Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 21

కళ్ళు విప్పార్చి చూసింది స్వప్న. ఆమెకి ఏమీ కనబడటం లేదు.
"అక్కడ ! కుడిచేతివైపు !"
పరీక్షగా చూసింది స్వప్న. ఒక చెట్టుకింద కదలకుండా నిలబడివుంది ఒక జింక. దాని రంగు మట్టిరంగులో కలిసిపోయి ఉంది. చెట్టు కొమ్మల మధ్యనుంచీ వచ్చి తెల్లటి చుక్కలుగా నేలమీద ప్రతిఫలిస్తుంది సూర్యరశ్మి. జింక చర్మంమీద తెల్లటి మచ్చలు కూడా సూర్యరశ్మిలాగే అనిపిస్తోంది చూసేవాళ్ళకి.
అందుబాటులో ఉన్న ఒక ఎండుపుల్లను విరిచాడు సందీప్. "ఈ తమాషా చూడండి !" అంటూ.
కొంచెం దూరంగా జరిగి, దాన్ని అనుమానంగా చూసింది స్వప్న. ఒక ఎండుపుల్ల. దానికి ఎండిపోయిన ఆకులూ, అంతే ! మరే విశేషమూ కనబడలేదు తనకి.
పుల్లని మెల్లిగా కదిపాడు సందీప్. ఒక ఎండుటాకు ఎగిరి, స్వప్న భుజంమీద వాలింది. అది నిజానికి ఎండుటాకులా కనబడే పురుగు.
"గాడ్ !" అంది స్వప్న ముడుచుకుపోతూ.
నవ్వి, పురుగుని వేలితో కిందికి నెట్టేశాడు సందీప్.
"ఆత్మరక్షణకు వీలుగా, కొన్ని జంతువులకి చితమైన రూపాలూ, రంగులూ, కొన్నింటికి కోరలూ, కొమ్ములూ, మరికొన్నింటికి భరించలేని దుర్వాసనా పెట్టింది ప్రకృతి తనకు ప్రకృతిపరంగా ఏ రక్షణా లభించకపోయినా, కేవలం బుద్ధిబలంతో సమస్త జంతుజాలాన్నీ లొంగదీసుకోగలుగుతున్న ప్రాణి మనిషి ఒక్కడే! నా బట్టలూ, బూట్లూ చూడండి. ఇలాంటి రంగులు ఎందుకు వేసుకున్నానో తెలుసా ?"
అతనివైపు చూడడమే మహాపాపం అన్నట్లు మొహం చిట్లించి చూసింది స్వప్న. ఆలివ్ కలర్ జెర్కిన్ వేసుకొని ఉన్నాడతను. చాక్ లెట్ కలర్ జీన్స్, మెత్తటి సోల్సుతో, ఖాకీ రంగులో ఉన్న నార్త్ స్టార్ షూసూ.
ప్రకృతి మనకు సహజమైన ఆత్మరక్షణ విదానాలేమీ ఇవ్వలేదు కాబట్టి, కృత్రిమంగా మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఈ జెర్కిన్ ముదురు ఆకుపచ్చ రంగుది కావడంవల్ల చెట్ల బ్యాక్ గ్రౌండ్ లో కలిసిపోతుంది. జీన్స్ చాక్ లెట్ కలర్ కావడంవల్ల నేల రంగులో, చెట్ల మానుల రంగులో కలిసిపోతాయి. షూస్ పులిపంజాలలాగా నిశ్శబ్దముగా నడవడానికి అనుకూలంగా ఉండాలి. వాటి కలర్ చూశారా ? ఎండుగడ్డిలో కలిసిపోతోంది. అడవిలో తిరగడానికి ఇది సెన్సిబుల్ డ్రెస్. అంతేగాని తెల్ల పట్టుచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని, ముత్యాల హారాలు వేసుకొని, తెల్ల స్పైక్ హీల్సు వేసుకొని రాకూడదు__ దానివల్ల అసలే కళ్ళు చెదిరే మీ అందం మరో వెయ్యి రెట్లు పెరిగినా కూడా !"
అప్పటిదాకా చెవులప్పగించి వింటున్న స్వప్న, చటుక్కున పెదిమలు బిగించి, తల తిప్పేసుకుంది.
"ఈ సృష్టి అత్యద్భుతమైనది స్వప్నా ! చిక్కటి ఈ అడవిలో ఇంకా ముందుకు వెళ్ళేకొద్దీ మరెన్నో చిత్రాలని చూడవచ్చు మనం. జంతువులనూ, వాటి ప్రవర్తననీ గమనించాలంటే జూలో చూస్తే లాభం లేదు. వాటి సహజ పరిసరాల్లోనే చూడాలి. ఇది మనకి అపూర్వమైన అవకాశం ! మీరేం భయపడకుండా నాతో రండి! నన్ను నమ్మండి! మిమ్మల్ని క్షేమంగా తిరిగి మీ అమ్మగారి ఒడిలో దింపే బాధ్యత నాది" అన్నాడు. 'మీ అమ్మగారి ఒడిలో' అని అతను ఉద్దేశ్యపూర్వకంగా ఆమెని రెచ్చగొట్టాలనే అన్నాడు.
మంత్రం పనిచేసింది. ఆ మాట వినగానే నిటారుగా కూర్చుంది స్వప్న. "నాకేం భయంలేదు!" అంది సాధ్యమైనంత బెట్టుగా.
"బ్రేవో! దట్స్ మై గర్ల్ ! ఒకవేళ మీకు భయమేసినా నేను తోడుగా ఉన్నాను. నేనేం అల్లాటప్పా గాడిననుకోకండి. నేను ఒక్కడినే మా ఊరి జనాభాని ఒక శాతం పెంచాను తెలుసా ?"
అతన్ని దహించేస్తున్నట్లు చూసింది స్వప్న.
ఆమె కోపం చూసి నవ్వాడు సందీప్. "అపార్థం చేసుకోకండి అమ్మాయిగారూ! నేను చిన్న పల్లెటూళ్ళో పుట్టాను. ఆ ఊరి జనాభా వంద ఉండేది. నేను పుట్టాక అది నూటఒకటి అయింది. నేను మరి జనాభాని ఒక శాతం పెంచినట్లు కాలేదూ ?" అన్నాడు.
కనుబొమలు ముడేసి, ఏదో గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు తీక్షణమైన ఆలోచనలో పడిపోయింది స్వప్న.

 Previous Page Next Page