"ఇంక నన్ను రైలుస్టేషనులో దింపెయ్ ?" అంది స్వప్న, తన పాత పాట అందుకుంటూ.
జీపు స్టార్టు చేశాడు సందీప్. అసలే సన్నటి రోడ్డు, దానికితోడు అక్కడక్కడ పెద్ద పెద్ద వృక్షాలు రోడ్డుకి అడ్డంగా ఒరిగి పడిపోయి వున్నాయి. ఒడుపుగా రోడ్డు పక్క నుంచీ డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళాడు సందీప్. నాలుగుచోట్ల చిన్నచిన్న వాగులమీద నుంచి పోయిన రోడ్డు. అక్కడ బ్రిడ్జీలు లేవు. సాధారణంగా ఎప్పుడు ఎండిపోయి వుండే చిన్న వాగులవి. వాటిలోనుంచే పల్లం వెళుతుంది రోడ్డు. పెద్ద వానలు కురిసినపుడు మాత్రం కొన్ని గంటలసేపు ఉధృతంగా ప్రవహిస్తాయి అవి. ఆ సమయంలో వాటిని దాటే మార్గం ఉండదు. వరదనీరు పోయేదాకా కాచుకుని వుండవలసిందే.
ఆ వాగులన్నీ దాటి, అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత జీపు ఆపాడు సందీప్.
చుట్టూతా పరికించి చూశాడు.
అక్కడ రైల్వేస్టేషను జాడే లేదు !
భూతాలరాజు వైపు తిరిగాడు సందీప్. "నాతో పరాచికాలు ఆడడం ఆరోగ్యానికి మంచిది కాదు!" అన్నాడు నెమ్మదిగా.
రాజు కళ్ళలో ప్రాణభయం కనబడింది.
"అమ్మతోడు గురువా, ఇక్కడే ఎక్కడో ఉందా స్టేషను! ఎంత ఒట్టుపడితే అంత ఒట్టు !" అన్నాడు.
"మీరిద్దరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. ఐ విల్ కిల్ బొత్ ఆఫ్ యూ !" అంది స్వప్న పెద్దగా.
సందీప్ చూపులు ఒక దృశ్యంమీద కేంద్రీకృతమయ్యాయి. నిర్నిమేషంగా చూస్తూ వుండిపోయాడు.
అతను చూస్తున్నవైపు తిరిగారు స్వప్నా, భూతాలరాజూ. నిర్ఘాంతపోయి నిలబడ్డారు.
రైలు పట్టాలు మెలిపడిపోయి, ఒక చెట్టుకి కొండ చిలువలా చుట్టుకుని ఉన్నాయి. ప్రకృతి విలయతాండవం చేసింది అక్కడ. స్టేషను నీళ్ళలో కొట్టుకుపోయి ఉండాలి.
నెమ్మదిగా స్వప్న భుజంమీద చెయ్యి వేశాడు సందీప్. "సారీ స్వప్నా ! ఇంక వేరే మార్గం లేదు. మీరు మాతో రాకతప్పదు" అన్నాడు.
ఆమె భుజంమీద నుంచి అతని చేతిని తోసేసింది స్వప్న. నిస్సత్తువగా కూర్చుండిపోయి మోకాళ్ళలో తల పెట్టేసుకుంది. వెక్కిళ్ళతో ఎగిరెగిరి పడసాగింది ఆమె వీపు.
పులులమంద
జీపు వెనక్కి మళ్ళించాడు సందీప్. బొచ్చుకి నిప్పంటించుకున్న ఎలుగొడ్డులా చిరచిరలాడుతున్నాడు భూతాలరాజు. బొమ్మలా చలనం లేకుండా కూర్చుని వుంది స్వప్న.
ఏదో ఒక విధంగా ఆమెకు భయం పోగొట్టి మామూలు మనిషిని చెయ్యకపోతే మెంటల్ షాక్ కి గురవుతుందేమో అనిపించింది సందీప్ కి. అందుకని తెచ్చి పెట్టుకున్న ఉత్సాహంతో ఏవేవో మాట్లాడి ఆమెని ఎంగేజ్ చెయ్యాలని చూస్తున్నాడు.
అతనేం చెబుతున్నా వినిపించుకోకుండా శూన్యంలోకి చూస్తోంది స్వప్న.
సడెన్ బ్రేకు వేశాడు సందీప్. "స్వప్నా ! రెండు తలల బల్లి ! అటు చూడండి ! త్వరగా!" అన్నాడు.
ఉలిక్కిపడి చూసింది స్వప్న.
రోడ్డు పక్కగా ఒక రెండు తలల 'స్కంట్ బల్లి' తలెత్తి చూస్తోంది.
బిగుసుకుపోయింది స్వప్న.
"దానికి నిజంగా రెండు తలలు ఉండవు. తోకకూడా తలవేపులోనే ఉంటుందన్న మాట! ఎప్పుడూ తోకని ఎత్తి ఉంచుతుంది. దాన్ని చూసి తల అని భ్రమపడతాయి గద్దలు" అన్నాడు సందీప్.
అతను అన్నట్లుగానే, ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద ఆ బల్లిని చూసింది, ఎత్తి వుంచిన తోకని తలగా భ్రమపడి, బల్లి ఆ దిశగా పోతుందని ఊహించి, రివ్వున వచ్చి దాడి చేసింది.
కానీ అప్పటికే నిజమైన తల ఉన్న దిశలో సరసర పాకిపోయింది స్కంక్ బల్లి - గద్దని ఫూల్ చేస్తూ.
"స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ! బతకడానికి ఎన్ని తాపత్రయాలో! శత్రువుల బారినుంచీ తప్పించుకోవడానికి, ఒక్కొక్క జంతువుకీ ఒక్కొక్క రకమైన ఆత్మరక్షణోపాయాన్ని ఇచ్చింది ప్రకృతి. ఆ జింకని చూశారా? అటువైపు!" అన్నాడు.