అది అంత అపురూపంగా తన చేతికి ఇచ్చి లక్షలు ఖరీదు చేస్తుందని చెబితే ఇంకెప్పుడయినా అయితే ఫక్కున నవ్వేవాడు యోగానందం. అవసాన దశలో వున్న బావగారిని అవహేళన చేయడం, మనసు నొప్పించడం బాగుండదనుకున్నాడు.
"అలాగే బావా! సిటీకి వెళ్లాక మంచి ధరకట్టే వజ్రాల వ్యాపారికి చూపిస్తాను. అమ్మా మణీ! ఇది జాగ్రత్తగా దాచు"అంటూ కౌస్తుభ చేతికి అందించాడు.
"అది ఎవరికయినా చూపి వజ్రపురాయి ఏమో చూడండని! చెపితే తమని పిచ్చివాళ్లను చూసినట్లుగా చూడరూ? దాన్నిదాచడం కూడానా?"కౌస్తుభ ఆ రాయిని పట్టుకెళ్లి దొడ్లో గుట్టలా పడివున్న పలుగురాళ్లలో పడేసింది.
"నేను ఈ ఒక్కరోజుకే సెలవుపెట్టి వచ్చాను బావా.రేపు నేను వెళ్లి సెలవు పొడిగించి వస్తాను. పిల్లలు ఇక్కడే వుంటారు" ఆ రాత్రి పడుకునేముందు చెప్పాడు.
ఆ రాత్రి మంచి నిద్రలో వుంది కౌస్తుభ.
"నా జీవితమంతా అన్వేషించి సాధించిన గెలుపుకదమ్మా అది. అది నిజంగా వజ్రపురాయి తల్లీ!
రాళ్లకుప్పలో పడేసి నా మనస్సుకు శాంతి లేకుండా చేశావుకదా?" తండ్రి తన తల దగ్గిర నిలబడి అంటున్నట్లుగా అనిపించింది కౌస్తుభకు.
ఎవరో తట్టి లేపినట్లుగా మెలుకువ వచ్చేసింది.
ముంజేతికున్న వాచీలోకి చూస్తే రాత్రి రెండయింది.
ప్రక్కనే ఇద్దరు చెల్లెళ్లు గాఢనిద్రలో వున్నారు.
యోగానందం కూడా మంచి నిద్రలో వున్నాడు.
కౌస్తుభ దిగ్గున మంచంమీద పడుకున్న తండ్రిని చూసింది.
అతని నోరు తెరుచుకుని వుంది.
కళ్లు మిటకరించి చూస్తున్నట్లుగా మిద్దెకప్పుకేసి చూస్తున్నాయి.
ఎంతసేపు చూసినా ఆ కళ్లు రెప్పవాల్చడంలేదు.
భయపడిపోయింది కౌస్తుభ.
"మామయ్యా!" కంపిత స్వరంతో యోగానందాన్ని లేపింది.
"ఏమిటి మణీ?"
"నాన్నకేమైందో చూడు మామయ్యా?"
యోగానందం లేచి బావగారిని చూశాడు.
"ప్రాణం పోయింది" అంటూ తెరుచుకున్న నోరు మూశాడు. కళ్లు మూశాడు.
అక్కగారు లేచి లబోదిబో మొత్తుకోసాగింది.
ఆవిడ చిన్నవయసులోనే భర్తను పోగొట్టుకుని పుట్టిల్లు చేరి తమ్ముడిని చూసుకుంటూ బ్రతుకుతోంది. ఆ తమ్ముడు ఇక లేడంటే.....
"నా మనస్సుకు శాంతిలేకుండా చేశావుకదా!" తండ్రి మాట మనస్సులో ప్రతిధ్వనిస్తుంటే కౌస్తుభ మనసు కలతచెందింది.
తండ్రిగా ఆయన తనకేమీ చేసి వుండకపోవచ్చు.
కూతురిగా తనేం చేసింది? ఆయన ఆత్మ క్షోభించినట్లు చేసిందికదా
అది రాయి కావచ్చు. వజ్రం కావచ్చు. ఆయన కోరిన విధంగాచేస్తే సరిపోయేది.
