మౌనం
__వేంపల్లి నిరంజన్ రెడ్డి
హైద్రాబాద్_
సమయం మధ్యాహ్నం రెండూ ఇరవై.
జంట నగరాలలోని రోడ్లన్నీ జనంతో, వాహనాలతో కిటకిటలాడిపోతున్నాయి.
గ్రీన్ లాండ్స్ క్రాస్ రోడ్స్_
గ్రీన్ సిగ్నల్ వెలిగింది.
అప్పటికి రెండు నిమిషాలుగా ఆగి ఉన్న ట్రాఫిక్ అంతా ఒక్కసారిగా ముందుకు దూకింది.
గేరు మార్చి యాక్సిలేటర్ రైజ్ చేసి బైక్ ని కదిలిన ట్రాఫిక్ తోపాటు ముందుకు దూకింది.
గేరు మార్చి యాక్సిలేటర్ రైజ్ చేసి బైక్ ని కదిలిన ట్రాఫిక్ తోపాటు ముందుకు దూకించాడు అతను.
బేగంపేట ఫ్లై ఓవర్ మీదుగా దూసుకుపోతున్న అతని భైక్ స్పీడు మీటర్ లోని నీడిల్ డెభై మీద కదులుతోంది.
రెండున్నరలోగా అతను తన గమ్యాన్ని చేరుకోవాలి.
పంక్చువాలిటీకి చాలా ప్రాధాన్యం యిచ్చే మనిషి అతను.
అతను హైద్రాబాద్ కి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు ఆపుతోంది. వచ్చిన మొదటి రోజుల్లో ట్రాఫిక్ రూల్స్ ని చాలా ఖచ్చితంగా పాటించేవాడు. తన ముందు వెళ్ళే వాహనాలను కేవలం కుడివైపు నుంచే ఓవర్ టేక్ చేసేవాడు.
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైటు వెలగగానే ఆగటం, వన్ వే ట్రాఫిక్ అని బోర్డు వున్న రోడ్ లోకి బైక్ ని టర్న్ చేయకుండా, పక్కనున్న ప్రదేశానికి కూడా ప్రదక్షిణం చేసినట్లుగా చుట్టూ తిరిగి రావటం చేసేవాడు.
కానీ....కొన్నాళ్ళపాటు అలా సిన్సియర్ గా ట్రాఫిక్ రూల్స్ పాటించాక అతనికి అర్ధమయింది. ట్రాఫిక్ రూల్స్ పాటించే ఫూల్ తానొక్కడే అని.
రెడ్ సిగ్నల్ వెలగగానే వాహనాలు అన్నీ ఆగవు.
ఆగేవారు ఆగుతారు....
లేకపోతే లేదు.
అంతవరకు ట్రాఫిక్ వైపు చూసే కానిస్టేబుల్ రెడ్ సిగ్నల్ వెలగగానే చటుక్కున తల తిప్పుకుంటాడు .వెళ్ళే వాహనాలు వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా.
ఈ అనుభవాలు చూశాక అతనూ మారిపోయాడు.
తను కావాలనుకుంటే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బైక్ డ్రైవ్ చేస్తాడు. లేకపోతే లేదు. అంతా అతని యిష్టం.
అతని గమ్యం కొద్ది గజాల దూరంలోకి వచ్చింది.
బైక్ వేగం తగ్గింది.
రోడ్డు మధ్యనుంచి ఎడమవైపుకి రాసాగాడు ఆగే ఉద్దేశంతో.
జుమ్....అన్న శబ్దంతో అతనికి ఎడమవైపు నుంచి దూసుకుపోయింది ఒక జావా మోటార్ సైకిల్.
గుండె ఝల్లుమంది అతనికి.
వెంట్రుకవాసిలో తప్పిపోయింది యాక్సిడెంట్.
ఇటువంటి అనుభవాలు జంటనగరవాసులకి మామూలే.
ఇంకా ఏమైనా వాహనాలు వెనుక నుంచి వస్తున్నాయేమోనని వెనుక వైపు, ఎడమవైపు చూసి రావటం లేదని నిర్ధారించుకొని, ఒక బిల్డింగ్ ముందు ఆపాడు వాహనాన్ని.
హేండిల్ లాక్ చేసి, చెదిరిన జుట్టుని సరిచేసుకుని జేబులోంచి హేండ్ కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు.
తెల్లని ఆ కర్చీఫ్ మీద అతని ముఖం మీది దుమ్ము నల్లని మసిలాగా అంటుకుంది.
అతని పేరు శ్రీకాంత్. ఎడ్వర్ టైజింగ్ ఫోటోగ్రాఫర్.
బొంబాయిలోని ఒక ప్రముఖ యాడ్ ఫోటోగ్రాఫర్ దగ్గర రెండేళ్ళు అసిస్టెంట్ గా పనిచేసాడు.
ఆ అనుభవంతో హైదరాబాద్ తిరిగివచ్చి స్టూడియో ప్రారంభించాడు. మంచి ఫోటోగ్రాఫర్ గా ఎదుగుతున్నాడు.
అతను తరచుగా 'ట్రినీటీ' ఎడ్వర్ టైజింగ్ ఏజెన్సీకి వస్తుంటాడు.
జంటనగరాల్లోని పెద్ద ఎక్రిడిటెడ్ యాడ్ ఏజన్సీలలో అదొకటి. దానినుంచి వచ్చే ఫోటోగ్రాఫీ వర్క్స్ అతనే హేండిల్ చేస్తాడు.
ఆ ముందు రోజు షూట్ చేసిన కొన్ని ఫోటోలు చూపించడానికి వచ్చాడు.
గ్లాస్ డోర్ తీసుకుని లోపలికి అడుగుపెట్టిన అతనికి ఎయిర్ కండిషన్ తాలూకు చల్లదనం శరీరాన్ని హాయిగా తాకింది.
చాలా అందమైన ఇంటీరియల్ డిజైనింగ్ వున్న ఆఫీస్ అది.