"తమ్ముడులేని ఇంట్లో ఒక్కదానివీ ఎలా వుంటావు? వచ్చి మాతో వుండిపో" అని చెప్పాడు రామనాథం అక్కగారితో.
ఆవిడ ఆ ఊరిని విడిచి రావడానికి ఒప్పుకోలేదు.
ఆవిడ వున్నంతవరకూ ఆ ఇల్లుకానీ, వాళ్లకిన్నాళ్లు భుక్తి గడిపిన పొలాలుగానీ ముట్టకూడదన్న నిర్ణయానికి వచ్చిన యోగానందం కౌస్తుభకి అదేమాట చెప్పాడు.
"అలాగే మామయ్యా! అత్త బ్రతికినంతవరకూ ఇక్కడ ఇల్లుగానీ పొలాలుగానీ అమ్మే ప్రసక్తిలేదు " కౌస్తుభ కూడా చెప్పింది.
సెలవు లేకపోవడంవల్ల యోగానందం వెళ్లిపోయాడు. ఇక్కడ వ్యవహారాలు చక్కబెట్టి రెండు మూడు రోజుల్లో తనూ వస్తానని చెప్పింది కౌస్తుభ.
* * * *
వయసు పైబడ్డంవల్ల ఒంగిపోయిన నడుము, తెల్లబడిన వెంట్రుకలు, చూపు తగ్గినట్లుగా చిట్లించి చూస్తున్న కళ్లు, అయినా ఆ ముఖంలో ఒకవిధమైన గాంభీర్యం. ఠీవి.
చేతిలో పొన్నుకర్ర సాయంతో ఆన బంగళాలోంచి బయటకి వస్తున్నాడు.
"నమస్కారమండీ!" వినయంగా చేతులు జోడించింది కౌస్తుభ.
ఆయన తలెత్తి చూశారు. కళ్లల్లో ప్రశ్నార్దకం కదలాడింది.
"నా పేరు కౌస్తుభమణి అండీ. ఒకసారి మిమ్మల్ని కలుసుకుందామని వచ్చాను."
"ఏ విషయం గురించి అమ్మాయి?"
మాది ప్రక్క గ్రామమేనండీ! మా నాన్నగారు, మీ అబ్బాయి జయసూర్యగారూ క్లాస్ మేట్స్ ట. నేను పనిమీద ఇక్కడికి వస్తుంటే తన ఫ్రెండు క్షేమ సమాచారాలు తెలియక చాలా రోజులైందని, ఒకసారి కలసి రమ్మనీ చెప్పారు మా నాన్నగారు. ఆల్బంలో తామిద్దరు కలసి దిగిన ఫోటో వుంటుందట. అడిగి తీసుకురమ్మన్నారు. మళ్లీ ఆ ఫోటో తీయించుకుని పంపించేస్తానన్నారు. మీ అబ్బాయి ఇక్కడే వున్నారా? విదేశాల్లో వున్నారా?"
జవాబు ఒక్కమాటలో చెప్పేదికాదన్నట్లుగా" లోపలికెళదాం రా అమ్మా!" అన్నారు వెనుదిరిగి బంగళాలోకి నడుస్తూ.
ఆయన్ని అనుసరించింది కౌస్తుభ.
హాల్లో కూర్చోబెట్టారు కౌస్తుభను.
"మంగా!'
ఆయన కేక విని నడివయసులో వున్న ఒకామె లోపలి నండి వచ్చింది - "ఏమిటి బాబుగారూ?" అంటూ.
ఆమె ఆ ఇంట్లో పనిచేసే మనిషిలా వుంది.
"నా గదిలో టేబుల్ మీద బాబు ఫోటోలున్న ఆల్బం వుంది. ఇలా పట్రా!"
ఆమె వెళ్లింది తీసుకురావడానికి.
"బాబు సంగతులేవీ మీ నాన్నగారికి తెలీవన్నమాట!' ఆయన స్వరంలో ఏదో వ్యధ.
"ఆయననిక్కడ లేరా?"
"ఇక్కడ లేడు. ఎక్కడున్నాడో తెలియదు.'
"అదేమిటి?'
"పాతికేళ్లు గడిచిపోయాయి వాడు ఇంటినుండి వెళ్లిపోయి సలేశ్వరం వెళుతున్నానని ఒక ఫ్రెండుతో కలిసి వెళ్లాడు. అంతే! మరి తిరిగి రాలేదు. హిమాలయాలు దర్శించాలని వుందంటూ అటునుండి అటే వెళ్లిపోయాడట."
"ఆ ఫ్రెండు పేరేమిటి?"
"సుబ్రహ్మణ్యస్వామి. మన ప్రక్కగ్రామమే ఆయనది.
