ఒకనాడు పార్కులో వెంకట్రావే కనిపించేడు. కనిపించినవాడు క్షేమసమాచారములు మాని 'నిందలు' వేయడం ప్రారంభించేడు.
" అవున్లేవోయ్. మేం నీకిప్పుడు ఏంకనిపిస్తాం? పెద్దవాడివి. అదికాదుగూరూ! నీఅదృష్టంపండి, నువ్వు పెద్దవాడి వయ్యావంటే మేమంతా సంతోషిస్తున్నాం. బాగుంది .కాని అంతమాత్రం చేత మన స్నేహితాన్ని మరిచిపోతే ఏ బాగుంటుంది చెప్పు?" అన్నాడు వెంకట్రావు.
" నన్నేం చేయమంటానో చెప్పు వెంకట్రావూ?"
" కుర్రముండా వాడు కాలికి బలపం కట్టుకుని రోజూ మి యింటికి వొస్తూ పోవడం తప్పించి నువ్వొక్కనాడైనా ఆ పశుపతిగార్ని కలుసుకున్నావా? ఉద్యోగం యివ్వడం. మానడం తర్వాత విషయం. ఇప్పటికొచ్చి నూవ్వాయన్ని కలుసుకోలేదంటే నాతల కొట్టేసినంత పనవుతోంది. మా వాడేమొ నామిదా, మన స్నేహంమిద కొండంత ఆశపెట్టుకున్నాడాయిరి. అబ్బేయిందేం బాగోలేదుగూరూ! నువ్వే మైనా అనుకో. అంతే!" అన్నాడు బాధగా.
నేనెందుచేత ఆ పశుపతిగార్ని కులుసుకోలేక పోతున్నానో కారణం వెంకట్రావుకి, చెబ్దామనిపించింది.అది చెప్పిఅతన్ని వొప్పించే దానికంటే ,అభిమానం చంపుకుని పశుపతిగార్నే కులుసుకుందామనే నిర్ణయానికొచ్చేను.
నాటినుంచి నాలుగురోజులు నిద్రమానుకుని రచనలో కూచున్నాను. అయిదోనాటి సాయంత్రం నాటకాన్ని తయారుచేసి స్ట్ర్ర్కిప్ట్ చేతపట్టుకుని పశుపతిగారింటికి వెళ్లేను.
పశుపతిగారి జేష్టుడు బజారువేపు వెడుతున్నాడు కాబోలు. కారు తాళంచేవిని (ఇఘ్నీషన్ కీ) సరదాగావూపు కుంటో యెదురయ్యేడు. అతను భారీయెత్తు మనిషి.రెవటలా గాలి కెగిరిపోయే అవతారం! నెత్తిమిద అరంగుళం మేర వెంట్రుకలు కత్తిరింపబడి వుంటాయి. ఎల్లప్పుడూ బాగా యిరుకైన పంట్లా ములు ధరిస్తాడు .చొక్కా అనబడని యేదో వొస్తువిశేషాన్ని చొక్కాగా వేసుకుంటాడు. అంతెత్తు మనిషి గాల్లో యెగిరిపోతున్నట్టు నడుస్తూంటే నాక్కొంచెం కంటగింపుగా వుంటుంది.
అప్పుడతని నెత్తిమిద ఒక వూలు టోపీ గూడా వున్నది. ఈ రకమైన టోపిలక రోజుల్లో పరపతిపెరిగిపోతుంది. ఆ టోపీతో, ఆ నడకతో అతన్నాకు యెదురైనప్పుడు ఒక 'కొంగ' నేల మిద నడుస్తున్న భ్రాంతి కలిగింది.
ఆ కొంగ నన్ను విష్ చేసి చేయికలిపి యింగ్లీషులో నాక్షేమాన్నడిగింది. వాళ్ల డాడీ కోసం వొచ్చేనని ఇంగ్లీషులోనే చాలా డాబూసరిగా చెప్ప ప్రయత్నించేనుగానీ, కుదిరిచావలేదు. లోపలున్నారని చెప్పి కారు దగ్గిరికి ఎగిరెళ్ళిపోయిందా కొంగ.
లోపలికి వెళ్ళేను. పశుపతి గారికా నిద్రలేవని కారణంగా కాసేపా వరండాలో నే కూర్చోవలసి వచ్చింది. కూర్చుని నా రచనలోని సొగసుని అక్కడక్కడాగమనించడం ప్రారంభించేను. డాబామిదగదుల్లో ముందేదోశబ్దమయ్యి ది. వెనువెంటనే 'ధా. ధిక్...ధైధిక్....థక్ థక' లూ మగ గొంతు నుంచి వినవచ్చేయి. ఆపదాల కనుగుణంగా పాదతాకిడీ వనిపించింది. ఈ తతంగం యావత్తూ నానెత్తిమిదనే జరుగుతున్నది. కాసేపట్లోనే నాకు చిరాకు వేసింది.
