Previous Page Next Page 
రక్షరేకు పేజి 2


    రాజయ్యకీ, కోటయ్యకీ దూరపు బంధుత్వముంది అంచేత నాగమ్మ, అన్నమ్మ "వదినా", అంటే "వదినా" అని పిలుచుకుంటారు.
    రాజయ్య నాగమ్మను లేవదీసుకొచ్చినందుకు బందువులు గొడవచేశారు మొదట్లో.కానీ, రాజయ్య పెద్దకు "తప్పు" కట్టెయ్యడంతో అంతా సమసిపోయింది.
    ఆ "తప్పు" కట్టిన డబ్బుతో అందరూ తాగి తందనాలాడిన తరువాత, నాగమ్మ, రాజయ్య సంఘంలో కలిసిపోయారు.
    రాజయ్య బాగా సంపాదిస్తాడు- తాగుతాడు, కానీ మరీ విపరీతంగా తాగడు- రాజయ్య దగ్గిర కాస్తో, కూస్తో డబ్బుంది. కంటోనేమెంట్ ఆవరణలోనే ఒక ఎకరం స్థలం కవులుకు తీసుకొని కూరగాయలతోట వేసుకుని వ్యాపారం ప్రారంభించాడు- బాగానే నడుస్తోంది-
    ఈ వ్యాపారంగాక, అతడు రోడ్డు వేస్తున్నప్పుడు యిళ్ళు కడుతున్నప్పుడూ కూలికి కూడా పోతాడు. దానా, దీనా, రాజయ్య సంసారం సుఖంగానే సాగుతోంది. అంచేత నాగమ్మకి, బడాయి గర్వం.
    నాగమ్మ వరదాచార్యులు గారింట్లో పనిచేస్తోంది. ఎంత పెద్ద సిటీలోనైనా కోవెలలు లేకుండా ఉండవు.
    జనం ఏంలేకపోయినా బ్రతకగలరు కాని, తమ పాపపుణ్యాలభారం గుమ్మరించి తాము నిశ్చింతగా ఉండగలడు ఒక దేవుడు లేకపోతే బ్రతకలేరు.
    వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడు వరదాచారి- తరతరాలుగా ఆ కుటుంబం అర్చకవృత్తిలోనే ఉంది. జనానికున్న దైవభక్తి పుణ్యమా అని ఆ కుటుంబం సంపన్నకుటుంబాల జాబితాలోకి చేరుకుంది.
    వరదాచారికి ఒక వెర్రిబాగుల తమ్ముడున్నాడు.
    నాదముని - పేరు ఎంత గొప్పదో, మనిషి అంత ఎందుకూ పనికిరానివాడు.
    అతడి భార్య సరళమాత్రం సార్థక నామధేయురాలు. తోటికోడలు వరదాచార్యులు భార్య రంగనాయకమ్మ యెప్పుడూ యేదో రోగాన్ని కల్పించుకుని నడిమంచమెక్కి మూలుగుతూ వుంటే, యింటెడు చాకిరీ సరళ ఒక్కర్తే చేస్తుంది. ఇంత చాకిరీ చేసినా సరళనెవ్వరూ గౌరవంగా చూడరు ఆ ఇంట్లో.....
    సరళ యేమీలేని యింటిపిల్ల కావటమే అందుకు కారణం. పాపం, సరళకు చిన్నతనంలోనే తల్లీ తండ్రీ పోయారు. ఆధారం లేకపోయినా, తాను ఆదరించి పెద్ద చేయవలసిన తమ్ముడు మిగిలాడు - బంధువులంతా బెదిరిపోతూ ఎక్కడివాళ్ళక్కడ ఆ అక్కా తమ్ముళ్ళను వదిలించుకోవాలని చూశారు.
    సరళ తన తమ్ముడు పార్థసారధితో కలిసి తన మేనమామను ఆశ్రయించక తప్పలేదు.
    ఆ మేనత్తా మేనమామలు సరళను, తమ్ముణ్ని మెడపట్టుకు బయటకు యీడవటం మినహా, యింటిలోంచి వెళ్ళగొట్టడానికి ఎన్ని చెయ్యాలో అన్నీ చేశారు. సరళ మొండిగా ఆ చూరు పట్టుకు వేళ్ళాడింది.
