Previous Page Next Page 
మైదానం పేజి 20


    "వుండు మీరా."
    ఆనాడు అమీర్ కొండకింద ప్రవహించే యేట్లోకి నన్ను తోస్తానని బెదిరించాడు. నేనతని మెడ పట్టుకుని వేళ్ళాడ్డమూ, నన్ను కావులించుకుని "అమ్మా! నాదాన్ని, ప్రాణాన్ని, నేను ఒకరవ్వ విడుస్తానా? అనడమూ; ఆ కొండ పెద్ద నల్లరాతి ముందు నన్ను నుంచోబెట్టి తను కొంచెం కిందికి దిగి నన్ను చూస్తూ అక్కడనించే తన ఆనందాన్నీ ఆశ్చర్యాన్నీ వెలిబుచ్చడమూ, పిచ్చిపాటలు పాడుతూ ఆ వెన్నెలనంతా చేర్చి బట్టని చేసి నాకు కట్టుకోడానికి కిస్తానని నవ్వడమూ; నిద్రపోతానంటే వెన్నెల వృధా అవుతుందని చంద్రుడు పచ్చగా పెద్దగా పడమట కుంకే వరకూ మాటిమాటికీ మూతపడే నా కళ్ళని బలవంతంగా తెరిచి చూపుతో వుండడమూ.
    మీరా యేడీ? లేచి పిలిచాను.
    ఇంటికి వెళ్ళాడా?
    లేచి సగం వెతుకుతూ సగం ఆలోచిస్తూ తిరుగుతూ వున్నాను. మీరా కూడా వెళ్ళిపోయినాడా నన్ను ఒంటరిదాన్ని జేసి యీ రాత్రి? ఏటివొడ్డున పడుకుని కనబడ్డాడు యిసుకలో-"మీరా?" కదలలేదు. లేపాను. వూయించాను. ఏడుస్తున్నాడు.
    మనసుకు తట్టింది?
    "నీతో మాట్లాడలేదనా? అవునా? చెప్పు. నన్ను క్షమించు. నిజంగా చాలా దిగులుపడుతున్నాను. ఎప్పుడో ఒకప్పుడు అట్లా మరుపు వొస్తే యింత ఆగ్రహిస్తావా! లేదు. ఏం! నిజం అట్లా అనుకుంటావా? కాదు. నిర్లక్ష్యమచేసి కాదు కాదు. కాదు"-
    "యేమిటి? నువ్వు నాకు చవక కాలేదు. ఎన్నటికీ కావు....నాతో మాట్లాడవా!"
    "పోనీలే అమ్మా అంత కోపమైతే"
    నాకు విసుగూ రోషమూ వస్తున్నాయి. అమీర్ లేని బాధ ఎక్కువవుతోంది. అంత అందమైన వెన్నెలకి బలిచేసి వెళ్ళిపోయిన నా నాధుడి క్రూరత్వం నన్ను కోస్తోంది. జీవితం దుర్భరం. జీవితం నిష్ఫలం. నాకింక ఆనందం లేదు. ఇంక ఆశలేదు. ఎందుకు బతికి? నన్ను వెక్కిరించినట్లు యీ సౌందర్యమంతా ఏమిటి!
    "మీరా ఎందుకు నన్నిట్లా యేడిపిస్తావు?" మీరా లేడు.
    వొంటరిగా ఆ యేటివొడ్డున కూచున్నాను. మా ప్తానాలు, మా ప్రేమ, మా ఈతలు, మా సరసాలు అన్నీ ఆనందించిన యేరు నన్ను చూసి జాలిపడ్డట్టే వుంది ఆ యేరు. 'నదీ, నా తల్లీ? నువ్వే నా దిక్కు' అన్నాను. ఏడుపోచ్చింది నా మీద? నా జీవితం మీద నాకు చాలా జాలి కలిగింది.
    ఈ నదిలోనే పడి మునిగిపోతాను. అమీరు వచ్చి యేడుస్తాడు. ఒంటరిగా యీ కొండలు, ఈ మైదానం, ఈ దుబ్బులు చూసి నన్ను పిలుస్తూ పశ్చాత్తాపపడుతూ యేడుస్తూ వెతుకుతాడు. అతని దుఃఖం తలుచుకుని వెక్కివెక్కి యేడుస్తున్నాను కాబోలు. మెల్లిగా మీరా వచ్చి నా చెంపల్ని తాకేదాకా నాకు తెలీదు.
    "ఎందుకేడుస్తావు?"
    అమీర్ కోసం అంటే మళ్ళీ వెళ్ళిపోతాడేమో.
    "ఎందుకు వెళ్ళిపోయినావు?"
    "నా మనసు మంచిదికాదు. దుష్టుణ్ణి. నా సంగతి పోనీ, నువ్వేమిటి యీ రాత్రి యోచిస్తున్నావు?"
    "చెపితే నీకు కోపం వస్తుంది."
    "అమీర్ని గురించేనా?"
