Previous Page Next Page 
మైదానం పేజి 21


    ఆదుర్దాతో వెలవెలబోయే అతని మొహం చూస్తూంటే నా బాధ మరచి అతని బాధకై బాధపడేదాన్ని. నేనొక్క పెద్ద మూలుగు మూలిగి నప్పుడల్లా అతను విలవిలలాడి హడలిపోయేవాడు. అతని కళ్ళలోని వ్యథని చూడలేక ఆ నెప్పినంతా కుక్కుకుని కళ్ళు మూసుకు పడుకుంటే మళ్ళీ మళ్ళీ పలకరిస్తాడు. నేనెటు తిరిగితే అటు వొచ్చి కూచుంటాడు. నేను నిద్రపోతూంటే పాదాల దగ్గిర తల పెట్టుకుని పడుకుని నేను కదలినప్పుడల్లా చప్పున లేచి కూచుంటాడు. నా మీరాని, ఉరితీస్తారుట అతన్ని. యామవుతుందో అతని అందం, అతని హృదయం? యే గులాబి పువ్వులకి కొత్తరంగు, యే నక్షత్రానికో కొత్తమెరుపు, ఏ మబ్బులకి కొత్త నునుపు నిస్తుందో? ఏ దేవతల హృదయాలు కొత్తజాలిని, ఏ గంధర్వుల బాహువులకి కొత్తరసన, ఏ కిన్నెరుల కంఠాలు కొత్త పాట నిస్తుందో! మీరా! మీరా!  
    ఆ రాత్రి నేను పక్కమీదపడి మూలుగుతున్నాను. అంతసేపు నా పక్కమీద పడి కూచున్న మీరా కుండపట్టుకుని యేటి దగ్గరికి వెళ్ళాడు. మీరా తెచ్చిన లాంతరు గుడిసెలో వెలుగుతోంది. గుమ్మంలో నించి తూలుతూ నల్లని గడ్డం మనిషి వొస్తున్నాడు. వాడే ఆనాటి రాత్రి గడ్డం వాడని నాకు వెంటనే తెలిసి ప్రాణా లెగిరిపోయాయి. వాడు తాగి వుండకపోతే నా స్థితి అర్థమై వెళ్ళేవాడేనేమో? మీరా కోసం పెద్ద కేక వేశాను. వాడు తొరగా వచ్చి నా చేతులదిమి మీదపడి అల్లరి చేస్తున్నాడు. వాడితో పెనగడానికైనా శక్తిలేదు. మూలిగాను. బతిమాలాను. యింకా రాడేం మీరా! వొచ్చినా మాత్రం యీ రాక్షసి యెదుట యేం చేయగలడనే ఆలోచన తోచనేలేదు. మీరాని ముందే బైటవాణ్ని బైటనే యామన్నాచేసి రాలేదు కద వీడు? నా మూలాన, నాకోసం మీరా గతి యామైంది? ఆ తలుపుతో నా అవస్థని నేను మరిచిపోయి అతనికోసం గోలపడ్డాను. నన్ను రక్షించుకునే ధ్యాసే రాలేదు. ఐనా యేం చెయ్యగలను. వాడు నన్ను కిందికి అదిమి మరీ అశక్తురాలిగా చేశాడు. కళ్ళు తిరిగి బలహీనంతో మూతలు పడ్డాయి. ఎంతసేపయిందో పెద్ద కేకలు వినబడి కళ్ళు తెరుచుకున్నాయి. మీరాని వాడు మెడ పట్టుకుని లాక్కెడుతున్నాడు. రక్తం కనబడ్డది. మళ్ళీ తెలివితప్పి పడిపోయినాను. లేచేటప్పటి కంతా నిశ్శబ్దం. దీపం మాత్రం వెలుగుతోంది. మీరా లేని సంగతి మొహాన కొట్టినట్లు అయి నాకు దిమ్మ తిరిగింది. ఆ రాత్రి నేను పడ్డ బాధ యీ కోర్టువారు నన్ను ఉరి తీసేటప్పుడు కూడా పడను. అంతే కావాలి అనుకుంటున్నావు. అట్లాంటి బాధ, నా మీరా, నా ప్రాణదానం జేసి, నాకోసం బలిపడ్డ మీరా కోసం పడ్డ తపన యెంత ప్రేమలోనించి వొచ్చి వుండాలి? అది ఆలోచించు, ఆ ప్రేమ చాలదూ?
    నేను పెద్ద రక్తపు మడుగులో దొర్లుతున్నాను. దాహంతో నాలిక లోపలికి లాక్కుపోతోంది, లేచి నీళ్ళ చెంబందుకోలేను. మీరా! మీరా! మీరా యేడీ! యామైబోయినాడు? చప్పున నాకళ్ళముందు ఇందాక చూసిన పటం కనపడ్డది. ఆ రక్తం! వాడి చేతుల్లో కత్తి! వాడుపోనీ, తన దుర్మార్గం నెరవేర్చుకొనడానికైనా వెనక్కి రాకపోవడం! ఏం జరిగింది! తలచుకున్న కొద్దీ భయమేసింది. ఎక్కడ యే నూతిలో పారేశాడో! ఇప్పుడేదో గోతిలో కత్తిపోటు తిని మూలుగుతున్నాడేమో. మధ్యాహ్నం నా మెడచుట్టూ చేతులేసుక్కూచున్న మీరా? అక్కడైనా, ఆ బాధలోనైనా నన్నే తలుచుకుంటూ వుంటాడు ఏమైనానో అని, నా కాళ్ళు చేతులు ఇటూఅటూ కొట్టుకున్నాను. ఏం చెయ్యను? తీసుకురాగలిగితే ఎవరన్నా పిలవగలిగితే! తమాషా. అమీర్ వస్తే బావుండును. అతన్ని పంపిద్దును అని తోచి, యేడుపొచ్చింది? ఇంకేం మీరా? వాళ్ళ అమ్మ యెంత యేడుస్తుంది? నన్నెంత తిడుతుంది? ఆమెకన్నా తెలియజేయ గలిగితే! లేవబోయినాను. కిందపడ్డాను మళ్ళీ!
