Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 19


    "సరే అలాగయితే తరువాత కార్యక్రమం ప్రారంభిద్దాం. నేను వెళ్ళి నాకు తెలిసిన ఓ స్కూల్ హెడ్ మిస్టేస్ ని వివరాలు కనుక్కోస్తాను. ఈ వేసవి శెలవులయిపోయేలోగా నెలరోజుల్లోగానే మనం స్కూలు ప్రారంభిద్దాం . ఈలోగా ఈ చుట్టూ పక్క లేక్కడయినా స్కూలు కోసం ఓ ఇల్లు అద్దెకు చూస్తూండండి" తను బయల్దేరుతూ అన్నాడు రెడ్డి.
    "సరే" అంగీకార సూచకంగా తలూపాడు మాధవరావు.
    అనుకోన్నట్లే పనులు చకచక జరిగిపోసాగాయి. ఆ స్కూల్ తెరవడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు రెడ్డి. ఈలోగా సీత, మాధవరావు ఆ ప్రాంతమంతా తిరిగి చివరికి రెండు గదులున్న ఓ ఇల్లు అద్దెకు సంపాదించగలిగాడు.
    వెంటనే పిల్లలు కూర్చూనే  బల్లలు చేయించడం ప్రారంభించాడు రెడ్డి. స్కూలు ముందు పెద్ద బోర్డు కూడా తగిలించారు. లోపల రంగులూ అవీ వేయించి చూడడానికి అందంగా కనిపించేలా చేశారు. స్కూలుకి ప్రారంభోత్సవం జరిగింది.
    ఆ కాంపౌండు లోని పిల్లలందరూ వెంటనే ఆ స్కూల్లో చేరిపోయారు. అంతా మూడు అయిదేళ్ళ మధ్య వయసు గల వాళ్ళే. ఆ వయసు పసివాళ్ళని కూర్చోబెట్టి చదువు చెప్పటం తమాషాగా ఉంది సీతకు. మాధవరావుకి మొదట్లో పెద్ద పనేమీ లేకపోయినా రానురాను కొంతమంది ఒకటో క్లాసు పిల్లలు కూడా చేరడంతో అతనికీ కాలక్షేపం అవుతోంది. పగలంతా స్కూలు కోసం వినియోగిస్తున్నా రాత్రుళ్ళు చాలాసేపటి వరకూ మేలుకుని కూర్చుని తన రచనలు కొనసాగిస్తోంది సీత.
    మొదట్లో ఆ స్కూలు మీద ఎక్కువ ఆదాయం రాకపోయినా క్రమక్రమంగా అది పెరుగుతుంటే సంతృప్తికరంగానే కనిపించింది వాళ్ళకు. సీతను చూస్తుంటే మాధవరావుకి జాలీ, ప్రేమా, గౌవరం ఏర్పడ్డాయి. ఆమె నిద్రపోకుండా చాలా రాత్రి వరకూ మేలుకొని కూర్చుని రచనలు చేస్తూంటే అతనూ ఆమె ప్రక్కనే కూర్చుని ఆమె కధల్లోని లోపాలు చూసి సరిదిద్దుతుండేవాడు. కధలు అల్లడంలో అతని సహకారం ఎంతో లభిస్తుండేది సీతకు.
    మనిషికి కోరికలుండటం తప్పు కాదు. ఈ విషయం తనకు తెలుసు. అందులోనూ సీతకున్న కోరికలు విపరీతమైనవేమీ కావు. ఆ వయసులో వున్న ప్రతి స్త్రీ కోరుకునేవే . కొంతమంది తన కోరికలు తీరేవి కావనీ, జీవితం ముగిసేవరకూ అవి అలా కోరికలగానే మిగిలిపోతాయనీ త్వరలోనే తెలుసుకొని వాటిని బలవంతంగా మర్చిపోడానికి ప్రయత్నిస్తారు. మరికొంత మంది తమ కోరికలు తీరేవి కావని తెలిసినా ఆఖరి క్షణం వరకు వాటిమీద ఆశలతోనే జీవిస్తుంటారు. సీత ఆ రెండో కోవకు చెందింది. ఆమె ఎప్పటికీ విసుగు చెందదు. ఏనాటికయినా తన కోర్కెలు నెరవేరగలవనే నమ్మకం ఆమెకుంది. అందుకు అహర్నిశలు శ్రమ పడి సాధించడానికి ప్రయత్నిస్తుంది.