నాట్యమనేది లలితకళల్లో ఒకటని నేనొప్పుకుంటాను. ఎందుచేతనోగాని దేనెంత ప్రయత్నించేసినా శాస్త్ర్రీయ నాట్యంలోని ఔన్నత్యాన్ని వెతుక్కోలేకపోతున్నాను. ఇది కేవలం నాతప్పన్నా నేనొప్పుకునేందుకు సిద్ధమే.
నా నెత్తిమిద నాట్యం జోరుగా సాగుతూన్న వేళకి పశుపతిగా ర్రావడం జరిగింది. లేచి నించున్నాను. ఆయన కుర్చున్న తర్వాత నేనూ కూర్చున్నాను. ఆయనొక్కడే సిగరెట్టు ముట్టించి అన్నాడు.
" మీర్నాకు కనిపించి రెండు నెలలు దాటిందనుకుంటాను."
" అవునండి. ఈ మధ్యన ఆరోగ్యం బాగాలేక బయటికి రాలేకపోయేను."
" ఈ సంవత్సరం ధరల్లాగా ఎండలెంతమండిపోయేయో గమనించేరా?"
" అవునండి. చాలా మండిపోయేయి.వర్షాలూ అంతేను,అతివృష్టి"
" అగ్ని ప్రమాదాలు అవీగూడా ఈ సంవత్సరం ఎక్కువే."
" అవుండి .బాగా ఎక్కువే."
" ఏమిటో కలికాలం యావత్తూ యిలా తగలబడి పోతోంది."
"అవునండి"
ఈ తడవ వంతపాడటమిష్టంలేకపోయింది.ఆయన వరసచూస్తూంటే నా నాటకం విషయం మరిచిపోయునట్టనిపిస్తోంది. లేకపోతే వారింత న్యాయంగా మాటాడేవారు కానేకాదు. అందుచేత నాకై నాటకోదంతాన్ని ప్రారంభించేను.
మీరు చెప్పినట్టు నాటకం రాసేను. కానైతే నెల రాజుల కాలాన్ని రెండు నెలలువరకూ పొడిగించేను. క్షమించాలి. పోతే ఈ నాటకాన్ని బాగా రాయగలిగేనన్న ధైర్యముంది.ఓమీటు మిరుగూడా చదువుతే."
"ఐతే, నాటకం పూర్తయిందన్నమాట .ఏమిటోనండి ఈమధ్య తీరుబడి చిక్కక చాలా సరదాలు చంపేసుకుంటున్నాను. చూద్దాం. నాటకమిచ్చి వెళ్ళండి" అన్నాడాయన చప్పగా. చేదుగా.
పుస్తకమిచ్చి చేతులు నలుపుకున్నాను. మెల్లిగా అసలు విషయంలోకి సంభాషణ మార్చేను.
" నాకో ఫ్రెండున్నాడు. చాలా మంచివాడు."
"పేరేమిటన్నారు?"
"వెంకట్రావని మానూరివాడే! అతని కో మేనల్లుడున్నాడు."
" పేరేమిటన్నారు?"
" ఏం చేస్తున్నాడన్నారు ?"
" ఆ విషయం మాటాడేందుకే వచ్చేను. అతను ప్రస్తుతం నిరుద్యోగి. మంచివాడూ, తెలివైనవాడూను.
"ఐసీ"
" మీ కంపెనలో యేదైనా ఖాళీ వుంటే అతనికో ఛాన్స్ యిస్తారేమో యెప్పటికప్పుడు అడుగుదా మనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చేను."
" చెప్పారు కాదే! బలేవారే మీరు. మీకంత మొహమాటం పనికిరాదు సుమండీ"
నాక్కొంచెం సరదాగా వున్నది. కుర్చీలో ముందుకి జరిగి క్కూర్చున్నాను.
"కానీ, ప్రస్తుతం మా కంపెనీలో, ఖాళీలేమి లేవు. ఉంటే గనక మికు తప్పనిసరిగా ఖబురంపుతాను సరేనా? పోతే ఈపుస్తకం మి దగ్గిరే వుంచుకోండి. కావసివొస్తే తనేనే అడిగి పుచ్చుకుంటాను ఓ కే?' అన్నారు.
"ఏ. కె." అనేశాను.
ఆయన లేచి నించున్నారు. నేను లేచీ వచ్చేశాను.
* * * *