నిజానికి ఇప్పుడు మరీ అంత కృంగి పోవాల్సిన పరిస్థితి కాదు తమది. తమిద్దరినీ పస్తులుండ కుండా కాపాడుతోంది స్కూలు. అయినా సీతకు సంతృప్తి లేదు. ఆమెకు వేగం కావాలి! ఏ పనయినా సరే! అనుకున్నది క్షణాల్లో జరిగిపోవాలి. ఏదయినా వస్తువుని చూసి మోజు పడిందంటే అది ఇంట్లోకి వచ్చేవరకూ ఆమెకు నిద్రపట్టదు. వేరే ధ్యాస వుండదు. స్కూలు పెట్టి సంవత్సరం అయింది. సంవత్సరంలోనే ఆ స్కూలు వల్ల తాము లక్షాధికారులవాలని కలలు కందామే. ఆ కలలు ఫలించక పోయేసరికి ఇప్పుడు మళ్ళీ ఆమె ఆలోచనలు మారాయి.
ఆమెను చూస్తుంటే నవ్వూ వస్తోంది, విచారమూ కలుగుతోంది. తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు మాధవరావు. ఎంత ప్రయత్నించినా ఫలితమేమీ కనిపించడం లేదతనికి. ఎంత తక్కువ జీతానికి ఒప్పుకొన్నా ఉద్యోగమిచ్చే వారే కనిపించడం లేదు. తన పాత కంపెనికి వెళ్ళాడతను. తనలా బాధపడుతున్న ఉద్యోగులనేక మంది తమను ఆకలి బాధ నుంచి రక్షించమని, లాకౌట్ ఎత్తి వేయమని మేనేజ్ మెంట్ ని ప్రాధేయ పడుతుండటం కనుపించిందతనికి.
8
ఆ రోజు ఆదివారం.
బయట జోరున వర్షం కురుస్తోంది. కాంపౌండ్ లోని పిల్లలు వర్షపు నీళ్ళలో కాగితపు పడవలు విడుస్తున్నారు.
సీత కిటికీ దగ్గరే కూర్చుని బయటకు చూస్తోంది. మాధవరావు కళ్ళు మూసుకొని మంచం మీద పడుకున్నాడు. ఇద్దరి మనుషుల్లో విభిన్న ఆలోచనలు!
చాలాసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది. బయట అటో ఆగడం చూసి ఆలోచనల్లోంచి తేరుకుంది సీత. అంతకు ముందు కొద్ది నెలల క్రితం తమ దగ్గర కొచ్చిన రెండో పబ్లిషర్ అతను.
"ఏమండీ! ఆ రెండో పబ్లిషర్ వచ్చాడు చూడండి. ఆ రోజు అతనోస్తున్నాడు......" అంది హడావుడిగా . ఆమె ముఖంలోకి కళ వచ్చేసింది అతన్ని చూస్తూనే. ఆ మొదటి నవల తరువాత మరో రెండు నవలలు ముగింపు దశలో వున్నాయి రెండు పత్రికల్లో. మరో నవల రాయడం కూడా ఇంచుమించుగా ముగుస్తోంది.
"నమస్తే!' గడప దగ్గర ఆగి చేతులు జోడించాడతను.
"రండి!" అంది సీత ప్రతినమస్కారం చేస్తూ.
అతను లోపలకొచ్చి సోఫా మీద కూర్చున్నాడు.
"నా పేరు రామనాధం. అదివరకోసారి మీ దగ్గర కొచ్చాను మీ నవలల ప్రచురణ కోసం. మీకు గుర్తుందనుకుంటాను...." నవ్వుతూ అన్నాడతను.
"ఓ, యస్ గుర్తుంది .......' నవ్వుతూ అన్నాడు మాధవరావు.
"మీ నవలలు రెండు ఈ నెలతో పూర్తి అయిపోతాయని తెలిసింది. మరి వాటి విషయం ఇంకెవరి కయినా మాట ఇచ్చారా?"
"లేదు" అని చెప్దామనుకోనేటంతలో టక్కున సీత అడ్డుపడింది మాధవరావుకి.
"ఇద్దరు పబ్లిషర్సు ఎవరో వచ్చారు క్రిందటి వారం! అయితే వారికి మాకు డబ్బు విషయంలో ఎక్కువ తేడా ఉండటం వలన కుదరలేదు......' అందామె త్వరత్వరగా మాట్లాడేస్తూ.
మాధవరావు ఆశ్చర్య పోయేడు. సీత ఇంత త్వరగా అలా మాట్లాడాలని ఆలోచించు కోవడం , తను మాట్లాడక ముందే మాట్లాడేయడం -- నిజంగా అదీ ఒక కళే! ఆ కళ సీతకు అబ్బింది, తనకు అది కూడా లేదు.
"ఓహో ........అలాగా!' నింపాదిగా అన్నాడు రామనాధం.
"వాళ్ళెంత ఇస్తామన్నారు?" తిరిగి కొద్ది క్షణాల తర్వాత అడిగాడతను.
మాధవరావు సీత వంక చూశాడు. ఏం చెపుతుందా అని.
"ఒకాయన నవలకు వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు. మరొకాయన పదకొండు వందలకంటే ఎక్కువ ఇవ్వలేనన్నాడు......"
రామనాధం ఉక్కిరిబిక్కిరయ్యాడు.
"అసలు మీరెంత అడుగుతున్నారు?" నెమ్మదిగా అడిగాడు.
"పదిహేను వందలు ......." నిక్కచ్చిగా అంది సీత.
అతను చాలా సేపటి వరకూ మాట్లాడలేదు. ఆలోచనల్లో పడ్డాడు. సీత సంసిద్దంగా ఉంది, అతనేమయినా ఇంకా అడిగితే జవాబివ్వడానికి.
మాధవరావు వారిద్దరినీ గమనిస్తున్నాడు. అతనికి సీత మాటలే అత్యంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
రామనాధం బిజినెస్ మన్. కనుక అతను ఎలా మాట్లాడినా తను ఆశ్చర్య పోనక్కరలేదు. ఆశ్చర్యపోడు కూడా! కానీ సీత అతని కంటే పెద్ద వ్యాపారస్తులు లాగా మాట్లాడటం అతడిని చాకితుడ్ని చేస్తోంది. ఆనాడు, ఆ మొదటి రాత్రిలో -- ఎంతో సిగ్గుగా, అమాయకంగా తనలో ఐక్యమయి పోయిన సీతేనా ఇంత చాక చక్యం ప్రదర్శిస్తోంది?
పదిహేను వందలు చాలా ఎక్కువే ......." నీళ్ళు నములుతూ అన్నాడతను.
"కావచ్చు ! కానీ అది నా నిర్ణయం, అవసరం. అంతకంటే తక్కువయితే నేను వాటిని అమ్మదల్చుకోలేదు. అని అసలు అమ్ముడు కాకపోయినా నాకు ఇష్టమే .........."
"అంత డబ్బు మేమింతవరకూ ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇస్తే మేము నష్టపోతాము ....." మళ్ళీ అన్నాడతను.
"మీరు నష్టపడాలని నా ఉద్దేశం కాదు......" లౌక్యంగా అంది సీత.
"పోనీ నేనో మొత్తం చెప్తాను వింటారా! నవలకు పన్నెండు వందలిస్తాను. అంతకంటే ఎక్కువివ్వడం నావల్ల కాదు. ఉపయోగమూ లేదు. మీకు అంగీకారమయితే చెప్పండి ......."