్ నీవల్ల నాశనమయిపోవాలా?"  
    "సారీ మేడమ్.
    "గెట్ లాస్ట్! ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ టికెట్ కూడా కన్ ఫార్మ్ అయితేనే మళ్ళీ నీ మొఖం చూపించు లేకపోతే నువ్వూ, నీ ఉద్యోగమూ కూడా పోతాయ్."
    శ్రీరామ్ గాయపడిన హృదయంతో బయటకు నడిచాడు.
    "ఇలాంటి వెధవల్ని డాడీ ఎక్కడినుంచి పట్టుకొస్తారో తెలీదు. ఇన్ ఎఫిషియెంట్ బాస్టర్డ్స్."
    శ్రీరామ్ కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్.
    ఠక్కున నిలబడిపోయాడు.
    పిడికిళ్ళు బిగుసుకున్నాయ్.
    తను చార్టర్డ్ ఎకౌంటెంట్. ఏ సంస్థలో జాయినయినా ఓ ఉన్నతాధికారిగా ఎంతో గౌరవప్రదమైన జీవితం గడపగలడు. ఇలాంటి పొగరుబోతు యువతి దగ్గర అసహ్యమైన మాటలనిపించుకుంటూ పనిచేయాల్సిన అవసరం తనకేమాత్రం లేదు.
    వెనక్కు తిరిగి ఆమె గదిలోకి నడిచాడు మళ్ళీ.
    "నా వయసెంతో తెలుసా?" కోపంగా వణికిపోతూ అడిగాడతను.
    ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న దీపకు అతనా ప్రశ్న ఎందుకడుగుతున్నాడో తెలీలేదు.
    "నీ స్కూలు సర్టిఫికెట్ లో ఉంటుంది చూసుకో"
    "మీ డాడీ నన్ను బ్రతిమాలి ఇక్కడికి మేనేజరుగా తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? నా ఎఫిషియన్సీ చూసి!"
    "డాడీ అప్పుడప్పుడూ బ్లండర్స్ చేస్తుంటారు."
    "నాది ఇంచుమించు మీ డాడీ వయసు. నన్ను పట్టుకుని బాస్టర్డ్స్ అంటావా? నీకు సిగ్గుండక్కర్లేదా? పెద్దాళ్ళకు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో తెలీకపోతే ఇంకెందుకు నీ చదువు? నీకంటే అడుక్కుతినే వాళ్ళు నయం..."
    దీపకు ఆ మాటలతో ఆవేశం పెరిగిపోయి పూనకం వచ్చినట్లయింది.
    "ఒరే బుడ్డా! గెటౌట్! నువ్వు మా దగ్గర పనిచేసే కుక్కవి! తోక ఊపుతూ కాళ్ళ దగ్గర పడివుండాల్సిందేగానీ వాగటానికి అధికారం లేదు. నిన్నిప్పుడే డిస్మిస్ చేస్తున్నాను పో"
    "నీ బోడి డిస్మిస్ కి ఇక్కడెవడూ భయపడబోవటం లేదు. నేనే రిజైన్ చేస్తున్నాను. నీలాంటి పిచ్చిదాని దగ్గర పనిచేయాల్సిన అవసరం నాకేంలేదు."
    దీపకు తనమీద అదుపుతప్పింది.

 Previous Page Next Page