Previous Page Next Page 
మౌనం పేజి 2

    వెల్ డిజైన్డ్  అండ్ వెల్ మెయిన్ టైన్స్  ఆఫీసు.

    బయట రూమ్ లో కుడివైపు  రిసెప్షనిస్ట్....టేబుల్, చైర్, వాటికి ఎదురుగా విజిటర్స్  చైర్స్.
   
    రిసెప్షనిస్ట్  వెనుక  వున్న  గోడకి  నల్లని  వెల్ వెట్ క్లాత్  వున్న డిస్ ప్లే బోర్డు....అందులో  ఆ ఏజన్సీ చేసిన  రకరకాల  ఎడ్వర్ టైజింగ్  వర్క్స్.

    ఆ గది దాటి  వెళితే  ఎడమవైపు  వరుసగా  చీఫ్  ఎగ్జిక్యూటివ్, మీడియా  మేనేజర్, ఫీల్డ్ ఫోర్స్ ల కేబిన్ లు, కుడివైపు  క్రియేటివ్ డిపార్ట్ మెంట్స్. కొంచెం  లోపలికి వెళితే  కాపీ రైటర్స్ రూమ్, మరో వైపుకి పర్సనల్ అండ్   అక్కౌంట్స్  డిపార్ట్ మెంట్....అంతా  కలిపి  దాదాపు  నలభై మంది స్టాఫ్ వుంటారు.

    కారిడార్లో  నడుస్తున్న  అతనికి  క్లెయింట్  రిలేషన్స్  ఆఫీసర్  కనిపించాడు.

    "హలో" అని  జంటిల్ గా  అతనిని  విష్ చేసి  ముందుకు  నడిచాడు శ్రీకాంత్.

    ఆ రూమ్  డోర్ మీద  "అర్చన" క్రియేటివ్  డైరెక్టర్  అని వుంది.

    డోర్ దగ్గర  నిలబడి  లోపలికి  చూశాడు.

    చైర్ లో  కూర్చుని వుంది  ఆమె.

    కళ్ళు  మూసుకుని  తలను  కొంచెం  వెనక్కి  వాల్చి  వుంది.

    ఆమె చేతిలోని  పెన్సిల్ ను  చెక్కిట  ఆన్చి  వుంది.

    ఏదో  దీర్ఘాలోచనలో  ఆమె  వుందన్న  విషయం  అర్ధమయింది  అతనికి.

    కళ్ళు  మూసుకొని  వుండటంతో  అతని రాకని  ఆమె గమనించలేదు.

    చైర్ లో  వెనక్కి  వాలి  వున్న  ఆ భంగిమలో  ఆమె చాలా అందంగా కనిపించింది  శ్రీకాంత్ కి.

    ఆమెది సహజ సౌందర్యం. సుమారు  ఇరవై ఏడేళ్ళ  వయసుంటుంది  ఆమెకు. అయినా  ఆమె ఇరవై  రెండేళ్ళ  అమ్మాయిలా  కనిపిస్తుంది.

    కోలముఖం....

    పెద్దవి కాకపోయినా  ఆకర్షణీయంగా  వుండే  కళ్ళు....

    షార్ప్ గా వున్న  ముక్కు....

    సన్నని పెదవులు, పలుచని  బుగ్గలు....

    అందంగా కట్ చేసిన  బాబ్డ్  హెయిర్....

    సుమారు  ఐదడుగుల  ఏడంగుళాల  ఎత్తు....

    నాజూకైన  శరీరం....

    ఆమె ధరించే  చీరలకే  ఆమెవల్ల  అందం  వచ్చిందా  అన్నట్లుంటుంది  ఆ శరీరం. ఇంతవరకూ ఆమెను మోడ్రన్  డ్రస్ లలో  చూడలేదతను. చుడీదార్, మిడ్డీలాంటి  డ్రసెస్ వేసుకుంటే  ఆమె మరింత  అందంగా  వుండొచ్చు  అనుకున్నాడతను.

    ఆమెను  ఎప్పుడు చూసినా  చంద్ర బొమ్మ  అంత  అందంగా వుంటుంది  ఆమె అని అనుకుంటాడు  అతను. చంద్రగారి  బొమ్మలంటే  అతడికి  ప్రాణం. అందులోను  చంద్ర వేసే  అమ్మాయి  బొమ్మలంటే  మహాపిచ్చి. అందుకే  అతడు  ఆమెను ఎప్పుడు  చూసినా  చంద్రబొమ్మల్లోని  అమ్మాయితో  పోల్చుకుంటాడు.

    ఆమె మోడల్  అయి వుంటే  హైదరాబాద్  ఎడ్వర్ టైజింగ్  ప్రపంచానికే  ఒక యువరాణి  అయ్యేదేమో  అనిపిస్తుంది  అతనికి  ఆమెను చూసిన  ప్రతిసారి. కానీ  అతనికి  తెలియదు  ఆమె అంతకుముందే  మోడలింగ్  చేసిందని.

    ఎన్నోసార్లు  ఆమెతో  చెప్పాలనుకున్నాడు. "మీరు మోడలింగ్  ఎందుకు  చేయకూడదు?" అని.... కానీ  అనలేదు....కారణం, ఆమెతో ఆ మాట  చెప్పాలంటే  ధైర్యం చాలదు.

    ఆమెను  చాలా అభిమానిస్తాడతను.

    బికాజ్....షి ఈజ్  హైలీ  టేలెంటెడ్.

    ఆమె తలుచుకుంటే  ఎటువంటి  యాడ్ కాంపెయిన్  అయినా  సూపర్ సక్సెస్  కావాల్సిందే.

    ఏ ప్రోడక్ట్  సేల్స్ నయినా  ఇట్టే  క్రియేటివ్  తన ఐడియాలతో  అనూహ్యంగా పెంచగలదు.

