Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 19


    "నేను దర్శనానికి రాలేదు. డాక్టరు విదుషిని. ఇళని చూడటానికి వచ్చాను."
    బయటినుంచే చెప్పింది విదుషి. తలుపులు తెరుచుకున్నాయి. "లోపలికి రండి" అని ఆహ్వానించింది అచ్యుతమ్మ. ఆయాచితంగా వచ్చి తన కూతురి ఆరోగ్యం గురించి వ్యాకులపడుతోన్న ఈ డాక్టరమ్మ అంటే, అచ్యుతమ్మ చాలా మారింది. పట్టుచీరె కట్టుకుంది. ఉన్న నగలన్నీ పెట్టుకుంది. జుట్టు ముడిలో పూలున్నాయి. ఇల్లు పెద్దది కాదు ముందు గదిలోనే సోఫాలున్నాయి. బహుశః అక్కడే ఇళ భక్తుల్ని ఆశీర్వదిస్తుందేమో? దేవుళ్ళ ఫోటోలన్నీ అక్కడే వున్నాయి. లోపల రెండు పడకగదులు, వేరుగా వంటిల్లు, పెరడు.
    విదుషిని చూసి ఇళ లేవబోయింది. విదుషి తానే ఆప్యాయంగా వచ్చి ఇళ పక్కన కూచుని "బాగున్నావా?" అని అడిగింది.
    "ఆ! చిచ్చు ఎలా ఉన్నాడూ?" అమాయకంగా అడిగింది. అలా అడగటం బాగుండదని కూడా ఆ అమ్మాయికి తెలీదు. ఆ రోజు జనం చిచ్చుని ఇళ నుండి వెనక్కి నెట్టేశాక ఇళ మళ్ళీ చిచ్చుని చూడలేదు.
    "బాగున్నాడు అసలు చిచ్చు పోరితేనే నేనిలా బయల్దేరాను"
    "నా కోసం కాదన్నమాట!"
    "నీ కోసమే. నేను రావాలనుకొంటూనే వున్నాను. చిచ్చు తొందరపెట్టి పంపించాడు."
    పరికిణీ వోణీ వేసుకుని జడ గంటలు ఊపుకుంటూ వయ్యారంగా నడుస్తూ ఒక అమ్మాయి వచ్చింది.
    "భోజనం చేస్తారా?" అడిగింది విదుషిని. విదుషి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అచ్యుతమ్మని ఉద్దేశించి "ఈ అమ్మాయెవరూ!" అని అడిగింది.
    "నామాలయ్య బంధువు!"
    "బంధువులమ్మాయి. వరసకి కూతురు అవుతుంది. కన్నకూతురిలాగే చూసుకుంటారు."
    ఆ అమ్మాయికి నామాలయ్య కూతుర్నని చెప్పుకోవటమే ఇష్టం లాగుంది. ఈ వివరణకి ముఖం చిటపటలాడింది.
    "ఇక్కడెందుకుంది?" అడిగింది విదుషి.
    "ఇళని కనిపెట్టి ఉండమని నామాలయ్య ఉంచాడు."
    "మీరున్నారుగా!"
    "భక్తులంతా వచ్చినప్పుడు ఇళ లేవక్కర్లేకుండా కావలసినవి అందిస్తూ సపర్యలు చెయ్యటానికి!"
    "మీరు చెయ్యకూడదా?"
    "ఏమో మరి! నామాలయ్య ఏర్పాటు ఇది."
    "మీరు వద్దనలేదా?"
    అచ్యుతమ్మ మాట్లాడలేదు. విదుషికి అర్థమయింది. ఎలా జరిగిందో కాని ఇళ కూడా నామాలయ్య గుప్పిట్లోనే వుంది. ఆ పిల్ల చెప్పింది కారణం.
    "ఈ గుళ్ళూ, ఈ ఇళ్ళూ అన్నీ మా నాన్నే కట్టించాడు. లేకపోతే, ఇంత ఆదాయం వచ్చేదా? గుడిమీది ఆదాయానికి శాస్త్రీ, మా నాన్న, కరణం ధర్మకర్తలు. అన్ని వ్యవహారాలూ మా నాన్న చూసుకుంటాడు. మా నాన్న లేకపోతే వీళ్ళు ఇంత పైకి వచ్చేవారా?"