రాళ్లకుప్పలోకి విసిరేసి తప్పుచేసింది.
తండ్రి తన తల దగ్గిర నిలబడి మాట్లాడినట్లుగా కావడం గురించి యోగానందానికి చెప్పింది కౌస్తుభ.
"ఆత్మలూ, అతీత శక్తుల గురించి అవహేళన చేసేదానివికదా?"
ఇప్పుడు నీకు అయిన అనుభవం గురించి ఏమంటావు?"అన్నాడు యోగానందం.
"నేను ఆ రాయి తీసుకెళ్లి దొడ్డిలో కుప్పలమీద పారేసిన సంగతి నాన్నకి ఎలా తెలిసింది మామయ్యా?"
"క్షణ భంగురమైన ఈ దేహాన్ని వదిలాక ఆత్మలకి కొన్ని అతీత శక్తులు ఏర్పడతాయంటారు?"
"ఆయన కూడా జయసూర్య కథలోలా దెయ్యంగా మారతారా తన ఆఖరి కోరిక తీరనందుకు?"తను చేసిన పనికి చాలా ఆవేదన పడుతోంది కౌస్తుభ.
"అకాల మరణం పొందినవాళ్లు దెయ్యాలవుతారంటారు. మీ నాన్నది అకాల మరణంకాదు. ఆయుష్షు చెల్లిపోయారు. ఆయనది సహజ మరణం. మళ్లీ ఏ అమ్మ కడుపులో పడడానికి వెళ్లిపోయాడో?" అన్నాడు యోగానందం.
"ఆయన మరణశయ్యమీద వుండి కోరిక చిట్టచివరి కోరిక......ఆయన జీవితమంతా శ్రమపడి సంపాదించిన రాయి నేను రాళ్లపాలు చేశాను మామయ్యా! ఈ విషయం నన్ను జీవితమంతా వేధిస్తోంది."
తెల్లవారుతూనే దొడ్డిలోకి పరుగెత్తి రాళ్లకుప్లో నిన్న పారేసిన రాయికోసం చూసింది.
కానీ గుర్తుపట్టలేకపోయింది.
అక్కడ అన్ని రాళ్లూ ఒకేలా తెల్లగా, స్పటికల్లా మెరుస్తున్నాయి.
చితిమీద పడుకోబెట్టిన తండ్రికి తలకొరివి పెడుతున్న కౌస్తుభకి ఎంత ఆపుకోవాలనుకున్నా దుఃఖం ఆగింది కాదు.
ఆయన మరణశయ్యమీద వుండి కోరిన చిట్టచివరి కోరిక తీర్చకుండా చేశానన్న బాధ ఆమెను వీడడంలేదు.
* * * * *
మూడవరోజు స్మశానంలో అస్తికలు ఏరి కుండలోవేసి గుడ్డలో మూటకట్టారు.
"ఈరోజు తిధి వార నక్షత్రాలు బాగున్నాయి. కృష్ణలో నిమజ్జనం చేస్తే ఒక పని అయిపోతుంది" చెప్పాడు దినవారాలు చేయించడానికి కుదుర్చుకున్న బ్రాహ్మడు.
"ఇక్కడికి కృష్ణ ఎంతదూరం శాస్త్రిగారూ?" అడిగాడు యోగానందం.
"రామాపురం ప్రక్కనే కదండీ కృష్ణ?రామాపురం ఇక్కడికి రెండు మైళ్లు. ఇటునుండి ఇటే బయలుదేరితే అరగంటలో రామాపురం రేవు చేరుకుంటాం.
అస్తికలు కృష్ణలో నిమజ్జనంచేసి అందులో మునిగివస్తే ఒక పని అయిపోతుంది."
అటునుండి అటే బయలుదేరారు అస్తికలు కృష్ణలో కలపడానికి.
ముప్పావుగంట పట్టింది రేవు చేరుకోడానికి.
బ్రాహ్మడు మంత్రాలు చదువుతుంటే తండ్రి అస్తికలు కృష్ణలో కలిపింది కౌస్తుభ.