    ఎలాగయినా తమ్ముడికి చదువు చెప్పించాలనే సరళ ప్రయత్నం మాత్రం ఫలించలేదు. సరళ మేనమామ తన మేనల్లుణ్ని తనచేతిక్రింద పనిపాటలు చెయ్యటానికి ఉపయోగించుకున్నాడే కాని, బడికి పంపలేదు. ఫలితంగా పధ్నాలుగేళ్ళు వచ్చినా పార్ధసారధికి చదవటం రాయటంమించి ఏమీ రాకుండాపోయింది.
    ఇలాంటి సందర్భంలో వరదాచార్యులు తన వెర్రిబాగుల తమ్ముడికి పెళ్ళి సంబంధాలు చూస్తూ సరళ అన్నివిధాలా తగినదని నిర్ణయించుకుని సరళ మేనమవను అడిగాడు.
    ఎలాగైనా పీడ వదిలించుకోవాలని ఆరాటపడుతున్న మేనమావ ఒప్పుకున్నాడు.
    వరదాచార్యులు కుటుంబం బాగా ఉన్న కుటుంబం అనివింది సరళ.
    అంచేత నాదముని వెర్రిబాగులవాడని తెలిసినా తనకూ, తన తమ్ముడికీ, ఇంత ఆశ్రయం దొరుకుతుందని ఆశతో...... తన తమ్ముణ్ని అప్పటికైనా చదివించి ప్రయోజకుణ్ని చేయాలనే తపనతో ఆపెళ్ళికి ఒప్పుకుంది....
    అత్తింట్లో అడుగుపెట్టిన మరుక్షణమే తన ఆశ అడియాస అని సరళకు తెలిసిపోయింది.
    ఆ ఇల్లు సంపన్న కుటుంబమే! అయితేనేం? పెత్తనమంతా వరదాచారిది- వెర్రిబాగుల వాడైన నాదమునికి ఆ ఇంట్లో గడ్డిపోచ విలువలేదు- అతని భార్య అయిన సరళకు అసలే విలువలేదు.
    వంట మనిషికి మించిన స్థానం ఆ ఇంట్లో సరళకి లభించలేదు.
    వంటమనిషికీ సరళకీ కొంచెమే తేడా? సరళను వంట మనిషి అనరు- వరదాచార్యులుగారి మరదలు అంటారు.
    వంట మనిషికి చేసిన పనికీ జీతం వస్తుంది- యదేచ్ఛగా వ్యవహరించే స్వాతంత్ర్యం ఉంటుంది.
    సరళకు ఇవి రెండూ లేవు..... తన తమ్ముణ్ని ప్రయోజకుణ్ని చేయాలన్న సరళ తపన తపనగానే ఉండిపోయింది.
    సారధి తన మేనమావగారింట్లో బదులు, బావగారింటిలో చారికీ చెయ్యవలసి వచ్చింది.
    సారధిమంచివాడు- తెలివైనవాడు. తనంతట తనే ఎలాగో ఒకలాగ పుస్తకాలు సంపాదించి చదువుకోవాలని తాపత్రయ పడేవాడు.
    పాపం, అదీ కుదిరేదికాదు, కొన్నిసందర్భాల్లో.....
    సరళకి కాని, సారధికి కాని నయాపైస కావలసి వచ్చినా వరదాచారి ముందు చెయ్యి జాపవలసిందే.
    ఎన్నెన్నో ప్రశ్నలు అడిగి విసుక్కుంటూ, విదిలిస్తూ అడిగినదానిలో సగం ఇచ్చేవాడు వరదాచారి.
    విలాసాలూ, వినోదాలూ, దేవుడెరుగు - దైనందిన జీవితావసరాలకి కూడా కటకటలాడవలసి వచ్చేది ఆ కలిగిన వారింటికోడలు.
    చదువులేదు- ఆర్థికస్తోమతు లేదు - అండదండలు లేవు. ఒక ఆడది ఏం చెయ్యగలదు?
    ఎన్ని కష్టాలనైనా మౌనంగా భరించడమే అలవాటు చేసుకుంది సరళ - సంతానమైనా ఉంటే తనకొక ఆధారమేర్పడుతుందని ఆశపడింది కొన్నాళ్ళు..... అదేం దురదృష్టమో, ఆ ఆశకూడా ఫలించలేదు.....
    ఆ ఇంటిలో సరళ స్థానమేమిటో నాగమ్మకు బాగా తెలుసు- తనకు ఏదైనా పెట్టాలన్నా, పెట్టగలిగే స్వాతంత్ర్యం సరళకు లేదని తెలుసు- అంచేత సునాయాసంగా సరళను "కర్కోటకపు ముండ" అనేసింది.

 Previous Page Next Page