సీత నవ్వింది.
"మీరు బేరాలాడటం బావుండలేదు ........ఆ పని మా ఆడాళ్ళు చేయాలి!"
అతను నవ్వేశాడు.
"నిజమే కాని .......ఇది వ్యాపారం కాబట్టి తప్పదు. నాకు నష్టం రాకుండా చూసుకోవాలంటే బేరసారాలు తప్పవు కదా........"
"సారీ! అంత తక్కువయితే ఇవ్వడం ఇష్టం లేదని ముందే చెప్పాను కదా........!" మీరు ఇక వెళ్ళవచ్చు అన్నట్లు చూస్తూ అందామె.
"మీరు మరి అంత కఠినంగా ఉంటే బావుండదు. ఇవతల మా ఇబ్బందులు కూడా ఆలోచించాలి మరి. మీకొక్కరికె కాదు -- మీ నవలలన్నీ అమ్ముడు పోవాలంటే చాలా మందికి లంచాలు తినిపించాలి........"
"అవతలివాడి ఇబ్బందులు గురించి ఆలోచిస్తే వ్యాపారమేం సాగుతుంది?" నవ్వుతూ అంది సీత.
రామనాధం జవాబివ్వలేక నెత్తి గోక్కున్నాడు.
"చూడమ్మా! ఇంకోక్కమాట చెప్తాను. పదమూడు వందలు! అంతే. ఇష్టమయితే చెప్పండి! లేదంటే నా దారిన నేను పోతాను........" లేచి నుంచుంటూ అన్నాడతను.
"ఊహు!" తల అడ్డంగా తిప్పింది సీత.
"సరే మీ యిష్టం . వస్తానండీ , నమస్తే...." బయటకు వెళ్ళిపోతూ అన్నాడతను.
అటోరిక్షా కదిలేవరకూ చూసి గట్టిగా నవ్వేశాడు మాధవరావు.
"సీతా , ఇదంతా నాకెలా ఉందొ తెలుసా? ఆరేళ్ళ కుర్రాడు మొదటిసారిగా సర్కస్ చూస్తె ఎలాంటి థ్రిల్ అనుభవిస్తాడు? అలాంటి స్థితిలో ఉండిపోయాను. నాకనిపించింది - నేను మాట్లాడకపోవడం ఎంతో మంచిదైందని . నువ్వు చొరవ చేయకపోయినట్లయితే ఏ ఎనిమిది వందలకో ఒప్పేసుకొని ఉండేవాడిని."
"నాకు తెలుసు --- మీరు అంత పనీ చేస్తారనీ" నవ్వుతూ అంది సీత.
"కానీ అతన్నలా వదిలేశావేం? పదమూడు వందలు తక్కువేం కాదుగా?"
"అతనేక్కడికీ పోడు. మళ్ళీ వస్తాడు చూడండి! పదమూడు వందల వరకూ వచ్చినవాడూ రెండు వందల కోసం వెనక్కి పోతాడా. అయినా ఇదే బాగా పేరున్న రచయిత్రుల కయితే ఐదు వేలు కూడా ఇస్తారట! మరి మనకి పదిహేను వందలివ్వడానికేమయింది?"
మాధవరావుకి విషయాలన్నీ కొత్తగా ఉన్నాయి. సీత కిన్ని విషయాలు తెలుసునని కూడా అతననుకోలేదు.
"కానీ సీతా. పెళ్లినాటికి ఇప్పటికీ నీలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా? అసలు అప్పటికీ, యిప్పటికీ పోలికే లేనంతటి మార్పు. ప్రపంచన్నంతా పూర్తిగా చదివేసినట్లు మాట్లాడుతున్నావ్. ఈ కొద్ది రోజుల్లోనే. ఎలా జరిగిందంతా?"
"ఇవన్నీ జీవితమూ, అవసరాలూ నేర్పిస్తున్న పాఠాలండీ. అంతే!' నవ్వేస్తూ అందామె.