"ఆయన వున్నారా ఇప్పుడు?'
"ఉన్నాడు. వారంరోజుల క్రితం వచ్చి వెళ్లాడుకూడా తమ ఊరి నుండి వెళ్లిన ఒక యాత్రా బృందానికి హరిద్వార్ లో మా బాబు కలసాడట. గడ్డం మీద పెంచి కాషాయం గుడ్డలుకట్టి సన్యసిగా మారాడట."
"అయ్యో! ఆయన సన్యాసి ఎందుకయ్యారు?"
"వాడు అమెరికాలో చదువు పూర్తిచేసి వచ్చేసరికి ఇంటి దగ్గర వాడికి వూహించని పరిస్థితులు ఎదురయ్యాయి. బాగా చితికిపోయిన మా ఆర్దిక పరిస్థితి చూసి ఖిన్నుడయ్యాడు. క్రమంగా విరక్తి పెంచుకున్నాడు. అనుకున్నది సాధించలేకపోతే ఎందుకీ జీవితం అనుకున్నాడేమో, మనసును ఆద్యాత్మిక పథంలోకి మరల్చుకున్నాడు. చివరికి సన్యాసుల్లో కలిసి పోయాడు" ఆయన భారంగా ఒక నిట్టూర్పు విడిచి కుర్చీలో వెనక్కి వాలారు.
'ఆయన తిరిగి వస్తారని మీరనుకుంటున్నారా?"
" మా బాబుకి నేనంటే చాలా ప్రేమ. ఎందుకిలా చేశాడో తెలియదు. నేను కన్నుమూసేలోగా తప్పక నన్ను చూసేందుకు వస్తాడనే నా నమ్మకం!"
ఆల్బం తెరిచి చూసింది కౌస్తుభ. "ఈయనేనా డాక్టర్ జయసూర్య గారు?"
ఆయన తలాడించారు.
ఫోటోలో చాలా అందంగా వున్నాడు జయసూర్య.
మనోహరమైన రూపం.
ఒకచోట తండ్రి కూర్చుంటే అతడు పక్కన నిలబడి తీయించుకున్న ఫోటో వుంది. ఫుల్ సూట్ లో వున్నాడు. సమున్నతమైన విగ్రహం. ఆడపిల్లల గుండెల్లో వలపులు రేపే పర్సనాలిటీ.
ఇదొక విచిత్రమైన అనుభవం.
అతడి కథ చదివాక అతడిని ఫోటోలో చూస్తోంది.
"ఇందులో మా నాన్న గారితో ఫోటో లేనట్టుందండీ! ఇంకెక్కడైనా పెట్టారో ఏమో?" ఆల్బం మూస్తూ అంది.
"ఈ ఊళ్లో హరిచందన అన్న అమ్మాయి వుందా?"
"ఆ పేరున్నవాళ్లు ఎవరూ లేరే?"
"డాన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది."
"ఆమె పేరు హరిచందన కాదు, హిమబిందు."
కౌస్తుభ ముఖంలో ఉద్విగ్నత చోటుచేసుకుంది.
"ఆమెవుందా?"
"ఆమె నిన్ననే అమెరికా వెళుతున్నాను. ఆశీర్వదించండి బాబుగారూ" అంటూ వచ్చి నా ఆశీస్సులు తీసుకువెళ్ళింది."
"అమెరికా వెళ్లిందా?"
"తన డాన్స్ ట్రూప్ తో నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు విదేశాల్లో వున్నమన తెలుగువాళ్ల ఆహ్వానం మీద వెళ్లింది. ఆమె అమెరికా వెళ్లడం ఇది మూడోసారి."
"ఒక పల్లెటూరి పిల్ల అంత గొప్ప డాన్సర్ కావడం ఆశ్చర్యం గొలుపుతోంది."
"మా బాబు ఇంటినుండి వెళ్లిపోయేముందు హిమబిందు వాళ్లింటికి వెళ్లి ఆమె ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తానని, ఆమె నాట్యతార కావడానికి ఎంత ఆర్దిక సహాయమైనా చేస్తానని మాటిచ్చాడట. ఆ విషయం మా బాబు డైరీలో వ్రాసుకున్నాడు. మా బాబు వెళ్లిపోయినా మా బాబు ఇచ్చినమాట నిలబెట్టడం తండ్రిగా నా కర్తవ్యమనిపించింది. ఆమె చదువుకోవడానికీ, నృత్యం అభ్యసించడానికి ఆర్దిక సహాయం అందించాను. అందుకే నేనంటే ఆమెకు చాలా భక్తి. నా ఆశీస్సులు లేనిదే ఆమె ఏ పనీ చేయదు. నేను ఆమెకు చేసింది కొద్దిపాటి ఆర్దిక సాయమైనా ఆమె నాకు కొండంత పేరు తెచ్చిపెట్టింది. ఎవరికి ఇంటర్ వ్యూ ఇచ్చినా, తను ఆ స్థాయికి చేరుకోవడానికి ఆ మహానుభావుడే కారణం అంటూ నాకు కృతజ్ఞతాంజలులు ఘటిస్తూంటుంది. ఆమె మనదేశం గర్వించదగ్గ నాట్యతారగా రూపుదిద్దుకోవడం నన్ను ఆనందపరిచిన విషయాల్లో ఒకటి."