    గుడిశ తలుపులోంచి ఉత్తరాభాధ్ర కనబడుతోంది. దాని వెనక నించి చంద్రవంక విచారంగా ఉదయిస్తోంది. ఆ యర్రని కాలయముడు ప్రాణులపై పంపిన మరణపాశం వలె కనబడ్డది. దానికి నా మీరా కనపడుతున్నాడు? యే గోతిలోనో రక్తంకారే మీరాని చూసి కాదుగదా ఆ అరుణ కాంతి.... నక్క కూస్తోంది....యే గోతిలోనో, మీరా శవాన్ని వెన్నెట్లో చూసి కాదు కదా? అయ్యో మీరా! ఆ యేరట్లా యేడుస్తుందేం, యీరాత్రి! దాంట్లో పారెయ్యలేదు కదా మీరాని చంపి! ఈ దాహం యెట్లా? లేవలేను. ఎందుకు లేవడం? యెవరికోసం, కాని యీ బాధ! యింకెవరొస్తారీవేపు మీరా పోయిన తర్వాత! యింతే! నేనింక చావవలసిందేనా? అంతే కావాలి....అమీరు వొచ్చి తన క్రూరత్వం వల్ల యేం జరిగిందో తెలుసుకుని, పశ్చాత్తాపంతో మండిపోవాలి. కాని అతనికేం!(ఇంకెవ్వరినో తెచ్చుకుంటాడు. యిప్పటికప్పుడే తెచ్చుకున్నాడేమో!.... యీ ఘోరానికంతా అతనే కారణం? అతని కోసం) నేనీ తీవ్రత్యాగం చేశాను. చాలా కోపం వచ్చింది. అట్లాంటి క్రూరుణ్నెట్లా ప్రేమించానా అనుకున్నాను. మీరా నన్నింకా ఆక్రమించుకున్నాడు. మీరా కోసం దేవుణ్ని ప్రార్థించాను. వాళ్ళ అల్లాను వేడుకొన్నాను.... 'మీ వాడిని, మీరాని రక్షించ'మని కాని అమీరుని రప్పించమని ఏడ్చినపుడు నా మొర నెవరు విన్నారు! పోనీ అమీరు రాకపోయినా సరే మీరాను రప్పిస్తే చాలునన్నాను. తన ప్రాణాన్ని నాకు ఆహుతి చేసిన ప్రణయధీరుడు నా మీరా? కాని పాపాత్మురాలిని. నా యేడుపు దేవుడు వింటాడా? యెట్లా తెల్లవారిందాకా యీ 'సస్పెన్సు'లో కాలం గడపటం! తెల్లవారితే మాత్రం! పోనీ చచ్చిపోకూడదా? దాహం యింక బతకలేను. దాహం, బలవంతంగా లేచి కూచున్నాను. బట్టలన్నీ రక్తంతో తడిసి వున్నాయి. ఆ రక్తం మధ్య చిన్ని నోరెరగని పిల్ల? చిన్న కళ్ళు మూసుకుని, చిన్న కాళ్ళు, పొట్ట - భరించలేక పోయినాను. కళ్ళు తిరిగి పడిపోయినాను గావును-మళ్ళీ మెళుకువ వొచ్చింది. భయమేసింది. ఆ గుడిశక్తి- ఆమె దానానికి పిల్లా నేనూ! అదీ! అది కదిలితే! లేచి బైటికిపోతే! చంపినందుకు నా మీద కసి తీసుకుంటే ప్రేమా దిగులూ మాయమై, భయం పట్టుకుంది. భరింపలేని దాహం! అమ్మా! ఏం బాధ పడ్డానో! రాత్రి ప్రతినిమిషమూ చస్తాననుకున్నాను. ప్రతిచప్పుడికీ ఉలికిపడి వొణికాను. కాని చావను. నిద్రో! మూర్చో!
    మృదు పాదపద్మాల చప్పుడు నా హృదయంమీద కొట్టి లేపింది. వేగుచుక్కలో నించి వూడిపడ్డాడు. నా మీరా పీక్కుపోతున్న నాలికతో- "వొచ్చావా? నా మీరా? నువ్వేమైనావు చెప్పు" అన్నాను.
    చెప్పక "నువ్వెట్లా వున్నావు?" అంటూ నా రక్తాన్ని చూసి పెద్ద కేకేశాడు.
    "నిన్నేం చేశాడు."
    "ఏం చెయ్యలేదు. అసలు మళ్ళీ రాలేదు."
    "రాలేదు కదా! ఆ రక్తమేమిటి?"

 Previous Page Next Page