    తను రోజూ పడుకునేముందు దేవుడిని ప్రార్ధిస్తాడు. ఆ ప్రార్ధనలో తన కోసం తను కోరేదేమీ ఉండదు. ఆ ప్రార్ధనలన్నీ సీత కోసమే "దేవుడా నా సీతను సుఖపెట్టు, ఆమె సుఖ పడేందుకు నన్నేం చేయమన్నా చేస్తాను ఎన్ని బాధలయినా పడతాను. కానీ ఆమెని సుఖపెట్టే అవకాశం మాత్రం నాకు కలిగించు"
    కేవలం సీతకోసమే ఈ స్కూలు నడపటానికి అంగీకరించాడు తను! నిజానికి ఇది కూడా తనకు సహించని వ్యాపారం. విద్యని వ్యాపారంగా మార్చకూడదని తన అభిప్రాయం. విద్య అనేది ఒక అమూల్యమయిన వరం! దురదృష్ణవశాత్తూ మన దేశంలో అందరూ విద్యని వ్యాపారంగా భావిస్తున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో అదో స్మగుల్ద్ వ్యాపారం అయిపొయింది. సీట్లు బ్లాకులో అమ్మటం, డొనేషన్ పేరుతొ లక్షలు ఆర్జించటం, పరీక్షలు డబ్బు కట్టి పాస్ కావడం ఒకటేమిటి! అన్ని విధాల నాశనం చేస్తున్నారు విద్యని.
    ఏదేమయినా స్కూలు బాగానే నడుస్తోంది. ప్రస్తుతం  దాని మీద ఆదాయం, ఖర్చులు పోను నెలకు సుమారు మూడు వందలుంటుంది. రెడ్డికి కూడా సంతృప్తికరంగా ఉంది స్కూలు వ్యవహారం . మాధవరావుకి స్కూలు పెట్టడం కోసం పెట్టుబడిగా తను ఖర్చు చేసిన రెండు వేలు లెక్కలోనిది కాదు. ఆ డబ్బు తిరిగి తను రాబట్టుకోవాలని కూడా అనుకోవడం లేదు. ఆ స్కూలుని ఆధారం చేసుకొని మాధవరావు కుటుంబం గడవడమే ప్రస్తుతం తన క్కావాల్సింది. అది ఇంచుమించుగా నెరవేరిందిప్పుడు.
    అయితే స్కూలు పరిస్థితి సీతకు ఏమంత సంతృప్తి కలిగించటం లేదు. స్కూలు అతి త్వరగా పెరిగి పెద్దదయిపోతుందనీ, అప్పుడు తమకిక ఆర్ధికమయిన ఇబ్బందులేమీ ఉండవనీ ఊహించుకొందామే. కానీ నెలలు గడిచినా పరిస్థితిలో మార్పు రాకపోయేసరికి ఆమె ఆశాభంగం పొందింది. ఇక తన జీవితమంతా ఇలాగే చాలీచాలనీ బతుకు బతకాలేమో! ఎప్పటి కప్పుడు మంచి రోజులోస్తున్నాయని అనందపడుతూ ఎదుర్చూడటం , చివరికది ఎండమావిగా తేలడం జరుగుతోంది.
    మాధవరావు కంపెనీ తిరిగి తెరిస్తే గాని కొంత సౌలభ్యం ఏర్పడదు. కానీ అదెప్పుడు తెరుస్తారో ఎవరికీ తెలీదు.
    "పోనీ --- మీరు మరేదేనా కంపెనీలో ఉద్యోగానికి ప్రయత్నించ రాదుటండీ! స్కూలు వ్యవహారాలు నేనొక్కదైనా చూసుకోగలను......." అంది సీత ఒకరోజు మాధవరావుతో.
    "అది వరకు ప్రయత్నించేగా ఈ స్కూలు పెడదామని నిర్ణయించుకుంది" ఆశ్చర్యంతో అన్నాడు మాధవరావు .
    అది నిజమేననుకోండి! మరి ఈ స్కూలు మీద సంపాదన కూడా అంతంత మాత్రంగానే ఉందిగా! మీరు కనీసం వందో, నూట యాభయ్యో సంపాదించ గలిగినా చాలు  కొంతవరకూ సర్దుబాటు అవుతుంది..........' మాధవరావు బిన్నుడయిపోయాడు.
    సీత తనను అవమాన పరుస్తున్నట్లు అనిపించసాగిందతనికి. అందుకే ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. మగాడు ఉద్యోగం చేయకపోతే ఆడదానికి చులకన అయిపోతాడనటానికి తనే నిదర్శనం.

 Previous Page Next Page