Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 20


                                          8


    సూర్యకిరణాలు కళ్ళమీద చురుక్కుమన్నాక కళ్ళు తెరిచింది విదుషి. రాత్రి చాలాసేపటివరకూ ఆమె నిద్రపోలేదు ఆలోచిస్తూ! అంచేత పొద్దెక్కేవరకూ లేవలేకపోయింది.
    "లేచారా! మీకు ముఖం కడుక్కోవడానికి అన్నీ రెడీగా వున్నాయి బాత్ రూంలో! రండి" అంది రాణి వయ్యారాలు పోతూ. లేవగానే రాణి కన్పించడం విదుషి మనసుకి ఆహ్లాదం కలిగించలేదు. ఎందుకు రాణి అంటే విముఖత్వం కలుగుతోంది విదుషిలో! అనాకారి అని కాదు. రాణీ అందగత్తె కాకపోయినా బాగానే ఉంటుంది. మూర్ఖత్వం అనుకోవడానికీ లేదు. పరమ గడుసుగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయిలో ప్రతి క్షణమూ అణువణువునా ఉరుకుతోన్న వెకిలితనమే, ఆమెపట్ల వెగటు కలిగిస్తోంది విదుషిలో!
    లేచి కాలకృత్యాలు ముగించి, అచ్యుతమ్మ ఇచ్చిన కాఫీ అందుకుని, ఇళ కోసం వెతికింది! అప్పటికే, ఇళ ధ్యానంలో ఉంది. ధ్యాన ముద్రలో ఉన్న ఇళని చూసి ముగ్ధురాలయింది విదుషి. నిశ్చలమైన ఏకాగ్రమైన ధ్యానం చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా ఇళకి తెలీదు.
    అంతటి ఏకాగ్రత కుదరటం గొప్ప అదృష్టం. మనసుని అంత నిశ్చలంగా ఉంచుకోగలుగుతోంది కాబట్టే గుండెజబ్బు విషమించలేదు. కానీ, అది ఎప్పటికయినా ప్రమాదమే!
    అచ్యుతమ్మ విదుషిని పక్కకి పిల్చి చెప్పింది.
    "మీరు చెప్పినట్లే ఇళకి ఫలహారంగా పళ్ళూ, పాలూ ఇస్తున్నాను. ఇడ్లీ కాఫీలు ఇయ్యడం లేదు. బంగారుతల్లి. అది కూడా 'ఇది కావాలి, అది కావాలి!" అని అడగదు."
    అచ్యుతమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి.
    "ఊరుకోండి. తనకి జబ్బు ఉన్నట్లు ఇళకి తెలియనియ్యకండి. ఇవాళ మళ్ళీ పరీక్ష చేస్తాను" చెప్పింది విదుషి.
    ఇళ ధ్యానంలోంచి లేచి, పళ్ళూ పాలూ తీసుకున్నాక, భక్తుల రాక మొదలయింది. అచ్యుతమ్మ విదుషి సలహా బాగానే అమలుపరుస్తోంది. ఇళ ఒక సోఫాలో కూచుంది. తీర్థప్రసాదాలూ వగైరా అచ్యుతమ్మ చూసుకుంటోంది. భక్తులు ఒకరి తర్వాత ఒకరు క్యూలో వస్తున్నారు. ఒక్కొక్కరికి పది నిముషాల టైం. వాళ్ళు తమ కోరికలు, బాధలు, భయాలు, ఆశలూ విన్నవించుకుంటూంటే చిరునవ్వుతో వింటుంది అంతే. ఏం మాట్లాడదు. వాళ్ళు కానుకలు ఇళ పాదాల ముందు సమర్పించుకుంటారు. వాళ్ళు వెళ్ళగానే ఆ కానుకలు దాస్తుంది అచ్యుతమ్మ. కొన్ని సందర్భాలలో బంగారు నగలు కూడా వుంటాయి కానుకల్లో! అవి అచ్యుతమ్మ జాగ్రత్త చేస్తున్నంతసేపూ రాణీ ఎటూ కదలకుండా అక్కడే ఉంటుంది. ఎందుకో ఎవరూ చెప్పకుండానే అర్థమయింది విదుషికి. కానుకల్లో నామాలయ్యకి గుండయ్యకి కూడా వాటా వుంది. ప్రజల వేలంవెర్రిని చూసి ఎంతో బాధపడింది. సిగ్గుపడింది. దీనికంతకూ తను కూడా ఒక మూగసాక్షిగా ఉన్నందుకు తనమీద తనకి కోపం వచ్చింది. ఎలాగయినా ఈ వలయాన్ని ఛేదించాలి. ఇళని దీనిలోంచి బయటపడెయ్యాలి.
    విశ్రాంతి సమయంలో తన స్టెతస్కోప్ తో పరీక్షించింది ఇళని. 'నాకెందుకూ పరీక్ష? బాగానే ఉన్నానుగా" అంది ఇళ.
    "ఊరికే! డాక్టర్ కి పాత రోగిని చూస్తే పరీక్ష చెయ్యాలనిపిస్తుంది."
    స్టెతస్కోప్ తో ఇళ గుండె, ఊపిరితిత్తులూ, వెన్నూ పరీక్షించింది.