    నిర్ఘాంతపోయింది విదుషి. ఎంత గర్వంగా చెపుతోంది. సిగ్గు పడవలసిన చేదు నిజాలని. పాపం, చాలామందికి లాగే ఆ పిల్లకి తెలీదు. దేవుణ్ణి పెట్టుబడితో ప్రసిద్ధిలోకి తెచ్చి వ్యాపారం చెయ్యటం సిగ్గు పడవలసిన విషయమని! ఇళ తలదించుకుంది. "పైకి రావటం అనేమాట నామాలయ్య కూతురు చాలాసార్లు సగర్వంగా వాడుతుంది. తను నామాలయ్య దయవల్ల పైకి వచ్చాననుకోవటం ఇళకి ఎంత మాత్రం నచ్చదు. అసలు తను పైకి వచ్చిందేముందీ? దేవీ కృప తనమీద లేదా? దేవి తన ద్వారా భక్తుల కోరికలు తీర్చటం లేదా? ఇందులో నామాలయ్య ప్రసక్తి ఎక్కడుందీ? కాని, పైకి ఏమీ అనదు. ఎవరితోనైనా పోట్లాడే స్వభావం కాదు ఇళది.
    "భోజనం చేస్తారా? బాపన భోజనమేలెండి. ప్రసాదాలతో పాటు ఇంట్లో వంట కూడా బాపనయ్యే చేస్తాడు. వంటాయన్ని కూడా మా నాన్నే పెట్టాడు" తిప్పుకుంటూ అంది. తిప్పుకుంటూ తప్ప నిలబడలేకపోతోంది ఆ పిల్ల.
    "నీ పేరేమిటి?" అడిగింది విదుషి.
    "రాణి!" గొప్పగా చెప్పింది. "నేను ఈ ప్రాంతానికంతా రాణిని అన్నట్లుంది ఆ ధోరణి.
    "భోజనం వద్దుగాని కాఫీ తీసుకురా!"
    రాణి వెళ్ళిపోయాక ఇళతో మాటలు మొదలుపెట్టింది.
    "ఎలా వుంది యిక్కడ?"
    "చాలా బాగుంది. అన్నట్లు యిక్కడ దేవి స్వయంగా రాత్రి పన్నెండు గంటలకి, చేతిలో జ్యోతితో తిరుగుతుంటుంది తెలుసా?"
    ఉలిక్కిపడింది విదుషి.
    "ఏమిటి?"
    "నిజం. రాత్రి వరకూ వుండు. నీకే చూపిస్తాను."
    "మీ అందరి మధ్యా తిరుగుతుందా దేవి?"
    "అందరి మధ్యా కాదు. దేవి మానవుల మధ్య తిరుగుతుందా? అలా కిటికీలోంచి చూడు. కొంచెం దూరంగా చెట్లమధ్య తిరుగుతుంది. స్పష్టంగా కనిపిస్తుందో జ్యోతి."
    "ఇంతవరకూ ఎవరూ దేవిని చూద్దామని వెళ్ళలేదూ?
    "వెళ్ళరు, ఒకరిద్దరు వాళ్ళు "ఇదంతా మోసం! మేము స్వయంగా పరిశీలించి తెలుసుకుంటాం" అని వెళ్ళారు. మళ్ళీ తిరిగిరాలేదు.
    "ఏమయిపోయారూ?"
    "మాయమయిపోయారు."
    "మాయమా?"
    "అవును తనను పరీక్షించాలనుకునే వాళ్ళని దేవత క్షమించదు. అందుకే మాయం చేసింది. ఆ తర్వాత ఎవరూ వెళ్ళలేదు."
    "చిత్రంగా ఉంది."
    "చిత్రమేముంది అక్కా! దేవి శక్తి అనంతం. ఆవిడ తలుచుకుంటే చెయ్యలేనిదేముందీ?"
    "ఎందుకు తిరుగుతోంది దేవి యిక్కడ?"
    "నన్ను అనుగ్రహించి, భక్తులకి తన మహత్తు చూపటానికి!"
    తెల్లబోయింది విదుషి. ఇళకి బ్రైన్ వాష్ బాగానే జరిగింది.
    ఆ రాత్రి ఇళతో పాటు విదుషి కూడా చూసింది ఆ జ్యోతిని. దూరంగా ఆవిడ దారిలో చెట్ల మధ్య ఒక జ్యోతి కదులుతోంది. ముందుకు నడవటం స్పష్టంగా కనిపిస్తోంది.

 Previous Page Next Page