"కృష్ణలో మూడు మునకలు వేసి పైకి ఎక్కమ్మా? నేను స్నానం చేసి వస్తాను" చెప్పాడు బ్రాహ్మడు.
మూడుసార్లు మునిగి పైకి లేస్తుంటే రేవులోని మెట్లు పైపైకి వెళ్లి ఆఖరిచోట గుట్టమీద బంగళా ఒకటి కనిపించింది.
"మామయ్యా!" సంభ్రమంగా అరిచింది కౌస్తుభ.
జయసూర్య కథళో వర్ణించినట్లుగా గుట్టమీద బంగళా. బంగళా నుండి రేవువరకు మెట్లు.
"ఆ బంగళా ఎవరిదండీ శాస్త్రిగారూ?" ఉద్విగ్నంగా అడిగాడు యోగానందం.
"రామాపురం జమీందారు వెంకటకృష్ణ భూపాల్ గారిదండీ!" అని చెప్పాడు బ్రాహ్మడు.
"ఆయన ఇప్పుడు వున్నారా?"
"లక్షణంగా వున్నారు. ఎందుకలా అడుగుతున్నారు?"
"ఆయనకి పిల్లలున్నారా?"
"ఒక కొడుకు వుండేవాడు. అతడు చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. సన్యాసుల్లో కలిసిపోయాడని, హిమాలయాల్లోకి వెళ్లిపోయాడు అని, కాదూ చచ్చిపోయాడని రకరకాలుగా చెప్పుకుంటారు జనాలు. నిజం పరమాత్ముడికే తెలుసు.
ఆ కొడుకు ఏనాటికయినా తిరిగి వస్తాడని ఈ ముసలాయన కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నాడు. ఆ కొడుకేమో వెళ్లిపోయి ముప్పై ఏళ్లు అవుతోంది. ఇంకేంవస్తాడు ఈ ముసలాయన చాదస్తం కాకపోతే?"
"అతను డాక్టరా?"
"అవును డాక్టరే. ఆ కాలంలో ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలకంతా విదేశాలకి వెళ్లొచ్చిన డాక్టర్ ఇతడొక్కడే. ఈ సంగతి మీకెలా తెలుసు?" శాస్త్రిగారు ఆశ్చర్యపోయారు.
"ఎవరో అంటుంటే విన్నాము."
"ఒకసారి ఆ బంగళాలోకి వెళ్లి చూడాలని వుంది. వెళ్లనిస్తారాండీ?" కౌస్తుభ అడిగింది.
"వెళ్లనివ్వకపోవడానికి అక్కడెవరూ వాచ్ మెన్ వుండడు. ఎవరయినా వెళ్లవచ్చు. అయితే ఆ ముసలి జమీందారు చాలా సాధువులే అమ్మా. జమీందార్లకి సహజంగా దురహంకారం, డాబూ, దర్పం ఆయనకూ ఏనాడూ లేవు. ఈ చుట్టుప్రక్కల జనాలకంతా ఆయనంటే గొప్ప అభిమానం. ఆయన కష్టం తమ కష్టంగా భావిస్తారు."
"ఒకసారి ఆ బంగళాలోకి వెళ్లివద్దామా మామయ్యా?"
"మధ్యాహ్నం అయింది. ఆకలేస్తోంది. మరోసారి వెళదాంలే అమ్మా!"
"తండ్రికి పెద్దకూతురిగా తల కొరివి పెట్టావు. పితృకర్మపూర్తి చేసేవరకూ ఎవరిళ్లకీ వెళ్లకూడదన్నది ఆచారం. ఆ తరువాత నీ ఇష్టం" అన్నాడు శాస్త్రిగారు.
* * * * *
రామనాథం శ్రాద్దకర్మ ఆ రోజుతో పూర్తి అయింది.
ఒకరోజు దేవాలయంలో నిద్ర చేయనిదే ఎవరిళ్లకీ వెళ్ళకూడదని శాస్త్రిగారు చెప్పడంతో అది కూడా చేశారు.