"ఇవాళ నేనో నిజం తెలుసుకొన్నాను సీతా. నువ్వు అన్నివిధాల నాకంటే గోప్పదానివి. నేను ఉత్తరాలు కూడా రాయడం చేత కాని వాడిని. నువ్వు ఎంతో మంది పాఠకుల నాకట్టుకొన్న రచయిత్రివి! నీకు జీవితం మీద ఆశ వుంది. నేను జీవివచ్చవం లాంటి వాడిని. నువ్వు అనుకొన్నది సాధించగలనన్న నమ్మకం నీకుంది. నాకు లేదు. ఎలాంటి అవాంతరాన్నయినా నువ్వు ఎదుర్కోగలవు. నాకది చేతకాదు. అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న నన్ను చేసుకొన్నందుకు నీకెప్పుడయినా విచారం కలుగుతుందా సీతా!" ఆవేదనతో అడిగాడతను.
సీతకు నవ్వు వచ్చింది. నిజమే అతనన్నమాటలు! తనకు అతను సరయిన జోడి కాదు! తన మనస్తత్వం వేరు- అతని ఆలోచనలు వేరు. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలనుకొనే తత్త్వం తనది. ఎలాగోలా జీవితం లాగించేలనే మనస్తత్వం అతనిది. అయినా తనెప్పుడూ అతన్ని చేసుకొన్నందుకు విచారించలేదు. అతని ఆలోచనా ధోరణి మారనందుకు మాత్రమే విచారపడుతోంది అంతే.
"మీరు అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండండి? నేను జవాబు చెప్తే అప్పుడడగండి...." నిష్టూరంగా అందామె.
"ఏదేమయినా నేనో నిర్ణయం తీసుకొన్నాను సీతా ! ఇకనుంచీ ఇలాంటి విషయాలన్నీ నువ్వే మాట్లాడాలి. నేను కల్పించుకుంటే అంతా అభాసయిపోతుంది. అంచేత నేను పూర్తిగా డమ్మీ నయిపోతాను సరేనా?"
"మీ ఇష్టం! మీకంత భయంగా వుంటే నేను మాట్లాడతాను లెండి! నాకిప్పుడు బాగా అనుభవమయిపోయిందిగా, ఎవరితో ఎలా మాట్లాడాలో ....." చిరునవ్వుతో అందామె.
ఆమె అన్నట్లే ఆ సాయంత్రానికే మళ్ళీ వచ్చాడు రామనాధం.
మూడు వేల రూపాయలకు చెక్కు రాసి అగ్రిమెంట్ రాయించుకొని వెళ్ళిపోయాడు. మాధవరావు ఆశ్చర్యానికి అంతులేదు. మూడు వేల రూపాయలు సీత క్షణంలో రాబట్టగలిగిందంటే ఇదో గొప్ప వింతే, తను పదినెలలు కష్టపడి కంపెనీలో ఉద్యోగం చేస్తేనే గాని సంపాదించలేని మొత్తం. అదంతా సీతకి కేవలం రెండు నవలలు రాసి సంపాదించ గలిగింది.
ఇది జరిగిన కొద్ది రోజులకు మరో విచిత్రం కూడా జరిగింది. ఓ యువకుడు సాయంత్రం సమయంలో ఆమె ఇంటి కొచ్చాడు.
"నమస్కార......' అన్నాడతను ఆమెను చూస్తూనే.
నమస్తే " అంది సీత ఎవరా అని ఆశ్చర్యపోతూ.
అతను లోపలికి నడిచి కూర్చున్నాడు.
"న పేరు శివరామ్. నేనో మాస పత్రికను ప్రారంభిస్తున్నాను. వచ్చే దీపావళి కి విడుదలవుతుంది. ప్రారంభ సంచిక. అందులో మీ సీరియల్ ఉండాలి! మీ సీరియల్ అంటే నాకెంతో ఇష్టం. ఇంతే నేను చెప్పదలుచుకొంది. మీ రచనలు విపరీతంగా చదివే పాఠకులున్నారనడం ఒక్కటే కారణం కాదు. నేను కూడా మీ అభిమానిని. కనుక నా పత్రికలో మీ సీరియల్ ఉండాలని ఓ సెంటిమెంట్ డెవలప్ చేసుకొన్నాను! యిది కాదనకండి! మీరు నవలంతా ఒకేసారి కూడా ఇవ్వనక్కర్లేదు. ప్రతినెలా కొంత రాసి ఇవ్వొచ్చు!"