    "ఏం చెపుతుంది నీ మిషన్?" నవ్వుతూ అడిగింది ఇళ.
    "నీకు ఏ అనారోగ్యమూ లేదని చెపుతోంది."
    హాయిగా నిద్రపోయింది ఇళ. అప్పుడు పక్కగదిలో అచ్యుతమ్మతో చెప్పింది విదుషి.
    "మీ అమ్మాయి పరిస్థితి ఇదివరకటి కంటే పాడయింది. ఇ.సి.జి. తీస్తేగాని అసలు స్థితి తెలీదు. వెంటనే ఆపరేషన్ చేయించకపోతే, మీ అమ్మాయి మీకు దక్కదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం లేదు."
    అచ్యుతమ్మ గుండెల్లో రాయి పడింది.
    "మీరు చెప్పినట్లే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాగా!"
    "అందుకే ఈ మాత్రంగా ఉంది. ఇలా ఎల్లకాలమూ కొనసాగించగలమని భ్రమపడకండి. నవ్వుతూ తిరుగుతున్నట్టుగానే ఉంటారు. ఉండుండి ముంచుకొస్తుంది. అంతా క్షణాలలో అయిపోతుంది. నా మాట విని మీ అమ్మాయిని హైదరాబాద్ తీసుకురండి వెంటనే! ఆపరేషన్ ఏర్పాట్లు నేను చూస్తాను."
    "ఇప్పుడు మాకు డబ్బుకి లోటు లేదులే! ఆయనకి చెప్తాను. నువ్విక్కడే ఇంకా ఉంటావా?"
    "ఉండను. ఈ రాత్రి ఉండి, ఉదయమే వెళ్తాను." రాత్రి ఉండాలని విదుషి నిర్ణయించుకోవడానికి కారణం, జ్యోతి విషయం తెల్సుకోవాలని!
    సాయంత్రం భోజనాలయ్యాక, పెరట్లో అరుగుమీద కూచుని మాటలు ప్రారంభించారు విదుషి, ఇళ. "నువ్వు భగవద్గీత, ఉపనిషత్తులు చదివావా?"
    "లేదు. దుర్గాదేవి మహిమ చెప్పే కథను విన్నాను. భారత భాగవతాలో కథలు తెలుసు."
    "కథలు కాదు. దేవుడు, దేవి-ఈ భావనకి ఆధారమేమిటి? రోజూ నువ్వింత కష్టపడి చేసే ధ్యానానికి ధ్యేయమేమిటి? ఇలాంటి సంగతులు."
    అయోమయంగా చూసింది ఇళ. తల అడ్డంగా ఊపింది.
    "పోనీ, నీ ఉద్దేశ్యంలో దేవుడంటే ఎవరూ?"
    "ఒకడేమిటి? చాలామంది దేవుళ్ళున్నారు. సత్యనారాయణ స్వామి మల్లికార్జునస్వామి..."
    "ఆగాగు. లిస్ట్ చదవకు. ఈ దేవుళ్ళందరూ వేరు వేరు అనుకుంటున్నావా?"
    "అందరూ విష్ణుమూర్తి అవతారాలే!"
    "కానీ మళ్ళీ విష్ణువూ, శివుడూ వేరు కదూ?"
    "తిక్కన హరిహరమూర్తిని ఆరాధించాడు. ఆ ఇద్దరూ ఒకటే అని చెప్పాడు."
    "ఫర్వాలేదే. ఓహో? నువ్వు మీ నాన్నగారి దగ్గర చిన్నతనం నుంచీ రోజూ భారతం వినే దానివి కదూ? ఇది చెప్పు. దేవుడంటే, నువ్వు గుళ్ళో పూజించే బొమ్మ అనుకుంటున్నావా?"
    "కాదు ఏ దేవుడ్ని పూజించాలనుకున్నారో ఆ దేవుడ్ని మంత్రాలతో బొమ్మ మీదికి ఆవహింపచేస్తారు."
    "వెరీగుడ్. అంటే, నువ్వు పూజించే దుర్గ విగ్రహమే దేవత కాదన్నమాటేగా!"
    ఇళ మాట్లాడలేదు కొంచెంసేపు.
    "కానీ, నేను ధ్యానంలో ఉన్నప్పుడు దుర్గామాత తేజోరూపం నాకు కనపడుతుంది. దేవత కాకపోతే నాకు కనపడుతుందా? నేను అబద్ధం ఆడుతున్నాననుకుంటున్నావా!"
    "లేదు. లేదు. నీ మాటలు నిజమని నాకు తెలుసు. ధ్యానానికి ఆ శక్తి ఉంది. అయితే నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను. ఎప్పుడైనా నీకు చాలా చాలా ఇష్టమయిన వాళ్ళు, నువ్వు ఎక్కువగా తలచుకునే వాళ్ళు... నీకు దూరంగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర్నుంచి ఉత్తరం రాయడమో, వాళ్ళు కనపడినట్లో, మనసు పిలిచినట్లో వాస్తవంగా అనిపించటమూ జరిగిందా నీ అనుభవంలో!"

 Previous Page Next Page