"ఆమెకు వివాహమైందా?"
"ఉహూ! పెళ్లి చేసుకోవా అని అడిగితే నా జీవితం నాట్యానికే అంకితం అంటుంది. ఇహ ఇప్పుడు వయసు కూడా అయిపోయంది నలభయ్యోపడిలో పడింది. ఇంకేం పెళ్లిచేసుకుంటుంది? కొందరి జీవితాలు ఎందుకో అలా మిగిలిపోతాయి"
తను జయసూర్య కథలో వచ్చిన సెకండ్ హీరోయిన్ హరిచందన కాదు. మిగిలించి చంద్రరేఖ.
మైగాడ్! పూర్వజన్మలో తను దెయ్యమై ఈ బంగళాలో తిరిగిందా? జయసూర్యను పట్టి పీడించి అతడి చావుకు కారణమైందా?
కేతకి కథ మరీ విచిత్రం కదా?
పూర్వజన్మ జ్ఞాపకాలు లేకపోవడం నిజంగా మనిషికి దేవుడిచ్చిన వరం. మనిషికి పూర్వజన్మ జ్ఞాపకాలుంటే అథడి మస్సెంత ఘర్షణకు గురి అవుతుంది? తానెవరో తనకు మాత్రమే తెలిసి ఇంకెవ్వరికీ తెలీని పరిస్థితి వస్తే అంతకంటే భయంకరమైన అనుభవం మరేదీ వుండదు మనిషికి.
"ఈ బంగళాలో తెల్లచీర కట్టుకున్న ఒక ఆడ దెయ్యం తిరిగేదట. నిజమేనా?"
"ఈ సంగతులన్నీ నీకెలా తెలుసునమ్మాయ్?" ఆయన ఆశ్చర్యపోయాడు.
"మా నాన్నగారికి మీ అబ్బాయి అన్ని సంగతులు వ్రాసేవాడట."
ఒక విధంగా మా బాబు ఇల్లు విడిచిపోవడానికి ఆ దెయ్యం కారణం అనుకుంటాను. చాలా పీడించింది. దాని బాధ తట్టుకోలేక హనుమంతోపాసన చేశాడు. అయినా అతడిని అస్థిత్వానికి గురిచేసి ఇల్లు విడిపించి చివరికి సన్యాసుల్లో కలిపింది."
"నిజంగా దెయ్యాలున్నాయంటారా? లేక మన భ్రాంతి అంటారా?"
"భ్రాంతి కాదు. వున్నాయనే అనిపిస్తుంది. తెల్లచీర కట్టుకుని తిరిగే ఒక స్త్రీ ఆత్మను నేను ఈ బంగళాలో రెండు మూడుసార్లు చూడడం జరిగింది. ఎన్నోసార్లు ఆమె ఈ బంగళాలో తిరుగుతున్నట్లు గజ్జెల శబ్దం విన్నాను. తెల్లచీర కట్టుకుని పనివాళ్లకి కనిపించేదట. గజ్జెల శబ్దం కూడా అందరికీ వినిపించేదట"
"పనివాళ్లంటే గుర్తువచ్చింది. మీ నమ్మినబంటు రాందత్ వున్నాడా?"
"రాందత్తా? ఆ పేరుతో పనివాళ్లేవరూ లేరే! రాంలాల్ అని ఒకడు వుండేవాడు. వాడు పోయాడు. పోతూపోతూ కోడలికి నన్నప్పగించి పోయాడు. మధు అని మా బాబు దగ్గర కాంపౌండర్ గా పనిచేసేవాడు. మంగ ఆమె పేరు. కొంచెం చదువుకున్నదే. నా ఆస్తి వ్యవహారాలు కూడా చూస్తుంటుంది. డబ్బు తీసుకోవడం, డబ్బు దాచిపెట్టడం అంతా ఆమే చేస్తుంది. నా చీకటి జీవితంలో మంగను ఒక చిన్న దీపంలా వెలిగించి పోయాడనుకో మా రాంలాల్."