    "అవును"
    "నాకు కోపమెందుకు? నాతో చెప్పు."
    అమీర్ నన్నెందుకు వొదిలాడో మీరాకి తెలీదు.
    కన్నీళ్ళతో, నిట్టూర్పులతో అంత సంగతీ మధ్యమధ్య సిగ్గుపడుతూ చెప్పాను, నిదానంగా విన్నాడు. అమీర్ని తిట్టలేదు, నాకోసం జాలిపడలేదు. ఆ సంగతి మరిపించేసి నాతో ఆదుకుని నేను నిద్రపోయిం తర్వాత వెళ్ళిపోయినాడు. మర్నాడు ఒకత్తె వొచ్చింది.
    "ఎన్ని నెల్లు అయింది?" దాని మాట నా కర్థం కాలేదు.
    రాత్రంతా అమీరు కలలు కన్నాను. పగలంతా, అతను లేడనే విరహంతో మాడిపోతున్నాను. నా వికారంతో, డోకులతో, వొంటరి తనంతో, విరహంతో, శూన్యభావంతో, నా మాతృభావం అడుగంటింది. నేను వెర్రిపట్టుపట్టి నా అమీర్ని వెళ్ళగొట్టానా? ఈ బిడ్డ పుడితే మాత్రం యెట్లా పెంచను? ఏం చేసుకోను? పోషణ యెట్లా? మా ఆనందానికీ, మా షికార్లకీ ఆటంకమనేకదా, అమీరు యీ కడుపు వొద్దన్నది అనుకున్నాను. ఆ పిల్లకి పాలిచ్చుకుంటూ, ఆ పిల్ల ఏడుపు సముదాయిస్తూ, దాని మురికితో నిండి, ఆ ధ్యానలోనే మునిగి....ఆ బిడ్డ మా ప్రేమని నాశనం చెయ్యదా? నాకంటె దూరదృష్టి కలవాడు అమీర్. అతనికి కోపం వచ్చిందంటే తప్పా మరి!
    ఇప్పుడు నన్ను అమీర్ వొదిలి వెడితేనే దిక్కుమాలిన పక్షినైనానే. ఆ పిల్లతో సహా ఏనాడో నన్ను వొదిలేస్తే యిద్దరమూ యామైపోతాము? ఇప్పుడు బతుకు దుర్భరమైతే యే యేటిలోనో ముంచి అంతం చేసుకోగలను నా బాధని! అప్పుడో? అని అనుకుంటూ వుండగా వొచ్చిందా మనిషి.
    "నెల లేమిటి?"
    "మీరాగారి అక్కగారు నన్ను పంపించారు."
    "ఎందుకు?"
    తెలిసింది. వొప్పుకోనా?
    కాని నా చిన్నపాపని. నన్ను నమ్ముకుని నాలో దాక్కున్న పాపని....కాని మళ్ళీ అమీర్ రావడమూ, నేనూ అతనూ ఆ మైదానంలో పూర్వం మల్లేనే....'సరే' అన్నాను.
    ఒక్కమాటలో, ఒక్క తలవూపుతో యీ దుస్వప్నం చెదిరిపోతుంది. మళ్ళీ మెలకువ వచ్చేటప్పటికి, మళ్ళీ అమీర్ నా ప్రక్కన వుంటాడు. మళ్ళీ జీవితమంతా ఆనందమయ మవుతుంది. ఈ పిల్ల లేకపోతేనేం-కాలమంతా గంతులేస్తే, నా ముందు నవ్వుతూ పరుగెత్తుతూ వుంటే! ఎంత వెర్రివాళ్ళీ మనుషులు! ఆశపడి నవ్వుల్ని చేతుల్నిండా పోగుచేసుకుని అతి ఆశతో గుప్పెట్లు తెరిచి చూసుకుంటే, భరించలేని కన్నీళ్ళుగా మారి కనపడతాయి.
    ఆ మూడు రోజులూ యమ బాధపడ్డాను. ఇంక మీరా నన్నంటి పెట్టుకొని నాకు పరిచర్య చేస్తూ నీతో కలిసి పడ్డ వేదన, రుణం యెన్ని జన్మాలలో తీర్చుకోగలను? నానించి యేమాత్రం ప్రత్యుపకారమూ వొస్తుందనే ఆశైనా లేక నాకు చూపిన అట్లాంటి ప్రేమని పొందిన నా జీవితాన్ని తలుచుకుంటే నా వొళ్ళు పొంగిపోతుంది. నన్ను తాకుతూ, నా జుట్టు దువ్వుతూ, నా నోట్లో జావా పోస్తూ, 'తగ్గిందా?' అని ప్రతి నిమిషం అడుగుతూ, నా కళ్ళలోకి చూస్తూ, నా చీర సర్దుతూ నా పక్కన కూచుంటే, నిజంగా యింకా నాలుగు రోజులు బాధలో పడుకోవాలనిపించింది.

 Previous Page Next Page