    "అయాం సారీ....మిమ్మల్ని  డిస్ట్రబ్  చేసినట్లున్నాను" జెర్కిన్ పాకెట్ లోంచి  ఫోటోలున్న  కవర్  బయటకు  తీస్తూ  అన్నాడు.

    "అదేం లేదు....ఆడియో  సిస్టమ్స్  ఎడ్వర్ టైజ్ మెంట్  ఒకటి తయారుచేయాలి. దాని  గురించే  ఆలోచన" చెప్పిందామె  ఫోటోలు  చూడటానికి  సిద్ధపడుతూ.

    "ఆడియో సిస్టమ్స్....అంటే  ఏ కంపెనీ?"

    ప్రీమియర్  ఆడియోస్  అని కొత్తకంపెనీ....స్టీరియోలు, టూ ఇన్ వన్ లు, టేప్ రికార్డర్లు, యాంప్లిఫైయర్స్....ఇలా  చాలా వున్నాయి. సుమారు కోటి రూపాయలకు  పైగా  ఖర్చు  ఎడ్వర్ టైజ్  మెంట్లమీద పెట్టడానికి  క్లెయింట్  సిద్ధంగా  వున్నాడు. నెల రోజుల్లో  ఎడ్వర్ టైజ్ మెంట్లు, టీవీలో, పేపర్లలో  మొదలవ్వాలి. దానికే యాడ్ ఫిల్మ్  ఎలా వుండాలా  అని  ఆలోచన....సరే....నా ఆలోచన విషయం  అలా వుంచి, నిన్నటి రిఫ్రిజిరేటర్  ఫోటోలు  ఎలా వచ్చాయి? చూపించండి" అంది  అతను  వచ్చిన  విషయం  గురించి  మాట్లాడే ప్రయత్నం  చేస్తూ.

    "ఫోటోలు ఎలా  వున్నాయన్న  విషయం  మీరు చెప్పాలి. ఇదుగో చూడండి" అన్నాడు ఫోటోలు  ఆమె ముందుకు  జరుపుతూ.

    ఆమె వరుసగా  ఫోటోలు  చూడనారంభించింది.

    ఫోటోలు  చూస్తున్న  ఆమెక కళ్ళలోని  భావాలు  చదవటానికి  ప్రయత్నం  చేయసాగాడతను.

    అన్నింటినీ  చూశాక  దృష్టిని  అతనివైపు  మరల్చి  "దె ఆర్ వెరీ నైస్" అంది  అభినందనగా.

    "థాంక్యూ!"

    "బట్! ఈ ఫ్రిజ్  దగ్గర  నిలబడిన  మోడల్ ఎక్స్ ప్రెషన్స్  అంత బాగాలేవు."

    "నేనూ  అదే  అనుకున్నాను. ఈ సమస్య  ఇక్కడే  వున్నదే. మోడలింగ్  ఇక్కడ  అంతగా  పాపులర్  కాలేదు. కెమెరా  ముందు  నిలబడి  సరైన  భావాలు  వ్యక్తం  చేయగలిగిన  అమ్మాయిలు లేరు. అదే బొంబాయిలో  అయితే కోకొల్లలుగా  వున్నారు మంచి మోడల్స్" వివరణ  యిచ్చాడు  అతను. 'ఆ అమ్మాయికంటే  మీరు మోడలింగ్  చేస్తే  బావుండేది' అనాలి  అనిపించింది  అతనికి.

    కానీ  అనలేదతను.

    "అందుకే  త్వరలో  చేయబోయే  ఈ ఆడియో  సిస్టమ్స్  యాడ్ బొంబాయిలో  చెయ్యటం  మంచిదేమో  అనుకుంటున్నాను" అంది ఆమె.

    "మంచి  మోడల్స్  కావాలనుకుంటే  అది చాలా మంచి పని."

    అతను  తెచ్చిన  ఫోటోలను మరోసారి  చూసిందామె.

    "ఈ ఫోటోలు  తాలూకు బిల్లు  మా ఎక్కౌంట్స్  డిపార్ట్ మెంట్స్ లో యిచ్చేయ్యండి. అలాగే  మా ఆర్ట్ డైరెక్టర్  మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. ఆయనతో  కూడా ఒకసారి  మాట్లాడండి" చెప్పిందామె.

    "అలాగే! నేను వెళతాను" అంటూ  లేచాడతను.

    "థాంక్యూ మిస్టర్  శ్రీకాంత్! ఫర్  యువర్  సర్వీస్" మర్యాదపాటిస్తూ  అంది ఆమె.

    "థాంక్స్  ఫర్ గివింగ్  మి ఎ ఛాన్స్  టు సర్వ్ యు" తిరిగి  సమాధానం  చెప్పి చిరునవ్వు  నవ్వి బయటికి నడిచాడతను.
    ఇతనికి  ఫోటో  గ్రాఫర్ గా మంచి ఫ్యూచర్ వుంది  అనుకుంది  ఆమె.

    రెండు నిమిషాల  తర్వాత  తిరిగి  తన ఆలోచనలలోకి  వెళ్ళిపోయిందామె.

    కొత్తగా  టేప్ రికార్డర్లు, స్టీరియోలు  మార్కెట్ లోకి  ప్రవేశపెడుతున్నాడు క్లెయింట్.

    ఈ మధ్య కాలంలో  టేప్  రికార్డర్లు  తయారుచేసే  కంపెనీలు  చాలా వచ్చాయి. అందులో  కొన్ని  కంపెనీలు  స్టాండర్డ్ కంపెనీలు  పేరు కూడా తెచ్చుకున్నాయి.    
 

 Previous Page Next Page